కోరాడ రామకృష్ణయ్య

భాషావేత్త, తెలుగు-సంస్కృతం-అంగ్ల-ద్రావిడ భాషా నిపుణులు

కోరాడ రామకృష్ణయ్య (2 అక్టోబర్ 1891 - మార్చి 28, 1962) ప్రముఖ భాషావేత్త, తెలుగు-సంస్కృతం-అంగ్ల-ద్రావిడ భాషా నిపుణులు. ద్రావిడభాషా కుటుంబాన్ని గురించి శాస్త్రీయంగా కృషిచేసిన తెలుగువారిలో ప్రథములు.

కోరాడ రామకృష్ణయ్య
కోరాడ రామకృష్ణయ్య రేఖాచిత్రం-'శత జయంతి సాహితీ నీరాజనం’ పుస్తకము నుండి
జననం(1891-10-02)1891 అక్టోబరు 2
అమలాపురం, తూర్పుగోదావరి జిల్లా
మరణం1962 మార్చి 28(1962-03-28) (వయసు 70)
విద్యబి. ఎ, నోబుల్ కళాశాల, మచిలీపట్నం (1915), ఎం. ఎ, మద్రాసు విశ్వవిద్యాలయం (1921)
ఉద్యోగంనోబుల్ కళాశాల,మచిలీపట్నం, మహారాజా కళాశాల, విజయనగరం, మద్రాసు విశ్వవిద్యాలయం, తితిదే ప్రాచ్య పరిశోధనాలయం, తిరుపతి
తల్లిదండ్రులు
  • లక్ష్మీమనోహరం (తండ్రి)
  • సీతమ్మ (తల్లి)
సంతకం

బాల్యం

మార్చు

కోరాడ రామకృష్ణయ్య తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో అమ్మమ్మ ఇంట 1891, అక్టోబరు 2 న జన్మించాడు.అతని తల్లిదండ్రులు సీతమ్మ, లక్ష్మీమనోహరం.

విద్య

మార్చు

ఈయన ప్రాథమిక విద్యానంతరం మచిలీపట్నం నోబుల్ కళాశాలలో 1915లో బీ.ఏ. పూర్తి చేశాడు. లెక్చరర్ గా నోబుల్ కళాశాలలో ఉద్యోగం చేసి, ఆపై 1921లో రాజధాని కళాశాల (ప్రెసిడెన్సీ కాలేజీ) మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎం.ఏ పూర్తి చేశాడు.

ఉద్యోగం

మార్చు

బీ.ఏ పూర్తి చేసిన వెంటనే నోబుల్ కళాశాలలో పండితులుగా పనిచేశాడు. తరువాత విజయనగరం మహారాజాకళాశాలలో తెలుగు, సంస్కృతం బోధించారు. ఎం.ఏ పూర్తిచేసిన అనంతరం 12 సంవత్సరాలు (1915-27) మహారాజా కాలేజీలో పనిచేశారు. తరువాత 1927లో మద్రాస్ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా చేరారు. 1950లో పదవీ విరమణ చేశారు. ఆపై తిరుపతి తితిదేలో ప్రాచ్య పరిశోధనాలయంలో ఆరు సంవత్సరాలు పనిచేశాడు.

రచనలు

మార్చు

దక్షిణదేశ భాషలలో సమానమైన ఛందస్సాహితీ సంప్రదాయం ఉందని చూపినవారిలో ప్రథములు. పరిశోధనలో సత్యైక దృష్టితో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పినవారిలో ప్రథములు. పదాల పుట్టుపూర్వోత్తరాల జ్ఞానంతో సామాజిక చరిత్రను ప్రజాస్వామ్యంలో ప్రచారంచేసినవారిలో ప్రథములు.

తెలుగు సాహిత్య విమర్శ రచనలు

  • ఆంధ్ర భారతకవితావిమర్శనము, 1929: శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారు 1927సం. మద్రాసు విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా చేరారు. మద్రాసు యూనివర్సిటీలో తెలుగు శాఖ చేపట్టవలసిన పరిశోధనా కార్యక్రమము "ఆంధ్ర భాషా సాహిత్యముల పరిణామము నన్వేషించి, వాటి ప్రత్యేక లక్షణములు, విశిష్ఠత ఎట్టివో వ్యక్తపరచవలసి ఉన్నది" అని తలచి, దానికి మూలాధారమైనది ఆంధ్ర భారతము గనుక, దానిలో పరిశోధన ప్రారంభించారు. తత్ఫలితంగా రెండేళ్లలో 'ఆంధ్రభారత కవితా విమర్శనము’ (తిక్కనార్యుని విరాటపర్వ విమర్శన) అనే గ్రంథాన్ని రచించి 1929 లో ప్రచురించారు. అప్పటి పత్రికలన్నీ ఈ గ్రంథాన్ని ముక్తకంఠంతో ప్రశంసించాయి. ఈ గ్రంథం పాఠకులపైనా, తరువాతి భారత విమర్శకులపైనా చెరగని ముద్ర వేసింది. విద్వాన్, బి.ఏ., ఎం.ఏ. విద్యార్థులకు ఇంచుమించు ఏభై సంవత్సరాలు పాఠ్యగ్రంథంగా ఉన్నది.
  • కాళిదాసుని ప్రతిభలు: సాహిత్య విమర్శలో పాశ్చాత్త్యపద్ధతులను అనుసరించి కాళిదాసు మూడునాటకాలలో అతని కళాప్రతిభలు ఎలా అభ్యుదయం పొందాయో వివరించారు.
  • సారస్వత వ్యాసములు: భారత విమర్శనంలో వలె మన సాహిత్యంలో నూతన పద్ధతులను అనుసరించవలసిన ఆవశ్యకతను వ్యక్తంచేయడానికి 'సారస్వత వ్యాసములు' అనే విమర్శ వ్యాససంపుటి ప్రకటించారు.
  • దక్షిణ దేశభాషా సారస్వతములు - దేశి, 1949: భాషావిషయంలో వలెనే సాహిత్యచ్ఛన్దో విషయాలలోకూడా సంస్కృతం నుండి వచ్చి చేరిన సంప్రదాయ ఫక్కీకి భిన్నమై దక్షిణదేశీయ భాషలకు సహజమైన సంప్రదాయ ఫక్కీ ఒకటి ఉన్నదనీ, అది సంస్కృత సంప్రదాయ ప్రాబల్యం వలన మాటు మణిగి పోయినదనీ, కాబట్టి దేశీయ సంప్రదాయ సిద్ధమైన వాఙ్మయాన్ని పునరుద్ధరించవలసి ఉన్నదనీ వారు 1940 ప్రాంతంలో ఉద్ఘాటించారు. 'దక్షిణ దేశ భాషా సారస్వతములు - దేశి' అనే గ్రంథంలో, తెలుగులో ఉపజాతి ఛందస్సును తమిళ కన్నడ ఛందస్సుతో పోల్చిచూస్తే ఆ దేశీయ ద్రావిడమైన ఛందో ఫక్కీ బయలుపడుతుందనీ కుడా ప్రకటించారు.
  • Telugu Literature outside the Telugu Country: దక్షిణాంధ్ర వాజ్మయ యుగంలో దేశి సాహిత్య పునరుద్ధరణ, ఆధునిక తెలుగు సాహిత్య లక్షణాలుగా పరిణమించిన కొన్ని సాహిత్య శాఖల అభివృద్ధి నాయకరాజుల చలవే. తరువోజ వంటి దేశీ వృత్తాలు యెంత సులభంగా గానయోగ్యాలవుతాయో, లేక బహుశా మొదట రాగతాళ లయలతో ఉన్న దేశీ ఛందస్సులే తర్వాత వృత్తాలుగా తీర్చబడినాయా - అనే విషయాలు ఈ గ్రంథంలో నిరూపించబడ్డాయి. 'ముసలమ్మలు పాడే పాటలలోను,కార్మికులు, కర్షకులు వీధులలో, పొలాలలో పాడే పాటలలోను తెలుగులోని పాత దేశీ ఛందస్సు ఇంకా సురక్షితమై ఉందని మనం విశ్వసించవచ్చు' అని ఈ గ్రంథం మనకు హామీ ఇస్తున్నది.

తెలుగు భాష,చరిత్ర పై రచనలు

  • సంధి, 1935: ఈ గ్రంథం రామకృష్ణయ్యగారి మౌలిక పరిశోధన పద్ధతికి మణిమకుటం. తెలుగులోని సంధినియమాలను చారిత్రకపద్ధతిని అనుసరించి, ఇతర సన్నిహిత భాషాలక్షణాలతో సరిపోల్చి, అందులోని విశేషాలను సాకారణంగా సమన్వయించారు. ‘సంధి’ వంటి గ్రంథం ఇంతవరకు తెలుగులో వెలువడలేదు.
  • భాషోత్పత్తి క్రమము - భాషా చరితము, 1948: తెలుగు సంస్కృత భవతే అని తలచి సంపూర్ణంగా సంస్కృత వ్యాకరణ ఫక్కీనే తెలుగు వ్యాకరణం రచించిన తెలుగు పండితుల అభిప్రాయాలను తొలగించి, తెలుగు వ్యాకరణ విశేషములను భాషాచారిత్రక పద్దతిని సమన్వయించి రచించారు. వ్యాకరణం బోధించే పండితులకు తెలుగు వ్యాకరణ సూత్ర బోధన విషయమున చారిత్రక దృక్పధం ఏర్పడాలని వారి ఆశయం. అప్పటికి పశ్చాత్త్యదేశాలలో వేళ్ళుదన్నిన భాషాశాస్త్ర సిద్ధాంతాలను, అనువర్తన విధానాలను తెలుగువారికి పరిచయం చేశారు.
  • భాషా చారిత్రక వ్యాసములు, 1954:వివిధపత్రికల్లో ప్రచురించిన వ్యాసాల సంకలనం.
  • Studies in Dravidian Philology, 1953:దక్షిణదేశ భాషల విషయమైన పరిశోధన మప్పటికింకా కొత్త మార్గమే అవడం వల్ల అక్కడ చేయదగిన పనులను గూర్చి పలువురు పలువిధాలుగా అనుకునేవారట. రామకృష్ణయ్యగారు ఆంధ్రభాషా చరిత్రాన్వేషణకు ద్రావిడభాషా తత్వ పరిశీలన ముఖ్యసాధనమని తలచి తెలుగు భాష పుట్టుపూర్వోత్తరాలను కనుగొనడానికి ప్రయత్నించారు. వారి 'Studies in Dravidian Philology' అనే గంథం ద్రావిడ భాషలలోని నామ, క్రియా విభక్తి స్వరూపాన్ని నిరూపిస్తుంది. ఆర్యద్రావిడభాషల సంబంధము, ద్రావిడభాషల సంయుక్తపదరూపతత్వమును వివరిస్తుంది.
  • Dravidian Cognates: ఒకే మూలమునుంచి ఆవిర్భవించిన దక్షిణదేశ భాషలలోని పదముల సంకలనం చేసి, వాటిని పరిశీలించి వ్రాసిన గ్రంథం. ఈ గ్రంథం తరువాత వచ్చిన 'The Dravidian Etymological Dictionary' by Burrow and Emeneau కి మార్గదర్శకమైంది.
  • ‘Telugu Language in the First Millennium A.D.’ : ప్రాఞ్జనన్నయ యుగంలో శాసనభాషకు చారిత్రకవ్యాకరణ రచనకు ఇది మొదటి ప్రయత్నం. తిరుపతి శ్రీవెంకటేశ్వర ప్రాచ్యపరిశోధనాలయం జర్నల్ లో ధారావాహికంగా మొదట ప్రచురితమైంది.

అనువాదాలు, పరిష్కరించి ప్రచురించిన ప్రాచీన గ్రంథాలు

  • ఘనవృత్తం, 1917
  • భీమేశ్వర పురాణం, 1919
  • శ్యమంతకోపాఖ్యానం, 1920
  • విష్ణుపురాణం , 1930
  • నవనాథాచారితము, 1937
  • ఆంధ్రభారత పాఠనిర్ణయ పధ్ధతి, 1937
  • వల్లభాభ్యుదయము, 1940
  • పరతత్వరసాయనము, 1941
  • నన్నిచోడుని కుమారసంభవము, 1948
  • శ్రీవెంకటేశ్వర స్తుతిరత్నమాల, 1952
  • కోరాడవంశ ప్రశస్తి, 1952
  • శ్రీనివాసవిలాసము, 1954
  • మతసారసంగ్రహము, 1955

మూలాలు

మార్చు
  1. ఆర్కైవ్‍డాట్‍ఆర్గ్ వద్ద కోరాడా రామకృష్ణయ్య శతజయంతి జ్ఞాపిక పుస్తకం