గురజాడ శ్రీరామమూర్తి
గురజాడ శ్రీరామమూర్తి (1851 - 1899) ప్రముఖ తెలుగు రచయిత, కవి, పత్రికా సంపాదకులు. శ్రీరామమూర్తి గారి 'కవిజీవితములు ' చరిత్రలో నొక కనక ఘట్టము.
గురజాడ శ్రీరామమూర్తి | |
---|---|
జననం | 1851 |
మరణం | 1899 |
వృత్తి | రచయిత, సంపాదకులు |
తల్లిదండ్రులు |
|
వీరు నియోగిశాఖీయ బ్రాహ్మణులు. వీరి తండ్రి: దుర్గప్రసాదరావు. నివాసము: కాకినాడ, విజయనగరము. వీరు "రాజయోగి" అను పత్రికా సంపాదకత్వమును నిర్వహించారు. విజయనగరము ప్రాంతములో వీరికి కాకినాడ పంతులని పేరు.
గురుజాడ శ్రీరామమూర్తి గారికి ముందు తెలుగులో కవిచరిత్రములు లేవు. వీరు ఆంగ్ల విద్యాధికులు కాబట్టి పాశ్చాత్య విద్వాంసులు రచించిన కవి జీవితములు చూచి అటువంటివి తెలుగుభాషలో రచించిరి. ఆంధ్ర కవి జీవితములు కథా ప్రధానమయిన గ్రంథము. అందు కవి కాల నిర్ణయాదుల కంటే నా యా కవులపై జెప్పుకొను పుక్కిటి పురాణము లెక్కువ. చారిత్రక దృష్టితో బరిశీలించిన నీ గ్రంథమునకు బ్రథమ స్థానము లేకున్నను గవి చారిత్రముల కిది మార్గదర్శి యనవలయును. కందుకూరి వీరేశలింగం పంతులు తమ 'కవులచరిత్ర ' లో మఱుగున నున్న కవులను బెక్కుమందిని బయట బెట్టి వారి వారి కాల నిర్ణయములు సప్రమాణముగా నొనరించి తత్తద్గ్రంథములలోని గుణ దోహములు వెల్లడించిరి. ఆ కారణమున వీరి కవి జీవితముల కంటె, వారి కవి చరిత్రములకు బెద్ద పేరు వచ్చింది. 1880 లో కవి జీవిత రచనము వీరిది సాగినది. రామ మూర్తి పంతులు గారి పీఠికలోని కొన్ని మాటలు పరికింప దగినవి.
కందుకూరి వీరేశలింగము గారు తమ మిత్రు లెవ్వరో తమ్ము గవి చరిత్రములు తిరుగ రచియించుటకు బ్రేరేపించినారని కవి చారిత్రము లను పేరితో నొక గ్రంథము ప్రాచీన కవులం గూర్చిన భాగమును ముద్రించి ప్రకటించిరి. అందు పెక్కండ్రు కవుల పేళ్ళును వారి చారిత్రములను 101 వ్రాసినట్లున్నను జాల భాగ మిదివఱలో నాచే బ్రకతింప బడిన కవి జీవితముల యర్థ సంగ్రహమే కాని వేఱు కాదు. ఏవియైన నొకటి రెండు కథలు నవీనముగా కాంపించుటకు జేర్పబడినను నవి యనవసరమైన చారిత్రములు గానైనను లేక ప్రత్యేకము కవిత్వ శైలిం జూపుటకు వ్రాయ బడిన పద్యములు నుదాహరణములుగా నైన నుండును.
రామమూర్తి పంతులు గారిది సువర్ణ విగ్రహము. విగ్రహమునకు తగిన గుణసంపత్తి. ఈయన 'మెట్రిక్యులేషన్ ' నేటి ఎం.ఏ లకు సమానము. వీరు కాకినాడ సబ్ కోర్టులో నుద్యోగించుచు రాజీనామానిచ్చి 1830 లో విజయనగర సంస్థానాధీశ్వరులు పూసపాటి ఆనంద గజపతి రాజు సన్నిధిని నిలయ విద్వాంసుడుగా నుండెను. ఆ ప్రభువున కీకవి యెడల జెప్పలేని యాదరము. 1897 లోఆనంద గజపతి నిర్యానము తరువాత రామమూర్తి గారిని సంస్థానము పోషించింది. వీరి కవి జీవితములు ఆనంద గజపతి పేరుగా వెలసి యున్నవి.
ఈయన చరిత్ర పరిశీలకుడే గాక కవి కూడను. 'మర్చంటు ఆఫ్ వినీస్ ' నాటకమును బరివర్తించిరి. ఓగిరాల జగన్నాధ కవిగారి యచ్చ తెనుగు నిఘంటువగు ఆంధ్ర పద పారిజాతమును కొన్ని పదములందు జేర్చి కూర్చి వీరచ్చుకొట్టించిరి. తిమ్మరుసు, బెండపూడి అన్న మంత్రి, ఆప్పయ దీక్షితులు ఈ ముగ్గురు మహామహుల చరిత్రములు సంపాదించి తెలుగువారికి అందించిరి. వీరు కాకినాడ నుండి వెలువరించిన రాజయోగి పత్రిక నాడు పేరుబడింది. గురజాడ శ్రీరామ మూర్తి గారు కొంతకాలం పెద్దాపురంలో నివసించారు ప్రబంధ కల్పవల్లి అనే మాస పత్రికను పెద్దాపురం నుండి ప్రచురించి వారి రచనలైన కవి జీవితములు, ఇతర వ్యాసాలను అందులో ప్రచురించేవారు
రచించిన గ్రంథాలు
మార్చు- 1. చిత్రరత్నాకరము [1]
- 2. కళాపూర్ణోదయ కథాసంగ్రహము
- 3. కవి జీవితములు
- 4. కలభాషిణి
- 5. తెనాలి రామకృష్ణుని కథలు
- 6. అప్పయదీక్షిత చారిత్రము
- 7. తిమ్మరుసు చారిత్రము - ఇత్యాదులు.
- 8. వైద్యనిఘంటిక పదపారిజాతము[2]
మూలాలు
మార్చు- ↑ శ్రీరామమూర్తి, గురజాడ. చిత్ర రత్నాకరము.
- ↑ https://ebooks.tirumala.org/read?id=681&title=Vaidyanaikantika%20padaparijathamu
- గురజాడ శ్రీరామమూర్తి, ఆంధ్ర రచయితలు, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, 1950, పేజీలు: 121-2.