గొల్లభామ (సినిమా)
మీర్జాపురం రాజా శ్రీ శోభనాచల పిక్చర్స్ పతాకంపై గొల్లభామ చిత్రాన్ని నిర్మించాడు. కృష్ణవేణి, ఈలపాట రఘురామయ్య ఈ చిత్రంలోని ముఖ్య పాత్రధారులు.[1] ఇది అంజలీదేవి నటించిన తొలిచిత్రం. మధుర సుబ్బన్న దీక్షితులు తెలుగులో వ్రాసిన కాశీమజిలీ కథలు ఆధారంగా ఈ చిత్రం నిర్మించబడింది. తొలుత ఆర్.ఎస్.ప్రకాష్ దర్శకత్వంలో కొంత భాగం చిత్రీకరణ జరిపి, కారణాంతరాలవలన దాన్ని పక్కకు తీసిపెట్టి, తిరిగి మొత్తం చిత్రాన్ని సి.పుల్లయ్య దర్శకత్వంలో పూర్తిచేశారు. ఈ సినిమా 1947, ఫిబ్రవరి 22న విడుదలైంది.
గొల్లభామ (1947 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | చిత్తజల్లు పుల్లయ్య |
---|---|
తారాగణం | సి.కృష్ణవేణి, అంజలీ దేవి, దాసరి కోటిరత్నం, లీలాబాయి, సుందరమ్మ, గంగారత్నం, కల్యాణం రఘురామయ్య, రామిరెడ్డి, వెల్లంకి, తీగెల, రేలంగి, ఎ.వి.సుబ్బారావు, కోటీశ్వరరావు, కుంపట్ల, మల్లికార్జునరావు, కె.వి. సుబ్బారావు, రామమూర్తి |
సంగీతం | పి.ఆదినారాయణరావు |
ఛాయాగ్రహణం | కొట్నీస్ |
నిర్మాణ సంస్థ | శోభనాచల పిక్చర్స్ |
పంపిణీ | చామ్రియా టాకీస్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నటీనటులు
మార్చు- సి.కృష్ణవేణి - స్వయంప్రభ
- ఈలపాట రఘురామయ్య - యువరాజు
- అంజలీదేవి - మోహిని
- దాసరి కోటిరత్నం
- శ్రీరంజని (జూనియర్) - దేవకన్య
- లీలాబాయి
- సుందరమ్మ
- గంగారత్నం - వేశ్య
- రామిరెడ్డి
- వెల్లంకి
- తీగల
- రేలంగి - యువరాజు స్నేహితుడు
- ఎ.వి.సుబ్బారావు - కామపాలుడు
- కోటేశ్వరరావు
- మల్లికార్జునరావు
- కె.వి.సుబ్బారావు
- నల్ల రామమూర్తి
సాంకేతికవర్గం
మార్చు- సంగీతం :ఎస్.బి.దినకర్ రావు
- ఛాయాగ్రహణం: కొట్నిస్
- కళ: శర్మ
కథ
మార్చుకాశీ వెళుతున్న మణిసిద్ధుడనే గురువు, గొల్లగోపన్నకు దారిలో కథలు చెబుతుంటాడు. ఓనాడు దారిలో గొల్లభామ తలపై కుండతో, పక్కన రాకుమారుడు గల శిల్పం అక్కడగల ఓ పద్యం చూసి, దీని కథను అడగటంతో చిత్రం ప్రారంభం ఆ పద్యం, కథకు ఆధారం.
‘'నృపతి చంపితిన్, మగడు భూరిభుజంగము చేత చచ్చే నే
నాపద చెంది చెంది ఉదయార్కుని పట్టణమేగి, వేశ్యనై
పాపము కట్టుకొంటి, అట పట్టి విటుండైరాగచూసి, సం
తాపము చెంది అగ్ని పడి దగ్ధముగా కిటు గొల్లభామనై
రుూ పని కొప్పుకొంటి నృపతీ వగపేటికి చల్లచిందినన్’’
దీని కథను గోపన్నకు ఇలా వివరించసాగాడు సిద్ధుడు. విక్రమపురి రాజ్యంలోని మహారాజు కామపాలుడు (ఎ.వి.సుబ్బారావు) ఒక గొల్లపడుచు (కృష్ణవేణి)ను చేపట్టాలని, అవకాశం కోసం చూసే స్త్రీలోలుడు. ఒకనాడు అడవిలో ఆమెను బలాత్కరించబోగా, అతని ఒరలోని కత్తితో అతన్ని ఆమె అంతం చేస్తుంది. ఆమెను బంధించబోయిన రాజభటుని నుంచి మరో దేశపు యువరాజు (రఘురామయ్య) ఆమెను కాపాడి, తన రాజ్యానికి తీసుకువెళ్లి, స్వయంప్రభ పేరుతో ఆమెకు సకల విద్యలు, చదువు, సంగీతం, నృత్యం, కత్తియుద్ధం మొదలైనవి నేర్పించి తన తల్లిదండ్రుల అనుమతితో ఆమెను వివాహం చేసుకుంటాడు.
ఒకనాడు తోటలో విహరిస్తున్న దంపతులను చూసి, స్వర్గంలోని మోహిని (అంజలీదేవి) యువరాజుపై మరులుగొంటుంది. పాముకాటుచే యువరాజును చంపించి, ఆ దేహాన్ని తనతో దేవలోకానికి తీసుకువెళుతుంది. అతనికి జీవం పోసి, తనను వరించమని కోరుతుంది. కాదంటే అతని భార్యను, వంశాన్ని నాశనం చేస్తాననటం, ఒక్క రాత్రి తన భార్యతో గడిపి ఆమెకు లొంగిపోతానని మాట ఇస్తాడు యువరాజు. ఆ ప్రకారం స్వర్గానికి వచ్చిన భార్యతో ఒక రేయి గడిపి, ఆ ఆనందంలో అక్కడ అమృతం దంపతులు సేవిస్తారు. తిరిగి మరునాడు భూలోకంలో రాణీవాసానికి వచ్చిన స్వయంప్రభ, భర్తను కలిసిన విషయం చెప్పినా ఎవరూ నమ్మరు. కొంతకాలానికి గర్భవతియైన ఆమెను అడవిలో వధించమని మహారాజు అనుజ్ఞ ఇవ్వటం, అమృతం సేవించిన కారణంగా ఆమెకు మరణం కలగకపోవడం, అక్కడనుంచి ఒక కోయగూడెంలో బాబును ప్రసవించి, అతడు దూరం కావడంతో ఉదయార్కుని పట్టణంలో ఓ వేశ్య ఇంట 18 సంవత్సరాలు గడుపుతుంది. ఆమె కొడుకు ఆ దేశ యువరాజుగా పెరుగుతాడు. ఆమె రూప లావణ్యాలు తగ్గకపోవటంతో, స్వయంప్రభను కలవాలని వెళ్లిన కుమారుని గుర్తించిన స్వయంప్రభ విచారంతో అక్కడినుండి వెళ్లి అడవిలో కార్చిచ్చుబడి ఒక గొల్లవానిచే కాపడబడి, వారింట ఆశ్రయం పొందుతుంది. దేవలోకంలో మోహిని, యువరాజుపై ప్రయోగించిన సృతిభంగం మందు కొన్నేళ్ళకి పనిచేయక, యువరాజు వేడికోలుపై మోహిని అతన్ని భూమికి పంపించివేస్తుంది. తల్లిదండ్రుల వద్దకు వచ్చిన యువరాజు, తన భార్య గురించి నిజం తెలియచేసి ఆమెకై వెదుకులాట మొదలుపెట్టి రాజ్యాలు తిరుగుతూ ఆమె వున్న గ్రామం చేరుకుంటాడు. ఆ గుర్రం ధాటికి చల్లనమ్మబోయిన ప్రభ కుండలు పగిలి చల్ల చిందగా, ఆమె నవ్వటం చూసి ప్రశ్నించిన యువరాజుకు తన కథను భూపతి భూపతి పద్యంగా వివరించటం, అది విన్న ఆమె భర్త, ఇంతలో అక్కడకు వచ్చిన ఆమె కుమారుడు నిజం తెలుసుకొని అందరూ ఏకం కావటంతో చిత్రం సుఖాంతమవుతుంది[2].
విశేషాలు
మార్చుఆ తరువాత 20 ఏళ్ళకు 1968లో ఇదే కథతో శేఖర్ ఫిలింస్ బేనర్‌పై ఎన్.టి.రామారావు, దేవిక జంటగా, విజయనిర్మల మోహినిగా ‘భామావిజయం’ పేరుతో చిత్రం రూపొందించారు. ఈ చిత్రానికి దర్శకుడు సి.పుల్లయ్యగారే కావడం విశేషం.
పాటల జాబితా
మార్చు1.ఇది ప్రేమ మధువుల గ్రోల మధురాతి,రచన: వెంపటి సదాశివ బ్రహ్మం, గానం.కల్యాణం రఘురామయ్య
2.ఉన్నావా లేవా కరుణింపగా, రచన: సదాశివ బ్రహ్మం, గానం.సి.కృష్ణవేణి
3.ఓహో ఓహో ఏమే నీ భాగ్యం, రచన:సదాశివ బ్రహ్మం, గానం.బృందం
4.గంగ గోవుపాలు గరిటనైన నేమి, (పద్యం ) రచన:సదాశివ బ్రహ్మం, గానం.రేలంగి వెంకట్రామయ్య
5.గొల్లడా పిల్లడా ఒకమాటు రారాల్లుడా, రచన: సదాశివ బ్రహ్మం, గానం.సి.కృష్ణవేణి బృందం
6.ధన్యతమము నాజన్మ ఓలలనా, రచన: సదాశివ బ్రహ్మం, గానం.కె.రఘురామయ్య
7.పొద్దొడిసింది రాయే ముద్దరాలా, రచన: సదాశివ బ్రహ్మం, గానం.సి.కృష్ణవేణి బృందం
8.ప్రియతమా ప్రియతమా ఆనందమాయే, రచన: సదాశివ బ్రహ్మం, గానం.కె.రఘురామయ్య, సి.కృష్ణవేణీ
9.ప్రేమసుధా మధుర కథా ఎవరెరుంగరోయీ, రచన:సదాశివ బ్రహ్మం, గానం.సి.కృష్ణవేణి, కె.రఘురామయ్య
10.భూపతి జంపితిన్ మగడు (పద్యం),రచన: మధుర సుబ్బన్న దీక్షితులు, గానం.సి.కృష్ణవేణి
11.రావోయి రావోయి ఈరేయి ఓ ప్రియతమా, రచన:సదాశివ బ్రహ్మం, గానం.సి.కృష్ణవేణీ
12.వద్దు వద్దంటే గుర్రాన్ని పట్టుకొని చెట్టునకు (బుర్రకథ), గానం.బృందం.
13.వలపు తేనీయలూలిన వనజ వీపు మధుర(పద్యం), గానం.కె.రఘురామయ్య
14.సందమామ అందమైన ఓ సందామామ, రచన: సదాశివ బ్రహ్మం, గానం.సి.కృష్ణవేణి, కె.రఘురామయ్య
15.హాయినిడేగా రుతుశోభ రుతశోభ, రచన: పి.ఆదినారాయణరావు, గానం.సి కృష్ణవేణి.
బయటి లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1948లోనే తెలుగు చిత్రాల నిర్మాణం తడిసి మోపడు - ఆంధ్రప్రభ మే 4, 2011[permanent dead link]
- ↑ "గొల్లభామ -సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి ఫ్లాష్ బ్యాక్ @ 50 ఆంధ్రభూమి దినపత్రిక 09-06-2018". Archived from the original on 2018-08-14. Retrieved 2018-10-27.
. 3.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.