గన్నవరపు సుబ్బరామయ్య

గన్నవరపు సుబ్బరామయ్య (1890 -1963) ప్రముఖ రచయిత, అనువాదకుడు, సంపాదకుడు. ఇతడు భారతి మాసపత్రిక సంపాదకునిగా పనిచేశాడు.

విశేషాలు మార్చు

ఇతని స్వగ్రామం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, దొరవారిసత్రము మండలానికి చెందిన సూరప్పాగ్రహారం. ఇతడు 1890, మార్చి 13వ తేదీన చెన్నపట్టణంలో తన మాతామహుల ఇంట జన్మించాడు[1]. ఇతడు అగ్రహారంలో తన పితామహుడు శేషశాస్త్రి వద్ద తెలుగు, సంస్కృత భాషలు నేర్చుకున్నాడు. ఇతడికి తన 12వ యేట మేనత్త కూతురుతో వివాహం జరిగింది. దానితో చదువుకు ఆటంకం ఏర్పడింది. ఇతని 18వ యేట భార్య చనిపోవడంతో అదే సంవత్సరం ద్వితీయ వివాహం చేసుకున్నాడు. ద్వితీయ వివాహం తరువాత ఇతనికి తన మాతామహుల ఇంటికి మద్రాసుకు రాకపోకలు ఎక్కువ కావడం, చదువు పట్ల తిరిగి ఆసక్తి పెరగడం సంభవించింది. స్వగ్రామంలో ఒక మెట్ర్రిక్యులేటు వద్ద కొంత ఇంగ్లీషు అభ్యసించాడు. తరువాత మద్రాసులో తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, గుజరాతీ, హిందీ భాషలు అభ్యసించాడు. జీవనోపాధి కోసం బుక్ కీపింగ్, టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ వంటి విద్యలూ నేర్చుకున్నాడు.

1912లో మద్రాసులోని ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో పండితుడిగా వేటూరి ప్రభాకరశాస్త్రి స్థానంలో నియమించబడి అక్కడ నాలుగు సంవత్సరాలు పనిచేశాడు. వేదం వేంకటరాయశాస్త్రి వద్ద సూర్యరాయాంధ్ర నిఘంటు నిర్మాణంలో సహాయ సంగ్రాహకునిగా కొంత కాలం పనిచేశాడు. విదేశీయులకు దేశభాషాధ్యాపకులుగా కొంత కాలం, మద్రాసు ప్రభుత్వం యాంటీ హుక్‌వర్ం కాంపైన్‌లో స్టెనోగ్రాఫర్‌గా కొంత కాలం పనిచేశాడు.

కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఉత్తమ సాహిత్య మాసపత్రిక ప్రారంభించాలనే సంకల్పంతో దాని నిర్వహణకు వివిధ ప్రాచ్యభాషా పాండిత్యంతో పాటుగా ఆధునిక విజ్ఞానం, రాజకీయ పరిజ్ఞానం గల వ్యక్తి కోసం అన్వేషిస్తూ వేటూరి ప్రభాకరశాస్త్రి సలహా మీద గన్నవరపు సుబ్బరామయ్యను భారతి మాసపత్రిక సంపాదకునిగా నియమించాడు. భారతి 1924లో ప్రారంభమయ్యింది. వచ్చిన రచనలలో నచ్చిన మంచి వాటిని ఎన్నుకుని వాటిని సంస్కరించి నాగేశ్వరరావు పంతులుతో సంప్రదించి వాటిని ప్రచురించేవాడు. భారతిలో మనవిమాటలు, మీగడతరకలు, గ్రంథసమీక్షలు, వ్యాసాలు, కలగూరగంప మొదలైనవి స్వయంగా వ్రాశాడు. ఈ పత్రికకు 1938 వరకు సంపాదకునిగా వ్యవహరించాడు.

ఆ తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రచురించిన రంగనాథ రామాయణము పరిష్కరణలోను, సంపాదకత్వంలోను వేటూరి ప్రభాకరశాస్త్రికి సహాయకుడిగా మూడు సంవత్సరాలు పనిచేశాడు. పిమ్మట 11 సంవత్సరాలు నెల్లూరు ఎ.బి.ఎమ్‌.బాలికల పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. పాటూరు శ్రీహరితో కలిసి కావ్యాంజలి పేరుతొ పాఠ్యపుస్తకం రాశాడు. మరికొన్ని పాఠ్యపుస్తకాలు గూడా రాసాడు.1956 నుండి నాలుగేండ్లు తెలుగు భాషాసమితి వారి తెలుగు విజ్ఞాన సర్వస్వంలో అసిస్టెంట్ కంపైలర్‌గా పనిచేసి తన 70వ యేట ఉద్యోగ విరమణ చేశాడు.1963 ఏప్రిల్ 8న నెల్లూరులో స్వగృహంలో మరణించాడు.

రచనలు మార్చు

సంపాదకత్వం మార్చు

  • యామున విజయవిలాసము[2]

అనువాదాలు మార్చు

మూలాలు మార్చు

  1. తిరుమల, రామచంద్ర (27 February 1963). "మరపురాని మనీషి - గన్నవరపు సుబ్బరామయ్య". ఆంధ్రప్రభ సచిత్రవారపత్రిక. 11 (29): 6–7. Retrieved 14 May 2017.[permanent dead link]
  2. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో యామున విజయవిలాసము ప్రతి

విక్రమపురి (నెల్లూరు) మండల సర్వస్వం,1963