కె.ఎస్.తిమ్మయ్య
జనరల్ కోదండర సుబ్బయ్య తిమ్మయ్య భారత సైన్యంలో ఒక విశిష్టమైన సైనికుడు. ఇతడు 1957 నుండి 1961 వరకు భారత చైనా దేశాలమధ్య యుద్ధవాతావరణం నెలకొన్న సమయంలో భారత సైన్యంలో ఛీఫ్ ఇన్ ఆర్మీ స్టాఫ్‌గా కీలకమైన సేవలను అందించాడు. ఇతడు రెండవ ప్రపంచ యుద్ధం పదాతిదళానికి నాయకత్వం వహించిన ఏకైక భారతీయుడు. ఇతడు భారత సైన్యం అందించిన విశిష్ట అధికారిగా గుర్తింపు పొందాడు.[1] కొరియా యుద్ధం తరువాత ఇతడు యుద్ధ ఖైదీలను వారి వారి దేశాలకు తిరిగి పంపే పనిలో ఐక్యరాజ్య సమితి విభాగానికి నాయకత్వం వహించాడు. ఇతడు ఆర్మీ నుండి పదవీ విరమణ చేసిన తరువాత 1964 జూలై నుండి డిసెంబరు 1965 వరకు సైప్రస్ దేశంలో ఐక్యరాజ్యసమితి శాంతి సంరక్షక దళానికి కమాండర్‌గా నియమించబడ్డాడు. ఇతడు సైప్రస్ లో 18 డిసెంబరు 1965లో మరణించాడు.
జనరల్ కోదండర సుబ్బయ్య తిమ్మయ్య DSO | |
---|---|
ఆర్మీ స్టాఫ్ (ఇండియా) ఛీఫ్ | |
In office 8 మే 1957 – 7 మే 1961 | |
అంతకు ముందు వారు | జనరల్ ఎస్.ఎం.శ్రీనగేష్ |
తరువాత వారు | జనరల్ పి.ఎన్.థాపర్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | మద్దికేరి, కూర్గ్, మైసూర్, బ్రిటిష్ ఇండియా | 1906 మార్చి 30
మరణం | 17 December 1965 సైప్రస్ | (aged 59)
పురస్కారాలు | పద్మభూషణ్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ ఆర్డర్(DSO) |
Military service | |
Allegiance | British Indian Empire India |
Branch/service | British Indian Army Indian Army |
Years of service | 1926 – 1961 |
Rank | జనరల్ |
Unit | 19వ హైదరాబాద్ రెజిమెంట్ (Now Kumaon Regiment) |
Commands | ఛీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ సదరన్ కమాండ్ (ఇండియా) 19వ ఇన్ఫాంట్రీ డివిజన్ 268వ ఇండియన్ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్ 19వ హైదరాబాద్ రెజిమెంట్ 8వ బెటాలియన్ |
ప్రారంభ జీవితం, విద్యాభ్యాసం
మార్చుఇతడు కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా (పూర్వపు పేరు కూర్గ్) మద్దికెరి గ్రామంలో 1906, మార్చి 30వ తేదీన తిమ్మయ్య సీతమ్మ దంపతులకు జన్మించాడు. వీరి కుటుంబం కాఫీతోటలను పెంచేవారిలో ముందంజలో ఉండేది. ఇతని తల్లి సీతమ్మ మంచి విద్యావంతురాలు, సంఘ సేవకురాలు. ఈమెకు బ్రిటిష్ ప్రభుత్వం కైసర్ - ఎ- హింద్ బిరుదును ప్రదానం చేసింది. ఇతడు తమ తల్లిదండ్రుల ఆరుగురు సంతానంలో రెండవవాడు. ఇతని అన్న పొన్నప్ప, ఇతడు, ఇతని తమ్ముడు సోమయ్య ముగ్గురూ భారత సైన్యంలో అధికారులుగా పనిచేశారు. [2] భారతదేశపు మొట్టమొదటి కమాండర్-ఇన్-ఛీప్ కె.ఎం.కరియప్ప ఇతని తండ్రివైపు బంధువు. 1935 క్వెట్టా భూకంపం వచ్చినపుడు ఇతని భార్య నీనా తిమ్మయ్య చేసిన సేవా కార్యక్రమానికి ఈమెకు బ్రిటిష్ ప్రభుత్వం కైసర్ - ఇ- హింద్ పతకాన్ని ప్రదానం చేసింది. ఇతడు మెరుగైన విద్య అభ్యసించాలనే ఉద్దేశంతో తన 8వ యేటనే తమిళనాడు రాష్ట్రం కూనూరులోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో చేరాడు. ఆ తర్వాత బెంగళూరులోని బిషప్ కాటన్ బాయ్స్ స్కూలులో చదివాడు. ప్రాథమిక విద్య ముగిసిన తరువాత ఇతడు డెహ్రాడూన్ లోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రాయల్ ఇండియన్ మిలటరీ కాలేజీ(RIMC)లో చేరాడు. అక్కడి నుండి పట్టా పొందిన తరువాత ఇతడు ఇంగ్లాండులోని రాయల్ మిలటరీ కాలేజీకి తదుపరి శిక్షణ కోసం ఎంపిక చేయబడ్డాడు.
వృత్తిలో తొలినాళ్లు
మార్చుఇతని మిలటరీ శిక్షణ తరువాత 1926 ఫిబ్రవరి 4న ఇతడిని బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సెకండ్ లెఫ్ట్‌నెంట్‌గా నియమించారు. ఆ బ్యాచ్‌లో నియమింపబడిన వారిలో ఇతని తరువాత ఛీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా పనిచేసిన ప్రాణ్ నాథ్ థాపర్ ఉన్నాడు. తిమ్మయ్య 19వ హైదరాబాద్ రెజిమెంట్‌కు చెందిన 4వ బెటాలియన్‌లో 1927 మే 28 న నియమించబడ్డాడు. 1928 మే 4 న ఇతడు లెఫ్ట్‌నెంట్‌గా పదోన్నతి పొందాడు. 1930లో రెజిమెంటల్ సహాయాధికారిగా నియమించిన తరువాత ఇతడు తన నైపుణ్యంతో నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ (నేటి పాకిస్తాన్) లోని పఠాన్ ఆదివాసీ తిరుగుబాటుదారులను అణచగలిగాడు.
1935 జనవరిలో ఇతడు నీనా కరియప్పను వివాహం చేసుకున్నాడు. అదే సంవత్సరం ఫిబ్రవరి 4న ఇతడు కెప్టెన్‌గా పదోన్నతి పొందాడు. నీనా, తిమ్మయ్య దంపతులకు 1936 మార్చి 20వ తేదీన మిరిల్లె అనే కూతురు పుట్టింది. అదే యేడు ఏప్రిల్‌లో ఇతడు మద్రాసులోని యూనివర్సిటీ ట్రైనింగ్ కార్ప్స్‌కు సహాయాధికారిగా బదిలీ కాబడ్డాడు.
రెండవ ప్రపంచ యుద్ధం
మార్చుతరువాత ఇతడిని సింగపూర్ బెటాలియన్‌కు బదిలీ చేశారు. తరువాత 1941లో ఇతడిని ఆగ్రాలోని హైదరాబాద్ రెజిమెంటల్ సెంటర్‌లో సెకండ్ - ఇన్ - కామాండ్‌గా నియమించారు. తరువాత ఇతనిని క్వెట్టాలోని స్టాఫ్ కాలేజీలో శిక్షణ కోసం పంపారు. అక్కడ ఇతడు, ఇతని భార్య 1935 క్వెట్టా భూకంప బాధితులకు ఎనలేని సేవలను అందించారు. 1943లో ఇతనికి మేజర్ పదవి లభించింది. ఇతడు 25వ పదాతి దళానికి గ్రేడ్2 స్టాఫ్ ఆఫీసర్‌గా నియమితుడైనాడు. సైన్యంలో ఆ పదవిని వరించిన తొలి భారతీయుడు తిమ్మయ్య.
ఇతని పదాతి దళం అడవులలో యుద్ధశిక్షణను పొంది రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ సేనలను బర్మాలో ఎదుర్కొంది. 1944లో ఇతడు లెఫ్ట్‌నెంట్ కల్నల్‌గా పదోన్నతి పొంది బర్మాలో 8వ, 19వ హైదరాబాద్ రెజిమెంట్‌లకు కమాండింగ్ ఆఫీసర్‌గా పనిచేశాడు. 1945లో ఇతడు బ్రిగేడియర్ ర్యాంకుకు ఎదిగాడు. యుద్దంలో ఇతని సేవలకు గుర్తింపుగా డిస్టింగ్విష్డ్ సర్వీస్ ఆర్డర్(D.S.O)ను ప్రకటించారు.
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇతడిని స్వదేశానికి వెనుకకు రప్పించారు.
స్వాతంత్ర్య భారతదేశంలో పాత్ర
మార్చుఇతడు 1947లో భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత పాకిస్తాన్ విభజన సందర్భంగా భారత్ పాకిస్తాన్‌ల మధ్య ఆయుధాలు, పనిముట్లు, సైన్యం పంపకాల కమిటీలో ఇతడిని సభ్యుడిగా నియమించారు. దాని తరువాత సెప్టెంబర్ 1947లో మేజర్ జనరల్‌గా పదోన్నతి కల్పించి 4వ పదాతి దళానికి కమాండ్‌గా నియమించారు. 1948లో కాశ్మీర్‌లో జరిగిన భారత్-పాక్ యుద్ధంలో ఇతడు క్రియాశీలక పాత్రను నిర్వహించాడు. ఇతడు 19వ పదాతి దళానికి కమాండర్‌గా వ్యవహరిస్తూ కాశ్మీర్ లోయ నుండి పాకిస్తాన్ సేనను తరిమికొట్టాడు.[3] ఇతడు షేక్ అబ్దుల్లా, బక్షి గులాం మొహమ్మద్, జవహర్‌లాల్ నెహ్రూలతో సత్సంబంధాలను ఏర్పరచుకున్నాడు.
తరువాత ఇతడు డెహ్రాడూన్ లోని ప్రతిష్టాత్మక ఇండియన్ మిలటరీ అకాడమీకి కమాండెంట్‌గా వ్యవహరించాడు. ఇతని అనుభవాన్ని పరిగణనలో తీసుకుని ఇతడిని ఐకరాజ్యసమితి తటస్థ దేశాల రిపాట్రియేషన్ కమీషన్‌కు ముఖ్యునిగా నియమించి కొరియాకు పంపింది. ఇది చాలా సున్నితమైన, అసాధారణమైన పని అయినప్పట్టికీ ఇతడు చాకచక్యంతో నెరవేర్చగలిగాడు. ఇతడు స్వదేశానికి తిరిగి వచ్చి లెఫ్ట్‌నెంట్ జనరల్ హోదాలో జనరల్ ఆఫీసర్ కమాండింగ్, సదరన్ కమాండ్‌గా 1953లో నియమితుడైనాడు. 1954లో ఇతనికి భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ఇచ్చి సత్కరించింది. ఇతడు భారత ఆర్మీ ఛీఫ్‌గా 1957 మే 7 నుండి బాధ్యతలను చేపట్టాడు.[4]
ఛీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్
మార్చుఇతడు 1957, మే 7న 6వ ఛీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా బాధ్యతలను చేపట్టాడు. 1959లో అప్పటి కేంద్ర రక్షణ మంత్రి వి. కె. కృష్ణ మేనన్ తో ఏర్పడిన విభేదాల కారణంగా పదవికి రాజీనామా చేశాడు. కానీ ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ అతని రాజీనామాను తిరస్కరించడంతో పదవిలో కొనసాగాడు. ఇతడు 35 ఏళ్ల మిలటరీ సర్వీసు పూర్తి చేసుకుని 1961 మే 7న పదవీ విరమణ చేశాడు.[4]
పదవీ విరమణ తర్వాత
మార్చుభారత సైన్యం నుండి పదవీ విరమణ తరువాత ఐక్యరాజ్యసమితి ఇతని సేవలను మరోసారి ఉపయోగించ తలపెట్టి ఇతడిని సైప్రస్‌లో ఐక్యరాజ్యసమితి సేన(UNFICYP)లకు కమాండర్‌గా జూలై 1964లో నియమించింది. ఇతడు ఆ పదవిలో ఉన్న సమయంలోనే1965, డిసెంబరు 17 న మరణించాడు. ఇతని పార్ధివ దేహాన్ని అంత్యక్రియలకోసం బెంగళూరుకు తరలించారు. ఇతని స్మృత్యర్థం బెంగళూరు, పూనే, సైప్రస్‌లోని లార్నకా నగరాలలో కొన్ని వీధులకు జనరల్ తిమ్మయ్య రోడ్ అని నామకరణం చేశారు. 1966లో రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ ఇతని స్మారక తపాలాబిళ్ళను విడుదల చేసి గౌరవించింది.[5]బిషప్ కాటన్ బాయ్స్ స్కూలు పూర్వవిద్యార్థులు ఇతని స్మారకార్థం ప్రతి యేటా జనరల్ కె.ఎస్.తిమ్మయ్య స్మారకోపన్యాసాన్ని ఏర్పాటు చేస్తున్నారు.[6]
అవార్డులూ, గుర్తింపులూ
మార్చునోట్స్
మార్చు- Citations
- ↑ Jacob, J.F.R. An Odyssey in War and Peace. Roli Books Pvt. Ltd. p. 17. ISBN 978-81-7436-840-9.
- ↑ Singh 2007, p. 87.
- ↑ Khanduri, Chandra B. (1969). Thimmayya:An Amazing Life. New Delhi: Centre for Armed Historical Research, United Service Institution of India, New Delhi through Knowledge World. p. 137. ISBN 81-87966-36-X. Retrieved 6 August 2010.
- ↑ 4.0 4.1 "When an Army Chief almost quit". The Sunday Tribune - Spectrum. April 16, 2006. Retrieved 2017-06-26.
- ↑ "Cyprus Stamp Issue: General Thimmayya". Archived from the original on 15 జూలై 2011. Retrieved 29 December 2009.
- ↑ "General K S Thimayya Memorial Lecture Series". Old Boys of Cottons. Retrieved 9 September 2014.
మూలాలు
మార్చు- సింగ్, విజయ్ కుమార్ (2005), లీడర్షిప్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ: బయోగ్రఫీస్ ఆఫ్ ట్వల్వ్ సోల్జర్స్, SAGE, ISBN 978-0-7619-3322-9
- శర్మ, సతీందర్ (2007), సర్వీసెస్ ఛీఫ్స్ ఆఫ్ ఇండియా, Northern Book Centre, ISBN 978-81-7211-162-5
బయటి లింకులు
మార్చు- "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived (PDF) from the original on 15 నవంబరు 2014. Retrieved July 21, 2015.