కన్నెగంటి సూర్యనారాయణమూర్తి
కన్నెగంటి సూర్యనారాయణమూర్తి తొలి తరం భారత స్వాతంత్ర్య సమర యోధుడు. తామ్రపత్ర గ్రహీత.
జీవిత విశేషాలు
మార్చుఅతను గుంటూరు జిల్లా తెనాలి తాలూకా నందివెలుగు గ్రామంలో 1896 డిసెంబరు 7న జన్మించాడు. సాదారణ వ్యవసాయ కుటుంబ నేపథ్యంలో వ్యవసాయంపట్ల మక్కువ ఉన్నప్పటికీ నాటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా స్వాతంత్ర్యోద్యమంలో ముఖ్యమైన పాత్ర వహించాడు. 1921లో విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశానికి హాజరవడంతో మొదలైన అతని రాజకీయ ప్రస్థానం చివరి దశలో గుంటూరు జిల్లా స్వాతంత్ర్య సమరయోధుల సంఘానికి అధ్యత వహించి, వారి సమస్యల పరిష్కారంలో ప్రధాన పాత్ర వహించే వరకు నిరాటంకంగా కొనసాగింది.
భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో తెనాలి పట్టణానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. కాంగ్రెస్ లోని యువకులతో ముఠా కట్టి తెనాలి ప్రాంతంలో స్వాతంత్ర్యోద్యమాన్ని బాగా ప్రచారం చేసాడు. 1921 సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని తెనాలి పరిసర ప్రాంతాలలో పికిటింగులు, ధర్నాలు, ఖాదీ వస్త్రధారణ, విదేశీ వస్త్ర దహన కార్యక్రమాలలో ముఖ్య పాత్ర వహించి బ్రిటీషు అధికారులను ముప్పతిప్పలు పెట్టాడు. ఫలితంగా ఆరు నెలల కఠిన కారాగార శిక్ష, రూ.500 జరిమానా విధించి రాయవెల్లూరు జైలులో ఉంచారు. 1930 ఉప్పు సత్యాగ్రహంలోపాల్గొని లాఠీ ఛార్జి అనుభవించాడు. 1940 వ్యక్తి సత్యాగ్రహంలో ఆరునెలలు, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో 9 నెలల జైలు శిక్షలు అనుభవించాడు . రాయచోటి పుల్లరి ఉద్యమంలో గిరిజనులకు అండగా నిలబడ్డాడు. రాజమండ్రి, వెల్లూరు, మధుర, తంజావూరు జైళ్లలో ఏడు సంవత్సరాల పాటు ఎన్నో కష్టాలు అనుభవించాడు. వెల్లూరు జైలులో ఖైదీల హక్కుల కోసం పోరాడి అందరి మన్ననలు పొందాడు. ఈ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్న రాజాజీ తన ఆత్మకథలో "యంగ్ చౌదరి ఆఫ్ గుంటూరు జిల్లా" అంటూ కన్నెగంటిని కీర్తించాడు. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యునిగా, కొంతకాలం గుంటూరు జిల్లా పరిషత్తు అధ్యక్షునిగా ప్రజాసేవ చేసాడు.స్వాతంత్ర్యానంతరం వినోభాబావే సిద్ధాంతాల ప్రచారానికి తన జీవితాన్ని అంకితం చేసాడు. భారత ప్రభుత్వం నుంచి తామ్ర పత్రాన్ని పొందాడు.[1]
అతను 1990 మార్చి 13న మరణించాడు.
మూలాలు
మార్చు- ↑ 30 జూలై 2018 ఆంధ్రజ్యోతి దినపత్రిక గుంటూరు జిల్లా విభాగం