గూడ అంజయ్య (1955 - జూన్ 21, 2016) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ గేయ కవి, కథా రచయిత.[1]

గూడ అంజయ్య

జీవిత విశేషాలు

మార్చు

లక్ష్మమ్మ, లక్ష్మయ్య దంపతులకు 1955లో ఆదిలాబాద్ జిల్లా, దండేపల్లి మండలం, లింగాపురం గ్రామంలో అంజయ్య జన్మించాడు. ఆయనకు ఐదుగురు సహోదరులున్నారు. ఆయన ప్రాథమిక విద్యను లింగాపురం గ్రామంలో చదివారు.ఇంటర్మీడియట్ వరకు లక్సెట్టిపేటలో చదివిన ఆయన.. తర్వాత హైదరాబాద్ లో బీ ఫార్మసీ పూర్తి చేశారు. ఫార్మసిస్టుగా కూడా పనిచేశారు.

రచనా ప్రస్థానం

మార్చు

నలభై ఏళ్లుగా కవిగా, రచయితగా ఎన్నో కథలు, పాటలు రాసిన అంజయ్య కలకాలం నిలిచిపోయే పాటలు రాశాడు. వీటన్నింటికి తోడు సినిమాల్లో పాటలు రాసిన తర్వాత తెలుగు నేల నలుమూలలా ఆబాలగోపాలం అందరి నోళ్లలో నానుతున్నాడు. వృత్తిరీత్యా హైదరాబాద్‌లో ఫార్మసిస్ట్‌గా పనిచేశాడు. ఆయన పక్షవాతం వ్యాధితో బాధపడుతున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం వైద్యం చేయడానికి ముందుకు వచ్చింది.[2] ఆయన వ్రాసిన "ఊరు మనదిరా" పాట 16 భాషలలో అనువాదమయింది. ఆయన తెలంగాణ సాంస్కృతిక సంఘ నాయకునిగా పనిచేసాడు.

పల్లెలో పుట్టి పెరిగారు కాబట్టే.. ఆ వాతావరణం.. అక్కడి పరిస్థితులే ఆయన పాటలకు ప్రాణమయ్యాయి. పేదల కన్నీళ్లే ఆయన కలంలో సిరా అయ్యాయి. వారి గోసను ప్రపంచానికి చాటి చెప్పాయి. అందుకే ప్రజా కవుల్లో గూడ అంజయ్యది ప్రత్యేక స్థానం. ఆయన ఎవరికి అందని సాహితీ శిఖరం.

బడికి పోతున్న సమయంలో దారినపోతున్న ఒక రైతును పలకరించగా ఊరిడిసి పోవన్నా..ఉరిపెట్టుకోవన్నా... అన్న మాటలే తన తొలి పాటకు అన్న ప్రాసన చేశాయని..తను కళ్లారా చూసిన కష్టాలకు, వాటిని అనుభవిస్తున్న వారి నోట వచ్చిన మాటల స్ఫూర్తిగా పాటలల్లడం తనకు బాల్యంలోనే అబ్బిన విద్య అని అసలేని వానల్ల ముసలెడ్లు కుట్టుకొని.. అనే ఆయన తొలిపాట పుట్టుకకు నేపథ్యం అదేనని అంజయ్య ప్రతి సభలోనే చెప్పేవాడు.

చిరుత ప్రాయమునాడే అన్సన్నివేశం బాధ కలిగిస్తే ముందుగా తానే ఏడుస్తారు. అందుకే ఆయన పాటలు ప్రజల గుండెలను అంతలా హత్తుకుంటాయి.

కేవలం ప్రజా సమస్యలే కాదు.. తెలంగాణ పోరాటంలోనూ గూడ అంజయ్య కీలక పాత్ర పోషించారు. తొలి దశ ఉద్యమంలో అనేక ఆందోళనల్లో పాల్గొన్నారు. 1975లో ఎమర్జెన్సీ టైంలో తెలంగాణ నినాదంతో ముందుకెళ్లడంతో.. జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది. అయినా ప్రజా ఉద్యమ బాటను వీడలేదు. మలిదశ ఉద్యమంలోనూ తనవంతు పాత్ర పోషించారు అంజయ్య. పాటలతో ఉద్యమానికి ప్రాణం పోశారు. రసమయి బాలకిషన్ తో కలిసి ధూం…ధాం.. ప్రారంభించి ఉద్యమానికి కొత్త శక్తినిచ్చారు. అయ్యోనివా.. అవ్వోనివా అంటూ వలస పాలకులను ప్రశ్నిస్తూ.. ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా అంటూ యువతలో పోరాట స్పూర్తిని నింపారు. దళితులపై కొనసాగుతున్న వివక్షపైనా పోరాటం చేశారు అంజయ్య. నట్టు చిన్న వయస్సులోనే జనం కష్టాలకు అక్షర రూపమిచ్చారు. అంటే అప్పటికే ఆయన సమాజాన్ని ఎంత లోతుగా అర్థం చేసుకున్నారో దీన్ని తెలుసుకోవచ్చు. ఆ రోజుల్లో ఊళ్లో వడ్డీ వ్యాపారుల అకృత్యాలకు బలైన ఓ పెద్దాయన చెప్పిన మాటలను… పాటగా మార్చి రచనారంగంలో తొలి అడుగేశారు అంజయ్య. ఏదో పాట రాయాలని రాసే వ్యక్తి కాదు గూడ అంజయ్య. పరిస్థితిని, సంఘటనను ముందుగా తాను ఫీల్ అయ్యి రాసే వ్యక్తి. జనం బాధను తన బాధగా భావించే సాహితీవేత్త అంజయ్య. ఆయన పాట సజీవమైనది. వారిపైన జరుగుతున్న దాడులను ప్రశ్నించారు. అంజయ్య పాటలు మనసును హత్తుకోవడమే కాదు.. ఆలోచన రేకెత్తిస్తాయి. అందుకే.. జీవిత సత్యాలు తెలియకుంటే పాటలు రాయలేమంటారు అంజయ్య.

అదీలా బాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో విప్లవోద్యమ నిర్మాణం జరుగుతున్న సమయంలో ఈ పెత్తందార్ల పాలనలో పీడిత జనానికి విముక్తి లేదని, జన ఐక్యతతో ప్రజోద్యమాల ద్వారా శ్రామిక రాజ్యం స్థాపించడమే ఏకైక మార్గమని నమ్మి ఉద్యమ బాటలో పయనించాడు. ఉన్నత చదువులకోసం హైదరాబాద్‌ హాస్టల్‌కు మకాం మార్చిన అంజన్నకు ప్రపంచ ఉద్యమాల పరిచయం ఏర్పడింది. తనలాగే జనం కోసం పాకులాడే వారు హైదరాబాద్‌లో చాలామంది ఉన్నారని తెలుసుకున్న అంజయ్య వారందరిని కలుపుకున్నాడు. అరుణోదయ సాంస్కృతిక సంస్థను స్థాపించి జనంనోట విన్న పదాలనే పాటలుగా రాసి బాణీలు కట్టి తెలుగురాష్ర్టం మెత్తం తిరుగుతూ ప్రజల నుండి నేర్చుకుంటూ, ప్రజల ఆలోచనల్లో మార్పుకోసం తన పాటల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించాడు.

మహాకవి శ్రీశ్రీతో అనేక సభల్లో పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి, అరుణోదయ కళాసంస్థల ద్వారా తన గళాన్ని ప్రపంచానికి వినిపించారు. తెలంగాణ సాంస్కృతిక సంఘ నాయకుడిగాకూడా పనిచేశారు. పలు సినిమాల్లోనూ నటించారు. అవార్డుల కోసం ఏనాడు పాట రాయలేదంటారాయన. కేవలం పేదోడికోసమే తన పాటను అంకితం చేశానని ధైర్యంగా చెబుతారు. వచ్చిన అవార్డులతోనే సంతృప్తి చెందారు. జనంలోంచి వచ్చిన జానపదమే తన ప్రాణపాదమని నమ్మి… చివరివరకు అదే మాటపై ఉన్నారు. 1988 రజనీ తెలుగు సాహితీ సమితి అవార్డు, 1986లో సాహిత్య రత్న బంధు, 2000 లో గండె పెండేరా బిరుదుతో సత్కారం, 2004లో నవ్య సాహిత్య పరిషత్ నుంచి డాక్టర్ మలయశ్రీ సాహితీ అవార్డు అంజయ్యను వరించాయి. 2015లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాహితీ పురస్కారంతో సత్కరించింది. 2015లో సుద్దాల హన్మంతు-జానకమ్మ స్మారక పురస్కారాన్ని అందుకున్నారు.

కొంతకాలంగా కామెర్లు, మూత్రపిండాల వ్యాధితో బాధపడిన ఆయన జూన్ 21, 2016 రంగారెడ్డి జిల్లా రాగన్నగూడలోని స్వగృహంలో ప్రాణాలు విడిచాడు.

  1. పొలిమేర (నవల)
  2. దళిత కథలు (కథా సంపుటి)

జనబాహుళ్యం పొందిన కొన్ని పాటలు

మార్చు
  • నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు
  • జర భద్రం కొడుకో కొడుకో కొమరన్న
  • ఊరు మనదిరా ఈ వాడ మనదిరా
  • అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా?
  • రాజిగా ఓరి రాజిగా
  • ఇగ ఎగబడుదాంరో ఎములాడ రాజన్న
  • లచ్చులో లచ్చన్న.. ఈ లుచ్చాగాళ్ళ రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే
  • అసలేటి వానల్లో ముసలెడ్లు గట్టుకుని
  • గజ్జలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న
  • తెలంగాణ గట్టుమీద సందమామయ్యో

పొందిన అవార్డులు

మార్చు
  1. 1988లో రజనీ తెలుగు సాహితీ సమితి నుంచి అవార్డు
  2. 1988లో సాహిత్య రత్న బిరుదు
  3. 2000లో గండెపెండేరా బిరుదు
  4. 2004లో నవ్య సాహిత్య పరిషత్ నుంచి డాక్టర్ మలయశ్రీ సాహితీ అవార్డు
  5. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు - 2015 అవార్డు - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2015 జూన్ 2

మూలాలు

మార్చు
  1. Songs defined Telangana movement-ది హిందూ-02-06-2014
  2. Telangana State takes responsibility of ailing poet Guda Anjaiah-దక్కన్ క్రానికల్-13-10-2014
  3. "Books from Author: Guda Anjaiah-కినిగె.కాంలో పుస్తకాల వివరాలు". Archived from the original on 2016-03-04. Retrieved 2015-08-25.

ఇతర లింకులు

మార్చు