గుమ్మా వీరన్న ప్రముఖ హేతువాది. కర్నూలు జిల్లా నాగలదిన్నె గ్రామంలో 1952 మే 22 వ తారీకున గుమ్మా నరసమ్మ, గుమ్మా భద్రప్ప దంపతులకు జన్మించిన గుమ్మా వీరన్న ప్రాథమిక విద్యాభ్యాసం ఎమ్మిగనూరులో, ఉన్నత విద్య (ఎం.ఏ., ఎల్.ఎల్.బి) హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేశాడు. రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీస్ అండ్ అక్కౌంట్స్ శాఖలో అదనపు సంచాలకుడిగా పనిచేసి 2010 మే మాసంలో పదవీ విరమణ చేశాడు.

గుమ్మా వీరన్న వర్ణ చిత్రం

ఎం.ఎన్ రాయ్, రావిపూడి వెంకటాద్రి రచనలు చదవగా హేతువాద ఉద్యమం పట్ల వీరన్నకు ఆసక్తి కలిగింది. గుమ్మా వీరన్న 1984 ఫిబ్రవరి 26 న గుడివాడలో లక్ష్మిని కులాంతర వివాహం చేసుకొన్నాడు. ఈ వివాహం హేతువాద పద్ధతిలో జరిగింది. తొలుత కమ్యూనిస్టు ఉద్యమానికి ఆకర్షితుడైనా తరువాతి దశలో 1980 నుంచి హేతువాద, మానవవాద ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు.

2008 వ సంవత్సరంలో హేతువాద భావ ప్రచారంలో చేసిన కృషికి గుర్తింపుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు కవిరాజు త్రిపురనేని రామస్వామి ధర్మనిధి పురస్కారాన్ని అందచేశారు. వీరన్న హేతువాదే కాకుండా రచయిత కూడా. గుమ్మా వీరన్న హేతువాద, మానవవాద తత్వాలపై, ఇతర విషయాలపై పలు పుస్తకాలు రచించాడు.

  1. హేతువాదం -భావవిప్లవం (1984)
  2. హేతువాదం - మార్క్సిజం (1987 )
  3. నవ్యమానవవాదమీనాటి బాట (1996)
  4. స్వేచ్ఛ (2001)
  5. రాడికల్ హ్యూమనిజం (2005 - తార్కుండే పుస్తకానికి అనువాదం -తెలుగు అకాడమీ, హైదరాబాదు)
  6. హేతువాదం - స్వరూప స్వభావాలు (2007)
  7. భారతీయ సంస్కృతి - తత్వం (2008 పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం)
  8. మానవజాతికి మతమెందుకు? (2010 - Why Religion for Humankind? -Kottapalli Wilson పుస్తకానికి ఆనువాదం)
  9. హేతువాదం: అపోహలు అపార్థాలు (2012)
  10. ఆంధ్ర ప్రదేశ్ లో హేతువాద మానవవాద ఉద్యమాల చరిత్ర (ఇన్నయ్య ఆంగ్ల రచనకు తెలుగు అనువాదం - హేతువాది మాసపత్రికలో ప్రచురితం)

ప్రస్తుతం గుమ్మా వీరన్న భారత హేతువాద సంఘానికి ఉపాధ్యాక్షుడిగాను, ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘానికి అధ్యక్షుడిగాను కొనసాగుతున్నాడు.