గియాసుద్దీన్ అబుల్ ఫతహ్ ఒమర్ ఇబ్న్ ఇబ్రాహీం ఖయ్యాం నేషాబూరి (పర్షియన్: غیاث الدین ابو الفتح عمر بن ابراهیم خیام نیشابوری, ( మే 18, 1048 - డిసెంబరు 4, 1131) ) పర్షియన్ కవి, గణిత శాస్త్రజ్ఞుడు, ఇస్లామీయ పండితుడు, ఖగోళ శాస్త్రజ్ఞుడు, చరిత్రకారుడు. ఇతనికి ఒమర్ ఖయ్యామీ అని కూడా పిలిచేవారు.[1][2] ఇతను కవిగా ప్రసిద్ధి. ఇంకనూ రుబాయిలకు ప్రసిద్ధి. ఇతని రుబాయీలు రుబాయియాత్ ఎ ఖయ్యాం అనే సంకలనంతో ప్రసిద్ధి. ఎడ్వర్డ్ ఫిట్జ్‌గెరాల్డ్ వీటిని తర్జుమా చేసి ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇతను గణిత శాస్త్రము, ఆల్‌జీబ్రా జియోమెట్రీ లలో ప్రసిద్ధి.[2] ఇతను కేలండర్ తయారుచేశాడు. కోపర్నికస్ ప్రతిపాదించిన చాలాకాలం ముందే సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.[ఆధారం చూపాలి]

ముస్లిం శాస్త్రవేత్తలు, ముస్లిం పండితులు
ఇస్లామీయ స్వర్ణయుగం
నైషబూర్ లోని ఖయ్యాం సమాధివద్ద, చిత్రం
పేరు: ఒమర్ ఖయ్యాం
జననం: 1048
మరణం: 1131
సిద్ధాంతం / సంప్రదాయం: పర్షియన్ గణితం, పర్షియన్ కవిత్వం, పర్షియన్ తత్వం
ముఖ్య వ్యాపకాలు: పర్షియన్ సాహిత్యం, ఇస్లామీయ గణితశాస్త్రం, ఇస్లామీయ తత్వం, సూఫీ తత్వము, ఇస్లామీయ ఖగోళ శాస్త్రము
ప్రభావితం చేసినవారు: అబూ రైహాన్ అల్-బెరూని, అవిసెన్నా
ప్రభావితమైనవారు:
ఖయ్యాము సమాధిని వర్ణిస్తూ వ్రాసిన పద్యము

జీవిత విశేషాలు

మార్చు

ఖయ్యాము అనునది కవియొక్క కలం పేరు (తఖుల్లసస్ నామము/pen name). ఆ కాలములో సాహిత్య రచన చెయ్యు పారసీక కవులందరు సాధారణంగా కలంపేరు/మారు పేరు/pen name తో రచనలు చెయ్యడం పరిపాటి. ఫిరదౌసి, హాఫిజ్, అత్తారి, సాది, జామి, అనునవి ఇటువంటి మారు పేరులే.ఒమర్ ఖయ్యాం 11వ శతాబ్దమునకు చెందినవాడు.దాదాపు 80 నుండి 85సం.జీవించి ఉండవచ్చును. ఒమరు గొప్ప జ్యోతిష శాస్త్రజ్ఞడు, గొప్ప భావికుడు.మాలిక్ సాహ్ సుల్తాను ఆజ్ఞను అనుసరించి పంచాంగమును సరిదిద్దినవాడు.ఆనాటినుండి తారీఖే-మలిక్-శాహీ-జలాలీ' సం. ఆరంభమయ్యెను.

ఖయ్యాము యొక్క రుబాయుతుల పురాతనమైన వ్రాత ప్రతి 'ఆక్సుఫర్డు 'లోని బోడ్లీయన్ పుస్తక భాండాగారమున ఉంది. ఆ ప్రతి సా.శ.1460 లో అనగా ఖయ్యాము మరణానంతరము 337 సంవత్సరములకు షిరాజు పట్టణమున వ్రాయబడింది. దానిలో కేవలము 158 రుబాయూలు మాత్రమేకలవు. ఆ తరువాత సా.శ.1528 లో వ్రాయబడిన మరోక ప్రతి ప్యారిసు నగరమందలి 'బిబ్లియోతికె నాసియోనాల్ (Bibliotheque nationale) అను గ్రంథాలయంలో ఉంది. అందులో 349 రుబాయూలున్నాయి. ఉమర్ ఖయ్యాము మరణానంతరము 500 సంవత్సరములకు వ్రాయబడిన, 540 రుబాయూలున్న ప్రతి బ్రిటిష్ గ్రంథాలయంలో ఉంది.రుబాఇయాత్-ఏ-ఉమర్ ఖైయామ్-అనగా ఒమర్ ఒమర్ ఖయ్యాం యొక్క రుబాయి అని అర్ధము. రుబాఇ శబ్దమునకు పారసీభాషలో బహువచన రూపము రుబాఇయాత్, రుబాఈ అనగా చతుష్పది. ఇదియొక చందోవిశేషము.దీనిలో 4పాదములుండును. ఇది మాత్రా చంధస్సు.ఇందు ప్రాసనియమము ఉంది. మొదటి, రెండవ, నాల్గవ పాదములందు ప్రాస నియమము ఉండును.మూడవపాదము పై భాగములకు భిన్నముగా ఉండును.ఒక్కోసారి నాలుగు పాదములందు ప్రాస రాయవచ్చును.పారసీ భాషలో ఇది విశేష ప్రచారమున్న ఛందస్సు. రుబాఇలో భావమును విశిదీకరించి చెప్పుటకు వీలున్నది. ఇందు కవి మొదటి రెండు పాదములందు భావనాలోకమున విహరించును మూడవపాదమున ప్రాసరహితము కావున భావము పరాకాష్ఠ నొందును.

మొదట బోడ్లియన్ లైబ్రరిలో వున్న ఖయ్యాము రుబాయూతులను గూర్చి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చరిత్రాధ్యాపకుడుగా వున్న ఇ.బి.కోవెల్ సా.శ.1856 లో గుర్తించాడు. ఆయన దానిని గురించి 1858 లో 'కలకత్తా రెవ్యూ'లో ఒక వ్యాసంలో ప్రకటించెను. ఆ మరుసటి సంవత్సరము ఎడ్వర్డు ఫీ'ట్జెరాల్డ్, 75 రుబాయుతులను ఇంగ్లీషులోకి తర్జుమా చేసెను. సా.శ.1867 లో పారశీక రాజాస్ధానమున ఫ్రెంచి రాయబారికి దుబాసి/ద్విభాషిగా వున్న జె.బి.నికొల రుబాయూలను ఫ్రెంచి భాషలోకి అనువాదం చేసాడు. ఆ తరువాత సంవత్సరంలో ఫే 'ట్ జెరాల్డ్ ఇంకొన్ని రుబాయూలను చేర్చి 101 రుబాయూలున్న పుస్తకాన్ని ముద్రించెను.

ఖయ్యాము నిషాపూరులో జన్మించినప్పటికి బాల్యము బల్ఖలో గడచెను. ఖయ్యాము విద్యాభ్యాసము నిషాపూరులో వున్న సుప్రసిద్ధ శాస్త్రవేత్త ఇమాం మువఫిక్ అను గురువు వద్ద జరిగింది. ఖయ్యాముకు, నిజాముల్ ముల్కు సహపాఠి, మిత్రుడు. నిజాముల్ ముల్కు అల్‍ఫ్ అర్సలాస్ ప్రభువు వద్ద మంత్రిగా పనిచేసాడు. అర్సలాన్ మరణానంతరము మాలిక్ షా వద్ద మంత్రిగా పనిచేశాడు. నిజాముల్ ముల్కు గొప్ప విద్వాంసుడు, నీతివేత్త. ఈతడు మలిక్ షా కొరకు 'సియాసత్ నామా' అను ప్రసిద్ధమైన పాలనాశాస్త్రమును రచించి పాదుషా పేరు ప్రతిష్ఠలకు చిరంజీవం కావించెను. అంతేకాదు 'వసాయా'అను పారసీక గ్రంథాన్ని రచించెను. నిజాముల్ ముల్కు అల్‍ఫ్ అర్సలాస్ వద్ద మంత్రిగా పనిచేయున్నప్పుడు అతని వద్దకు ఖయ్యాము వెళ్లగా, తమ పూర్వ స్నేహాన్ని మరవక, ఖయ్యాముకు రాజోద్యోగము ఇప్పించెదనని చెప్పగా, ఖయ్యాము తనకు వుద్యోగం చెయ్యుట యందు ఇఛ్చలేదని, శాస్త్రాద్యాయము చేయుచు, గ్రంథపఠనంచేయుచూవిద్యార్థులకు బోధన చేయూ ఆపేక్ష కలదనిచెప్పెను. అంతట పాదుషాకు చెప్పి సంవత్సరానికి 1200 తోమానులు ఆదాయము వచ్చు జాగీరును నిషాపూరులో ఖయ్యాముకు ఇనాముగా ఇచ్చెను.

ఖయ్యాముకు చిన్నతనమునుండి గణితమునందు మక్కువ ఎక్కువగా వుండెను. గణితములోని జ్యామితి, అంక (అక్షర) గణితమందు ప్రావీణ్యము సంపాదించెను.జ్యోతిశ్సాస్త్రమునందు దిట్ట. ఖయ్యాము అరబ్బీలో అక్షర గణితమును రచించెను. ఈ గ్రంథము చాలా కాలము వరకు ప్రమాణ గ్రంథముగా ఆకాలములో పరిగణింపబడింది.[ఆధారం చూపాలి] ఈ అరబ్బీ గ్రంథము ప్రెంచిభాషలోకి కూడా అనువాదం చెందినది. ఖయ్యాము దాతు రసాయన శస్త్రము, యూక్లిడ్ జ్యామెట్రికి వ్యాఖ్యానము, ఒక తత్వశాస్త్రము, రుబాయాత్ లు ఇలా అన్ని కలిపి దాదాపు తొమ్మిది గ్రంథములవరకు రచన చేసెను. వీటిలో అక్షర గణితము, రసాయన శాస్త్రము, జ్యామెట్రి వ్యాఖ్యానముల మాతృకలు ప్యారిస్, లేడన్, ఇండియా ఆఫిసు లైబ్రరియలలో భద్ర పరచబడినవి.

దార్శనిక తత్త్వము

మార్చు

ఈ గీతములందు ప్రకృతి తత్త్వదర్శనము నిగూఢము మనుష్యుడు పుట్టును; పెరుగును;లోకము నవలోకించును;అనుభూతుల నొందును;లోకానుభవమును పురస్కరించుకొని జీవితమున ఆనందమును అనుభవించును; నిజ తృష్ణను దీర్చు కొన ప్రయత్నించును; ప్రబల ప్రవృత్తులకు లోనగును; ఇటువంటి సంఘర్షణ ఆరంభమగును.మనుజుడు సంతృప్తి నొందడు; ప్రకృతి పరివర్తన శీల సౌందర్యము శాశ్వతము కాదు; ప్రేమ శాశ్వతము కాదు; మరణము తలుపులు తెరుచుకొని వేచి ఉండును; ఇది జీవిత ప్రశ్న. జీవితం అనగానేమి? తృష్ణ అనగానేమి? తృప్తి అనగానేమి? దీనికి సమాధానము చిక్కక పలాయనము చిత్తగించువారు ఉన్నాయి. ఇలాంటి విషయములు ఒమర్ ఖయ్యాం రుబాయిలలో చాలా వరకు చర్చింపబడినాయి.

ఆంధ్రానువాదములు

మార్చు
  • శ్రీ అద్దేపల్లి రామమోహన రావు, ప్రముఖ కవి, విమర్శకుడు "మధుజ్వాల" పేరుతో తెలుగులో ఉమర్ ఖయ్యాం రుబాయీలను పద్యకావ్యంగా వ్రాశారు.  
  • శ్రీ ఆకిలి శ్రీరామ శర్మ: వీరు ఒమర్ ఖయ్యాం రుబాయిలను సురాలయ అను పేర సంస్కృతీకరించిన ఆంధ్రులు.
  • శ్రీ ఆదిభట్ల నారాయణదాసు ఒమర్ ఖయ్యాం నకు ఆదిభట్ల వారి అనువాదము తెలుగు రచనలలోనే తలమానికము వంటిది. మూలమునకు సాకల్యముగా చదివి, భావమునర్ధముచేసుకొని, చేయబడిన అనువాదము విజయ నగర మహారాణి శ్రీమతి లలితాకుమారి ప్రోత్సాహముతో దాసుగారీ మహాకావ్యమునకు పూనుకొనిరి.
  • శ్రీ దాసు వేదాంతి: ఈ పండితుడు ఫిట్టురాల్డు ఆంగ్లానువాదమును అనుసరించారు. పర్ష్యను మూలమునకు సంస్కృతములో గీతిలోను, అచ్చతెలుగులో భుజంగగీతిలోను; కందములోను చేసిరి.
  • శ్రీ కనకమేడల వేంకటేశ్వరరావు: వీరు ఆంగ్లమూలమునాధారముగా గొని ఒమర్ ఖయ్యాం రుబాయిలను పాటలలో వ్రాసిరి.
  • శ్రీ చిలుకూరి నారాయణరావు మూల కావ్యము నాధారముగా గొని అనువదించిరి.
  • శ్రీ కాడూరి గోపాలరావు మధుశాల అను కావ్యమును వ్రాసిరి.
  • శ్రీ దువ్వూరి రామిరెడ్డి విరచితమగు పానశాలకు వచ్చిన అనువాదమునకు వచ్చిన పేరు ప్రతిష్థలు వేరే ఇతర అనువాదములకు రాలేదు.వీరు సంస్కృత, ఆంధ్ర, పారసీ భాషలలో పండితులు.
  • శ్రీ నారపరెడ్డి రామిరెడ్డి మధునము అను కావ్యమును రచించారు.హిందీ భాషలో బచ్చన్ కవి వ్రాసిన మధుశాలకిది అనువాదము.
  • శ్రీ బూర్గుల రామకృష్ణారావు పారసీ వాజ్మయ సాగరమును మధించారు. బొంబాయిలో ఎల్.ఎల్.బి. చదువుచు అంజమన్ ఇస్లామియా హైస్కూలులో ఉపాధ్యాయులుగా పని చేయుచున్న దినములలో రుబాయి అనువదించారు.
  • శ్రీ మేకా రంగయప్పారావు: రుబాయతు అను పేర కావ్యమును రచించారు.
  • శ్రీ రామచంద్ర అప్పారావు: అమర కావ్యమను పేర రుబాయలను అనువదించారు.
  • శ్రీ స్వామి శివశంకరశాస్త్రి: వీరు కాలప్రభావమును గమనించి ఉమరు రుబాయిలను అనువదించారు.
  • శ్రీ స్ఫూర్తి శ్రీ: మధుపాలి పేర ఒమరు రుబాయిలను అనువదించారు. కావ్యపరిణామము 249 పద్యాలు. ఈ కావ్యము స్వామి గోవింద తీర్ధ సంకలించి ఆంగ్లములోనికి The nector of Grace అను పేర గ్రంథీకరించారు.
  • శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి పిఠాపుర సంస్థానముతో మొట్టమొదట సన్నిహిత సంబంధము కలవారు.జీవితమునందు భోగమును అలవరించుకొనిన రోజులలో ఒమర్ ఖయ్యాం కవితవైపు దృష్టి మరల్చారు.

సంస్మరణాలు

మార్చు

1970లో చంద్రుడి పై గల ఒక క్రేటర్కు 'ఒమర్ ఖయ్యాం క్రేటర్' అని పేరు పెట్టారు. 1980లో సోవియట్ యూనియన్కు చెందిన ల్యూడ్‌మిలా జురవ్‌ల్యోవా కనుగొనిన ఒక సూక్ష్మగ్రహానికి 3095 ఒమర్ ఖయ్యాం అనే పేరు పెట్టారు.[3]

మూలాలు

మార్చు
  1. ఈయన ఇరాన్ లోని నేషాపూర్ లో జన్మించాడు. గియాసుద్దీన్ అబుల్ ఫతహ్ ఒమర్ ఇబ్న్ ఇబ్రాహీం అనగా డేరాలువేయు కుటుంబునకు చెందిన ఇంబ్రహీం పుత్రుడు కావున ఓమర్ వంశములోని పూర్వీకులు డేరాలు వేసెడివారని ఊహింపవచ్చును.కాని ఒమర్ ఖయ్యాంనకు, కుటుంబ వృత్తికి సంబందము లేదని కొందరు పండితుల అభిప్రాయ పడిరి. "Omar Khayyam". Encyclopædia Britannica. 2007. Retrieved 2007-06-09.
  2. 2.0 2.1 "Omar Khayyam". The MacTutor History of Mathematics archive. Archived from the original on 2007-11-10. Retrieved 2008-05-18.
  3. Dictionary of Minor Planet Names - p.255

ఇతర మూలాలు

మార్చు
  • E.G. Browne. Literary History of Persia. (Four volumes, 2,256 pages, and 25 years in the writing). 1998. ISBN 0-7007-0406-X
  • Jan Rypka, History of Iranian Literature. Reidel Publishing Company. 1968. ISBN 90-277-0143-1
  • 1969 భారతి మాస పత్రిక-వ్యాసము ఉమరు ఖయాము వ్యాస కర్త శ్రీ కర్ణ రాజశేషగిరిరావు.

ఇవీ చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు