గుంటుపల్లి జగన్నాధం

గుంటుపల్లి జగన్నాథం, గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం పొనుగుపాడు గ్రామంలో 1946 ఆగష్టు 20 న వ్యవసాయ కుటుంబానికి చెందిన గుంటుపల్లి వెంకటేశ్వర్లు, వెంకటసుబ్బమ్మ దంపతులకు జన్మించాడు. ప్రాథమిక విద్య, ఉన్నత పాఠశాల విద్య స్వగ్రామం పొనుగుపాడులోనే సాగింది. గుంటూరు ఎ.సి కాలేజిలో పి.యు.సి.చదివాడు. తరువాత ఐ.ఐ.టి. బెనారస్, హిందూ విశ్వవిద్యాలయం నుండి (వారణాసి, ఉత్తరప్రదేశ్) బి.యస్.సి. (మెటలర్జికల్ ఇంజనీరింగు) పట్టా (1969) పొందాడు.1980 లో ముంబాయి నుంచి యం.ఐ.ఐ.ఐ.ఇ. పట్టాను పొందాడు.

గుంటుపల్లి జగన్నాధం
గుంటుపల్లి జగన్నాధం.పొనుగుపాడు
Guntupalli Jagannadham
జననంపొనుగుపాడు
1946 ఆగష్టు,20
గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, పొనుగుపాడు గ్రామం
నివాస ప్రాంతంగుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, పొనుగుపాడు గ్రామం
ప్రసిద్ధిEX. Managing Director of Global Ispat Koksna Industrija Lukavac. (As Elected Best Manager of Bosnia and Herzegovina , South-Eastern and Central Europe Countries in 2010)
మతంహిందూ
పిల్లలుశ్రీనివాస్,రామతులసి
తండ్రివెంకటేశ్వర్లు,
తల్లివెంకటసుబ్బమ్మ

వివాహం, సంతానం. మార్చు

నరసరావుపేట మండలం, పమిడిపాడు గ్రామానికి చెందిన పోపూరి రామయ్య, మహలక్ష్మమ్మ దంపతుల ద్వితీయ కుమార్తె గోవిందమ్మను వివాహమాడాడు. ఈ దంపతుల సంతానం కుమారుడు శ్రీనివాస్, కుమార్తె రామతులసి.

ఉద్యోగ ప్రస్థానం. మార్చు

జగన్నాధం మొదటగా  1969 లో స్టీలు అధారిటీ ఆప్ ఇండియా  యాజమాన్యం లోని భిలాయ్ స్టీలు ప్లాంటులో ‘బ్లాస్ట్ ఫర్నస్’ విభాగం నిర్వహణ నందు గ్రాడ్యేట్ ఇంజనీరు (మెటలర్జికల్) గా ఉద్యోగంలో చేరాడు. అసిస్టెంటు మేనేజరు స్థాయికి ఎదిగి 1983 వరకు పని చేసాడు. అక్కడ ఇతని అత్యుత్తమ ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం దేశంలోనే ప్రతిష్టాత్మకమైన “జవహర్ లాల్ నెహ్రూ” పురష్కారాన్ని అందించింది.

1983లో వైజాగ్ స్టీలు ప్లాంటులో డిప్యూటి మేనేజరుగా బాధ్యతలు స్వీకరించాడు.అధునాతన సాంకేతిక అమలు కోసం వైజాగ్ స్టీలు ప్లాంటు నుండి రష్యా, యూరప్, దక్షిణకొరియా, దేశాలకు వెళ్ళిన ఇంజనీర్ల టీముకు నాయకత్వం వహించాడు. దానికి గుర్తింపుగా అతనికి “బెస్ట్ లీడరు ఆఫ్ ది మెన్” అవార్డు లభించింది. విశాఖ స్టీలు ప్లాంటులో జగన్నాధం నాయకత్వంలో కొత్తగా ప్రారంభించబడిన “బ్లాస్ట్ ఫర్నెస్” మొదటి సంవత్సరంలోనే నూటికి నూరుశాతం ఉత్పత్తి స్థాయిని చేరుకోవటం చెప్పకోదగిన విషయం. అంతేగాదు ఇతను  వైజాగ్ స్టీలు ప్లాంటు ఉక్కు తయారీ శాఖకు ప్రధానాధికారిగా సమర్ధతతో వ్యవహరించాడు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పధకాన్ని కొత్తగా ప్రవేశపెట్టాడు. ఆ పధకం  ఇరవై ఏళ్ళపాటు నిర్విఘ్నంగా కొనసాగింది. వైజాగ్ స్టీలు ప్లాంటులో అసిస్టెంటు జనరల్ మేనేజరు స్థాయికి ఎదిగి 1994 వరకు పనిచేసాడు.

స్వదేశంలో ఉన్నత పదవుల నిర్వహణ. మార్చు

తదుపరి 1994 లోమహరాష్ట్ర, డోల్విలోని “ఇస్పాట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్”  ప్రాజెక్టులకు ముడి సరుకుల శాఖలో ఉపాధ్యక్షుడు/ డిప్యూటి సి.ఇ.ఒ గా ఉన్నత నాయకత్వ బృందంలో స్థానం సంపాదించి, 2003 వరకు పని చేసాడు.అంతేగాదు జగన్నాధం నాయకత్వం వహించిన నిపుణుల  బృందం జర్మనీలో నిరుపయోగంగా పడివున్న ఒక బ్లాస్ట్ ఫర్నస్ కు వంద సంవత్సరాల కొత్త జీవితం వచ్చేటట్లు పునర్నిర్మించారు.ఇతని ప్రతిభను జర్మని జట్టు ఘనంగా కొనియాడింది.

జగన్నాధం విద్యార్ధిదశ నుంచి కూడ ఇతను ఇనుము, ఉక్కు పరిశ్రమకు అంకితమైయ్యాడు.ఇనుము ఉక్కు తయారీలో పబ్లిక్, ప్రవేటు రంగాలలో నిర్వహణ, యాజమాన్య పద్ధతులలో అపారమైన అనుభవం గడించాడు. ఆ అనుభవంతో జగన్నాధం స్వదేశం ఇండియా, బల్గేరియా, లిబియా, బోస్నియా - హెర్జిగోవినా మొదలగు అనేక దేశాలలో ఉక్కు కర్మాగారాలు, వాటి అనుబంధ పరిశ్రమల అభివృద్ధిలో గణనీయమైన పాత్ర పోషించాడు.

విదేశాలలో ఉన్నత పదవులు నిర్వహణ. మార్చు

బోస్నియా-హెర్జిగోవినా దేశంలోని బొగ్గు-రసాయనిక సమాఖ్యలో భాగస్వామ్యం కలవటానికి జగన్నాధం ఆదేశ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ‘జికిల్’ పేరుతో స్టీలు ప్లాంటును నెలకొల్పాడు. 2004 నుండి 2012 వరకు సవ్యసాచిలాగా ఏక కాలంలో ఒక దాని కొకటి భిన్నమైన రెండు దేశాలలో, రెండు భిన్నమైన పరిశ్రమలకు బోస్నియా - హెర్జిగోవినా దేశంలోని ‘జికిల్‘ కు, బొగ్గు-రసాయనిక పరిశ్రమకు మేనేజింగు డైరెక్టరుగా 2004 నుండి 2012 వరకు, బల్గేరియా లోని ‘క్రెమికోవిడ్జ్’ ఉక్కు కర్మాగారానికీ - ప్రధాన కార్య నిర్వహణాధికారి (సి.ఇ.ఓ) గా 2007 నుండి 2008 వరకు పని చేసిన అరుదైన ఘనత ఇతనికి దక్కింది. బోస్నియా - హెర్జిగోవినా దేశంలోని "జికిల్" ఉక్కు కర్మాగారం సాధించిన విజయం గురించి జగన్నాధం సమర్పించిన పత్రానికి 2011 లో అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన "ఇనుము ఉక్కు పరిశ్రమల సాంకేతిక అసోసియేషన్" (ఎ.ఐ.యస్.టి) నుండి అరుదైన ‘గుర్తింపు పత్రం’ పొందాడు.అదే కాలంలో 2009 నుండి 2012 వరకు లిబియా దేశంలోని "లిబియాన్ ఐరన్ అండ్ స్టీలు కంపెని" సాంకేతిక అభివృద్ధి శాఖ (గ్లోబల్ స్టీలు హోల్డింగ్ లిమిటెడ్) కు డైరెక్టరుగా అదనపు భాధ్యతలు నిర్వహించాడు.భారీ పరిశ్రమలకు అత్యంత అరుదైన వ్యత్యాసంగల ఉన్నత పదవులు నిర్వహించటమనేది జగన్నాధం జీవితంలో ఒక మైలురాయి వంటిది.

అందుకున్న పురష్కారాలు. మార్చు

  • 1969లో భిలాయ్ ఉక్కు కర్మాగారంలో అత్యుత్తమ ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం దేశంలోనే ప్రతిష్టాత్మకమైన “జవహర్ లాల్ నెహ్రూ” పురష్కారాన్ని అందించింది.
  • వైజాగ్ స్టీలు ప్లాంటులో అధునాతన సాంకేతిక అమలుకోసం రష్యా,యూరఫ్,దక్షిణకొరియా దేశాలకు వెళ్లిన ఇంజనీర్ల బృందానికి నాయకత్వం వహించి నందుకు “బెస్ట్ లీడరు ఆఫ్ ది మెన్” అవార్డు పొందాడు.
  • బోస్నియా  పరిశ్రమలో అత్యంత పటిష్టమైన ఉత్పత్తి వ్యవస్థను ప్రవేశపెట్టి నిర్వహించిన జగన్నాధం ఘనతను గుర్తించిన జపనీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంటు మేనేజ్ మెంటు నుంచి 2008లో "టి.పి.యం ఎక్సలెన్స్" అవార్డును పొందాడు.
  • జికిల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టరుగా అత్యత్తమ సేవలు అందించినందుకు 2010 లో ఆగ్నేయ యూరప్ లోని సి.ఇ.ఒ.లందరిలోను అత్యత్తముడుగా గుర్తింపు పొంది "యూరోపియన్ దేశాల ఉత్తమ సి.ఇ.ఒ." (“Best CEO of the European Countries”) అవార్డును పొందాడు.[1][2]

ఆ అవార్డు పొందిన సందర్బంగా జికిల్ మేనేజింగ్ డైరెక్టరుగా ది.15.12.2010న బోస్నియా,హెర్జిగోవినాలో Banski Dvor in Banja Luka నందు జరిగిన కార్యక్రమంలో ప్రసంగించాడు.[3]

సేవా కార్యక్రమాలు మార్చు

జగన్నాధం ఎక్కడ ఉన్నా తన వృత్తితో పాటు  అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాడు.విశాఖపట్నంలో పనిచేసిన కాలంలో అనాధ ఆశ్రమాలకు అన్నదాన కార్యక్రమాలు జరిపాడు. బోస్నియాలో “జికిల్” కంపెనీ యం.డి.గా పని చేసేటప్పడు  సమీప గ్రామాలలోని ప్రజల ఆకాంక్ష మేరకు సిమ్మింగ్ పూల్స్ నిర్మించాడు.పలు కంపెనీల నందు అనేక పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టాడు.అతనికి విద్యమీద ఉండే మక్కువతో విశాఖపట్నం (సంగివలస) నందు 2006 లో “అమేయ వరల్డ్ స్కూలు” ను స్థాపించాడు.

స్వగ్రామం పొనుగుపాడులో మంచి నీటికి ఇబ్బంది పడుచున్న ప్రజల కష్టాలు గమనించి,అతని తండ్రి పేరన "గుంటుపల్లి వెంకటేశ్వర్లు చారిటబుల్ ట్రష్టు" స్థాపించి, స్వంత నిధులు ఎనిమిది లక్షల వ్యయంతో మినరల్ వాటరు ప్లాంటు నిర్మించాడు.దాని ఫలితంగా లాభ నష్టాలు లేని పద్దతిపై గ్రామస్థులకు మంచి నీరు నిరంతరం అందుతుంది.తను చదివిన ప్రాథమిక,ఉన్నత పాఠశాలలలోని విద్యార్ధులకు విద్య మెరుగ్గా ఉండటానికి స్వంత ఖర్చుతో ట్యూటరును నియమించి, విద్యార్దుల మంచి భవిష్యత్తుకు తోడ్పడుచున్నాడు.గ్రామంలో జరిగే ప్రతి మంచి పనులలో ఇతని పాత్ర తప్పనిసరిగా ఉంటుంది.

స్వదేశానికి చేరిక. మార్చు

ఇతర దేశాలలో ఉండుటకు ఎన్నో అవకాశాలు ఉన్న జగన్నాధం తన స్వగ్రామంలో నివశించాలనే ఆశయంతో 2012లో స్వదేశానికి తిరిగి వచ్చి స్వగ్రామం పొనుగుపాడులో నివాసం ఉండుట విశేషం.

మూలాలు. మార్చు

  1. "JAGANNADHAM GUNTUPALLI THE BEST MANAGER FOR 2010". Archived from the original on 2020-08-08. Retrieved 2017-09-23.
  2. "Jagannadham Guntupalli (MD of GIKIL) is reciving award for The Best Manager in BiH for 2010".
  3. "Speech of Guntupalli Jagannadham (MD of GIKIL - The Best Manager in BiH for 2010)".

వెలుపలి లింకులు. మార్చు