భారత రాష్ట్రపతి
సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమైన భారత దేశానికి దేశాధినేత రాష్ట్రపతి (Rashtrapati / President). రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు, సర్వ సైన్యాధ్యక్షుడు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి కార్యనిర్వాహక దేశాధినేత. శాసన విభాగమైన పార్లమెంటు ఉభయ సభలను రాష్ట్రపతి సమావేశపరుస్తారు. ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రిని నియమిస్తారు. అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు. అయితే, వాస్తవానికి కార్యనిర్వాహక అధికారాలన్నీ ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రివే. ప్రధానమంత్రి సలహా మేరకే, రాష్ట్రపతి సంతకంతో ఉత్తర్వులు జారీ అవుతాయి. రాష్ట్రపతి పదవి అలంకార ప్రాయమైనది.
భారతదేశం |
![]() ఈ వ్యాసం భారతదేశం రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం. |
|
ఇతర దేశాలు |
1950 జనవరి 26 న భారత రాజ్యాంగం అమలు లోకి వచ్చిన తరువాత దేశాధినేతగా రాష్ట్రపతి అయ్యారు. అప్పటి వరకు గవర్నర్ జనరల్ దేశాధినేతగా ఉండేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, భారత దేశానికి ఇద్దరు గవర్నర్ జనరల్ గా పనిచేసారు.
అర్హతలుసవరించు
భారత రాష్ట్రపతిగా ఎన్నికయేందుకు క్రింద తెలిపిన అర్హతలు ఉండాలి.
- భారత పౌరుడై ఉండాలి.
- వయసు 35 ఏళ్ళు లేదా ఆ పైబడి ఉండాలి.
- లోక్‌సభ సభ్యుడయేందుకు కావలసిన అర్హతలు ఉండాలి.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో గానీ, ఆ ప్రభుత్వాల నియంత్రణలోనున్న సంస్థలలో గాని సంపాదనగల స్థానం కలిగి ఉండకూడదు.
ఒక వ్యక్తి ఎన్నిసార్లు అయిన రాష్ట్రపతిగా ఎన్నిక కావచ్చు. రాష్ట్రపతిగా ఎన్నికవ్వబోయే వ్యక్తి, పార్లమెంటు ఉభయసభల్లోగాని, రాష్ట్ర శాసన సభల్లోగాని సభ్యుడిగా ఉండరాదు. ఒకవేళ అటువంటి సభ్యుడు రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తే వెంటనే సదరు సభల్లో సభ్యత్వం కోల్పోతారు.
రాష్ట్రపతి వేతనం పార్లమెంటు నిర్ణయిస్తుంది. పదవీకాలం ముగిసే వరకు రాష్ట్రపతి వేతనంలో కోత ఉండదు. అధికరణ 360 కింద ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో రాష్ట్రపతి వేతనంలో కోత విధించరాదు.
రాష్ట్రపతి ఎన్నికసవరించు
రాష్ట్రపతిని కింది సభ్యులు గల ఎలెక్టోరల్ కాలేజి (electoral college) ఎన్నుకుంటుంది.
- పార్లమెంటు రెండు సభలలోను గల ఎన్నికైన సభ్యులు
- కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరి శాసన సభలలో ఎన్నికైన సభ్యులు
- రాష్ట్ర శాసన సభలలోని ఎన్నికైన సభ్యులు.
- 2/3 వంతు సభ్యుల ఆధిక్యత ఉండాలి.
అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతి చే ప్రమాణ స్వీకారం చేయిస్తారు.[1]
ఏ కారణం చేతనైనా రాష్ట్రపతి పదవి ఖాళీ అయినపుడు, ఆరు నెలలలోగా కొత్త రాష్ట్రపతి పదవీ స్వీకారం జరగాలి. మొదట్లో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక ఎంపి లేదా ఎమ్మెల్యే ప్రతిపాదించి మరో ఎంపి లేదా ఎమ్మెల్యే బలపరిస్తే సరిపోయేది. 1974 లో జరిగిన రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రతిపాదించే వారి సంఖ్య, బలపరిచే వారి సంఖ్యను 10 కి పెంచారు. 1997 లో జరిగిన మరో సవరణ ప్రకారం ఈ సంఖ్యను 50 కి పెంచారు. రాష్ట్రపతి ఎన్నికల్లో నోటా (ఎవరికీ ఓటు వేయకపోవడం) అవకాశం లేదు. ఓటు వేసే వాళ్ళు ఖచ్చితంగా ఎవరినో ఒకరిని ఎన్నుకోవాల్సిందే. ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలట్ ఉండదు. సాధారణంగా రాజకీయ పార్టీలు తమ సభ్యులు ఓటింగ్ లో పాల్గొనేటపుడు ఫలానా వారికే ఓటు వేయాలని విప్ జారీ చేస్తాయి. కానీ రాష్ట్రపతి ఎన్నికకు మాత్రం విప్ జారీ చేయరు. ఒకసారి రాష్ట్రపతిగా ఎన్నికైనా కూడా ఎన్ని సార్లయినా తిరిగి ఆ పదవికి పోటీ చేయవచ్చు.[2]
రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ 2022సవరించు
ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం 2022 జులై 24తో ముగియనున్న నేపథ్యంలో జులై 25లోగా నూతన రాష్ట్రపతి ఎన్నిక పూర్తి కావాల్సి ఉంది. ఢిల్లీలో 2022 జూన్ 9న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ భారత రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు.[3] దీనికి సంబంధిచిన కీలక తేదీలు:
- జూన్ 15న రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్
- జూన్ 29 వరకు నామినేషన్ల స్వీకరణ
- జులై 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు
- జులై 18న రాష్ట్రపతి ఎన్నికల్లో కీలకమైన పోలింగ్
- జులై 21న ఓట్ల లెక్కింపు
రాష్ట్రపతి పదవీకాలంసవరించు
రాష్ట్రపతి ఐదేళ్ళు పదవిలో ఉంటారు. అయితే కింది పద్ధతుల ద్వారా రాష్ట్రపతి పదవీకాలం ముందే/తరువాత ముగియవచ్చు.
- రాష్ట్రపతి తన రాజీనామాను ఉపరాష్ట్రపతికి సమర్పించినపుడు
- రాజ్యాంగంలో సూచించిన విధంగా పార్లమెంటు అభిశంసన తీర్మానం చేసినపుడు
- పదవీకాలం ముగిసిన తరువాత కూడా, వారసుడు పదవి చేపట్టే వరకు
- తన రాజీనామాను ఉపరాష్ట్రపతికి సమర్పించిన విషయాన్ని లోక్‌సభ అధ్యక్షునికి తెలియజేసినపుడు
విధులు, అధికారాలుసవరించు
ప్రభుత్వంలోని మూడు వ్యవస్థలకు సంబంధించి, రాష్ట్రపతికి కింది అధికారాలు ఉంటాయి. అయితే ఈ అధికారాలన్నీ అలంకారప్రాయమైనవే. దాదాపుగా అన్ని విధులూ, ప్రధానమంత్రి సలహా మేరకే జరుగుతాయి.
శాసనాధికారాలుసవరించు
రాష్ట్రపతికి శాసన వ్యవస్థకు సంబంధించిన కింది అధికారాలు ఉంటాయి
- పార్లమెంటు ఉభయ సభలను సమావేశపరుస్తారు, ముగిస్తారు, లోక్ సభను రద్దుచేస్తారు
- ప్రతి సంవత్సరం ఉభయసభల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ప్రసంగం కూడా, కేంద్ర మంత్రివర్గం ఆమోదించినదే అయి ఉంటుంది
- పార్లమెంటు ఆమోదించిన బిల్లులపై రాష్ట్రపతి సంతకం చేసాకే చట్టంగా మారుతాయి. ఏ బిల్లునైనా తిరిగి పరిశీలించవలసిందిగా వెనక్కు పంపవచ్చు. అయితే పార్లమెంటు మళ్ళీ ఆ బిల్లును సంతకం కొరకు పంపినపుడు, రాష్ట్రపతి తప్పనిసరిగా సంతకం చేయవలసి ఉంటుంది.
- పార్లమెంటు సమావేశాలు జరగని సమయంలో చట్టాలు చెయ్యవలసి వస్తే, రాష్ట్రపతి సంతకంతో ఆర్డినెన్సును జారీ చెయ్యవచ్చు. అయితే తరువాత సమావేశాల్లో సదరు ఆర్డినెన్సును పార్లమెంటు ఆమోదించాలి.
కార్యనిర్వాహక అధికారాలుసవరించు
రాజ్యాంగం ప్రకారం కార్యనిర్వాహక అధికారాలన్నీ రాష్ట్రపతివే. అవి:
- లోక్ సభలో ఆధిక్యత గల పార్టీ/కూటమి నాయకుణ్ణి ప్రధానమంత్రిగా నియమిస్తారు.
- భారత రక్షణ వ్యవస్థ సర్వ సైన్యాధ్యక్షుడు అయిన రాష్ట్రపతి యుద్ధ ప్రకటన, సంధి ప్రకటన చేస్తారు.
- గవర్నర్లు, ఎన్నికల కమిషనర్లు, న్యాయమూర్తుల వంటి ముఖ్యమైన నియమాకాలు చేస్తారు.
- విదేశాలలో రాయబారులను నియమిస్తారు. భారత్‌లో నియమితులైన ఇతర దేశాల రాయబారుల పత్రాలను స్వీకరిస్తారు.
న్యాయ వ్యవస్థ అధికారాలుసవరించు
- నేరస్తులకు క్షమాభిక్ష ప్రసాదించవచ్చు, శిక్ష తగ్గించవచ్చు, శిక్షను మార్చవచ్చు.
- ప్రజా ప్రయోజనకర విషయాల్లో అవసరమనిపిస్తే అత్యున్నత న్యాయస్థాన అభిప్రాయం తీసుకోవచ్చు. కానీ ఆ అభిప్రాయాన్ని పాటించవలసిన అవసరం రాష్ట్రపతికి లేదు.
అత్యవసర అధికారాలుసవరించు
జాతీయ అత్యవసర పరిస్థితిసవరించు
352వ ప్రకరణం ప్రకారం యుద్ధం, విదేశీ దురాక్రమణ, సాయుధ తిరుగుబాటు జరిగినప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తారు. ఇప్పటికి ఇది 4 సార్లు విధించబడింది
రాష్ట్రపతి పాలనసవరించు
356వ అధికరణ ప్రకారం ఏదైన రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు దీనిని విధిస్తారు. ఇప్పటికి ఇది సుమారుగా 124 సార్లు విధించబడింది
ఆర్థిక అత్యవసరపరిస్థితిసవరించు
360వ ప్రకరణం ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడినప్పుడు దీనిని విధిస్తారు. ఇప్పటికి ఇది ఒక్కసారి కూడ విధించబడలేదు.
మహాభియోగ తీర్మానం విధానంసవరించు
రాష్ట్రపతి తొలగింపు ప్రక్రియను రాజ్యాంగంలో వివరించటం జరిగింది. ఈ విషయంలో పార్లమెంటు ఉభయ సభలకు సమాన అధికారములు ఉన్నాయి.
- అభిశంసన ప్రతిపాదన పార్లమెంటులోని ఏదో ఒక సభలో ప్రవేశపెట్టాలి. ఈ తీర్మానం ప్రవేశపెట్టేందుకు కనీసం 14 రోజుల ముందు సభలోని కనీసం నాలుగోవంతు సభ్యుల మద్దతుతో కూడిన ఒక నోటీసును ఇవ్వాలి.
- ఆ తీర్మానాన్ని సదరు సభ మొత్తం సభ్యులలో రెండింట మూడు వంతుల ఆధిక్యతతో ఆమోదించాలి
- ఈ ప్రతిపాదనపై పార్లమెంటు లోని రెండో సభ దర్యాప్తు చేయడం కానీ, లేదా దర్యాప్తు చేయించడం కానీ చేస్తుంది. రాష్ట్రపతికి తన వాదనను వినిపించే అవకాశం ఉంటుంది.
- ఈ దర్యాప్తు ముగిసిన తరువాత రెండో సభ కూడా, అభిశంసన ప్రతిపాదనను రెండింట మూడు వంతుల ఆధిక్యతతో ఆమోదిస్తే, అలా ఆమోదించిన తేదీన రాష్ట్రపతిని పదవి నుండి తొలగించినట్లే.
ఇంత వరకు ఏ రాష్ట్రపతి ఈ పద్ధతి ద్వారా తొలగించబడలేదు. తొలగించబడే రాష్ట్రపతి అనర్హతల గురించి రాజ్యాంగంలో వివరించలేదు.
స్వతంత్ర భారత గవర్నర్ జనరల్‌ల జాబితాసవరించు
సంఖ్య | పేరు | నుండి | వరకు |
---|---|---|---|
01 | లూయీ మౌంట్‌బాటెన్ | ఆగష్టు 15, 1947 | జూన్ 21, 1948 |
02 | చక్రవర్తి రాజగోపాలాచారి | జూన్ 21, 1948 | జనవరి 26, 1950 |
భారత రాష్ట్రపతుల జాబితాసవరించు
సంఖ్య | పేరు | నుండి | వరకు |
---|---|---|---|
01 | రాజేంద్ర ప్రసాద్ | జనవరి 26, 1950 | మే 13, 1962 |
02 | డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ | మే 13, 1962 | మే 13, 1967 |
03 | డా.జాకీర్ హుస్సేన్ | మే 13, 1967 | మే 3, 1969 |
* | వరాహగిరి వేంకటగిరి | మే 3, 1969 | జూలై 20, 1969 |
* | ఎం.హిదయతుల్లా | జూలై 20, 1969 | ఆగష్టు 24, 1969 |
04 | వరాహగిరి వేంకటగిరి | ఆగష్టు 24, 1969 | ఆగష్టు 24, 1974 |
05 | ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ | ఆగష్టు 24, 1974 | ఫిబ్రవరి 11, 1977 |
* | బి.డి.జట్టి | ఫిబ్రవరి 11, 1977 | జూలై 25, 1977 |
06 | నీలం సంజీవరెడ్డి | జూలై 25, 1977 | జూలై 25, 1982 |
07 | జ్ఞాని జైల్ సింగ్ | జూలై 25, 1982 | జూలై 25, 1987 |
08 | ఆర్.వెంకటరామన్ | జూలై 25, 1987 | జూలై 25, 1992 |
09 | డా.శంకర దయాళ్ శర్మ | జూలై 25, 1992 | జూలై 25, 1997 |
10 | కె.ఆర్.నారాయణన్ | జూలై 25, 1997 | జూలై 25, 2002 |
11 | డా.ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ | జూలై 25, 2002 | జూలై 25, 2007 |
12 | ప్రతిభా పాటిల్ | జూలై 25, 2007 | జూలై 25, 2012 |
13 | ప్రణబ్ ముఖర్జీ | జూలై 25, 2012 | జూలై 25, 2017 |
14 | రామ్‌నాథ్ కోవింద్ | జూలై 25, 2017 | నేటి వరకూ |
* తాత్కాలిక
కొత్త రాష్ట్రపతిసవరించు
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం 2017 జూలై 24న ముగిసింది. కొత్త రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్.డి.ఎ. కూటమి దళిత నేత, బీహారు గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్‌ను ప్రతిపాదించింది. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన కోవింద్ వృత్తి రీత్యా న్యాయవాది. బిజెపి దళిత మోర్చా అధ్యక్షుడిగా కూడా ఆయన గతంలో పనిచేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా రామనాథ్ కొవింద్ అభ్యర్థన పత్రం మీద మద్దతుదారులు గా ప్రధాని నరేంద్రమోడీ, రెండవ మద్దతుదారు గా అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు NDA కీలక భాగస్వామ్య పార్టీ అయిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంతకం చేశారు. ఆయన నియామకంతో కె.ఆర్.నారాయణన్ తర్వాత రాష్ట్రపతి భవన్ లోకి రెండో దళిత నేత అడుగు పెట్టారు.
కొన్ని విశేషాలుసవరించు
- ఇప్పటి వరకు ఇద్దరు రాష్ట్రపతులు పదవిలో ఉండగా మరణించారు - డా.జాకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్.
- ఇప్పటి వరకు ఏ రాష్ట్రపతినీ అభిశంసించలేదు.
- 2007 జూలై 25 న ప్రతిభా పాటిల్ ప్రమాణ స్వీకారం చెయ్యడంతో మొట్టమొదటి సారి ఓ మహిళ రాష్ట్రపతి పదవిని అధిష్టించినట్టయింది.
- 1969లో జూలై 20 నుండి ఆగష్టు 24 వరకు భారత దేశానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇద్దరూ లేరు. రాష్ట్రపతి డా.జాకీర్ హుస్సేన్ మే 3 న మరణించగా, ఉపరాష్ట్రపతిగా ఉన్న వి.వి.గిరి తాత్కాలిక బాధ్యతలు చేపట్టాడు. అయితే రాష్ట్రపతిగా పోటీ చేయడానికై జూలై 20న వి.వి.గిరి రాజీనామా చేసాడు. దీనితో అత్యున్నత న్యాయస్థాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎం.హిదయతుల్లా తాత్కాలిక రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసాడు.
- 1969లో రాష్ట్రపతి ఎన్నిక, చీలిక దిశగా సాగుతున్న కాంగ్రెసు పార్టీ అంతర్గత రాజకీయాల ఫలితంగా వివాదాస్పదమైంది. కాంగ్రెసు పార్టీ అధికారిక అభ్యర్థిగా పోటీ చేసిన నీలం సంజీవరెడ్డికి వ్యతిరేకంగా ఆత్మ ప్రబోధానుసారం ఓటు వెయ్యమని ఇందిరా గాంధీ తన పార్టీ వారిని ఆదేశించింది. పార్టీలో తన వ్యతిరేకుల ఆటకట్టించేందుకు ఇందిరా గాంధీ వేసిన ఎత్తు ఇది. ఫలితంగా ప్రతిపక్ష మద్దతు కూడా గల వి.వి.గిరి, సంజీవరెడ్డిని ఓడించి రాష్ట్రపతి అయ్యాడు. అనంతరం కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది.
వనరులుసవరించు
- ↑ Eenadu (10 June 2022). "రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ ప్రత్యేకతలు మీకు తెలుసా..?". Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.
- ↑ "President Election: రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ ప్రత్యేకతలు మీకు తెలుసా..?". EENADU. Retrieved 2022-06-09.
- ↑ "రాష్ట్రపతి ఎన్నికల నగారా - Andhrajyothy". web.archive.org. 2022-06-10. Retrieved 2022-06-10.