కాకతీయ శిలాతోరణ ద్వారం
దక్షిణ భారత దేశంలోని కాకతీయ సామ్రాజ్యానికి ప్రతీకగా నిలుస్తుంది కాకతీయ శిలా తోరణ స్తంభం. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో [1][2] స్థానం పొందింది. కాకతీయులు తమ చిహ్నంగా నిర్మించుకున్న దీనిని వరంగల్ గేట్ గా పరిగణిస్తారు. ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లోని వరంగల్ (పట్టణ) జిల్లాలో ఉంది.[3]
కాకతీయ శిలాతోరణ ద్వారం | |
---|---|
సాధారణ సమాచారం | |
రకం | ఆర్చి |
ప్రదేశం | వరంగల్, తెలంగాణ, భారత దేశం |
పూర్తి చేయబడినది | 12 వ శాతాబ్దం |
చరిత్ర
మార్చుఇది కాకతీయ సామ్రాజ్యము కాలంలో సుమారు 12 వ శతాబ్దంలో నిర్మించారు. దీనిని ఢిల్లీ సుల్తానుల రాజ్య ప్రారంభం కంటే ముందుగానే నిర్మించారు.[4] దీనిని కాకతీయుల "కీర్తి తోరణం"గా భావిస్తారు.
వర్ణన
మార్చుతోరణాల నిర్మాణం భారతీయ ఆలయ వాస్తులో సాంచి స్తూపం చుట్టూ శాతవాహన రాజైన శ్రీ శాతకర్ణిచే క్రీ.పూ.2 వ శతాబ్ది కాలంలో నిర్మించబడిన రాతి ఆవారం, మధ్యలో నాలుగు దిశలా నాలుగు తోరణ ద్వారాల నిర్మాణంతో ప్రవేశపెట్టబడింది. తోరణ నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాన్ని అందులోంచే గ్రహించినప్పటికీ, తమదైన శైలిలో అందమైన మార్పులన్నిటినీ చేసి అందులోంచి ఒక విశిష్టమైన నిర్మాణాన్ని సాధించి, కాకతీయ తోరణంగా ప్రతిష్ఠించి, శిల్పకళలో తమ ప్రతిభను చాటుకున్నారు కాకతీయ కాలపు శిల్పులు. తెలుగు ప్రజల కళాదృష్టికి, అభిరుచికి, కాకతీయుల కాలపు శిల్పుల కళా ఔన్నత్యానికి నిదర్శనాలుగానూ, అందులో వారి ప్రతిభను చాటి చెప్పే కీర్తి తోరణాలుగానూ ఆ శిలా తోరణాలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. వరంగల్ కోటలో నాలుగు కాకతీయ తోరణాలు సమానదూరాలలో విస్తరించి దర్శనమిస్తాయి. చూడ్డానికి ఓ అలంకారపు ద్వారంలా కనిపించినా అందులో తెలుసుకోవాల్సిన అంశాలెన్నో ఉన్నాయి. కాకతీయ తోరణం కేవలం అలంకారం కోసం చేసిన డిజైన్ కాదు. దాని మీద కాకతీయుల పాలనా వైభవమంతా పూసగుచ్చినట్టుగా ఉంటుంది. వాళ్ల ఏలుబడిలో ఏయే అంశాలకు ప్రాధాన్యమిచ్చారో తెలియజేస్తుంది. నిలబడ్డ నాలుగు పిల్లర్లు వాళ్ల పాలనలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందనడానికి నిదర్శనం. చివరి రెండు పిల్లర్ల మీద ఇరుపక్కల గర్జించిన సింహాలు కాకతీయుల ఎదురులేని నాయకత్వానికి చిహ్నం. దాని పక్కన తల పైకెత్తిన మొసలి జలకళకు ప్రతీతి. ఎందుకంటే కాకతీయుల కాలంలో చెరువుల కుంటలు కాలువల్లో పుష్కలంగా నీళ్లుండేవి. నీళ్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మొసళ్లు మెండుగా ఉంటాయి. ఇకపోతే తోరణం నిండా లతలు, తీగలు పారే గొలుసుకట్టు చెరువుల్ని, కుంటల్నీ సూచిస్తాయి. అపార జలరాశి పరవళ్లు తొక్కడంతో ఆ కాలంలో పంటలు బాగా పండేవి. కాకతీయుల కాలంలో ప్రజలకు ఆకలి బాధ ఎలావుంటుందో తెలియదంటే అతిశయోక్తి కాదు. ఇకపోతే పైన ఇరువైపులా రెండు హంసలు కాకతీయుల పారదర్శక పాలనకు నిదర్శనం. హంస కింద ఇరువైపుల చేతులు పైకెత్తిన కుబేరుల విగ్రహాలు ఆర్థిక పరిపుష్టికి సంకేతం. మొసలి కింది భాగంలో వజ్ర వైఢూర్యాల దండలు కాకతీయుల వైభవానికి చిహ్నం. అప్పట్లో రత్నాలు రాశులుగా పోసి అమ్మకున్నా ఆర్థికపురోగతి అద్భుతంగా ఉండేదని సంకేతం. కిందిభాగాన బోర్లించిన ఏడు పూర్ణకుంభాలు గ్రామదేవతల ప్రతిబింబాలు. వాటినే సప్తమాతృకలు అని కూడా పిలుస్తారు. స్తంభం మధ్యభాగంలో చేపల బొమ్మలు ఓ వెలుగు వెలిగిన మత్స్య పరిశ్రమకు సంకేతం.