గురువును మించిన శిష్యుడు

గురువును మించిన శిష్యుడు 1963 లో విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన జానపద కథా చిత్రం. ఇందులో గురువుగా ముక్కామల నటించగా, గురువును మించిన శిష్యుడిగా కాంతారావు నటించాడు. కృష్ణకుమారి కథానాయికగా నటించింది. ఇతర పాత్రలలో కైకాల సత్యనారాయణ, అంజిగాడు తదితరులు నటించారు.

గురువుని మించిన శిష్యుడు
(1963 తెలుగు సినిమా)

గురువును మించిన శిష్యుడు సినిమా పోస్టర్
దర్శకత్వం బి. విఠలాచార్య
తారాగణం కాంతారావు,
కృష్ణకుమారి
సంగీతం ఎస్.పి. కోదండపాణి
నిర్మాణ సంస్థ విఠల్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

సువర్ణగిరి సామ్రాజ్యాధీశుడైన ధర్మపాలుడికి (కైకాల సత్యనారాయణ) ఇద్దరు కుమారులు. అతని రాజ్యంపైకి కీర్తిసేనుడు (రాజనాల) దండెత్తి రాగా యుద్ధంలో పరాజయం తప్పదని తెలిసి ధర్మపాలుడు భార్యాబిడ్డలతో సహా అడవిలోకి పారిపోతాడు. అడవిలో కాళికా దేవిని ఆరాధించే కాలకేతుడు అనే ఒక మాంత్రికుడి (ముక్కామల) ఆశ్రమానికి వెళతారు. కాలకేతుడు తనకు సర్వలోకాధిపత్యం కావాలని కాళికాదేవిని కోరగా ఆమె సర్వలక్షణాలు కలిగిన ఓ రాజకుమారుడికి సర్వ విద్యలు నేర్పించి తన సమక్షానికి తీసుకురమ్మంటుంది. తన ఆశ్రమానికి వెళ్ళేసరికి అక్కడికి రాజకుమారులు విజేయుడు, అజేయుడు కనిపించేసరికి తన కోరిక నెరవేరబోతుందని ఆనందపడతాడు. రాజు తన బిడ్డలకు చదువు చెప్పించలేకపోతున్నానని బాధ పడుతుంటే కాలకేతుడు వారిద్దరికీ తాను విద్య నేర్పిస్తాననీ అందుకు ప్రతిఫలంగా తాను అడిగినప్పుడు వారిలో ఒకరిని తనకి అప్పగించమంటాడు. తన కుమారులు విద్యావంతులవుతున్నారని రాజదంపతులు అయిష్టంగానే అందుకు అంగీకరిస్తారు.

రాజదంపతులు వారిని వదిలి వెళ్ళగానే సర్వలక్షణాలు కలిగిన పెద్ద కుమారుడు విజేయుడికి అన్ని విద్యలు నేర్పడానికి నిర్ణయించి, చిన్న కుమారుడిని మాత్రం పశువుల కాపరిగా నియమిస్తాడు. ఇది చూసి మాంత్రికుడు శిష్యుడైన అనంతుడు బాధ పడతాడు. విజేయుడు పెరిగి పెద్దవాడై అన్ని కళలలోనూ ఆరితేరుతాడు. అప్పుడు అనంతుడు మాంత్రికుడు కుటిల ఆలోచనను విజేయుడికి తెలియజేస్తాడు. అప్పుడు విజయుడు కామరూపంలో తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి జరిగిన సంగతి గురించి చెబుతాడు. మరుసటి రోజు తన కుమారులను తీసుకెళ్ళడానికి రాజదంపతులు కాలకేతుని దగ్గరకు రాగా, కాలకేతుడు పశుల కాపరియైన అజేయుడిని విద్యావంతుడిగా, సకల విద్యా పారంగతుడైన విజేయుడిని పశుల కాపరిగా చూపించి ఎవరిని కావాలో కోరుకోమంటాడు. రాజ దంపతులకు ముందుగానే విషయం తెలిసి ఉండటం వలన వారు కాలకేతుడు ఎంత వారించిన విజేయుడనే ఎంచుకుంటారు. కాలకేతుడు చేసేదేమీ లేక అజేయుడిని కూడా అతని తల్లిదండ్రుల దగ్గరకే పంపించేస్తాడు.

తల్లిదండ్రుల వద్దకు వచ్చిన ఇద్దరు కుమారులు తమ రాజ్యం తిరిగి చేజిక్కించుకోవడానికి బయలు దేరతారు. తండ్రి గుర్రాల గురవయ్య దగ్గర దాచిపెట్టిన నగలు తీసుకోవాలని అతన్ని మోసం చేయడానికి విజేయుడు గుర్రం రూపం ధరించి, అజేయుడిని అతనికి ఇరవై వేల వరహాలకు అమ్మేయమంటాడు. అదే సమాయానికి కాలకేతుడు వచ్చి గుర్రం రూపంలో ఉన్న విజేయుడిని తీసుకుని తన గుహ కు తీసుకుని వెళ్ళి బలి ఇవ్వాలని చూస్తాడు. కానీ విజేయుడు తన చాతుర్యంతో గురువు నుంచి చిలుక రూపంలో తప్పించుకుని పారిపోతుంటే, గురువు వేసిన బాణం దెబ్బ తగులుతుంది. అప్పుడు కీర్తిసేనుని కుమార్తె అయిన పద్మావతి ఆ చిలుకకు సపర్యలు చేసి తన మందిరంలో పంజరంలో ఉంచుతుంది. ఆ చిలుక తెలివి రాగానే విజేయుడిగా మారి పద్మావతికి అసలు సంగతి తెలియజేస్తుంది. వారిద్దరూ ప్రేమలో పడతారు. మరోవైపు అజేయుడు ఒక దెయ్యాల గుంపును లోబరుచుకుని కీర్తిసేనుడి అన్నగారి కూతురును, అర్ధ రాజ్యాన్ని సంపాదిస్తాడు.

విజేయుడిని వెతుకుతున్న కాలకేతు కీర్తిసేనుడిని వశపరచుకోమని రత్నం, కళావతి అనే ఇద్దరిని ప్రేరేపించి వారిద్దరి ద్వారా ప్రజల దగ్గర నుండి అన్యాయంగా డబ్బు వసూలు చేస్తుంటారు. అజేయుడు అక్కడికి వచ్చి ఆ మోసాన్ని ఎండగడతాడు. అక్కడే తన అన్న విజేయుడు ఉన్న సంగతి కూడా తెలుస్తుంది. ఇద్దరూ కలిసి రత్నం, కళావతిలకు తగిన బుద్ధి చెబుతారు. అజేయుడు, లీలావతిల పెళ్ళికి అన్నగారిని, కూతురిని, విజేయుడినీ ఆహ్వానిస్తాడు. దారిలో పద్మావతి విజేయుడిని పరకాయ ప్రవేశ విద్య తన పెదనాన్న కోసం ప్రదర్శించ మంటుంది. అప్పుడు విజేయుడు తన శరీరాన్ని వదిలి పెట్టి అక్కడ చచ్చిపడి ఉన్న ఎలుగుబంటి లోకి ప్రవేశించగా అదే సమయానికి అక్కడికి వచ్చిన కాలకేతు తన శరీరాన్ని విడిచి విజేయుడి శరీరంలో ప్రవేశిస్తాడు. ఎలుగుబంటి రూపంలో ఉన్న విజేయుడు తిరిగి రాజ్యానికి వెళ్ళి తనవాళ్ళకి జరిగిన సంగతి చెబుతాడు. ఆ ఆపద నుంచి బయటపడటానికి రాజు గారి తరపున, రాణి గారి తరపున రెండు పొట్టేళ్ళ పందెం ఏర్పాటు చేయమంటాడు. విజేయుడు ఎలుగుబంటి శరీరంలో నుంచి ఒక చచ్చిన పొట్టేలు శరీరంలోకి ప్రవేశిస్తాడు. అది రాణి గారి తరపున పోరాడుతుంటుంది. రాజు గారి పొట్టేలు ఓడిపోవడం తట్టుకోలేక విజేయుడి శరీరంలో ఉన్న కాలకేతు ఆ పొట్టేలులో ప్రవేశించగా ఇదే అదనుగా విజేయుడు తన స్వశరీరంలోకి ప్రవేశిస్తాడు.

కీర్తిసేనుడి అన్న అజేయుడి పెళ్ళితోబాటు పద్మావతితో విజేయుడి పెళ్ళి చేయబోతుండగా వారు ఇద్దరు ధర్మపాలుడి పుత్రులని తెలుసుకుని అడ్డుకుని విజేయుడితో యుద్ధం చేసి ఓడిపోతాడు. చివరికి విజేయుడు పరాక్రమవంతుడని ఒప్పుకొని అతనికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయడానికి ఒప్పుకుంటాడు. అదే సమయానికి వచ్చి తనను మోసం చేసావని కాలకేతుడు విజేయుడితో యుద్ధానికి దిగుతాడు. కానీ విజేయుడి చేతిలో ఓడిపోయి అతన్ని గురువును మించిన శిష్యుడిగా గుర్తించి దంపతులను ఆశీర్వదించి హిమాలయాలకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోవడంతో కథ ముగుస్తుంది.

తారాగణం

మార్చు

పాటలు

మార్చు
  1. ఏదివ్య లోకాల ఏలేటి దేవతో అవనిపై (పద్యాలు) - పి.బి. శ్రీనివాస్
  2. ఏడేడు జన్మలనుండి పడివుంది బ్రహ్మముడి - పి.బి.శ్రీనివాస్, పి.సుశీల, రచన: జి కృష్ణమూర్తి
  3. తుమ్మెదలు కొమ్మల ఝుమ్మని ముగె కమ్మని చిరు తెమ్మెర - పి.సుశీల బృందం, రచన: జి కృష్ణమూర్తి
  4. పూవులు పూయును పదివేలు భగవానుని మెడలో - ఎస్.జానకి, రచన: జి. కృష్ణమూర్తి
  5. బలె బలె బలె బలె హిరణ్యకశపుడరా నిన్ను ఇరచుక - మాధవపెద్ది, స్వర్ణలత, రచన: జి కృష్ణమూర్తి
  6. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా - మాధవపెద్ది, ఎస్.జానకి, పి.బి. శ్రీనివాస్, రచన: జి కృష్ణమూర్తి
  7. వెన్నెల్లో కనుగీటే తారకా వినవే కన్నెమనసు కరిగించే కోరిక - ఎస్.జానకి, రచన: జి. కృష్ణమూర్తి.

[1]

మూలాలు

మార్చు
  1. డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

బయటి లింకులు

మార్చు