తుమ్మల సీతారామమూర్తి
తుమ్మల సీతారామమూర్తి (డిసెంబరు 25, 1901 - మార్చి 21, 1990) తెలుగులెంకగా సుప్రసిధ్ధుడైన ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడు. అభినవ తిక్కన బిరుదాంకితుడు.
తుమ్మల సీతారామమూర్తి | |
---|---|
జననం | తుమ్మల సీతారామమూర్తి డిసెంబరు 25, 1901 గుంటూరు జిల్లా కావూరు |
మరణం | మార్చి 21, 1990 గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని అప్పికట్ల |
ఇతర పేర్లు | అభినవ తిక్కన |
వృత్తి | ఉపాధ్యాయుడు |
ప్రసిద్ధి | ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడు,జాతీయోద్యమ కవి,కవి, పండితుడు |
భార్య / భర్త | అన్నపూర్ణమ్మ |
పిల్లలు | ఒక కుమార్తె నలుగురు కుమారులు |
తండ్రి | నారయ్య |
తల్లి | చెంచమాంబ, |
జననం
మార్చు1901 డిసెంబరు 25న గుంటూరు జిల్లా కావూరులో రైతు కుటుంబంలో జన్మించాడు. తాడేపల్లి వెంకటప్పయ్యశాస్త్రి, దువ్వూరి వెంకటరమణశాస్త్రి వంటి ప్రముఖుల వద్ద విద్యనభ్యసించిన తుమ్మల, కవిగా, పండితుడిగా, తనకు తానే తీర్చిదిద్దుకొన్నాడు. తుమ్మల అచ్చమైన గాంధేయవాది. తెలుగుదనం మూర్తీభవించిన జాతీయోద్యమ కవి. "మహాత్ముని ఆస్థానకవి" అని కట్టమంచి రామలింగారెడ్డితో పలికించుకున్న తుమ్మల, ఆత్మకథ, మహాత్మకథ వంటి ఆదర్శ ప్రౌఢకావ్యాలు, ఆత్మార్పణము, రాష్ట్రగానము, ఉదయగానము, పఱిగపంట, పైర పంట, శబల, సమదర్శి, నా కథలు వంటి సామాజిక కవిత్వాన్ని అందించారు. అచ్చ తెలుగు మాటలతో అందమైన పద్యాలు అల్లగలిగిన ఆధునిక కవుల్లో తుమ్మలను మించిన వారు లేరంటె అతిశయోక్తి కాదు. ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడైన తుమ్మల గాంధీ భక్తి, తెలుగు భాషానురక్తి కలిగిన జాతీయోద్యమ కవి.
జీవన సంగ్రహము
మార్చుతుమ్మల సీతారామమూర్తి 1901 డిసెంబర్ 25 న గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలోని కావూరు గ్రామంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు చెంచమాంబ, నారయ్య. 1930లో అన్నపూర్ణమ్మతో అయనకు పెళ్ళి జరిగింది. వారికి ఒక కుమార్తె నలుగురు కుమారులు కలిగారు.
ఆయనకు విద్యాబుద్ధులు చెప్పి తీర్చిదిద్దిన గురువులు కావూరి శ్రీరాములు, జాస్తి సుబ్బయ్య, తాడేపల్లి వేంకటప్పయ్యశాస్త్రి, దువ్వూరి వేంకటరమణశాస్త్రి. 1930లో ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయము నుండి ప్రథమశ్రేణిలో ఉభయభాషాప్రవీణ పట్టాను అందుకున్నాడు. చదువు పూర్తయ్యాక, తన స్వగ్రామం కావూరు లోని తిలక్ జాతీయ పాఠశాలలో 1924 నుండి 1929 వరకు ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. 1930 నుండి 1957 వరకు గుంటూరు జిల్లా బోర్డులోని దుగ్గిరాల, బాపట్ల, నిడుబ్రోలు, అప్పికట్ల ఉన్నతపాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. 1920 - 1930 మధ్య కాలంలో కాంగ్రెసులో చేరి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. 1922లో జైలుశిక్ష అనుభవించాడు.
గ్రామజీవనము, గాంధీతత్త్వము, సర్వోదయము, ఆంధ్రాభ్యుదయము, తిక్కన కవితామార్గము, చిన్నయసూరి సిద్ధాంతము ఆయనకు అభిమాన విషయాలు.
మరణం
మార్చు1990 మార్చి 21 న గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని అప్పికట్ల గ్రామాలో తుమ్మల సీతారామమూర్తి మరణించాడు.
సాహితీ కృషి
మార్చుసీతారామమూర్తి పలు రచనా రూపాలను స్పృశించాడు. ఆయన రచనలను స్థూలంగా కింది విధాలుగా విభజించవచ్చు.
- గాంధీకావ్యాలు - ఆత్మకథ, మహాత్మకథ, అమరజ్యోతి, సర్వోదయగానము, గాంధీగానము, మహాత్మగాంధీ తారావళి.
- రాష్ట్రకావ్యాలు - రాష్ట్రగానము, ఉదయగానము.
- ఖండకావ్యాలు - పఱిగపంట, పెద్దకాపు, శబల, పైరపంట, సమదర్శి, కదంబకైత, చక్కట్లు, దివ్యజ్యోతి.
- కథాకావ్యాలు - ఆత్మార్పణము, ధర్మజ్యోతి.
- సామాజిక కావ్యాలు - ఎక్కట్లు, సందేశసప్తశతి.
- స్వీయచరిత్ర కావ్యాలు - నేను, నా కథలు, తపస్సిద్ధి.
- వేదాంతకావ్యాలు - గీతాదర్శము, భజగోవిందం, లక్ష్మీనృసింహ స్తోత్రము, హనుమాన్ చాలీసా.
- నీతికావ్యాలు - తెనుగు నీతి, నీతికుసుమావళి.
- స్మృతికావ్యాలు - రామకృష్ణస్మృతి, విశ్వదాత.
- శతకములు - పురాంతక శతకము, రామశతకము, రామలింగేశ్వర శతకము.
- జంగం కథలు - బిల్హణీయము.
- నాటకాలు - గిరికా పరిణయము, హనుమద్విజయము,మహేంద్ర జననము.
- హరికథలు - అన్నదాన మాహాత్మ్యము, సాత్రాజితీ పరిణయము, నామదేవ చరిత్రము.
కృతులు (ప్రచురించిన సంవత్సరము క్రమములో)
మార్చు- గిరికా పరిణయము, 1911-1918
- మధ్య హనుమద్విజయము, 1911-1918 మధ్య
- అన్నదాన మాహాత్మ్యము, 1911-1918 మధ్య
- సాత్రాజితీ పరిణయము, 1911-1918 మధ్య
- పురాంతక శతకము, 1911-1918 మధ్య
- రామశతకము, 1919
- రామలింగేశ్వర శతకము, 1919
- బిల్హణీయము, 1920
- మహాత్మగాంధీ తారావళి, 1921
- నామదేవ చరిత్రము, 1922
- రామకృష్ణస్మృతి, 1923
- భజగోవిందం, 1923
- లక్ష్మీనృసింహ స్తోత్రము, 1925
- మహేంద్ర జననము, 1924
- ఆత్మార్పణము (4 ముద్రణలు), 1932-1953
- ఆత్మకథ (ప్రథమ భాగము), 1936
- నీతికుసుమావళి, 1937
- రాష్ట్రగానము (7 ముద్రణలు), 1938-1973
- ధర్మజ్యోతి (5 ముద్రణలు), 1943-1985
- పఱిగపంట (2 ముద్రణలు), 1943-1952
- పెద్దకాపు, 1948
- అమరజ్యోతి, 1948
- తపస్సిద్ధి, 1949
- ఆత్మకథ (మొత్తం అయిదు భాగములు), 1951
- ఉదయగానము (2 ముద్రణలు), 1955-1973
- శబల, 1955
- సర్వోదయగానము, 1961
- తెనుగు నీతి, 1961
- నేను, 1963
- గీతాదర్శము, 1963
- పైరపంట, 1964
- సమదర్శి, 1967
- మహాత్మకథ, 1968
- నా కథలు, 1973
- ఎక్కట్లు, 1976
- హనుమాన్ చాలీసా, 1978
- సందేశసప్తశతి, 1981
- కదంబకైత, 1983
- గాంధీగానము, 1987
- చక్కట్లు, 1993
- దివ్యజ్యోతి, 1994
- తెనుఁగులెంక తుమ్మల సమగ్ర సాహిత్యము, తుమ్మల శతజయంతి ఉత్సవ సంఘ ప్రచురణ, గుంటూరు, 2001
- మొదటి భాగము - బాపూజీ ఆత్మకథ
- రెండవ భాగము - మహాత్మకథ
- మూడవ భాగము - ఖండకావ్యములు - రామశతకము, రామలింగేశ్వర శతకము, మహాత్మగాంధీ తారావళి, మహేంద్ర జననము, రామకృష్ణస్మృతి, ఆత్మార్పణము, రాష్ట్రగానము, ధర్మజ్యోతి, పఱిగపంట, శబల, ఉదయగానము, సర్వోదయగానము, తెనుగు నీతి, నేను, గీతాదర్శము
- నాల్గవ భాగము - ఖండకావ్యములు - పైరపంట, సమదర్శి, నా కథలు, హనుమాన్ చాలీసా, సందేశసప్తశతి, కదంబకైత, గాంధీగానము, చక్కట్లు, దివ్యజ్యోతి
తుమ్మల కవితా సంకలన గ్రంథములు
మార్చు- యుగకవిత, తుమ్మల శ్రీనివాసమూర్తి, 1984
- రంగా - భారతి, తుమ్మల శ్రీనివాసమూర్తి, 1986
- సంక్రాంతి, తుమ్మల శ్రీనివాసమూర్తి, 1988
- రైతుజీవనము, తుమ్మల శ్రీనివాసమూర్తి, 1990
- సత్యం శివం సుందరం, తుమ్మల శ్రీనివాసమూర్తి, 1990
- తుమ్మల వాణి, తుమ్మల శ్రీనివాసమూర్తి, 1992
- తుమ్మల యుగవాణి, తుమ్మల శ్రీనివాసమూర్తి, 1996
- తుమ్మల సుభాషితములు, తుమ్మల శ్రీనివాసమూర్తి, 2000
- తుమ్మల వాణి, తుమ్మల శతజయంతి ఉత్సవ కమిటి, 2001
- ఆంధ్రప్రశస్తి, తుమ్మల శ్రీనివాసమూర్తి, 2004
- పండుగ కవితలు, తుమ్మల శ్రీనివాసమూర్తి, 2005
- తెనుఁగుతీపి, తుమ్మల శ్రీనివాసమూర్తి, 2005
సమ్మానములు
మార్చు- 1949 నిడుబ్రోలులో - గజారోహణము, గండ పెండేరము, కనకాభిషేకము, సువర్ణకంకణము.
- 1960లో అఖిల భారత తెలుగురచయితల మహాసభ సత్కారము.
- 1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ విశిష్టసభ్యత్వ ప్రదానము.
- 1969లో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమానము
- 1969లో ఆంధ్ర విశ్వవిద్యాలయము "కళాప్రపూర్ణ" బిరుదుతో సత్కారము.
- 1984 మద్రాసులో శ్రీ ఎల్. వి. రామయ్య చారిటీస్ జాతీయకవి అవార్డు.
- 1985లో నాగార్జున విశ్వవిద్యాలయం నాగార్జున విశ్వవిద్యాలయము "డాక్టర్ ఆఫ్ లెటర్స్" (డి.లిట్) బిరుదుతో సత్కారము
- 1985 విశాఖపట్నంలో సహస్ర చంద్రదర్శన మహోత్సవము.
- నెల్లూరు, అప్పికట్ల, ముక్త్యాల, తెనాలి, గుడివాడ, మద్రాసు, గుంటూరు, విజయవాడ చీమకుర్తి మొదలైన తావులలో సన్మానాలు జరిగాయి.
- జయంతి మహోత్సవములు: 1952 నుండి పెక్కుచోట్ల జరిగాయి.
బిరుదులు
మార్చుతుమ్మల సీతారామమూర్తికి తెనుగు లెంక, అభినవ తిక్కన, మహాత్ముని ఆస్థానకవి బిరుదులు. ఒక సభలో సీతారామమూర్తి ప్రసంగించబోతుండగా శ్రోతల్లోంచి ఒకరు లేచి మీకు అభినవ తిక్కన అన్న బిరుదు వుంది కదా. మీ పద్యాలలో అత్యుత్తమమైనది ఒకటి, తిక్కన పద్యాల్లో అత్యంత చెత్త పద్యమొకటి వినిపించి, దానికన్నా మీ పద్యం ఏ విధంగా గొప్పదో చెప్పండి. నేను మీరు అభినవ తిక్కనేనని ఒప్పుకుంటానని ప్రశ్నించారు. దానికి సమాధానంగా నన్ను నేను ఎప్పుడూ అభినవ తిక్కనగా భావించలేదు. కానీ వాళ్ళూ వీళ్ళూ అంటూంటే ఊరుకోవడం కూడా పొరబాటని ఇప్పుడు తెలిసివచ్చింది. ఈ సభాముఖంగా నేను ఆ బిరుదును వదిలివేస్తున్నాను. నేను తెలుగు లెంక, మహాత్ముని ఆస్థానకవి అన్న బిరుదులకు తగ్గవాణ్ణని భావిస్తూ వాటిని అట్టిపెట్టుకుంటున్నానని తుమ్మల అంగీకరించారు.
తుమ్మల జీవితము, కవిత్వము, వ్యక్తిత్వము పై ఇతరులు వ్రాసిన గ్రంథములు
మార్చు- తెనుఁగులెంక తుమ్మల, గొల్లపూడి ప్రకాశరావు, 1975
- యుగకవి తెనుఁగులెంక శ్రీ తుమ్మల సీతారామమూర్తి, తుమ్మల శ్రీనివాస మూర్తి, 1989
- తెనుఁగులెంక తుమ్మల సీతారామమూర్తి కవిత్వం - వ్యక్తిత్వం, జూపూడి అమ్ములయ్య (అమూల్యశ్రీ), 1995
- తుమ్మల సీతారామమూర్తి (భారతీయ సాహిత్య నిర్మాతలు), నాగళ్ల గురుప్రసాదరావు, సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీ, 2000
- అజరామరవాఙ్మయమూర్తి తుమ్మల సీతారామమూర్తి, సూర్యదేవర రవికుమార్, 2002