గోలకొండ పత్రిక

నిౙాం తెలంగాణలో ప్రచురించబడ్డ తెలుగు పత్రిక
(గోల్కొండ పత్రిక నుండి దారిమార్పు చెందింది)

పౌరస్వేచ్ఛ అసలే లేని నియంతృత్వ నిజాం పాలనలో నిత్యమూ నిజాల్ని తెలిపేందుకు సురవరం ప్రతాపరెడ్డి 1926 మే 10వ తేదీన (ఉర్దూ కాలగణనం ప్రకారం తీర్ నెల మూడవ తేదీన) గోలకొండ పత్రిక[1]ను హైదరాబాదు నుండి 7000 రూపాయల పెట్టుబడితో ప్రారంభించాడు. సంపాదకుడిగా ఇతని పేరు లేనప్పటికి సంపాదకత్వం, నిర్వహణ, ప్రచురణ బాధ్యతలు అన్నీ ఇతనివే. తెలుగు చదివిన ఉప సంపాదకులు, ప్రూఫ్‌ చూసేవారు దొరకకపోవడం వల్ల ప్రతాపరెడ్డి, సంపాదకుల నుండి మేనేజర్‌గా, ఉప సంపాదకుడిగా, ఫ్రూఫ్‌ రీడర్‌గా, గుమాస్తాగా, ఛప్రాసీగా అన్నింటిని తన భుజస్కంధాలపై వేసుకొని, సవ్యసాచివలె బాధ్యతలను కొంతకాలం నిర్వహించాడు. 1939 ఆగస్టు నుంచి అధికారికంగా గోలకొండ పత్రికకు ఇరవై ఏళ్లు ఇతడే సంపాదకుడు. తెలుగు భాషోద్ధరణ, తెలుగు ప్రజల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యాలతో ఈ పత్రిక స్థాపింపబడింది. మొదట ఈ పత్రిక అర్ధవార పత్రికగా వెలువడింది. ప్రతి బుధవారం, శనివారం వెలువడేది. 31-07-1933 నుండి ఈ పత్రిక ప్రతి సోమవారము, గురువారము ప్రకటించబడేది. దీనికి కారణము మునుపటి సంచికలో ఇలా వివరించారు. "ఇది మొదలుకొని మా పత్రిక సోమ, గురువారములయందు ప్రకటింపబడును. నిజాం రాజ్యముతో ముఖ్య సంబంధము గలదగుటచే మా పత్రికాకార్యాలయమునకు ఆదివారమును మాని శుక్రవారము శెలవుగానేర్పరచుకొనుటచే మార్పు చేయవలసి వచ్చినది." 1930 నుండి పత్రిక మొదటి పేజీలో The First Telugu Bi-weekly in Andhra Desa, The only Telugu News Paper for H E H The Nizam's Dominions. (Hyderabad Dn)అని ప్రకటించేవారు. 1936 నుండి మొదటి పేజీతో పాటు చివరి పేజీలో కూడా పతాక శీర్షికను ప్రచురించారు. దానికి ఉర్దూ భాష ప్రాబల్యమే కారణము. 02-08-1937 నుండి ఇది తనను తాను జాతీయపత్రికగా అభివర్ణించుకొన్నది. 1947లో దినపత్రికగా మారింది. ఒక పత్రిక వ్యక్తి స్థాయి నుంచి వ్యవస్థ స్థాయికి ఎదిగింది గోలకొండ పత్రిక తోనే. గోలకొండ పత్రిక నిర్వహణకు గోల్కొండ పబ్లికేషన్స్ లిమిటెడ్ పేరుతో ఒక లిమిటెడ్ కంపెనీ ఏర్పడింది. డైరెక్టర్ల బోర్డుకు రాజా రామేశ్వరరావు అధ్యక్షుడైతే, మేనేజింగ్ డైరెక్టర్‌గా నూకల నరోత్తమరెడ్డి వ్యవహరించేవారు. తెలంగాణా పత్రికా ప్రస్థానంలో ఒక పత్రిక పరిశ్రమ స్థాయికి ఎదగటం అదే తొలిసారి. వార్తా పత్రిక అయినప్పటికీ ఇది చేసిన సాహిత్యసేవ, భాషాసేవ ఎనలేనిది.

గోలకొండ పత్రిక
వివిధ రకాలైన గోలకొండ పత్రిక పతాకశీర్షికలు
రకంప్రతి బుధవారం, శనివారం ద్వైవారపత్రిక/ప్రతి దినం దినపత్రిక
రూపం తీరుబ్రాడ్ షీట్
ప్రచురణకర్తసురవరం ప్రతాపరెడ్డి
సంపాదకులుసురవరం ప్రతాపరెడ్డి
స్థాపించినది1926, మే 10/1947 హైదరాబాదు
ముద్రణ నిలిపివేసినది1966 ఆగస్టు 22
కేంద్రంట్రూప్ బజార్, హైదరాబాదు

సంపాదకులు, ప్రచురణకర్తలు

మార్చు
కాలపరిధి సంపాదకుడు ప్రచురణకర్త
1926-27 సురవరం ప్రతాపరెడ్డి
1927-29 కె.బాలకృష్ణారెడ్డి
1929-39 కె.బాలకృష్ణారెడ్డి జి.రామకృష్ణారెడ్డి
1939-47 సురవరం ప్రతాపరెడ్డి జి.రామకృష్ణారెడ్డి
1947-66 నూకల నరోత్తమరెడ్డి నూకల నరోత్తమరెడ్డి

గమనిక: పత్రిక ప్రారంభం నుండి 1947 వరకు తన పేరు ఉన్నా, లేకున్నా, ఇతరుల పేరు ఉన్నా సురవరం ప్రతాపరెడ్డియే సంపాదకుడు, ప్రచురణకర్తా.

రచయితలు

మార్చు

గోలకొండ పత్రిక సమస్త జాతీయోద్యమాలను బలపరచింది. సంఘ సంస్కరణోద్యమాలకు బాసటగా నిలిచింది. ఎంతోమంది యువకులతో రచనలు చేయించింది. తొలిదశలో తగిన రచనలు లేవని సురవరం ప్రతాపరెడ్డి తనే వెర్రి వెంగళప్ప, గద్వాల సిద్ధాంతి, చిత్రగుప్త, భావకవి రామమూర్తి, శ్రీశకుమార్‌, యుగపతి వంటి మారుపేర్లతో వ్రాసేవాడు.[2] గోలకొండ పత్రిక ద్వారా ఖండవల్లి లక్ష్మీరంజనం, ఆదిరాజు వీరభద్రరావు, చెలమచెర్ల రంగాచార్యులు మొదలైన ఎందరో సాహితీవేత్తలు రూపొందారు.[3] కోదాటి నారాయణరావు ఈ పత్రికలోనే ప్రూఫ్‌రీడర్‌గా తన పాత్రికేయ వృత్తిని ప్రారంభించాడు. నరిశెట్టి ఇన్నయ్య ఈ పత్రికలో వ్యాసాలు వ్రాసేవాడు. కాళోజీ నారాయణరావు, కవికొండల వెంకటరావు, దూపాటి సంపత్కుమారాచార్య, శేషాద్రి రమణ కవులు, వనం వేంకటనరసింహారావు మొదలైనవారు ఈ పత్రికలో రచనలు చేసి ప్రసిద్ధులయ్యారు.

రచనలు

మార్చు

ఇది ముఖ్యంగా వార్తా పత్రిక అయినా ఇందులో కథలు,[4] పద్యఖండికలు, కవితలు, పుస్తక సమీక్షలు, వ్యాసాలు మొదలైన సాహిత్యాంశాలు ప్రచురింపబడినాయి. విలేకరిగా ఎదిరె చెన్నకేశవులు ఈ పత్రికకు వెన్నుదన్నుగా ఉన్నారు.

సంపాదకీయాలు

మార్చు

ఈ పత్రికలో సంపాదకీయాలు చాలా నిష్పాక్షికంగా ఉండేవి. ఇవి నిజాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించేవి. నిజాం ఆగ్రహించి సంపాదకీయాలు సమాచార శాఖ అనుమతితోనే ప్రచురించాలని నిబంధన పెట్టాడు. దాన్ని తిప్పికొడుతూ ప్రపంచ మేధావుల సూక్తులను సేకరించి సంపాదకీయానికి బదులుగా ప్రచురించాడు. అది మరింత సమస్యగా ఆనాటి ప్రభుత్వం భావించింది.

ఈ పత్రిక మొదట గ్రాంథిక భాష వాడినా, తరువాత వ్యవహారిక భాషను అవలంబించింది. నైజాము ప్రాంతము నుండి వెలువడిన పత్రిక కాబట్టి ఉర్దూ పదాలు అతి సామాన్యంగా ఈ పత్రికలో దర్శనమిచ్చేవి. ఉదా:- షికాయతు, జెనానా, మజహబి, అదాలతు, పౌజ్దారీ బల్దా మొదలైనవి.

అభిప్రాయాలు

మార్చు
  • ఈ పత్రికకు, ఆంధ్రులకు (వారు బయటి వారు కానీ, రాష్ట్రీయులు కానీ) అసాధారణమగు సంబంధం కలదు. సర్వకాలాలయందు, అనుకూలం కానట్టి వాతావరణంలోనూ, క్లిష్ట పరిస్థితులలోనూ కూడా ఈ పత్రిక నడపబడింది. అట్లున్నను మా పత్రికలలో అత్యగ్రస్థానం వహించిన మూడు నాలుగింటిలో దీనినొకదానినిగా చేసిన నిజాం రాష్ట్రాంధ్రుల సేవ ప్రశంసనీయం. సురవరం ప్రతాపరెడ్డిగారు, వారి సహచరులు పత్రికను సజీవముగా నుంచుటయే గాక ఉత్తమమైన స్థాయిలో దీనిని బాగుగా నడుపుతూ తద్వారా ఆంధ్రుల శక్తి సామర్థ్యాలకు ప్రోద్బలం కలిగించినందులకు, అన్ని విధాలా ఆంధ్రుల యొక్క గాఢమగు కృతజ్ఞతకు పాత్రులగుచున్నారు. - కోదాటి నారాయణరావు స్వీయచరిత్ర నారాయణీయము నుంచి.
  • గోలకొండ సంపాదకీయాలు అద్భుతం. నిజాం ప్రభుత్వానికి అది గుండెలో కుంపటి. అది పత్రిక మాత్రమే కాదు, మహా సంస్థ. గాఢాంధకారంలో ఉన్న కాంతిరేఖ గోలకొండ - దాశరథి కృష్ణమాచార్య యాత్రాస్మృతి నుండి.

మూలాలు

మార్చు
  1. సంపాదకుడు (1928-02-01). "గోలకొండపత్రిక". గోలకొండపత్రిక. సురవరం ప్రతాపరెడ్డి. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 20 January 2015.
  2. నాగసూరి, వేణుగోపాల్ (2014-08-25). "ఒదిగిన విలువల విల్లు సురవరం". ప్రజాశక్తి. Retrieved 20 January 2015.
  3. ఎస్వీ సత్యనారాయణ (27 May 2011). "జనచైతన్య దీపం - సురవరం". విశాలాంధ్ర దినపత్రిక. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 20 January 2015.
  4. "కథానిలయంలో కథలజాబితా". Archived from the original on 2016-03-10. Retrieved 2015-01-20.