ఎం.ఎస్.గోపాలకృష్ణన్
ఎం.ఎస్.గోపాలకృష్ణన్, (1931 – 2013) ఒక భారతీయ కర్ణాటక సంగీత వాయులీన విద్వాంసుడు. లాల్గుడి జయరామన్, టి.ఎన్.కృష్ణన్, ఇతడిని కలిపి కర్ణాటక సంగీతపు వాయులీన త్రయంగా పరిగణిస్తారు. 2012లో ఇతడికి భారత ప్రభుత్వపు మూడవ అత్యున్నత పౌరపురస్కారం పద్మభూషణ్ లభించింది.
ఎం.ఎస్.గోపాలకృష్ణన్ | |
---|---|
జన్మ నామం | మైలాపూర్ సుందరం గోపాలకృష్ణన్ |
జననం | చెన్నై | 1931 జూన్ 10
మరణం | 2013 జనవరి 3 | (వయసు 81)
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వృత్తి | వాయులీన విద్వాంసుడు |
వాయిద్యాలు | వయోలిన్ |
జీవిత భాగస్వామి | మీనాక్షి |
పిల్లలు | నర్మద, లత, సురేష్ |

జీవిత విశేషాలు, వృత్తి సవరించు
ఇతడు 1931, జూన్ 10వ తేదీన చెన్నైలోని మైలాపూర్‌లో జన్మించాడు. ఇతని తండ్రి పారూర్ సుందరం అయ్యర్ కర్ణాటక సంగీతంలోను, హిందుస్థానీ సంగీతంలోను నిష్ణాతుడైన వాయులీన విద్వాంసుడు. గోపాలకృష్ణన్ తన తండ్రి వద్ద రెండు పద్ధతులలోను వయోలిన్ నేర్చుకున్నాడు. ఇతడు తన మొదటి ప్రదర్శన తన 8వ యేట ఇచ్చాడు. ఇతడు ద్వారం వెంకటస్వామి నాయుడు నుండి సంగీతంలో ప్రేరణ పొందాడు.
ఇతడు 50 సంవత్సరాలకు పైగా వాయులీన కచేరీలు నిర్వహించాడు. వీటిలో సోలో ప్రదర్శనలతో పాటుగా ఎం.ఎస్.బాలసుబ్రహ్మణ్యశర్మ, ఇ.ఎం.సుబ్రహ్మణ్యం, జె. వైద్యనాథన్, రుద్రపట్నం బ్రదర్స్, ఒ.ఎస్.త్యాగరాజన్, ఓంకార్ నాథ్ ఠాకూర్, డి.వి. పలుస్కర్ వంటి విద్వాంసులతో కలిసి కచేరీలు చేశాడు. ఇతడు భారత దేశంలోని అన్ని ప్రాంతాలతోపాటు ఆస్ట్రేలియా, అమెరికా, బ్ర్రిటన్, నెదర్‌లాండ్స్, దక్షిణ ఆఫ్రికా, మలేసియా, హాంగ్ కాంగ్ దేశాలను పర్యటించి తన కళను ప్రదర్శించాడు.
ఇతని కుమార్తె ఎం.నర్మద కూడా వాయులీన విద్వాంసురాలు.
మరణం సవరించు
ఇతడు తన 81వ యేట చెన్నైలో 2013, జనవరి 3వ తేదీన మరణించాడు. ఇతనికి భార్య మీనాక్షి, కుమార్తెలు నర్మద, లత, కుమారుడు సురేష్ ఉన్నారు.[1]
పురస్కారాలు సవరించు
ఇతనికి ఈ క్రింది పురస్కారాలు, బిరుదులు లభించాయి.
- 1960లో శివానంద ఆశ్రమం, ముంబై వారిచే "వయోలిన్ విద్యా సమ్రాట్"
- 1975లో భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం
- 1976లో "వయోలిన్ వాద్య చక్రవర్తి"
- 1978లో "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్" వారిచే కళైమామణి
- 1979లో కేరళ సంగీత నాటక అకాడమీ అవార్డు.
- 1980లో కర్ణాటక ప్రభుత్వంచే టి.చౌడయ్య మెమోరియల్ అవార్డు
- 1982లో సంగీత నాటక అకాడమీ అవార్డు
- 1997లో తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే "సప్తగిరి సంగీత విద్వన్మణి"
- 1998లో మద్రాసు సంగీత ఆకాడమీ వారిచే సంగీత కళానిధి
- 2006లో శ్రీకృష్ణ దేవస్థానం, గురువాయూరు వారిచే "గురువాయూరప్పన్ చెంబై పురస్కారం"
- 2012లో భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ పురస్కారం[2]
- 2012లో ది ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ చెన్నై వారిచే "సంగీత కళాశిఖామణి"
- 2012లో కేంద్ర సంగీత నాటక అకాడమీ వారిచే "టాగూర్ అకాడమీ ఫెలోషిప్"
మూలాలు సవరించు
- ↑ "Violin maestro M.S. Gopalakrishnan dies at 82. His daughter works with an IT company". The Hindu. Archived from the original on 13 January 2013. Retrieved 2013-01-03.
- ↑ "Padma awardees say they feel honoured". The Hindu. 26 January 2012. Retrieved 2012-01-26.