కోమలి కళా సమితి, నల్లగొండ జిల్లా కేంద్రంలో 1981లో స్థాపించబడింది. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమిచే గుర్తింపు పొందింది. దీని ఏర్పాటుకు ఆధ్యులు కీ.శే. దుగ్గి వెంకటేశ్వర్లు. వ్యవస్థాపక అధ్యక్షుడు బక్క పిచ్చయ్య, కార్యదర్శి కొంక బాలస్వామి, వ్యవస్థాపక సభ్యులుగా పోషం రఘుపతి, టి. వెంకటేశ్వర్లు, కోడి రాములూ, నాగరాజు, హన్మంత రెడ్డి, కస్పా రెడ్డి, సుభాష్ రెడ్డి, వై. వీరయ్య, వెంకటేశ్వర్లు, మంచిరాజు లక్ష్మీ నరసింహారావు, డా. లేఖానంద స్వామి, జి.యల్. కుమార్, యం. పురుషోత్తమ రావు, వి. భాస్కర్, శీలం భద్రయ్య ఉన్నారు.

మొదటి ప్రదర్శన

కోమలి కళా సమితి ప్రదర్శించిన మొదటి నాటకం "నేను రాముణ్ణి కాను". ఇది 1981లో నల్లగొండలోని ప్రభుత్వ జూనియర్ఈ కళాశాలలో ప్రదర్శించబడింది. నాటిక రచయిత కాశీ విశ్వనాథ్. దర్శకత్వం దుగ్గి వెంకటేశ్వర్లు.

ఇతర ప్రదర్శనలు

కోమలి కళా సమితి అనేక నాటకాలు, నాటికలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చి బహుమతులు సాధించింది. నేను రాముణ్ణి కాను, మనసున్న మనిషి, సమాధి కడుతున్నాం చందాలు ఇవ్వండి,రఘుపతి రాఘవ రాజారాం, క్షీర సాగర మథనం, మంచు బొమ్మలు, పునాది వంటి నాటకాలు, బైబిలు దొంగలు, నీరు పొయ్యి, అసుర గణం, పద్మవ్యూహం, గాంధీ పుట్టిన దేశమే ఇది, మనుషులొస్తున్నారు జాగ్రత్త, హుష్ కాకి, రూల్స్ ఒప్పుకోవు, ఓటున్న ప్రజలకు కోటి దండాలు,కృషితో దుర్భిక్షం, సరిహద్దు, అసలు నేను,అహం బ్రహ్మ, ఆత్మగీతం, అన్నట్టు మనం మనుషులం కదూ! వంటి నాటికలు అనేక సంఖ్యలో ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 110 ప్రదర్శనలకు పైగా ప్రదర్శించారు.

అవార్డులు

కోమలి కళాసమితి సభ్యులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చి, పలు అవార్డులను కైవసం చేసుకున్నారు. 22 జనవరి 2010లో ఖమ్మంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన నంది నాటకోత్సవాలలో భవాని ప్రసాద్ రచనలో, వెంకట్ గోవాడ దర్శకత్వంలో 'అహం బ్రహ్మ' నాటిక ప్రదర్శించి రెండు నంది అవార్డులను కైవసం చేసుకోవడం జరిగింది. తరువాత సంవత్సరం 22 జనవరి 2011లో కర్నూలులో నిర్వహించిన నంది నాటకోత్సవాలలో శిష్ట్ల చంద్ర శేఖర్ రచించిన 'ఆత్మగీతం' నాటికను ఎస్.ఎం. భాషా దర్శకత్వం చేశారు. ఈ నాటిక ప్రదర్శనకు గాను నటీ నటులు ఏకంగా ఐదు నంది అవార్డులను కైవసం చేసుకున్నారు. ఉత్తమ ప్రతి నాయకుడు పాత్రలో పోషం రఘుపతి కాంస్య నంది అందుకున్నాడు.

కోమలి కళా సమితిపై పరిశోధన

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం రంగ స్థల కళల శాఖ విభాగం నుండి 2017 సంవత్సరంలో 'కోమలి కళా సమితి, నల్లగొండ జిల్లా, ఒక పరిశీలన' అన్న అంశంపై మల్లం మారయ్య పరిశోధన చేశారు. ఈ పరిశోధనకు గాను విశ్వవిద్యాలయం వారిచే మల్లం మారయ్యకు ఎంఫిల్ పట్టాతో బాటు బంగారు పతకం అందజేయబడినది.

తాజా ప్రదర్శన

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆర్ధిక సహకారంతో, స్థానిక శాసన సభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి సహకారంతో కోమలి కళా సమితి సంస్థ నాటకోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో మూడు రోజులు ఆరు నాటికలు ప్రదర్శించడం జరిగింది. ఈ ఉత్సవాలలో భాగంగా కోమలి కళా సమితి తరపున 'అన్నట్టు మనం మనుషులం కదూ!' నాటికను ప్రదర్శించారు.

అన్నట్టు మనం మనుషులం కదూ! నాటిక సంక్షిప్త సారాంశం, నటీ నటులు

రచన: శ్రీ తులసి బాలకృష్ణ , దర్శకత్వం : డాక్టర్ వెంకట్ గోవాడ

సింహాచలం అనే బడుగుజీవి తన జీవిక కోసం రామాపురం బైపాస్ రోడ్డు పక్కన గల ఒక చిన్న టీకొట్టును నడుపుతుంటాడు. జపాన్ అనే జులాయి, ఎప్పుడూ మద్యంమత్తులో ఉండి, అటువైపుగా వచ్చిపోయే మహిళలను వేధిస్తూ ఉంటాడు. సాయంత్రం ఆరుగంటల సమయంలో అక్కడికి రామదాసుపంతులు అనే విశ్రాంత ఉపాధ్యాయుడు వస్తాడు. జపాన్ ఆయనను వేధిస్తూ ఆటపట్టిస్తుండగా ఇంతలో ధర్మరాజు అనే టాక్సీ డ్రైవరు టాక్సీతో అక్కడికి వస్తాడు. తన టాక్సీలోనుండి బలహీనంగా, మత్తుగా, డిప్రెషన్ తో నున్న ఒక మహిళను కిందకు దించి, తీసుకొచ్చి ఆ టీ కొట్టు దగ్గర కూర్చోబెడుతారు. జపాన్ కన్ను ఆ మహిళపై పడుతుంది. ఇంతలో అక్కడికి వేణుమాధవ్ అనే సోషల్ వర్కర్ అక్కడికి వస్తాడు. ఆమెకు ఏదైనా సాయం చేయాలని ప్రయత్నిస్తాడు. ఆ సమయానికి అక్కడికి పట్టణ పాత నేరస్తుడు మస్తానయ్య ఒక పథకం ప్రకారం అక్కడికి వచ్చి, ఆమె తన తమ్ముడి భార్య అని చెప్పి, ఆమెను తన వెంట తీసుకుపోవాలని ప్రయత్నిస్తాడు. అతని పన్నాగానికి టాక్సీ డ్రైవరు ధర్మరాజు కూడా సహకరిస్తుంటాడు. ఈలోగా అక్కడికి వచ్చిన పోలీసు ఇన్స్పెక్టర్ కూడా బసవలింగం వారితో కలిసిపోయి, ఎలాగైనా ఆ యువతిని తానే వెంట తీసుకుపోవాలని ప్రయత్నిస్తాడు. ఇలా జపాను, మస్తానయ్య, పోలీసు ఇన్స్పెక్టరు బసవలింగం తమ మాటలతో అక్కడి వారిని నమ్మించి ఎవరికీ వారు ఆమెను గద్దలా తన్నుకుపోదాం అని చూస్తుంటారు. కానీ సింహాచలం, రామదాసుపంతులు, వేణుమాధవ్ లు మాత్రం ఆమెను ఎలాగైనా కాపాడాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో బసవలింగం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వరుసగా వేణుమాధవ్, సింహాచలంను అక్కడినుండి పంపించివేస్తాడు. రామదాసు పంతులు మాత్రం అక్కడినుండి వెళ్ళేది లేదని భీష్మించుక కూర్చుంటాడు. దాంతో వాళ్ళు ఏకమై రామదాసుపంతులు మీద భౌతికంగా దాడి చేసి, ఆ యువతిపై దాడి చేయబోగా నాటిక కీలక మలుపు తీసుకుంటుంది. ఆ యువతి తనపై దాడిచేయబోతున్న మస్తానయ్య, జపాన్, ధర్మరాజు చెంపలు వాయించి పిస్తోలుతో వాళ్ళను నిశ్చేష్టపరుస్తుంది. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వాళ్ళను పట్టుకోవడానికి తన అసిస్టెంట్ పోలీసు అధికారి వేణుమాధవ్ తో మఫ్టీలో ఈ నాటకం ఆడాను మాస్టారు అని రామదాసు పంతులుతో చెప్పడంతో నాటిక ముగుస్తుంది. మహిళా భద్రత ఇతివృత్తంగా మానవీయకోణంలో సంభాషణలు కలిగి ఆలోచనాత్మక కథనంతో కుతూహలంగా నాటిక ఆద్యంతం సాగుతుంది.

పాత్రలు- పాత్రధారులు

రామదాసు పంతులు – యం.యల్. నరసింహారావు

సింహాచలం- డాక్టర్ యల్. లేఖానంద స్వామి

జపాన్ –యం. పురుషోత్తమ రావు

ధర్మరాజు- జి.యల్. కుమార్

మస్తానయ్య- బి. పిచ్చయ్య

వేణు మాధవ్- శీలం భద్రయ్య

ఎస్.ఐ./ బసవలింగం- పోషం రఘుపతి

ఝాన్సీ(యువతి)- శ్రీమతి సురభి లలిత

ఆర్గనైజర్ – వి. భాస్కర్

సంగీతం- లీలా మోహన్

[1]

https://www.ntnews.com/nalgonda/nalgonda-district-302-701464

అట్టహాసంగా రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలు ప్రారంభం

నంది నాటక పరిషత్తు - 2009

సామాజిక వికాసానికి నాటకం చైతన్య సాధనం

ఆయన విలక్షణ నటుడు