కాకి మాధవరావు
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
కాకి మాధవరావు ఐఏఎస్ అధికారి.కృష్ణాజిల్లా పామర్రు మండలం పెదమద్దాలి పుట్టిన ఊరు. నాన్న ఒక పాలేరు.
భావాలు అనుభవాలు
మార్చు- నాన్న ఆమోదం లేకుండానే అమ్మ స్కూల్లో చేర్పించింది. నేను చెప్పినా వినకుండా వాడ్ని స్కూల్లో చేరుస్తావా? మర్నాడు అమ్మను గొడ్డును బాదినట్టు బాదాడు. అడ్డం వెళితే, మా అన్నయ్యనూ, నన్నూ కూడా తన్నాడు. అంత జరిగినా "ఎన్నాళ్లు కొడతాడో చూద్దాం మీరు మాత్రం చదువు మానేయొద్దు అంది. ఆ కారణంగా అమ్మను ఎన్ని సార్లు కొట్టాడో లెక్కలేదు. చివరికి విసుగు పుట్టి వదిలేశాడు. నా చదువు, మా అన్నయ్య చదువు మా నాన్న అయిష్టత మధ్యే కొనసాగింది. మాకు తెలిసి ఆయన తన జీవితంలో ఓటమి అంటూ ఎరగడు. కానీ, ఈ ఒక్క విషయంలో మాత్రం నాన్న ఓడిపోయాడు. చూసే ప్రపంచం చిన్నదైపోయినపుడు ఎంత వారికైనా ఓటమి తప్పదేమోనని నాకనిపిస్తుంది.
- మా నాన్న ఎప్పుడు క్షవరం చేయించినా మంగలిని జుత్తు మరీ చిన్నదిగా చేయమని చెప్పేవాడు. నేనే వద్దూ వద్దూ అంటూ ఉండేవాణ్ని. అలాంటి నేను మంగలి వద్దకు వెళ్లి గుండు చేయించుకుని వచ్చాను. అంతే కాదు అమ్మతోనూ, నాన్నతోనూ మాట్లాడటం మానేశాను. ఆ మౌనంలో నాకు ఏవేవో ఆలోచనలు వచ్చేవి. తప్పు చేయకుండానే ఇలా దండించారే..! నిజంగానే తప్పు చేస్తే ఏం కావాలి? ఒక వేళ నిజంగానే నేను తప్పు చేసి ఉంటే అప్పుడు నా వద్ద సమాధానం ఉండదు. అందుకే జీవితంలో తప్పంటూ చేయకూడదనే ఒక నిర్ణయానికి వచ్చేశాను. స్నేహితులు, సరదా కబుర్లు, ఆట పాటల లాంటివన్నీ ఆ రోజునుంచి నా జీవితంలోంచి పూర్తిగా అదృశ్యమైపోయాయి. ఫలితంగా, నాలో క్రమంగా పెరుగుతూ వచ్చిన సీరియస్‌నెస్ నన్నొక పుస్తకాల పురుగును చేసింది. నాన్న చేతిలో నేను అన్యాయంగానే హింసకు గురైనా అది నాలో వేరే రకమైన కసిని పెంచింది. హింసను ఒక వైపునుంచే చూస్తే మనం కూలిపోవడం ఖాయం. అలా కాకుండా ఆవలి వైపు నుంచి చూస్తే అది మనల్ని నిలబెడుతుంది.
- నేను వరంగల్‌లో కలెక్టర్‌గా ఉన్న సమయంలో జనాన్ని తీవ్రమైన ఆందోళనకు గురిచేసే పరిణామాలు కొన్ని జరిగాయి. నక్సలైట్లు అన్న పేరుతో పోలీసులు కొంత మంది స్థానిక యువకుల్ని అడవుల్లోకి తీసుకెళ్లి కొద్ది రోజులు ఉంచేసేవారు. ఆ తర్వాత ఒక ఇన్స్‌పెక్టర్ వాళ్ల తలిదండ్రులను కలిసి, పోలీసులు ఇవ్వాళో రేపో మీ పిల్లాడ్ని కాల్చేస్తారు, మీరు ఇంత డబ్బు ఇస్తే పోలీసులకు చెప్పి విడిపిస్తాను అంటూ బేరం పెట్టేవాడు. మోహన్ రావు అనే సిపిఐ నాయకుడొకాయన నాకీ విషయం చెప్పాడు. వెంటనే ఈ విషయాన్ని నేను ఎస్.పి గారికి చెప్పాను. ఆయన అలాంటిదేమీ లేదని దాటవేశాడు. మళ్లీ ఒకరోజు అదే మోహన్ రావు ఫలానా అడవిలోని ఫలానా కొండ మీద 16 మంది యువకుల్ని బంధించి ఉంచారంటూ సమాచారాన్ని చేరవేశాడు. అప్పుడింక తట్టుకోలేకపోయాను. సబ్-కలెక్టర్‌గా ఉన్న జి. పి. రావును, అసిస్టెంట్-కలెక్టర్‌గా ట్రెయినింగ్‌లో ఉన్న హరిని ఆ ప్రదేశానికి వెళ్లమని చెప్పాను. వీళ్లు అక్కడికి వెళ్లి చూస్తే 16 కాదు 22 మంది ఉన్నారు.వాళ్లను వెంటనే విడిపించాను.ఆ సంఘటనతో పోలీసులు నా మీద కన్నెర్ర చేశారు. వివిధ కారణాలతో అప్పటికే నా మీద ద్వేషంతో ఉన్న కొంత మంది ఎం.ఎల్.ఏలు, ఒక మంత్రి ఇదే అదనుగా 'కలెక్టరు నక్సలైటు' అంటూ నా మీద ఒక పిటిషన్ తయారు చేసి అప్పటి రాష్ట్రపతి వి.వి. గిరికి అందచేశారు. ఈ విషయం స్థానిక పత్రికల్లోనూ, వివిధ జాతీయ పత్రికల్లోనూ ప్రచురితమమయ్యింది. కాని ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో మాత్రం నా గురించి చాలా పాజిటివ్ వ్యాసం వచ్చింది. దాని శీర్షిక 'నక్సలైట్ ఇన్ ఐఏఎస్ క్లోత్స్..!' అని. అందులో "అన్యాయంగా తమ భూమిలోంచి తరిమివేయబడ్డ పేదవారికి ఆయన తిరిగి ఆ భూమిని ఇప్పించాడు. గీతకార్మికులకు కాకుండాపోతున్న తాటి, ఈత చెట్లను వారికి అందేలా చేశాడు. ప్రభుత్వం ఇచ్చే కరువు నివారణా నిధులను పేదవాళ్ల పొలాలు చదును చేయడానికి, బావులు తవ్వడానికి ఖర్చు చేశాడు. ఈ చర్యలన్నీ నక్సలిజంలో భాగమే అయితే ఆ కలెక్టరు నక్సలైటే' అంటూ రాశారు. విధినిర్వహణలో సమస్యలు ఎప్పుడూ తప్పవు. కానీ, అత్యున్నత హోదాలో ఉండే వారు సైతం వక్ర మార్గం పడితే సమాజానికి ఇంక మనుగడేముంటుంది? హోదాల్ని కూడా మనుషుల హృదయాలతోనే కొలవాలి.
- నిజాయితీగా ఉండడమే కాదు. మన నీతిని అనుమానించే పరిస్థితి ఏర్పడకుండా చూసుకోవడం కూడా అవసరం.ఎన్. టి. రామారావు ప్రభుత్వం అవినీతిని అంతమొందిస్తాం అంటూ అధికారంలోకి వచ్చింది. అవినీతికి పాల్పడే వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తడం మొదలెట్టాయి. సరిగ్గా అదే సమయంలో మా అబ్బాయి పి.జి పూర్తి చేసుకుని సొంతంగా ఏదైనా పరిశ్రమ స్థాపించాలన్న అభిప్రాయానికి వచ్చాడు. అందుకు నేను అనుమతించలేదు. "నువ్విప్పుడు ఏ రుణంతో ప్రారంభించినా అది నేను అవినీతికి పాల్పడి సంపాదించిన డబ్బుతోనే పెట్టావని అనుకుంటారు. అందువల్ల నువ్వు సివిల్ సర్వీసెస్‌కు చదువుకోవడం మేలు అని చెప్పాను. వాడు ససేమిరా అన్నాడు. "ఒకవేళ నువ్వు అంతగా అనుకుంటే నేను రిటైర్ అయ్యేదాకా వేచి ఉండు అప్పుడు పెట్టుకో అన్నాను. "16 ఏళ్లు వేచి ఉండడం అంటే చాలా కాలం వృధా అవుతుంది కదా ! అన్నాడు. "అయితే నా ఇంట్లోంచి బయటికి వెళ్లిపో, నాకూ నీకూ ఏ సంబంధం లేదనుకున్నాక ఇంక ఏమైనా చేసుకో అన్నాను. "అంత కఠోరంగా ఎందుకులే నాన్నా మీరు రిటైర్ అయ్యాకే ఆ పరిశ్రమేదో పెడతా అన్నాడు. అప్పటికి వాడికి 38 ఏళ్లు వచ్చాయి. అన్న మాట ప్రకారం 1998 దాకా ఖాళీగా ఉండి ఆ తర్వాతే మా గ్రామస్తుడైన సుజనా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ వై.ఎస్ చౌద రి (ఎం.పి) గారి కంపెనీలోని ఒక యూనిట్ తీసుకుని దాని మేనేజింగ్ డైరెక్టర్‌గా పని ప్రారంభించాడు.కానీ, ఆ పరిశ్రమ నష్టాలే మిగిల్చింది. పరిస్థితి గమనించిన చౌదరి గారు ఆ పరిశ్రమ తిరిగి తానే తీసుకుని ఆ నష్టాలన్నీ తన మీదే వేసుకున్నాడు. నైరాశ్యానికి గురవుతున్న మావాడిని అంతటితో వదిలేయకుండా, తన కంపెనీల్లోని ఒక యూనిట్‌కు మేనేజింగ్ డైరెక్టర్ ఉద్యోగం ఇచ్చి కొండంత అండగా నిలబడ్డాడు. వాస్తవానికి నేను రిటైర్ అయ్యేనాటికి నాకు సొంత ఇల్లే లేదు. అప్పటిదాకా ఉన్న అద్దె ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. నా కొడుకుకే కాదు, మా మొత్తం కుటుంబానికి ఆశ్రయంగా తన కంపెనీ హౌజ్‌ను మాకు ఇచ్చాడు. నేనున్న ఈ దశలో వై. ఎస్. చౌదరి లేని జీవితాన్ని ఊహించడం కూడా కష్టమే. జీవితమంతా ఒక కోణాన్నే చూస్తూ అందులో మనం ఎంత నిష్ణాతులమైనా కావచ్చు. కానీ, జీవితానికి మనుగడనిచ్చే మరో కోణం గురించి ఏమీ తెలియకపోతే ఎంతో ప్రమాదం.జీవితానికి విలువలు ఎంత ముఖ్యమో, ప్రాణానికి ప్రాణంగా, ఒక ఆలంబనగా నిలిచే స్నేహితులు కూడా అంతే ముఖ్యం.
మూలాలు
మార్చు- నవ్య ఆంధ్రజ్యోతి 31.1.2014