గోవిందుని రామశాస్త్రి
గోవిందుని రామశాస్త్రి పాత్రికేయుడు. తెలుగు, ఇంగ్లీషు భాషల పత్రికల్లో సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించాడు. గోరాశాస్త్రి అనే పొట్టిపేరుతో పత్రికారంగంలో పేరుపొందాడు.
గోవిందుని రామశాస్త్రి | |
---|---|
మరణం | మే, 1982 |
ప్రసిద్ధి | నాటక రచయిత |
జీవిత విశేషాలు
మార్చుగోరాశాస్త్రి శ్రీకాకుళం జిల్లాలో పుట్టి, భద్రాచలం ప్రాంతంలో పెరిగాడు. బతుకుదెరువు కోసం విశాఖపట్టణంలో అనేక చిన్న ఉద్యోగాలు చేసి, చివరకు ఆనాటి రాజధాని మద్రాసు చేరాడు.
పాత్రికేయ ప్రస్థానం
మార్చుతన సహాధ్యాయి, మహంకాళి శ్రీరామమూర్తి సంపాదకత్వాన వెలువడిన ఆనందవాణి పత్రికలో వినాయకుడి వీణ పేరిట శీర్షికను నిర్వహించాడు.[1]
ఖాసా సుబ్బారావు ఇంగ్లీషు స్వతంత్రను, గోరాశాస్త్రి తెలుగు స్వతంత్రను మద్రాసు నుండి నడిపారు. "మద్రాసు మెయిల్ మాకు ప్రియబాంధవి" అంటుండేవారు గోరాశాస్త్రి. అప్పట్లో కలకత్తా నుండి మద్రాసుకు నడిచే మెయిల్ ద్వారా ఉత్తరాలు, వ్యాసాలూ అందుకునే వారు. మద్రాసులో వున్నందున 1950 ప్రాంతాల్లో తెలుగు రచయితలు, కవులు, కళాకారులతో గోరాశాస్త్రికి సన్నిహిత సంబంధాలుండేవి. ఆలిండియా రేడియోలో ఆయన నాటికలు ప్రసారమయ్యాయి. ఆశఖరీదు అణా అనేది బాగా ప్రచారంలోకి వచ్చిన నాటిక. తెలుగు స్వతంత్ర పత్రిక మంచి పేరు పొందింది. ఎందరో కవుల్ని రచయితల్ని గోరాశాస్త్రి ప్రోత్సహించారు. తెలుగు స్వతంత్ర చిన్న పెద్ద రచయితలకు ప్రోత్సాహకారిగా, భిన్నాభిప్రాయాల వేదికగా నిలిచింది. మద్రాసు సంస్కృతి, సంగీతం, మోర్ మార్కెట్ లో చౌకగా లభించే విదేశి సాహిత్య పత్రికలు, గోష్ఠులు, రచయితల ప్రవాసం అన్నీ గోరాశాస్త్రిని ఆకట్టుకున్నాయి. ఆయన సికింద్రాబాద్ లో స్థిరపడినా చివరి దాకా మద్రాసు అంటేనే అభిమానంగా వుండేవారు.
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత మిగిలిన పత్రికల వలె తెలుగు స్వతంత్రకూగడ్డుకాలం వచ్చింది. అప్పుడు హైదరాబాద్ మకాం మార్చి శ్రీదేవి (రచయిత్రి, డాక్టరు) సహకారంతో తెలుగు స్వతంత్ర నడిపారు. కాని అట్టేకాలం నడపలేక ఆపేశారు. 'కాలాతీత వ్యక్తులు' నవలరాసిన శ్రీదేవి చనిపోయారు.
శ్రీశ్రీ, రావిశాస్త్రి అంటే గోరాశాస్త్రికి యిష్టం. శ్రీశ్రీ అభిప్రాయాలతో గోరాశాస్త్రి ఎక్కడా అంగీకరించకపోయినా, మద్రాసు రోజులనుండే వారి స్నేహం అలాగే కొనసాగింది. శ్రీశ్రీ సమాచార తృష్ణ ఆయనకు బాగా నచ్చింది. రావిశాస్త్రి హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కలుస్తుండేవారు.
రాజకీయవాదులు అట్టే గోరాశాస్త్రి దగ్గరకు వచ్చేవారు కారు. ఆయన కూడా మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేసేవాడు కాదు. ఎప్పుడైనా ఒకసారి పి.వి.నరసింహారావును విద్యామంత్రిగా, ముఖ్యమంత్రిగా చూడకపోలేదు.
హైదరాబాద్ లో రేడియో చర్చలలో గోరాశాస్త్రి పాల్గొనేవారు. మద్రాసు నుండే ఆయన రేడియో నాటికల ప్రత్యేకత సాధించారు. "ఆశ ఖరీదు అణా" అనే కథ నుండి అనేకం పాఠకుల మన్ననలు పొందాయి. దిగంబర కవుల రచనలు గోరాశాస్త్రి విమర్శలకు గురయ్యాయి. అర్థరాత్రి నాంపల్లి స్టేషను వద్ద రిక్షాకూలితో ఆవిష్కరించిన తొలి పుస్తకాన్ని గోరాశాస్త్రి ఎద్దేవా చేసేవారు. జీరాలో గోరా అంటూ కమ్యూనిస్టు కవులు ఆయన్ను విమర్శించేవారు.
దేవులపల్లి కృష్ణశాస్త్రి కవిత్వాన్ని బాగా మెచ్చుకుంటూ, పోగారితనం ఆయన శిల్పంలో వుందనేవాడు. కాని వ్యక్తిగా కృష్ణశాస్త్రి అబద్ధాన్ని జీవించాడనేవాడు.
1970 ప్రాంతంలో నార్ల వెంకటేశ్వరరావు అన్నా,ఆయన సంపాదకీయాలన్నా గోరాశాస్త్రికి గిట్టేవికావు. మద్రాసు నుండే వారిరువురికీ సఖ్యతలేదు. ఖాసా సుబ్బారావు గొప్పతనం ఎన్నొవిధాల గోరాశాస్త్రి కొనియాడుతుండేవారు. టంగుటూరి ప్రకాశం జర్నలిజం గురించి కడుపుబ్బ నవ్వించే విశేషాలు చెప్పేవారు.
స్టీవెన్ స్పెండర్ ఆంగ్లకవిత్వం పట్ల గోరాశాస్త్రికి ప్రత్యేక మోజు వుండేది. గోరాశాస్త్రి సంపాదకీయాలలో కొన్ని, ఆయన నాటికలు,కథలు ఈతరం వారికి అందవలసివుంది. సి.ధర్మారావు గోరాశాస్త్రిగారికి అండగా నిలచి చివరివరకూ సహాయపడ్డాడు. డా||పి. తిరుమలరావు తన స్వీయ చరిత్ర కట్టలుగా రాసి, గోరాశాస్త్రి దగ్గర పడేసేవారు. ఆయన చిత్రికపట్టి, శైలిపెట్టి, నానాతిప్పలుపడి ఒక క్రమం సమకూర్చేవారు. ఆవిధంగా అనేకమంది గోరాశాస్త్రి సాహిత్యసేవ చేశారు.
ఆంధ్రభూమితో అనుబంధము
మార్చుగోరాశాస్త్రి ఆంధ్రభూమి ఎడిటర్ అయ్యారు. సికింద్రాబాద్ లోని జీరాలో అద్దె ఇంట్లో నివశిస్తూ, చివరివరకూ గడిపారు. కొందరు జర్నలిస్టుల వలె గోరాశాస్త్రి సంపాదనలో పడలేదు. ఆయనకు నిత్యమూ ఆర్థిక యిబ్బందులు వుండేవి. ముగ్గురు అమ్మాయిలు వుండగా పుత్రసంతానం లేదు. ఖర్చుబాగా వుండేది.
గోరాశాస్త్రి అభిప్రాయాలు, రాగద్వేషాలు బాగా ఘాటైనవి. కనుక ఒక పట్టాన ఆయనకు దగ్గరగా అందరూ వచ్చేవారు కారు. చర్చలలో నిర్మొహమాటంగా ఎత్తిపొడుపులు, ఖండవ మండనలు వుండేవి. ఆంధ్రభూమి సంపాదకుడుగా వున్నప్పుడు,డక్కన్ క్రానికల్ సంపాదకీయాలు రాయమని గోరాశాస్త్రిని యాజమాన్యం కోరింది. అది అదనపు పని,శ్రమతో కూడినవి అయినా ఆర్థిక యిబ్బందుల కారణంగా గోరాశాస్త్రి అంగికరించి ఇంగ్లీషు సంపాదకీయాలు రాసేవారు. ఒక్కోసారి అటు తెలుగు,ఇటు ఇంగ్లీషు సంపాదకీయం రాయడం సమయభావం వలన కష్టంగనుక, జి. ఎస్. వరదాచారికి, పొత్తూరి వెంకటేశ్వరరావుకు ఆ పని అప్పగించేవారు. సంపాదకీయాలు రాస్తున్న రోజులలో యించుమించు ప్రతిరోజూ సీతారాం (యునైటెడ్ న్యూస్ లో జర్నలిస్ట్)తో ఫోనులో సంప్రదిస్తుండేవారు. పదౌచిత్యం, సరైన అర్థంకోసం గోరాశాస్త్రి సరస ఫోను సంభాషణలు అప్పుడప్పుడు తిట్లవరకూ సాగేవి. గోరాశాస్త్రి రానురాను సంపాదకీయాలకే పరిమితమై మిగిలిన ఆఫీసు బాధ్యతలు ఇతరులకు అప్పగించేవారు.
ఈనాడు తో అనుబంధం
మార్చురామోజీరావు ఈనాడు పత్రిక పెట్టడానికి సంకల్పించినప్పుడు గోరాశాస్త్రిని సంప్రదించారు. హైదరాబాద్ అబిడ్స్ లో వున్న మార్గదర్శి కార్యాలయంలో చాలా పర్యాయాలు సాయంకాలాలలో యీ సమావేశాలు జరిగాయి. కొత్త పత్రిక ఎదుర్కోబోయే సమస్యలు,దినపత్రికల తీరుతెన్నులు,విదేశాలలో పత్రికల వ్యపహారం మొదలైన అంశాలు చర్చకు వచ్చేవి. గోరాశాస్త్రి తన అనుభవాల దృష్ట్యా రామోజీరావుతో అనేక అంశాలు చెప్పేవారు. ఆయన శ్రద్ధగా వినేవారు. ఆ సమావేశాలలో ఏర్పాటు కొంతకాలం సాగిన తరువాత 'ఈనాడు' వెలువడింది.
గోరాశాస్త్రి, గోరా
మార్చుగోరాశాస్త్రి, గోరా కు మధ్య ఎలాంటి సంబంధం లేదు. యిరువురూ ఒకరే అని కొందరు అనుకునేవారు. ఒకరికి రావలసిన ప్రశంసలు,తిట్లు మరొకరికి రావడమూ జరిగింది. విజయవాడలో నాస్తికోద్యమ నిర్మాతగా గోపరాజు రామచంద్రారావు తన పేరును గోరా అని క్లుప్తీకరించారు.
మూలాలు
మార్చు- ↑ టి, ఉదయవర్లు (20 Jul 2019). "గోరాశాస్త్రీయ బాణీలో వినాయకుడి వీణ". Archived from the original on 20 Jul 2019.
{{cite news}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 22 జూలై 2019 suggested (help)