గొలగమూడి
గొలగమూడి , శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఇది ఒక పుణ్య క్షేత్రం. ఇది నెల్లూరు నుండి సుమారు 15 కి.మీ దూరంలో ఉంది. వెంకయ్యస్వామి ఇక్కడ కొలువైవున్న దైవం.ఇక్కడ వెంకయ్య అనే సిద్దుడు నివసించి మహాసమాధి చెందాడు. అతనిని వెంకయ్య స్వామి అని భక్తులు పూజించారు. ప్రతి శనివారం ఇక్కడ విశేష పూజ జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం స్వామి నిర్యాణం చెందిన రోజు ఆగస్టు 24 ను పురస్కరించుకొని ఆగస్టు 18-24 వారం రోజులు "ఆరాధన" ఉత్సవం జరుగుతుంది. అప్పుడు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన యాత్రా స్థానాలలో ఇది ఒకటి.[1][2] ఈ గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి ఆలయం కోనేటి దక్షిణం గట్టున, కాస్త దూరంలో ఉంది. 1951 లో ఈ గ్రామీణులు కాళిదాసు వెంకటసుబ్బాశాస్త్రి ప్రోత్సాహం, నాయకత్వంలో పాడుబడిన గుడి బాగుచేయించి, పూజారిని నియమించి నిత్యపూజ ఏర్పాటు చేశారు. గొలగమూడి మహిళ భూమిని గుడికి దానం చేసి నిత్యపూజకు సహకరించింది. క్రమంగా గుడికి తలుపులుపెట్టి, మరమత్తులుచేశారు, వసారా ఏర్పడ్డాయి.
గొలగమూడి | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 14°21′24″N 79°58′43″E / 14.35678°N 79.97869°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు |
మండలం | వెంకటాచలం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 524321 |
ఎస్.టి.డి కోడ్ | 0861 |
ఈ గ్రామదేవత గొలగమూడయ్య పేర ఈ ఊరు నెలకొల్పబడింది. [3] పల్నాటి యుద్ధంలో గొలగమూడయ్య అనే యాదవవీరుడు కాటమరాజు వైపున పోరాడి యుద్ధంలో అమరుడయ్యాడట. అతను మావూరివారంటే మావూరివారని రెండు ఊళ్ళవాళ్లు తగాదాపడి, కనుపర్తిపాడు గ్రామంవాళ్లు తలను, గొలగమూడి వాళ్ళు మొండాన్ని తీసుకొని వెళ్లారట. అందుకనే గొలగామూడయ్య మొండెం రూపంలో ఉన్న రాయిని గొలగమూడిలో పూజిస్తున్నారు గ్రామదేవతగా. గొలగమూడయ్య గుడి ఊరికి తూర్పున ఉంది. గుడి పూజారిగా సాధారణంగా, ముత్తరాశి, పల్లెకాపు,కంసాలి కులాలవాళ్లు వ్యవహరిస్తారు. కనుపర్తిపాడు నెల్లూరు నుంచి గొలగమూడి వెళ్లే రోడ్డులో 5వ మైలు రాయివద్ద చీలి, ఎడమవయిపు కిలొమీటరుదూరంలో ఉంది. ఆ వూరి అంచున, కొత్తకాలువ లేక సర్వేపల్లి కాలువ వద్ద గొలగామూడయ్య గుడివుంది. ఇప్పుడు గొలగమూడిలో వలె ఈ గుడిలో పూజలు జరుగుతోన్నట్లులేదు.
పూర్వం గొలగమూడి మీదుగా దండుబాట ఉండేది. గొలగమూడి ఊరికి పడమర, అనికేపల్లి వెళ్లే రోడ్డుకు ఆనుకొని ఒక త్రాగునీరు గుంట ఉంది. బాటసారుల సౌకర్యంకోసం ఒక ధర్మాత్ముడు కోనేరును తవ్వించాడు. 30 సంవత్సరాలక్రితం వరకు ఇదే గొలగమూడి ప్రజలకు త్రాగునీటి ఆధారం. యాభయి ఏళ్ళ క్రితం వరకు గ్రామీణులు, కావళ్లతో ఆ గుంటలోని నీరు ముంచుకొని తీసుకొని పోయేవారు. ఆ ఊరివారు ఆ జలాధారాన్ని కోనేరని అనేవారు. బొమ్మిశెట్టి అనే ఆయనో, ఆ కుటుంబంలో అన్నదమ్ములో ఈ కోనేరును, సర్వేపల్లిలో ఒక చిన్న కోనేరునును, వెంకటగిరిలో, నాయుడుపేట దొరవారి సత్రం వద్ద ఒక కోనేరులను త్రవ్వించినట్లు జనశ్రుతి. బొమ్మిశెట్టి బలిజ కులస్తులని, కాదు వైశ్యులని రెండు రకాలుగా కథనాలు వ్యాప్తిలో ఉన్నాయి. 1975 వరకు వెంకటగిరిలో ఆ గుంట మొత్తం ఊరికి త్రాగునీటికి ఆధారం. గొలగమూడి కోనేరు ప్రక్కగా దండుబాట సాగేది. అందువల్ల ఆ దారిని వెళ్లే యాత్రికులకు ఈ కోనేరు దాహార్తిని తీర్చేది.1850 ప్రాంతంలో గొలగమూడికి దక్షిణంగా సర్వేపల్లి కాలువ త్రవ్వబడింది.
గొలగమూడి గ్రామంలో కోనేటి దక్షిణం గట్టున, కాస్త దూరంలో ఆంజనేయస్వామి గుడిఉంది. 1951లో గ్రామీణులు కాళిదాసు వెంకటసుబ్బాశాస్త్రి ప్రోత్సాహం, నాయకత్వంలో పాడుబడిన గుడి బాగుచేయించి పూజారిని నియమించి నిత్యపూజ ఏర్పాటు చేశారు.
ఇప్పుడు వెంకయ్యస్వామి ఆశ్రమం నిర్వహణలో కోనేరు చుట్టు ముళ్లకంచె ఏర్పరచి ఆ నీరు కలుషితం కాకుండా జాగ్రత్త చేశారు. గొలగమూడి ఊరులో బావులు త్రవ్వితే మంచి నీళ్లు పడలేదు. ఇప్పడు వెంకయ్యస్వామి ఆశ్రమ నిర్వాహకులు కుంట ఎగువన ఉన్న ఓటిచెరువునుంచి నీరు తోడి పైపులద్వారా ఊరికి సరఫరా చేస్తున్నారు.
గొలగమూడి పూర్వం ఇప్పుడు ఉన్న స్థలంలో కాకుండా అనికేపల్లి రోడ్డుకు ఎగువన ఉండేదట. పెన్నకాలువ లేదా సర్వేపల్లి కాలువను 1850 ప్రాంతంలో తవ్విన తర్వాత, కంపెనీ అధికారులు ఊరిపక్కగా పెన్నానది కాలువ సాగుతుంది కనక మనుషులకు, పశువులకు పెన్నానది జలాలు అందుబాటులో ఉంటాయనే ఆలోచనతో పాత ఊరును ఇప్పుడుఉన్న స్థలానికి మార్పించారట.1950 ప్రాంతాల్లో గొలగమూడిలో దొమ్మరి తదితర కులాలవారికి ప్రభుత్వం ఇళ్ళు కట్టించి ఇచ్చింది. వాళ్ళకోసం సగంలో స్కూలు నెలకొల్పింది.
ఊరికి కిలో మీటరు దూరంలో "మాలవాడ, మాదిగవాడ", ఎరుకల నివాసాలు ఉన్నాయి. గొలగమూడిలో ఇప్పడు చాలా విద్యాసంస్థలు నెలకొల్పబడ్డవి. వెంకయ్య స్వామి ఆశ్రమ నిర్వాహకులు ఎటువంటి వివక్ష లేకుండా మగపిల్లలకు ప్రాథమిక పాఠశాల, హైస్కూల్ నిర్వహిస్తున్నారు. ఇది కాక ఇతర ప్రభుత్వ పాఠశాలలు ఇక్కడ ఉన్నాయి.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ admin (2020-12-23). "Golagamudi Venkaiah Swamy Temple Nellore | Nellore Famous Temples". Vihara Darshani. Retrieved 2023-01-25.
- ↑ "About - SSV Temple". saivenkaiah.org. Retrieved 2023-01-25.
- ↑ Comments, రచన: డా కాళిదాసు పురుషోత్తం ఇతర రచనలు on: No (2021-06-27). "జ్ఞాపకాల తరంగిణి-1". సంచిక - తెలుగు సాహిత్య వేదిక. Retrieved 2023-01-25.
వెలుపలి లంకెలు
మార్చు- శ్రీ స్వామి సచ్చరిత్ర(భగవాన్ వెంకయ్యస్వామి జీవితం, తోలిముద్రణ, 2011, రచయిత అల్లు భాస్కరరెడ్డి.