కాలిఘాట్ చిత్రకళ
కాలిఘాట్ చిత్రకళ (ఆంగ్లం: Kalighat Painting) 19వ శతాబ్దం లో కోల్‌కాతా నగర వీధుల నుండి పుట్టుకొచ్చిన భారతీయ చిత్రకళ లో ఒక శైలి. [1] కాలిఘాట్ చుట్టు ప్రక్కల వెలసిన బజార్ల లో ఆలయానికి వచ్చే భక్తులకు విక్రయించబడటం వలన దీనికి ఈ పేరు వచ్చింది. పాటువ అనే చిత్రకారుల బృందం ఈ శైలిలో చిత్రీకరణ చేసేది. [2] ఒక వైపు ఆధునికత తొణికిసలాడుతూనే ప్రజాదరణ కూడా పొందబడటం కాలిఘాట్ చిత్రకళ యొక్క ప్రత్యేకత.
చరిత్ర
మార్చుకాలిఘాట్ చిత్రకళ ఎప్పుడు పుట్టిందో చెప్పటానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. అయితే చిత్రలేఖనానికి వాడబడిన కాగితం, రంగులను బట్టి ఇది 19వ శతాబ్దపు కళగా గుర్తించటం జరిగింది. [2] సమయం గడిచే కొద్దీ కాలిఘాట్ ఆలయానికి భక్తుల తాకిడి పెరగటం, విదేశాల నుండి సైతం సందర్శకులు రావటం తో చవకైన కళాఖండాల విక్రయం కొరకు కళాకారులు చాలా మంది అక్కడికి వలస వెళ్ళారు.
పటచిత్ర మూలాలు
మార్చుబెంగాల్ లోని మేద్నీపూర్, బీర్భూం, ముర్షీదాబాద్, 24 పరగణాల వంటి పల్లెటూళ్ళ లో పటచిత్ర అనే చిత్రకళకు మంచి ఆదరణ ఉండేది.[2] [3] చేతితో తయారు చేసిన 20 అడుగుల పొడవాటి కాగితం పై ఒక్కొక్క పటం లో కథయొక్క ఒక్కొక్క దృశ్యాన్ని చిత్రీకరించిన తర్వాత కాగితాన్ని చుట్టివేసేవారు. చుట్టను విప్పుతూ ఒక్కొక్క పటాన్ని వీక్షకులకు చూపుతూ కథ గురించి చెప్పేవారు/పాడేవారు. ఈ పటచిత్రాలను వేసే వారే పాటువలుగా వ్యవహరించబడ్డారు. పాటువలు ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి వారు పటచిత్రాలను ప్రదర్శించి పొట్ట పోసుకునే వారు.
పటచిత్రలో వచ్చిన మార్పులే కాలిఘాట్ చిత్రకళ
మార్చుఅయితే కాలిఘాట్ కు వచ్చే భక్తుల/సందర్శకులకు సమయం ఎక్కువగా తీసుకొనే పటచిత్రాలు నచ్చలేదు.[2] అందుకే పాటువలు అనవసరమైన అంశాలను తొలగించి, త్వరిత గతిన పూర్తయ్యే విధంగా కేవలం ఒక దృశ్యాన్ని మాత్రం చిత్రీకరించటం మొదలు పెట్టారు. పటచిత్రలో వచ్చిన మార్పులే కాలిఘాట్ చిత్రకళగా వ్యవహరించబడింది. కేవలం చిత్రకారులకే పరిమితం కాక కాలిఘాట్ చిత్రకళ కుమ్మరులకు, వడ్రంగులకు, శిల్పులకు కూడా వ్యాపించటంతో, కుండలు, మట్టి పాత్రలు, మట్టి శిల్పాలు, చెక్క వస్తువులు, రాతి వస్తువులు, రాతి శిల్పాలు కూడా కాలిఘాట్ చిత్రకళతో అందాలను సొంతం చేసుకొన్నాయి.
సాంకేతికత పెరగటంతో కళ కనుమరుగు
మార్చుజర్మన్ దేశస్థులు కాలిఘాట్ చిత్రకళ కు యావత్ భారతదేశం లో ఉన్న అభిమానాన్ని గమనించి, వీటిని అనుకరించి లిథోగ్రాఫులు తయారు చేశారు.[2] దీనితో చిత్రకారుల స్వహస్తాలతో వేయబడ్డ చిత్రలేఖనాలు కాక, చవకైన ప్రత్యాన్మాయాల విక్రయాలు ఊపందుకొన్నాయి. చిత్రలేఖకుల చిత్రపటాలు ప్రియం కావటం, ఓలియోగ్రఫీ, ఫోటోగ్రఫీ వంటి ప్రత్యాన్మాయాలు చవకగా ఇబ్బడి ముబ్బడిగా దొరకటంతో చేతితో వేయబడే ఈ చిత్రకళకు వన్నె తగ్గింది. 1930 నాటికల్లా ఈ కళ పూర్తిగా అంతరించిపోయింది.[3]
చిత్రీకరించబడే విధానం
మార్చుఒకే కుటుంబం లో ఒకరు ఔట్ లైనులు వేయగా, మరొకరు షేడింగు, ఇంకొకరు రంగులు అద్దకం, వేరొకరు మసిబొగ్గుతో వాటికి తుది మెరుగులు దిద్దేవారు.[2] రంగులు సహజ వనరులతో తయారు చేసుకొన్నవే అయి ఉండేవి. కుంచెలు ఉడుతల, మేకల, గొర్రెల వెంట్రుకలతో తయారు చేయబడేవి.[3]
లక్షణాలు
మార్చుకాలిఘాట్ చిత్రకళలో జలవర్ణాలు (water colors) ఉపయోగించబడేవి.[1] పొడవాటి కుంచె ఘతాలు, రంగుల వినియోగం లో నిస్సంకోచం, అధిక ఉత్పత్తి కోసం ఆకారాల సరళీకరణ ఈ శైలి చిత్రకళ యొక్క ప్రధాన లక్షణాలు. ఈ పొడవాటి కుంచె ఘతాలలో అనుమానం కానీ, లోపభూయిష్ట నిర్ణయం కానీ, వణుకు/బెరుకు లు గానీ ఏ మాత్రం ఉండేవి కావని కళాకారులు అభిప్రాయపడ్డారు. చిత్రపటం లోని రేఖలు ఆద్యంతాలు లేని వాటి వలె గోచరిస్తాయని తెలిపారు. [2] సాధారణంగా ఇవి 17/11 ఇంచిలు (43/28 సెంటీమీటర్ల) పరిమాణం లో ఉన్న కాగితాలపై వేయబడేవి. ఈ చిత్రలేఖనాలు అత్యధికంగా సేకరించబడిన లండన్ లోని విక్టోరియా & ఆల్బర్ట్ మ్యూజియం లో A3 సైజు కాగితం పైనే కాకుండా పోస్టు కార్డు (13/8 సెంటీమీటర్ల) పరిమాణంలో ఉన్న కాగితాల పైన చిత్రీకరించబడినవి సైతం కలవు.[4] ఈ శైలి లో నేపథ్య దృశ్యం చిత్రీకరించబడేది కాదు. ప్రధానంగా దేవుళ్ళ/దేవతల చిత్రపటాలు చిత్రీకరించబడిననూ సమకాలీన జీవితం నుండి దృశ్యాలు కూడా చిత్రీకరించబడేవి. కాలిఘాట్ చిత్రకళ లో ఉండే ఒక రకమైన లయ వలన మాడర్న్ ఆర్ట్ తో అవినాభావ సంబంధం ఉన్నట్లు అనిపిస్తుంది.[2]
చిత్రీకరించబడిన అంశాలు
మార్చుపౌరాణికాలు
మార్చురామాయణము, మహాభారతం వంటి కథలలోని దృశ్యాలు ప్రధానంగా చిత్రీకరించబడేవి.[2] కృష్ణుడు, శివుడు, లక్ష్మి, వినాయకుడు, కార్తికేయుడు వంటి ఇతర హైందవ దేవతలు కూడా చిత్రీకరించబడినను, కాళికాదేవి కాలిఘాట్ చిత్రకళ లో అత్యధిక ప్రాముఖ్యత కలది. ఈ ప్రధాన దేవతలే కాక, వీరి ఇతర రూపాలైన పరశురాముడు, బలరాముడు వంటి దేవతలు కూడా చిత్రీకరించబడ్డారు.
-
రావణుడు-ఆంజనేయ స్వామి మధ్య యుద్ధం
-
మండోదరి వద్ద ఆయుధాన్ని తీసుకొంటున్న ఆంజనేయ స్వామి
-
సీతను అపహరించుకు పోతోన్న రావణుడిని అడ్డుకొంటున్న జటాయువు
-
బకాసురుణ్ణి సంహరిస్తున్న శ్రీకృష్ణుడు
-
మత్స్య యంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని గెలుచుకొన్న అర్జునుడు
-
రాధా కృష్ణులు
-
వెన్న కోసం యశోద ముందు చేయి చాస్తున్న శ్రీ కృష్ణుడు
-
బలరామ కృష్ణులు
-
అభిమన్యుడిని చుట్టుముట్టిన యుద్ధవీరులు
-
బాలకృష్ణుడితో పారిపోతోన్న వసుదేవుడు
-
బాగలా ముఖి
-
బ్రహ్మ
-
గులాబీ, నెమలితో లక్ష్మీ దేవి
-
గంగా దేవి
-
గజ లక్ష్మి
-
వినాయకుడు
-
అర్థ నారీశ్వరుడు
-
జగన్నాథ త్రయం
-
చండీదేవి ఆశీర్వాదాన్ని అందుకొంటున్న కాలకేతువు
-
కాళి
-
కార్తికేయ (సుబ్రహ్మణ్య స్వామి)
కాలిఘాట్ చిత్రకళ లో హైందవేతర మతాలు
మార్చుహైందవ దేవతలే కాక, కాలిఘాట్ చిత్రకళ లో ఇస్లాం మతం, క్రైస్తవ మతం వంటి ఇతర మతాలకు సంబంధించిన చిత్రలేఖనాలు కూడా కలవని, కాలిఘాట్ చిత్రకళ యొక్క విశ్వమానవతకు ఇది తార్కాణమని చిత్రకళా చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.[2]
సాంఘిక దృశ్యాలు
మార్చుసమకాలీన అంశాలు, సాంఘిక దురాచారాలు, ప్రత్యేకమైన అలవాట్లు, మూర్ఖత్వాలు, తప్పులు, కపటత్వం, నీచత్వం వంటి వాటినన్ని కాలిఘాట్ చిత్రకళ స్పృశించింది.[2] జీవన విధాన్నాన్ని పాటువలు చాలా సునిశితంగా పరిశీలించారని, ధనిక జమీందారులు మధువు, మగువల కై ధారాళంగా ఖర్చు పెట్టటం, అల్లరి ప్రదేశాలలో బెంగాలీ బాబుల విచ్చలవిడితనం, సాధారణ ప్రజానీకం ఏవగించుకొనేలా చిత్రీకరించారు. 1873 తారకేశ్వర్ అనే అక్రమ సంబంధపు కేసు యొక్క దృశ్యాలు, 1890 లో శ్యామకాంత బెనర్జీ అనే వస్తాదు సర్కస్ పులులతో కుస్తీ చేసిన దృశ్యాలు సైతం కాలిఘాట్ చిత్రకళలో భాగం అయ్యాయి.
-
ఇరువురు సైనికులు
-
విటుడిని అలరిస్తున్న వేశ్య
-
ఒక స్త్రీ ముఖచిత్రం
-
ఇరువురు స్త్రీలు
-
ఒక చిత్రపటాన్ని వీక్షిస్తున్న కళాపిపాసి
-
జాలరి చేతికి చిక్కిన చేపలు
-
చేపను తన్నుకెళ్తున్న ఓ గ్రద్ద
-
ఒక రామచిలుక
-
భార్య ను పాదరక్ష తో కొడుతోన్న భర్త
ప్రభావాలు
మార్చుకాలిఘాట్ చిత్రకళ పై ఇతర ప్రభావాలు
మార్చుబెంగాల్ లో మట్టితో తయారు చేయబడే విగ్రహాల యొక్క ప్రభావం కాలిఘాట్ చిత్రకళపై కలదు. ఈ శిల్పాల యొక్క ముఖాల, చుబుకాల లోని గుండ్రనితనం, మృదువైన అధరాలు, వంపు గా ఉండే కనుబొమలు, విశాలమైన నేత్రాలు కాలిఘాట్ చిత్రకళ పై ప్రభావం చూపినవి.[3] కంపెనీ శైలి చిత్రకళ యొక్క వాష్ టెక్నిక్, కాలిఘాట్ చిత్రకళకు మరిన్ని అందాలను తెచ్చింది. బెంగాల్ జానపద చిత్రలేఖనం, పాశ్చాత్య శైలి, భారతీయ శైలి చిత్రలేఖనాల అపూర్వ సంగమానికి కాలిఘాట్ చిత్రకళ ప్రభావం అయ్యింది.
ఇతరుల పై కాలిఘాట్ చిత్రకళ యొక్క ప్రభావాలు
మార్చుపలు భారతీయ చిత్రకారుల పై కాలిఘాట్ చిత్రకళ యొక్క ప్రభావం కలదు. ప్రత్యేకించి జైమినీ రాయ్ చిత్రలేఖనాలలో ఈ ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. [1]
ప్రపంచ వ్యాప్తంగా కాలిఘాట్ చిత్రకళ
మార్చు- లండన్ లోని Victoria & Albert Museum, 645 చిత్రలేఖనాలు కలవు
- The Bodleian Library, ఆక్స్ఫర్డ్ లో 110 చిత్రలేఖనాలు ఉన్నాయి
- మాస్కో లోని పుష్కిన్ మ్యూజియం ఆఫ్ గ్రాఫిక్ ఆర్ట్ లో 62, ఫిలడెల్ఫియా లోని The University of Pennsylvania Museum of Archeology and Anthropology లో 57, ప్రాగ్ లోని నాప్ర్స్తెక్ మ్యూజియం లో 26, కార్డిఫ్ లోని నేషనల్ మ్యూజియం ఆఫ్ వేల్స్ లో 25, బ్రిటీషు లైబ్రరీ లో 17 కలవు.
- భారత్ లోని విక్టోరియా మెమోరియల్, బిర్లా అకాడెమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కల్చర్, అషుతోష్ మ్యూజియం, కళా భవన్ (శాంతినికేతన్) లలో కూడా కాలిఘాట్ చిత్రలేఖనాలు కలవు.
ప్రస్తుత కాలం లో కాలిఘాట్ చిత్రకళ
మార్చుపశ్చిమ బెంగాల్ లోని మేద్నీపూర్, బీర్భూం ల లో కాలిఘాట్ చిత్రకళ ఇప్పటికీ వేయబడుతోంది.[4]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 Britannica, Encyclopedia. "Kālīghāṭ painting". britannica.com. Retrieved 18 February 2022.
- ↑ 2.00 2.01 2.02 2.03 2.04 2.05 2.06 2.07 2.08 2.09 2.10 Sanyal, Partha. "Kalighat Paintings: A review". chitrolekha.com. Retrieved 18 February 2022.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ 3.0 3.1 3.2 3.3 "Bazar Painting of Kolkata (Kalighat Paintings and Drawings)". indianculture.gov.in. Retrieved 21 February 2022.
- ↑ 4.0 4.1 "Kalighat Painting". Victoria & Albert Museum. Retrieved 21 ఫిబ్రవరి 2022.