చిటిమెళ్ళ బృందావనమ్మ
చిటిమెళ్ళ బృందావనమ్మ ప్రఖ్యాత విద్యావేత్త, సంఘసేవకురాలు, చిత్రకారిణి.[1]
చిటిమెళ్ళ బృందావనం | |
---|---|
జననం | వరంగల్లు, తెలంగాణ రాష్ట్రం | 1917 నవంబరు 8
మరణం | 2008 అక్టోబరు 8 హైదరాబాదు |
ప్రసిద్ధి | విద్యావేత్త, సంఘ సేవకురాలు, చిత్రకారిణి |
మతం | హిందూ |
తండ్రి | నరసింహమూర్తి |
తల్లి | ఈశ్వరమ్మ |
బాల్యము, విద్యాభ్యాసము
మార్చుఈమె 1917, నవంబర్ 8న వరంగల్లు పట్టణంలో నరసింహమూర్తి, ఈశ్వరమ్మ దంపతులకు జన్మించింది. ఈమె ప్రాథమిక విద్య వరంగల్లు లోని మట్టెవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తెలుగు మాధ్యమంలో కొన్ని తరగతులు, ఉర్దూ మాధ్యమంలో మరి కొన్ని తరగతులు చదివింది. ఆ తర్వాత ఆమె హనుమకొండలోని ప్రభుత్వ మాధ్యమిక, డిపార్ట్‌మెంటల్ ట్రైనింగ్ స్కూలులో చదివింది. తరువాత ఎస్.ఎస్.ఎల్.సి. హనుమకొండలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో చదివింది. ఇంటర్మీడియట్ వరంగల్లులోను, బి.ఎ. హైదరాబాదులోని కోఠి ఉమెన్స్ కాలేజీలోను చదివింది. ఆ తర్వాత హైదరాబాదులోని కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో బి.ఎడ్. పూర్తి చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భూగోళశాస్త్రము, తెలుగు అభిమాన విషయాలుగా రెండు ఎం.ఎ. డిగ్రీలు గైకొనింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో చదివి ఎం.ఎడ్. పట్టా పొందింది. ఈమె డ్రాయింగ్, పెయింటింగ్‌లలో హయ్యర్ డిప్లొమాను సంపాదించింది, డ్రాయింగ్, పెయింటింగ్‌లలో ట్రైనింగ్ డిప్లొమాను కూడా సంపాదించింది. ఈమె అభిమాన గురువులు సూరజ్‌ఖాన్, ఖండవల్లి లక్ష్మీరంజనం, దివాకర్ల వేంకటావధాని, వేదాంతాచారి, జోహ్రాబేగం మొదలైనవారు.
ఉద్యోగ పర్వము
మార్చుఈమె మొదట హనుమకొండలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో 6 నెలలు డ్రాయింగ్ టీచర్‌గా పనిచేసింది. తరువాత ప్రభుత్వ సర్వీసులో చేరి వర్ధన్నపేట ప్రభుత్వ ప్రైమరీ స్కూలు ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసింది. పిమ్మట మట్టెవాడ లోని ప్రభుత్వ బాలికల ప్రైమరీ స్కూలులో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసింది. ఆ తరువాత మట్టెవాడలోని గవర్నమెంట్ మిడిల్ స్కూలులో ఫస్ట్ గ్రేడ్ అసిస్టెంటుగా పనిచేసింది. అనంతరం హనుమకొండ గరల్స్ హైస్కూలులో ఉర్దూ సెక్షన్ టీచర్‌గా పనిచేసింది. 1957లో ఉస్మానియా విశ్వవిద్యాలయం సర్వీసులో చేరింది. కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ఆర్ట్స్ ఇన్‌స్ట్రక్టరుగా, దృశ్యశ్రవణ విద్యావిభాగానికి ఇన్‌ఛార్జిగా పనిచేసింది. తరువాత ఈమె తెలుగు విభాగంలో లెక్చరర్‌గా, దృశ్యశ్రవణ మాధ్యమాల లెక్చరర్‌గా పనిచేసింది. 1980లో ఈమె పదవీ విరమణ చేసింది. ఈమె అమెరికా, ఐరోపా దేశాలలో పర్యటించింది.
సంఘసేవ
మార్చుఈమె తన జీవితంలో అనేక సాంఘిక సేవా కార్యక్రమాలలో పాలుపంచుకుంది. హైదరాబాదు ఆంధ్ర మహిళా సభ సాంఘిక సేవా సభ్యురాలిగా, ట్రస్ట్ బోర్డు మెంబరుగా వ్యవహరించింది. ఆంధ్రమహిళాసభ బాలికల ఉన్నతపాఠశాల కార్యనిర్వాహక సభ్యురాలిగా కొంతకాలం పనిచేసింది. హైదరాబాదు చిక్కడపల్లిలోని జనతా హైస్కూలుకు సలహాదారుగా, కార్యనిర్వాహక సభ్యురాలిగా, ఛైర్‌పర్సన్‌గా వివిధ హోదాలను నిర్వహించింది. ఆచార్య కుల్ (వినోబాభావే ట్రస్ట్) కు కార్యనిర్వాహక సభ్యురాలిగా పనిచేసింది. స్వామి చిన్మయానంద మిషన్ సభ్యురాలిగా కూడా తన సేవలను అందించింది.
చిత్రకళ
మార్చుఈమె తైలవర్ణచిత్రాలను గీయడంలో నిష్ణాతురాలు. ఈమె నైజాము యువరాణి "దుర్-ఎ-షెహ్రార్", యువరాజు "ఆజమ్ జా"ల నిలువెత్తు తైలవర్ణచిత్రాన్ని గీసి వారికి బహూకరించి వారి అభినందనలకు పాత్రురాలయ్యింది. జార్జి బెర్నార్డ్ షా లైఫ్ సైజ్ చిత్రాన్ని గీసి ఆనాటి ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్‌కు బహూకరించింది. ప్రముఖ శాస్త్రవేత్త సూరి భగవంతం తైలవర్ణ చిత్రాన్ని గీసి అతనికి బహూకరించింది. భారతదేశ పటంలో భారతమాత చిత్రాన్ని వేసి దాని మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్‌కు బహూకరించింది. దానిని అతడు తాను సేకరించిన వస్తువుల మ్యూజియంలో భద్రపరచుకున్నాడు.
మరణము
మార్చుఈమె హైదరాబాదులో 2008, అక్టోబర్ 8వ తేదీన మరణించింది.
మూలాలు
మార్చు- ↑ రాపాక, ఏకాంబరాచార్యులు (2012). విశ్వబ్రాహ్మణ సర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 278–279.