కొల్లా శ్రీకృష్ణారావు

కొల్లా శ్రీకృష్ణారావు ఒక తెలుగు పద్య కవి. సాహితీవేత్త. పత్రికాసంపాదకుడు. అలాగే సాహిత్యసంస్థల నిర్వాహకుడిగా తెలుగువారికి చిరపరిచితుడు. ఆయన గుంటూరు జిల్లా నిడుబ్రోలులో తెలుగు లెక్చరర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసారు. భావవీణ మాసపత్రికకు ఆయన చివరి వరకు సంపాదకత్వం వహించారు.

ప్రారంభ జీవితంసవరించు

కొల్లా శ్రీకృష్ణారావు గుంటూరు జిల్లా పెదకూరపాడు గ్రామంలో వ్యవసాయ దంపతులైన మహాలక్ష్మి సూరయ్య లకు జన్మించారు. భాషా ప్రవీణ పట్టభద్రులయ్యారు. కొంతకాలం తెలుగు పండితునిగా విధులు నిర్వర్తించారు. ఆయన బాల్యం నుంచి తెలుగు పద్యంపై మక్కువతో గుర్రం జాషువా, తన గురువు ఏటుకూరి వేంకటనరసయ్యలతో అత్యంత సన్నిహితంగా మెలిగాడు.

సాహిత్యసేవసవరించు

తెనుఁగులెంక, విశ్వశాంతి, పద్య శంఖారావం, రారాజు, పూదోట, కావ్యత్రయము, కవిబ్రహ్మ ప్రశస్తి, కర్షక సాహిత్యం.. ఇలా మరెన్నో రచనలు కొల్లా శ్రీకృష్ణారావు చేసారు. ఏటుకూరి వేంకటనరసయ్య స్ఫూర్తితో పౌరుషజ్యోతి, ఆయనకు గురుదక్షిణగా కవిబ్రహ్మ ఏటుకూరి వేంకటనరసయ్య, ఏటుకూరి వారి వీర వనితలు, గుర్రం జాషువాకు బహుమానంగా మన జాషువా రచించారు. అలాగే మఱుగున పడిన మహాకవి తురగా వెంకమరాజు , తన చరిత్రను నా సాహితీయాత్రగా తెలుగు పాఠకులకు అందించారు.

స్వీయ సంపాదకత్వంలో స్వతంత్రవాణి, భావవీణ పత్రికలను నడిపారు. ప్రముఖవైద్యులు కె. సదాశివరావుగారి నేతృత్వంలో నడిచిన సాహితీ సదస్సుకు సుదీర్ఘకాలం కార్యదర్శిగా వ్యవహరించారు. తుమ్మల సీతారామమూర్తి, బొద్దులూరి నారాయణరావు, నాగభైరవ కోటేశ్వరరావు, చిటిప్రోలు కృష్ణమూర్తి మొదలైన సమకాలీన కవుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు.

గుర్తింపుసవరించు

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాషువా కళాపీఠం పక్షాన రూ.50వేల నగదు పురస్కారం
  • తుమ్మల కళాపీఠం అవార్డు
  • నన్నయభట్టారక పీఠం అవార్డు
  • గుళ్ళపల్లి సుబ్బారావు సేవాసంస్థ విశిష్ట పురస్కారం
  • గాడేపల్లి సీతారామమూర్తి సాహితీ పురస్కారం
  • ప్రసన్న భారతి విశాఖ వారి పురస్కారం

మరణంసవరించు

94 సంవత్సరాల కొల్లా శ్రీకృష్ణారావు 2022 జూన్ 6న గుంటూరులోని స్వగృహంలో కన్ను మూశారు.[1]

మూలాలుసవరించు

  1. "రాలిన పద్యపారిజాతం - Andhrajyothy". web.archive.org. 2022-06-16. Archived from the original on 2022-06-16. Retrieved 2022-06-16.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)