కాళోజీ నారాయణరావు

ప్రజాకవి, తెలంగాణ ఉద్యమకారుడు

ప్రజాకవి రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ[1] (సెప్టెంబరు 9, 1914 - నవంబరు 13, 2002) "కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్న"గా సుపరిచితులు. అతను తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడతాడు. అతను రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం. కవిత్వం వ్రాసిన ప్రజాకవి. హక్కులడిగిన ప్రజల మనిషి. ఉద్యమం నడిపిన ప్రజావాది. మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి కాళోజి.[2] పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజి. నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా అతను తన కలం ఎత్తాడు.[3] అతను స్వాతంత్ర్యసమరయోధుడు, తెలంగాణా ఉద్యమకారుడు. అతను 1992లో భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ పొందాడు. అతని జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా చేసి గౌరవించింది.[4] వరంగల్ లో నెలకొన్న ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అతని పేరు పెట్టబడింది.[5] అలాగే హన్మకొండ పట్టణంలో కాళోజీ కళాక్షేత్రం నిర్మిస్తున్నారు.

కాళోజి నారాయణరావు
కాళోజీ నారాయణరావు చిత్రం
జననంసెప్టెంబర్ 9, 1914
కర్ణాటక
మరణంనవంబరు 13, 2002
వరంగల్, తెలంగాణ
ఇతర పేర్లుకాళోజి
ప్రసిద్ధిప్రజాకవి.,తెలుగు రచయిత
ఎత్తు1.75
బరువు51kg
భార్య / భర్తరుక్మిణిబాయి
పిల్లలురవికుమార్
తండ్రిరంగారావు
తల్లిరమాబాయమ్మ
సంతకం

తెలంగాణ తొలిపొద్దు కాళోజీ. ‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి-అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు.

జీవిత విశేషాలు

మార్చు

అతను 1914, సెప్టెంబరు 9 న (కర్ణాటక) రాష్ట్రం, బీజాపూర్ జిల్లా లోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించాడు. అతని తల్లి రమాబాయమ్మ, కన్నడిగుల ఆడపడుచు. తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్రీయుడు.

కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచాడు. రాజకీయ వ్యంగ్య కవిత్వం వ్రాయడంలో కాళోజీ దిట్ట. ‘నా గొడవ’ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తిగడించాడు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహం అతను గేయాల్లో రూపుకడతాయి. బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చిన కాళోజీ కుటుంబం మడికొండలో స్థిరపడింది.[6]

ప్రాథమిక విద్యానంతరం హైదరాబాదు పాతబస్తీలోని చౌమహల్ న్యాయపాఠశాలలో కొంతకాలం చదివిన కాళోజీ, అటు తరువాత సిటీ కాలేజీ లోనూ, హన్మకొండ లోని కాలేజియేట్ ఉన్నత పాఠశాల లోనూ చదువు కొనసాగించి మెట్రిక్యులేషను పూర్తిచేశాడు. 1939లో హైదరాబాదులో ఉన్నత న్యాయస్థానానికి అనుబంధంగా ఉన్న న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు. 1930 నుంచే కాళోజీ గ్రంథాలయోద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నాడు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ ఆకాంక్ష. సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలుశిక్ష అనుభవించాడు. నిజామాంధ్ర మహాసభ, హైదరాబాదు స్టేట్ కాంగ్రెసుతో కాళోజీ అనుబంధం విడదీయరానిది. 1940లో రుక్మిణీబాయితో వివాహం జరిగింది.[6] మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పి.వి.నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించాడు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకడు. రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945లో పరిషత్తు ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్యసాహసాలను అతను అభిమానులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు అతనికి నగర బహిష్కరణశిక్ష విధించారు. స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు, వారిని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర అనన్యం. 1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. 1958లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యాడు. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయగా, భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అంటూ "సామాన్యుడే నా దేవుడు" అని ప్రకటించిన కాళోజీ 2002 నవంబరు 13 న తుదిశ్వాస విడిచాడు. అతని మరణానంతరం అతను పార్థివ శరీరాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు అందజేసారు.[4]

వ్యక్తిగత జీవితం

మార్చు

కాళోజీ జన్మించిన అయిదారు నెలలకే రమాబాయమ్మ చనిపోవడంతో అన్నే అమ్మగా మారి తమ్ముడు కాళోజిని పెంచి పెద్దచేశాడు. అతని అన్న కాళోజీ రామేశ్వరరావు ఉర్దూ కవి. తమ్ముడికన్నా అన్న ఆరు సంవత్సరాలు పెద్ద. కాళోజీ రామేశ్వరరావు ‘షాద్’ పేరుతో ఉర్దూ కవిత్వం రాశాడు. తమ్ముడి హైపర్‌యాక్టివ్‌తనం వల్ల అతని ప్రతిభ వెనకబడిపోయినా వాళ్లిద్దరూ అన్యోన్యంగా బతికారు. న్యాయ శాస్త్రం చదివుండీ కాళోజీ ఏనాడూ రూపాయి సంపాదించకపోయినా అతనే ఇల్లు గడుపుతూ వచ్చాడు. ఒకవిధంగా తండ్రి తర్వాత తండ్రిలా సాక్కుంటూ వచ్చాడు. 1996 లో రామేశ్వరరావు చనిపోయినప్పుడు, ‘నేను నా ఆరవయేట మా అన్న భుజాల మీదికెక్కినాను. అతను మరణించేదాకా దిగలేదు. నేను అతను భుజాల మీదికి ఎక్కడం గొప్ప కాదు. 70 ఏళ్ల వరకూ అతను నన్ను దించకుండా ఉండడం గొప్ప.’ అన్నాడు.[7]

రాజకీయ జీవితం

మార్చు

అతను ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా 1958 నుండి 1960 వరకు పనిచేసారు. రెండేళ్లు ఏ పార్టీకి చెందని స్వతంత్ర సభ్యుడిగా ఉన్నాడు. అతను "ఆంధ్ర సారస్వత పరిషత్" వ్యవస్థాపక సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీలో సభ్యుడు. అతను తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షునిగానూ, 1957-61 కాలంలో గ్లోసరీ కమిటీ సభ్యునిగానూ ఉన్నారు. 1977లో సత్తుపల్లి (ఖమ్మం జిల్లా) నుండి స్వతంత్ర అభ్యర్థిగా నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు పై పోటీ చేశాడు కానీ ఓడిపోయాడు.[8]

పురస్కారాలు, గౌరవాలు

మార్చు
 
కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో కాళోజీ నారాయణరావు సైకత శిల్పం
  • 1992 : పద్మవిభూషణ్ - భారత రెండవ అత్యున్నత పౌర పురస్కారం
  • 1972 : తామ్రపత్ర పురస్కారం.
  • 1968 : "జీవన గీత" రచనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే అనువాద పురస్కారం.
  • బూర్గుల రామకృష్ణారావు మెమోరియల్ మొదటి పురస్కారం.
  • ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంచే 1981లో సత్కారం.
  • "ప్రజాకవి" బిరుదు.
  • ఆంధ్రప్రదేశ్ లో అనేక సాహితీ సంఘాలచే సన్మానాలు.
  • రామినేని ఫౌండేషన్ అవార్డు[9]
  • గాడిచర్ల ఫౌండేషన్ అవార్డు
  • కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్ వారు 1992 లో డాక్టరేట్ ప్రధానం చేసారు.
  • 1996లో సహృదయ సాహితీ విశాఖ వారి గురజాడ అవార్డు.
  • 1996లో కళసాగర్ మద్రాస్ వారి విశిష్ట పురస్కారం.[10]

నిజాం జమానాల

మార్చు
  • తెలంగాణనిజాం జమానాల నెలకొన్న ఇబ్బందికర పరిస్థితులను సాహసికంగా ఎదిరించిండు.
  • ఆర్యసమాజ్ సభలు, ఊరేగింపులు, కాంగ్రెస్, కమ్యూనిస్టుల కార్యకలాపాలు, రచయితల సభలు, అన్నీ కాళోజి భాగం పంచినయి.
  • సహ యువకుల్ని చైతన్యంలకి మళ్లించేటోడు. గాంధీ అహింసామార్గాన్నే శిరసావహించినా అవసరాన్ని బట్టి ప్రతిహింసను కూడా ఆహ్వానించిండు.
  • నిజాంకు వ్యతిరేకంగా తీవ్ర స్వరంతో కవితలు రాసిండు. నిజాం దుష్కృత్యాల్ని తన సహజ శైలిల తూర్పారబట్టిండు.

రచనలు

మార్చు

అతను మరాఠీ, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో పండితుడు. ఎన్నో ఇతర భాషా గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు.[11][12]

  1. అణా కథలు
  2. నా భారతదేశయాత్ర
  3. పార్థివ వ్యయము
  4. కాళోజి కథలు
  5. నా గొడవ
  6. జీవన గీత
  7. తుదివిజయం మనది
  8. తెలంగాణ ఉద్యమ కవితలు
  9. ఇదీ నా గొడవ
  10. బాపూ!బాపూ!!బాపూ!!!
  11. 1943 లోనే అతను కథల్ని "కాళోజీ కథలు" పేరుతో అప్పట్లో హైదరాబాదులో ఆంధ్ర పబ్లిషింగ్ కంపెనీకి చెందిన అణాగ్రంథమాల సంస్థ తన పద్నాలుగో ప్రచురణగా ప్రచురించింది.

తెలంగాణా వాదం

మార్చు
  • నిజాం ఆగ్రహించి కాళోజికి వరంగల్ నగర బహిష్కారం విధించిండు. కాళోజి మరింత తీవ్రంగా అంకితభావంతో అక్షరం సంధించిండు. 1939 ల, 1943 ల రెండుసార్లు జైలుకి పోవాల్సివచ్చింది.
  • ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు పాములపర్తి సదాశివరావుతో కలిసి తెలంగాణా ప్రత్యేక సంచిక వెలువరించాడు. విశాలాంధ్ర కావాలనీ అన్నాడు. తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ప్రత్యేక తెలంగాణా కావాలనీ అన్నాడు.
  • ఆంధ్ర జనసంఘం, ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రమహాసభ, తెలంగాణ రచయితల సంఘం సంస్థల నిర్మాణలలో కాళోజి భాగం ఉంది.
  • పి.వి.నరసింహారావు లాంటి ఎందరికో అతను సాహిత్యంల, రాజకీయాల్లో మార్గదర్శనం చేశాడు.
  • విశాలాంధ్ర సమస్యలు గమనించి అతను 1969ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కలిశాడు.
  • అన్ని సందర్భాలల్లా అసలుసిసలైన తెలంగాణవాదిగా జీవించాడు.

ఉల్లేఖనలు

మార్చు
  • ఎవని వాడుక భాష వాడు రాయాలె. ఇట్ల రాస్తే అవతలోనికి తెలుస్తదా అని ముందర్నే మనమనుకునుడు, మనను మనం తక్కువ చేసుకున్నట్లె. ఈ బానిస భావన పోవాలె. నే నెన్నో సార్లు చెప్పిన. భాష రెండు తీర్లు - ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకు బడుల భాష. పలుకు బడుల భాషగావాలె. - కాళోజీ
  • తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు-సంకోచ పడియెదవు సంగతేమిటిరా? అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు-సకిలించు ఆంధ్రుడా! చావవేటికిరా - కాళోజీ
  • కాళోజీ నిఖిలాంధ్ర కవి. అందులో ఎట్టి సందేహం లేదు. అతనుకు తెలంగాణా అంచులు గోడలుగా అడ్డునిలువజాలవు. అతను తన ఖండకావ్య సంపుటానికి 'నా గొడవ' అని పేరు పెట్టాడు. అదే కవి ప్రతిభ. అదే కవి చెప్పవలసిందీను. ఇది కవి గొడవగానే అనిపించినప్పటికీ చదివిన వారికి ఇది తమ గొడవగానే అర్థమవుతుంది. ఇది విశాల జగత్తు ప్రజలందరి గొడవ - శ్రీశ్రీ
  • ఒక్క సిరాచుక్క లక్షల మెదళ్లకు కదలిక- కాళోజి
  • పుట్టుక నీది-చావు నీది-బతుకంతా దేశానిదీ --- జయప్రకాశ్ నారాయణ మరణించినపుడు కాళోజి

మూలాలు

మార్చు
  1. "Telangana Poet: Kaloji Narayana Rao History". TSO. Hyderabad. 8 September 2017. Archived from the original on 10 సెప్టెంబరు 2016. Retrieved 20 జనవరి 2018.
  2. "Kaloji Narayana Rao remembered on 103rd birth anniversary". The Hans India (in ఇంగ్లీష్). Retrieved 2018-01-20.
  3. స్వాతంత్ర్య సమర నిర్మాతలు, జి.వెంకటరావు, ఏ.పండరినాథ్, 1994 ప్రచురణ, పేజీ 58
  4. 4.0 4.1 "Kaloji Narayana Rao". etelangana.org (in ఇంగ్లీష్). Archived from the original on 2018-01-22. Retrieved 2018-01-20.
  5. "KNRUHS". knruhs.in (in ఇంగ్లీష్). Archived from the original on 2018-01-21. Retrieved 2018-01-20.
  6. 6.0 6.1 Jagadeesh (2014-09-15). "Kaloji Narayana Rao Biography | Aanimuthyalu". Archived from the original on 2020-02-25. Retrieved 2018-01-20.
  7. "వివరం: కాళోజీ గొడవ". Sakshi. 2013-09-08. Retrieved 2018-01-20.
  8. "Andhra Pradesh Assembly Election Results in 1978". www.elections.in. Retrieved 2018-01-20.
  9. జీవనరేఖలు - తాళ్లపల్లి మురళీధర గౌడ్ - 2005 - పేజీ 1
  10. "అన్యాయంపై ధిక్కారస్వరం కాళోజీ". Retrieved 2018-01-20.
  11. "KALOJI NARAYANARAO". Telanagana Express. Retrieved 2018-01-20.
  12. "Kaloji Narayana Rao – The Non-Violent Revolutionary Poet of Telangana". www.exploretelangana.com (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2017-07-20. Retrieved 2018-01-20.

బయటి లింకులు

మార్చు
 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.