పూర్వ కాలం నుండి ఎరుకలసాని జ్యోతిష్యం చెప్పే వ్యక్తిగా ప్రాముఖ్యత వహించింది. ఈ ఎరుకలసాని వినోద కాలక్షేపానికీ యదాలాపంగా ఆటలు పాటలు జోడించి ప్రారంభించిన కళారూపం కురవంజి. అరణ్యాలలో నివసించే చెంచులు, కోయలు, కురవలు, ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. కురవలనే గిరిజనులు ప్రదర్శించేది కాబట్టి దానిని కురవంజి లేక కొరవంజి అని పిలుస్తారు.[1] రాజుల కాలం నాటినుంచి నేటిదాకా ఏదో ఒక రూపంలో కురవంజి కళారూపం జీవించివుంది.[2] ఇక ఆంధ్ర దేశంలో సొదెమ్మో సోదె అంటూ వచ్చె ఎరుకల వారిలో కురవంజి జీవితరేఖలు కనిపిస్తాయి.

ఎరుకలు -సోది

చరిత్ర

మార్చు

కురవంజి కళారూపం ఆటవికులది. మానవులు అడవుల్లో నివసించే కాలంలో ప్రాచుర్యంపొందింది. పుణ్యక్షేత్రాలుగా వున్న సింహాచలం దేవాలయం, మంగళగిరి నృసింహ దేవాలయం, విజయవాడ కనకదుర్గ దేవాలయం, శ్రీశైలం మల్లికార్జునదేవాలయం, తిరుమల లలో సంవత్సరం పొడుగునా యాత్రా ఉత్సవాలు జరుగుతూ వుండేవి. ఇలా వుత్సవాలకు వచ్చిన యాత్రికుల వినోదం కోసం ఆటవికులైన కురవలు, వినోద ప్రదర్శనలు ఇచ్చేవారు. ఈ వినోదాన్ని యాత్రికులు మెచ్చుకుని వారికి బహుమతులను దానం చేసేవారు.

ఏ మాత్రం నిర్మాణ పటుత్వంలేని అడుగులనే ప్రారంభదశలో వాడినా, క్రమేపీ వారి అడుగు ఒక కళారూపంగా ఆభివృద్ధి చెందింది. కురవంజులు వేషధారణలో అడవిజంతువుల చర్మాలూ, నెమలి ఈకలూ, పందిముళ్ళు, కోరలూ, పులిగోళ్ళూ, ఎలుగుబంటి వెంట్రుకలూ మొదలైన వాటిని ధరించి నృత్యాలు చేసేవారు. పుణ్యక్షేత్రాల మహోత్సవాల గురించి, కథలల్లి వాటిని ప్రదర్శించేవారు. ఇలా యాత్రాస్థలాలల్లో పుట్టి పెరిగిన ఈ కొరవంజి కళారూపమే క్రమేపి దేశం నాలుగు మూలలకూ వ్వాపించింది. ఈ కురవంజి కళారూపం ఒరవడినే జక్కులవారనే కళావంతులు కూడా ప్రదర్శనాలను ప్రారంభించారు.[1]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి (1992). తెలుగు వారి జానపద కళారూపాలు.
  2. నటరాజ రామకృష్ణ (1955). దాక్షిణాత్యుల నాట్యకళాచరిత్ర.
"https://te.wikipedia.org/w/index.php?title=కురవంజి&oldid=3830523" నుండి వెలికితీశారు