కల్ హో న హో
KalHoNaaHo1.jpg
కల్ హో న హో పోస్టరు
దర్శకత్వంనిఖిల్ అద్వానీ
రచననిరంజన్ అయ్యంగార్
కరణ్ జోహార్
నిర్మాతకరణ్ జోహార్
యష్ జోహార్
నటవర్గంజయా బచ్చన్
షారుఖ్ ఖాన్
సైఫ్ అలీ ఖాన్
ప్రీతీ జింటా
డెల్నాజ్ ఇరానీ
ఛాయాగ్రహణంఅనిల్ మెహతా
కూర్పుసంజయ్ సంక్లా
సంగీతంశంకర్-ఎహ్ సాన్ - లాయ్
పంపిణీదారులుధర్మా ప్రొడక్షన్స్
యష్ రాజ్ ఫిలింస్
విడుదల తేదీలు
28 నవంబరు 2003
నిడివి
184 ని
దేశంభారత దేశం
భాషలుహిందీ
English

కథసవరించు

నైనా క్యాథరీన్ కపూర్ (ప్రీతీ జింటా) ఆవేశపరురాలైన ఒక యువతి. తన ఆవేశానికి కారణాలనేకం. భార్యా పిల్లలని (నైనాకి ఒక తమ్ముడు) గాలికి వదిలేసి తన తండ్రి ఆత్మహత్య చేసుకొన్నందుకు. బ్రతుకు తెరువు కోసం తన తల్లి జెన్నిఫర్ (జయా బచ్చన్) నడుపుతున్న రెస్టారెంట్ నష్టాలపాలై చివరి దశలో ఉన్నందుకు. తన కొడుకు ఆత్మహత్యకి కారణం జెన్నిఫరే అని కోడలిని తన నాన్నమ్మ లజ్జో (సుష్మా సేఠ్) అపార్థం చేసుకొన్నందుకు. తాము దత్తత తీసుకొన్న జియా అనే అమ్మాయిని ఇంటికి దురదృష్టం తెచ్చింది అని నాన్నమ్మ దూషిస్తున్నందుకు. ప్రతి రోజు ఇంట్లో పెరుతున్న అశాంతిని నైనా ఎదుర్కోవలసిందే. ఇటువంటి నైనా జీవితానికి ఒకే ఒక ఆటవిడుపు, అమాయకమైన తన MBA సహ విద్యార్థి, రోహిత్ (సైఫ్ అలీ ఖాన్)

అమన్ మాథుర్ (షారుఖ్ ఖాన్) నైనా పొరుగింట్లో కొత్తగా దిగుతాడు. వారి విషాదాన్ని గమనించి వారిని అతి వేగంగా మార్చేస్తాడు. వారి విషయాలలో జోక్యం కలుగజేసుకొని, వారి రెస్టారెంటులో భారతీయ వంటకాలని ప్రవేశపెట్టి, వారి ఆర్థిక స్థితిని మెరుగు పరుస్తాడు. వారిలో ఆశావహ దృక్పథాన్ని నింపుతాడు. అమన్ కలుపుగోలుదనానికి, అత్యుత్సాహానికి ఇతరులు ముచ్చటపడినా, మొదట ఇష్టపడని నైనా మెల్లగా అమన్ పైన ప్రేమ పెంచుకొంటుంది.

కానీ నైనాని రోహిత్ ప్రేమిస్తుంటాడు. తన ప్రేమని నైనాకి ఎలా వ్యక్తపరచాలో తెలియని రోహిత్, అమన్ ని సంప్రదిస్తుంటాడు. అమన్ ప్రేరణతో నైనాని విందుకు పిలిచిన రోహిత్ తన మనసులో మాట చెప్పేలోపు నైనా తాను అమన్ ని ప్రేమిస్తూ ఉందని రోహిత్ కు చెబుతుంది. నైనా మనసులో తాను లేనని, అమనే ఉన్నాడన్న విషయం అమన్ కి తెలిపి, రోహిత్ తన తల్లిదండ్రుల వద్దకి వెళ్ళిపోతాడు. తన ప్రేమ గురించి అమన్ కి తెలపాలి అని అతని ఇంటికి వెళ్ళిన నైనాకి, అమన్ తనకి ఇది వరకే ప్రియ (సోనాలీ బేంద్రే) అనే డాక్టరుతో వివాహం జరిగిపోయినది అని తెలుపగానే భగ్న హృదయురాలౌతుంది.

నిజానికి అమన్ కు ప్రాణాంతకమైన ఒక హృద్రోగం ఉందని, అతడు ఎక్కువ కాలం జీవించడనీ, అందుకే తన చుట్టూ ఉన్న వారిని నవ్విస్తూ, తాను నవ్వుతూ "రేపు లేదు, కాబట్టి ఈ రోజే సంతోషంగా ఉండాలి" అనే అభిప్రాయంతో జీవిస్తుంటాడని తెలుస్తుంది. ఈ విశాల దృక్పథంతో అమన్ నైనా పైనున్న తన ప్రేమని త్యాగం చేస్తాడు. కొంతకాలం తర్వాత నైనా రోహిత్ ప్రేమని తెలుసుకొని అంగీకరిస్తుంది.

నైనా ఇంటికి వచ్చిన ఒక లేఖలో జియా నైనాకి సవతి చెల్లెలని, తన తండ్రి వివాహేతర సంబంధంతోనే జియా పుట్టినదని, జెన్నిఫర్ కి తాను చేసిన ద్రోహానికి అపరాధ భావంతోనే నైనా తండ్రి ఆత్మ హత్య చేసుకొన్నాడని చదివిన అమన్ కి జెన్నిఫర్ నిజాలను చెబుతుంది. లజ్జో జియాని మనవరాలిగా అంగీకరించటంతో నైనా ఇంట్లోని పరిస్థితులన్నీ చక్కబడతాయి.

అమన్ ఆరోగ్యం క్షీణిస్తుంది. రోహిత్, నైనాల నిశ్చితార్థం రోజున నాట్యం చేస్తున్న అమన్ గుండెలో నొప్పి మొదలౌతుంది. అనుకోకుండా ప్రియని కలుసుకొన్న నైనా ప్రియ అమన్ భార్య కాదని అతని ఆరోగ్య స్థితిని పర్యవేక్షించే ఒక వైద్యురాలు మాత్రమేనని తెలుసుకొంటుంది. రోహిత్, నైనాల వివాహం జరగాలనే అమన్ అబద్ధం ఆడాడు అని తెలుసుకొన్న నైనా అతనిని చూడటనికి వెళ్తుంది. చావు బ్రతుకుల్లో ఉన్నా కూడా అమని తనని ప్రేమించలేదని నైనాతో సరదాగా బుకాయిస్తాడు. తన పైన నిజంగానే అమన్ కు ప్రేమ ఉన్నదని తెలుసుకొన్న నైనాని, తాను ఎక్కువ కాలం జీవించడు కాబట్టి రోహిత్ నే పెళ్ళాడలని ప్రాధేయపడతాడు. వివాహానంతరం వారిరువురి చేతుల్లోనే అమన్ ప్రాణం వదులుతాడు.

తన కథనంతా కూతురితో చెబుతున్న నైనా వ్యాఖ్యానంతోనే చిత్రం ప్రారంభం, సుఖాంతం అవుతుంది.

విశేషాలుసవరించు

  • పతాక సన్నివేశాలలో షారుఖ్ పలికించే హావభావాలు అద్భుతం
  • న్యూయార్క్ లో స్థిరపడిన పంజాబీ కుటుంబంగా నైనా, గుజరాతీ కుటుంబంగా సైఫ్ వారి కలయికల చిత్రీకరణ సున్నితమైన హాస్యాన్ని పలికిస్తుంది.
  • నైనా ప్రేమని పొందటానికి రోహిత్ కు అమన్ సూచించే ఛే దిన్ - లడ్కీ ఇన్ (ఆరు రోజులలో అమ్మాయి ప్రేమ) ఫార్ములాకి నవ్వు ఆగదు.
  • ఇది జర్మనీలో విడుదలైన రెండవ హిందీ సినిమా. (మొదటిది కభీ ఖుషీ కభీ గం.) జర్మనులో ఈ చిత్రం పేరు Lebe und denke nicht an morgen ("Live, and do not think about tomorrow")
  • ఫ్రాన్స్లో ఈ చిత్రం New-York Masala పేరుతో విడుదలైనది
  • పోలండ్లో ఈ చిత్రం Gdyby jutra nie bylo (If Tomorrow Never Comes) పేరుతో విడుదలైనది.

పాటలుసవరించు

ఈ చిత్రంలోని పాటలన్నీ జనాదరణ పొందాయి.

తనని అమన్ ప్రేమించాడని తెలిసుకొన్నాక పెళ్ళిపీటలపై నైనా కూర్చోవటానికి వచ్చినప్పుడు కల్ హో న హో - విషాద గీతం లోని కొంత భాగం:
సచ్ హైకి దిల్ తో దుఖా హై
హమ్ నే మగర్ సోచా హై
దిల్ కో హై దుఖ్ క్యో ఆంఖే హై నమ్ క్యో
హోనా హీ థా జో హువా హై
ఉస్ బాత్ కో జానే భీ దో
జిస్ కా నిషాన్ కల్ హో న హో

మనసు బాధ పడుతున్నది నిజం
నేను ఆలోచించాను
మనసుకి ఈ బాధ ఎందుకు, కళ్ళకి ఈ నీళ్ళు ఎందుకు
ఏది రాసి పెట్టి ఉందో అదే జరిగింది
ఈ విషయాన్ని మరచిపో
దీని ఛాయలు రేపటికి ఉండవు కదా

తుమ్ హో గం కో ఛుపాయే
మై హూ సర్ కో ఝుకాయే
తుమ్ భీ చుప్ హో మై భీ చుప్ హూ
కౌన్ కిసే సంఝాయే

నువ్వు నీ విషాదాన్ని మనసులోనే దాచుకొన్నావు
నేను పెళ్ళిపీటలపై నా తలను వంచాను
నువ్వూ నిశబ్దం, నేనూ నిశబ్దం
ఎవరికెవరం ఏమని చెప్పుకోగలం

పాట గాయకులు వ్యవధి
కల్ హో న హో సోనూ నిగం 05:23
కుఛ్ తో హువా హై షాన్, అల్కా యాగ్నిక్ 05:22
ఇట్స్ ద టైం టు డిస్కో వసుంధరా దాస్, కేకే, షాన్, లాయ్ మెండోన్సా 05:35
మాహీ వే ఉదిత్ నారాయణ్, సోనూ నిగం, సాధనా సర్ గం, శంకర్ మహదేవన్, సుజాతా భట్టాచార్య ( మధుశ్రీ ) 06:09
ప్రెట్టీ వుమన్ శంకర్ మహదేవన్, Ravi "Rags" Khote 05:55
కల్ హో న హో - విషాదం అల్కా యాగ్నిక్, రిచా శర్మ, & సోనూ నిగం 05:38
హార్ట్ బీట్ ఇన్స్ట్రుమెంటల్ 04:28