ఎం.ఎస్.అనంతరామన్

వాయులీన విద్వాంసుడు, సంగీత గురువు

ఎం.ఎస్.అనంతరామన్ "పారూర్ బాణీ"కి చెందిన కర్ణాటక సంగీత వాయులీన విద్వాంసుడు.

ఎం.ఎస్.అనంతరామన్
M.S. Anantharaman.jpg
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంమైలాపూర్ సుందరం అనంతరామన్
జననం(1924-08-26)1924 ఆగస్టు 26
చెన్నై
మరణం2018 ఫిబ్రవరి 19(2018-02-19) (వయస్సు 93)
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తివాయులీన విద్వాంసుడు
వాయిద్యాలువయోలిన్
పిల్లలుఎం.ఎ.సుందరేశన్,
ఎం.ఎ.కృష్ణమూర్తి,
ఎం.ఎ.భాగీరథి

విశేషాలుసవరించు

ఇతడు 1924, ఆగష్టు 26న మద్రాసులో జన్మించాడు. ఇతని తండ్రి పారూర్ సుందరం అయ్యర్ కర్ణాటక సంగీతంలోను, హిందుస్థానీ సంగీతంలోను నిష్ణాతుడైన వాయులీన విద్వాంసుడు. ఇతని తమ్ముడు ఎం.ఎస్.గోపాలకృష్ణన్, అక్క పారూర్ సీతాలక్ష్మి కూడా వాయులీన విద్వాంసులే.

ఇతడు తన తండ్రి పారూర్ సుందరం అయ్యర్ వద్ద సంగీతం అభ్యసించాడు. తన సోదరి సీతాలక్ష్మితో కలిసి జంటగా (బహుశా మొట్టమొదటి అక్క - తమ్ముడు జంట) 1932లో తొలిసారి రామేశ్వరంలోని రామనాథస్వామి దేవాలయంలో వాయులీన కచేరీ చేశాడు. తరువాత ఈ జంట తిరుచెందూరులోని సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానంలో, కన్యాకుమారిలోని దేవస్థానాలలో, తిరువనంతపురంలోని పద్మనాభస్వామి దేవస్థానంలో కచేరీలు చేసింది.[1] వీరి కుటుంబం 1932లో కేరళ నుండి మద్రాసుకు తరలివెళ్ళింది.[2] ఇతడు సంగీతంతోపాటు గణితం, జర్మన్ ప్రత్యేక అంశాలుగా ఎంచుకుని చదువుకున్నాడు. ఇతనికి ఇంగ్లీషులో కూడా ప్రావీణ్యం ఉంది.[3]

ఇతడు 7 దశాబ్దాలకు పైగా కర్ణాటక సంగీత విద్వాంసులకు, హిందుస్థానీ సంగీత విద్వాంసులకు వయోలిన్ వాద్య సహకారం అందించాడు. అనేక సోలో కచేరీలు కూడా చేశాడు. ఇతడు తోడ్పాటు అందించిన వారిలో ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, కె.బి.సుందరంబాళ్, రాధ - జయలక్ష్మి, లాల్గుడి జయరామన్, ఎస్.ఆర్.జానకీరామన్, ఎం.ఎస్.సుందరేశన్, ఎం.ఎ.కృష్ణమూర్తి, ఎం.ఎ.భాగీరథి మొదలైన వారు ఉన్నారు.

ఇతడు కొన్ని సినిమాలకు కూడా నేపథ్యంగా తన వాయులీన సహకారాన్ని అందించాడు.[3]

ఇతడు చెన్నైలోని ప్రభుత్వ సంగీత కళాశాలలో 1962 నుండి 1983 వరకు వయోలిన్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. తరువాత కొన్ని నెలలు పిట్స్‌బర్గ్‌ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంగీత పాఠాలు చెప్పాడు.

ఇతనికి "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్"‌ కళైమామణి పురస్కారాన్ని ప్రదానం చేసింది. 1996లో మద్రాసు సంగీత అకాడమీ ఇతడికి టి.టి.కె. అవార్డును ప్రకటించింది. 1998లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతనికి అవార్డును ఇచ్చి గౌరవించింది. కంచి కామకోటి పీఠానికి ఆస్థాన విద్వాంసునిగా పనిచేశాడు.

ఇతడు 2018, ఫిబ్రవరి 19వ తేదీన తన 94వ యేట చెన్నైలోని తన స్వగృహంలో మరణించాడు.[2]

మూలాలుసవరించు

  1. web master. "M.S. ANANTHARAMAN". SRUTI MAGAZINE. THE SRUTI FOUNDATION. Retrieved 3 April 2021.
  2. 2.0 2.1 SPECIAL CORRESPONDENT (20 February 2018). "Renowned violinist M.S. Anantharaman passes away". The Hindu. Retrieved 3 April 2021.
  3. 3.0 3.1 శంకరనారాయణ, వైజర్సు బాలసుబ్రహ్మణ్యం (1 May 2015). నాదరేఖలు (PDF). హైదరాబాదు: శాంతా వసంతా ట్రస్ట్. p. 38. Retrieved 3 April 2021.