కంభం చెరువు

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా చెరువు

కంభం చెరువు ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా, కంభం లో ఉంది. ఈ చెరువు 15వ శతాబ్దంలో గుండ్లకమ్మ నదిపై శ్రీకృష్ణ దేవరాయులు కాలంలో ఈ చెరువును నిర్మించారు.ఆసియా ఖండంలోనే మానవ నిర్మితమైన చెరువుల్లో అతిపెద్దది.[1]కంభం చెరువు 23.95 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది.3 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. కానీ ఇటీవల పూడిక కారణంగా 2 టీఎంసీలకే పరిమితం అయింది. ఈ చెరువు ద్వారా 6,944 ఎకరాలకు సాగునీరు చేరుతుంది. ప్రస్తుతం కంభం చెరువు ఆయకట్టు పరిధిలో అరటి, పసుపు, శనగ, వరి వంటి పంటలు విరివిగా పండిస్తున్నారు. 2 లక్షల జనాభా తాగునీటి సమస్య తీరుస్తుంది.ఈ చెరువు 9 సార్లు మాత్రమే పూర్తిగా నిండింది. అది కూడా 1917, 1949, 1950, 1953, 1956, 1966, 1975, 1983, 1996, 2005, 2020 సంవత్సరాలలో పూర్తిగా నిండింది.[2]

కంభం చెరువు

చరిత్ర మార్చు

చారిత్రక కంభం చెరువు 15 వ శతాబ్దంలో ఒరిస్సా గజపతి రాజులు నిర్మించారు, తరువాత విస్తృతంగా విజయనగర రాజవంశం 15వ శతాబ్దం చివర రోజులలో విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయల భార్య వరదరాజమ్మ (జగన్మోహిని రాణి) పరిపాలనా కాలంలో 3.3 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు గుండ్లకమ్మ నదికి ఆనకట్ట కట్టడం ద్వారా అభివృద్ధి చేసింది.[3] గుండ్లకమ్మ, జంపాలేరు నుండి పారే ఒక యేరు ద్వారా ఈ చెరువుకు నీరు సమృద్ధిగా చేరి, వరి, పసుపు, చెరుకు, అరటికాయలు మొదలైన వాణిజ్య పంటలు రైతులు పండించుటకు వీలు కల్పిస్తుంది. వర్షపు నీరు ఈ చెరువుకు ఏకైక ఆధారం. 20 వ శతాబ్దం మొదట్లో ఆనకట్ట ఎత్తు 57 అడుగుల (17 మీటర్లు), డ్రైనేజీ ప్రాంతం 430 చదరపు మైళ్ల (1,100 కిమీ 2) ఉండేది. ప్రత్యక్ష నీటి పారుదల భూమి 10,300 ఎకరాలు (42 చ.కి.మీ) ఉండేది. ఈ చెరువు ఆయకట్టు ప్రాంతం కంభం, బెస్తవారిపేట మండలాలలో విస్తరించి ఉంది. ఈ చెరువు 23.95 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి, 3 టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. చెరువులో ఏడు కొండలున్నాయి. ఈ చెరువు పరిసరాల్లోని వంద గ్రామాల రైతులకు నీరందిస్తుంది. పరీవాహక ప్రాంత విస్తీర్ణం 6,944 హెక్టారులు. ఈ చెరువు 1917, 1949, 1950, 1953, 1956, 1966, 1975, 1983, 1996, 2005 సంవత్సరాలలో పూర్తిగా నిండినట్లు చెబుతారు.

చెరువు 1,113 కిలోమీటర్ల పరీవాహక ప్రాంతాన్ని, 23.95 చదరపు కిలోమీటర్ల నీటి నిల్వ ప్రాంతాన్ని కలిగి ఉంది. జలాశయ పూర్తి నీటి మట్టం 203.20 మీటర్లు కాగా, గరిష్ఠ నీటి మట్టం 204.10 మీటర్లు. చెరువు ఆనకట్ట పొడవు 295.65 మీటర్లు కాగా, ఎత్తు 18.29 మీటర్లు, అలుగు పొడుగు 89.40 మీటర్లు. చెరువు నీరు పెద్ద కంభం కాలువ, చిన్న కంభం కాలువ, చితిరలకట్ట, నక్కల గండి కాలువ, పాపాయిపల్లి కాలువ ద్వారా దాదాపు 25 గ్రామాలకు చెందిన పొలాలకు చేరుతుంది. పెద్ద కంభం కాలువ 32 తూములతో 7.2 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది. దీని కింద మూడు వేల ఎకరాల ఆయకట్టు ఉంది.

రాయల కాలం నాడు నిర్మించిన ఈ పురాతన చెరువుకు, ప్రపంచ చారిత్రిక నీటిపారుదల కట్టడాల (వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్) గుర్తింపు లభించింది. 2020వ సంవత్సరానికి గాను, ప్రపంచంలోని 14 సాగునీటి ప్రాజెక్టులకు స్థానం లభించగా, అందులో మన దేశంలోని నాల్గింటికి ఈ గుర్తింపు వచ్చింది. వీటిలో ఆంధ్రప్రదేశ్ చెందినవి మూడు ఉండగా, అందులో కంభం చెరువు ఒకటి. "ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్" అను సంస్థకు చెందిన న్యాయనిర్ణేతల బృందం, అంతర్జాతీయంగా వచ్చిన ఎంట్రీలను పరిశీలించి, ఈ ఎంపిక చేసింది. గుండ్లకమ్మ నదిపై నిర్మించిన ఈ చెరువు, ఆసియా ఖండంలోనే రెండవ అతి పెద్ద సాగునీటి చెరువు. 500 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ చెరువు క్రింద 10,300 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువు 7 కి.మీ. పొడవు, 3.5 కి.మీ. వెడల్పు ఉంది.ఇది ఆసియా ఖండంలోనే అతి పెద్ద చెరువుగా పేరుగాంచింది.ప్రకాశం జిల్లాలో ఇది ఒక పర్యాటక కేంద్రంగా గుర్తింపు ఉంది. [4]

అంతర్జాతీయంగా గుర్తింపు మార్చు

2020 జూన్ 24న ఇంటర్నేషనల్ కమీషన్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ, (ఐసిఐడి) తన 70వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న సందర్బంగా, 2012 నుండి యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో చారిత్రక నీటిపారుదల నిర్మాణాలను గుర్తిస్తోంది.అందులో భాగంగా కంభం చెరువుని ప్రపంచ చారిత్రక వారసత్వ సాగునీటి నిర్మాణాల జాబితాలో చేరుస్తున్నట్లు ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజే సంస్థ అధికారికంగా ప్రకటించింది.[5][6][7]

మూలాలు మార్చు

  1. S.murali (2016-09-27). "Cumbum tank a big draw in Prakasam". The Hindu. ISSN 0971-751X. Retrieved 2020-12-06.
  2. "25 సంవత్సరాల తర్వాత.. కంభం చెరువు తొణికిసలాడుతుండటంతో." www.andhrajyothy.com. Retrieved 2020-12-06.
  3. "Cumbum tank a big draw in Prakasam". The Hindu. 2016-09-26. ISSN 0971-751X. Retrieved 2022-12-21.
  4. ABN (2022-06-02). "కలగా కంభం చెరువు పర్యాటక కేంద్రం". Andhrajyothy Telugu News. Retrieved 2022-12-21.
  5. "కంభం చెరువుకు అంతర్జాతీయ గుర్తింపు ఎలా వచ్చింది... స్థానిక రైతులు ఏం ఆశిస్తున్నారు?". BBC News తెలుగు. Retrieved 2020-12-06.
  6. India, The Hans (2020-12-02). "Ongole: Cumbum Tank selected as World Heritage Irrigation Structure". www.thehansindia.com. Retrieved 2022-12-21.
  7. "Four sites in India get World Heritage Irrigation Structure tag". Hindustan Times. 2020-12-01. Retrieved 2022-12-21.

వెలుపలి లంకెలు మార్చు