చివరకు మిగిలేది (నవల)

ఇదే పేరుతో వచ్చిన సినిమా కోసం చివరకు మిగిలేది (సినిమా) చూడండి.

చివరకు మిగిలేది బుచ్చిబాబు రచించిన మనోవైజ్ఞానిక నవల. జీవితానికి సంబంధించిన పలు మౌలికమైన ప్రశ్నలను రేకెత్తించే రచనగా పలువురు సాహిత్యవేత్తలు పేర్కొన్నారు.

చివరకు మిగిలేది పుస్తక ముఖచిత్రము

రచన నేపథ్యం

మార్చు

ఎన్నో కథలను రచించిన బుచ్చిబాబు రాసిన ఏకైక నవల చివరికి మిగిలేది.

నవలా పరిచయం

మార్చు

తెలుగు నవలాచరిత్రలో ప్రముఖ సాహితీవేత్తలు శాశ్వతస్థానంగలదిగా గుర్తించిన నవల బుచ్చిబాబు గారి చివరకు మిగిలేది.[1] దీన్లో కథ స్వతంత్రం కోసం పోరాడుతున్న సమయంలో సాగుతుంది. ముఖ్యంగా నవల కథానాయకుడైన ధయానిది జీవితానికి సంబంధించిన అనేక మార్పులు, అతనికి తారసపడిన అనేకానేకుల మనస్తత్వాలను విశ్లేషించుకొంటూ రచయిత ధయానిది పాత్రను నడిపిస్తుంటాడు.

చివరకు మిగిలేది సమగ్రమైన తొలి మనోవైజ్ఞానికనవలగా విశేషమైన మన్ననలు పొందినది. ముందు రచయిత ఉపోద్ఘాతంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు కొన్ని ఇక్కడ చెప్పవలసివుంది.[1]

  1. ప్రతీరచయితకీ తన ఆంతరంగికాన్ని నలుగురితో పంచుకున్నప్పుడే రచయితకి సంతృప్తి కలుగుతుంది. ... దానికొక మూల్యం, సామాజిక ప్రయోజనం ఏర్పడుతుంది.
  2. పాఠకులకు జీవితంపై ఒక దృక్పథాన్ని కలగజేయాలనే ఉద్దేశంతోనే ఈరచన సాగింది.
  3. తల్లి చేసిన అపచారం నీడలా అతన్ని వెంటాడి, సంఘవిమర్శద్వారా, జీవితాన్ని కలుషితం చేసింది. ఈదౌర్జన్నాన్ని ఎదుర్కొడంలో అతను కొన్ని విలువల్ని సాధిస్తాడు. ఆవిలువలతో ఈనవలకి నిమిత్తం వుంది అంటారు రచయిత తన తొలిపలుకులో.
  4. రచయితకి జీవితంపై వున్న జిజ్ఞాసనీ, సమగ్రంగా నిజాయితీతో అనుభవించగలిగేటట్లుగా చిత్రితమైనవా లేదా అన్నదే పాఠకునికి కావలసింది.
  5. బెర్ట్‌రండ్ రాసిన “A Freeman’s Worship” అన్న వ్యాసం తననీ, జీవితంపై తనకు గల దృక్పథాన్ని మార్చివేసింది. అయితే తాను ఈనవల రాస్తున్నప్పుడు రసెల్ కానీ ఆవ్యాసం గానీ తన దృష్టిలో లేదని పాఠకులు గమనించాలన్నారు.

కథంతా దయానిధి అనబడే ఒక తాత్త్వికునికోణంలోనే నడుస్తుంది. ఇది అతని భావనాలోకపు రికార్డు. తనజీవితంలో తారసపడిన ప్రతివ్యక్తినీ మానసికవిశ్లేషణ చేసుకుంటూ పోతాడు ఆద్యంతం. అతనిజీవితంలో ప్రాముఖ్యత వహించిన వ్యక్తులు - అతనితల్లీ, కోమలీ, అమృతం, సుశీలా, తరువాత కొంతవరకూ ఇందిరా, నాగమణీ, కాత్యాయినీ. ... దయానిధి వెలిబుచ్చే అభిప్రాయాలు చూస్తే పాఠకులసానుభూతికోసం ఆరాటపడుతున్నవాడిలా కనిపిస్తాడు. అతని మనోవిశ్లేషణంతా తనలోపాలన్నిటికీ కారణం ఎవరా అని వెతకడంతోనూ, ఆలోపాలని ఎవరినెత్తిన రుద్దుదామా అన్న తాపత్రయంతోనూ సరిపోతుంది.[1]

సంక్షిప్త కథ

మార్చు

ధయానిధి పట్టణంలో డాక్టరు చదువుతూ పల్లెకు వచ్చినపుడు కోమలి అనే ఒక తక్కువ కులపు అమ్మయిని ప్రేమిస్తాడు, కాని ఆమెకు తన ప్రేమను వ్యక్తపరచడం ఎలానో, అసలు తనది ప్రేమో లేక ఆకర్షణో తెలియని సంగ్దిగ్దంలో ఉండి చదువు సంద్యలు లేని ఆమెకు ఆ అభిప్రాయాలను వ్యక్తం చేయలేక పోతాడు.

దయానిధి వృత్తి రీత్యా డాక్టరు. జీవిత యాత్రలో తారసిల్లిన అనేక సంఘటనలు, పరిసరాల ప్రభావంతో ఆయన తాత్వికుడుగా, భావకుడుగా మారతాడు. తల్లి మీద ఆయనకి అపారమైన గౌరవం ఉంటుంది. అయితే, ఆమె శీలం గురించి మాత్రం సంఘంలో సరైన అభిప్రాయం ఉండదు. సుశీల, ఇందిర అనే ఇద్దరు దయానిధి తల్లిని అవహేళన చేస్తారు. నిజానికి వారిద్దరు దయానిధికి భార్యలు కావాల్సినవారు. వారికి దయానిధి తల్లి మీద ఉన్న ఏహ్యభావం కారణంగా దయానిధికి దూరమవుతారు. అమృతం అనే యువతి మాత్రం దయానిధి తల్లి పట్ల గౌరవంతో మాట్లాడుతుంది. అందువల్లే ఆమె దయానిధికి సన్నిహితురాలవుతుంది. దయానిధి తల్లి పాత్ర ఎంతో కీలకమైనా ఆ పాత్ర మాత్రం నవలలో ఎక్కడా కనిపించదు. ఆమె చేసిన తప్పిదం మాత్రం కొడుకు దయానిధిని నీడలా వెన్నాడుతుంటుంది. తల్లి గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకోవడం విని సహించలేక దయానిధి సంఘానికి దూరంగా ఏకాంత జీవితం గడుపుతుంటాడు. అప్పుడే ఆయనకి జీవితానికి అర్థం ఏమిటి అన్న ప్రశ్నకలుగుతుంది. సత్యాన్వేషణకు, ఆధ్యాత్మిక, తాత్విక చింతనకు దారితీస్తుంది. పెద్దలు చేసిన తప్పిదాలకు పిల్లలు బాధ్యులై వారి జీవితాలు సాగాల్సిన తీరున సాగలేకపోవడం- ఈ నవలలో చిత్రితమైంది. దయానిధి సర్కారు వదిలి రాయలసీమకు వెళతాడు. అక్కడ సర్కారు రాయలసీమ ప్రాంతాల మధ్య గల వైషమ్యాలు భగ్గుమంటాయి. దయానిధి స్వాతంత్ర్యోద్యమంలో కూడా పాల్గొంటాడు. పెళ్లయి పునస్సంధానం జరిగే తొలిరాత్రి దేశమాత పిలుపునందుకొని అరెస్టవుతాడు. కోమలి, అమృతం, సుశీల, ఇందిర- ఈ నలుగురు స్త్రీల మధ్య అతను నాలుగు స్తంభాల ఆట ఆడినా అమృతం ఆయన హృదయాన్ని చూరగొంటుంది. అయితే అన్నివిధాలా ఆయనకు కోమలి సన్నిహితురాలైంది. ఇంకా కాత్యాయని, నాగమణి, శ్యామల... వీరు కూడా దయానిధి జీవితంలో సంచలనం కలిగిస్తారు. ఇతర పాత్రలైన కృష్ణమూర్తి, జగన్నాధం, సోమయ్య, రెడ్డి, నారయ్య మొదలైన వ్యక్తులందరూ ప్రతి వ్యక్తికీ సన్నిహితంగా ఉండి అందరితో కలసి మెలసి జీవించే పాత్రలు. ఈ నవల ద్వారా పాఠకులు గ్రహించే సత్యం ఏమిటంటే- 'మానవునికి కావాల్సింది మతాలు, దేవుళ్లు, మొక్కుబళ్లు, రాజకీయాలు కావు... కావాల్సింది దయ. అది కొంచెం ఉన్నా చాలు'. ఇక దయానిధి జీవితం అంతా- 'వ్యక్తిని కాదు ద్వేషించాల్సింది, వ్యక్తిలోని దౌర్భల్యాలను, బలహీనతలను ద్వేషించాలి' అన్న మానవతా వాద సిద్ధాంతం పైనే నడుస్తుంది.[2]

ఇందులో పదకొండు అధ్యాయాలున్నాయి. గడ్డిపోచ విలువెంత, అనుభవానికి హద్దులు లేవు, మూణ్ణాళ్ళ ముచ్చట, చప్పుడు చెయ్యని సంకెళ్లు, సౌందర్యరాహిత్యం, స్వయం సంస్కారం, చీకటి సమస్య, రాళ్లసీమ, కాత్యాయని సంతతి, ఆకులు రాలడం, చివరకు మిగిలేది. బుచ్చిబాబు స్వయంగా 'సమర్పణ' పేరుతో ఉపోద్ఘాతం రాశారు. అందులో తనని బాధించినదేదే రాస్తూ- 'గతించిపోయిన యౌవనం, జాడ్యం, బీదతనం, మృత్యువు- ఇవి జీవితంలోని చెడుగు. ఈ చెడుగులో మానవుడు గుండె బాదుకోవల్సిన విషాదం ఏమీ లేదు. జీవితంలో నిజమైన విషాదం ద్వేషించడం కూడా కాదు; నిజమైన విషాదం ప్రేమించలేకపోవడం, ద్వేషించడంలో కొంత పట్టుదల, కార్యసాధన కూడా ఉండొచ్చు; కాని ప్రేమించలేకపోవడంతో అట్లా సమాధానపడేటందుకేమీ లేదు. కృష్ణశాస్త్రి 'నా కొరకు చెమ్మగిల నయనమ్ము లేదు'-కంటె విషాదకరమైన గీతం ఏదుంది? ఈ సమస్య నన్ను బాధించింది. దీన్నిబట్టి ఈ సమస్యని నవలలో చర్చించి, ఒక సమాధానం కనుక్కున్నానని కాదు. ఈ వస్తువుని వ్రాసేస్తే విషయం నాకు విశదపడుతుందనీ, నలుగురితో పంచుకుంటే బాధ నుండి విముక్తి లభిస్తుందనీ తోచింది. వ్యక్తిగతమైన విముక్తి ఈ నవలకి ప్రేరణ. ప్రేమించలేపోవడం ఒకటే కాదు ఈ నవలలో వస్తువు. జీవితంలో 'చెడుగు' - 'పాపం' - ముఖ్యంగా పెద్దలు చేసిన తప్పిదాలు పిన్నలపైబడి వారి జీవితాల్ని ఏవిధంగా వికసించనీయకుండా, పాడుచేసింది- యిది కూడా ఒక ప్రధానమైన అంశమే. ఒకరు చేసిన అపచారాలకి మరియొకరు బాధ్యులై బాధపడడం వల్ల సమాజంలో వ్యక్తిగతమైన నైతిక విలువలకి తావులేకుండా పోతుంది' అంటూ బుచ్చిబాబు సుదీర్ఘమైన ముందు మాట రాశారు.[2]

ముఖ్య పాత్రలు

మార్చు
  • దయానిధి
  • కోమలి
  • అమృతం
  • నారయ్య
  • జగన్నాధం
  • పరంధామయ్య
నవలలో కొన్ని వాక్యాల ఉదాహరణ

"ఇతరులతో సంపర్కం వదులుకుని, ఏకాంతంగా మనం తెలుసుకున్న జీవిత రహస్యాన్ని యధార్థం అని నమ్మి సమాధాన పరుచుకోవడం, సంఘంతో నిమిత్తం వున్న మనిషికి చేతకాదు కాబోలు. చరిత్ర కట్టుకున్న ప్రాచీన పునాదులు, సంఘం పాతుకున్న మట్టి విత్తనాలు, వాటిని మినహాయిస్తే మానవుడిలో చివరకు మిగిలేది ఏమిటి? "

"రాతి శిధిలాల మధ్య వుండవలసింది అమృతం. ఎక్కడో ఏ హంపి లోనో -- అన్ని రాళ్ళు - భగ్న ప్రతిమలు. ఒంటరిగా నిలిచిపోయిన స్తంభాలు ప్రేమ కోసం గుండె రాయి చేసుకున్న రాకుమార్తెల విగ్రహాలు అన్నీ శిధిలమైపోయి, ఏ అర్ధరాత్రో అడుగుల చప్పుడు వినపడితే కదులుతాయెమో అనిపించే ప్రమాద స్థితిలో పడి వుంటే వాటి మధ్య అమృతం కూర్చుని, విషాదంలో నవ్వుతుంది. ఆమె గడిచిపొయిన అనుభవపు వైభవాలను తలచుకుని ఏడ్చి, ఏడ్చి, అతీతం అయినప్పుడు కన్నీరు చుక్కలు చుక్కలుగా రొమ్ముల మధ్యనుంచి జారి ఈనాటి నదిగా ప్రవహిస్తుంది. తన దుఃఖం నదులై పొంగి పొంగి దేహాన్ని ముంచి వెస్తుంది-- తప్పు !!. తను ఏడవకూడదు -- విషాదంలో నవ్వుతుంది.ఆనాడు సౌందర్యం తన యాత్ర ముగించుకుని ఆమెను శిలగా మార్చివేస్తుంది.ఏ రాతిని నిట్టుర్పుతొ కదిల్చినా అమౄతం కలలొ కార్చిన కన్నిరల్లే నీరైపొతుంది.. .. మొహం లో విషాదం వుంది. నవ్వుతుంటే రాజ్య వినాశనం జరిగిన తరువాత, శిధిలాలను చూసి, ఒకప్పుడు మహా వైభవం అనుభవించిన రాణి నవ్వడంలానిండుగా, బరువుగా, ఠీవిగా వుంటుంది.."

కోమలి శరీరం నా ప్రేమతో పెరిగింది. హృదయం ఇప్పుడిప్పడే జనిస్తోంది.... ఎందరెందరి స్వప్నాలనో యథార్థం చేసి, తనలోని యథార్థాన్ని రహస్యంగా స్వప్నం చేసుకొంది కోమలి.

రచయిత గురించి

మార్చు

బుచ్చిబాబు గురించి మధురాంతకం రాజారాం ఓ చోట ఇలా అంటారు- "బుచ్చిబాబు"గా ప్రసిద్ధి చెందిన శివరాజు వెంకట సుబ్బారావుగారు పశ్చిమగోదావరి జిల్లాలో 1916లో జన్మించారు. ఎం.ఎ. (ఇంగ్లీషు) పట్టభద్రులు. షేక్స్‌పియర్‌, బెట్రెండ్‌ రస్సెల్‌, సోమర్సెట్‌మామ్‌, టి.ఎస్‌.ఇలియట్‌, ఆల్దస్‌ హాక్స్‌లీ వంటి మహామహుల సాహిత్యాన్ని ఔపోశన పట్టారు. తెలుగులో కథాశిల్పానికి వన్నెలు బెట్టిన మహారచయితల్లో ఒకరు. నిరంతర త్రయం, ఎల్లోరాలో ఏకాంతసేవ, కాలచక్రం నిలిచింది, మరమేకులు-చీరమడతలు, తడిమంటకు పొడినీళ్లు, అడవిగాచిన వెన్నెల, మేడమెట్లు- ఇలా ఖండ కావ్యాల్లాంటి కథలెన్నో రాశారు. తెలుగు నవలల్లో ఆయన రచన 'చివరికి మిగిలేది' ప్రముఖమైనది.[2]

అభిప్రాయాలు

మార్చు

"చివరకు మిగిలేదేమిటి? దీనికి సమాధానం తెలిస్తే జీవిత రహస్యంతెలుసుకొన్నట్లే. అసలు జీవితానికి అర్ధం ఏమై ఉంటుంది?" లాంటి వాక్యాలతో ఈ నవల మొదలవుతుంది. .. జీవిత రహస్యం తెలుసుకొనే తపనలో దయానిధికి ఒక సత్యంఅర్ధమవుతుంది. "మనిషికి కావలిసింది కాసింత దయ" అని బుచ్చిబాబు ఈ నవల ద్వారా చెప్పదలచుకొన్నాడు[3]

చివరకు మిగిలేది నవల ఏ ప్రశ్నతో మొదలయ్యిందో అదే ప్రశ్నతొ ముగిసి విశ్రాంతి పొందింది. .. బుచ్చిబాబు రచించిన ఒకే ఒక నవల "చివరకు మిగిలేది" ఓపెన్ ఎండింగ్ నవల.[4]

బుచ్చిబాబు నవల శరీర, మానసిక, హృదయ, ఆత్మ సంస్కారాలకు సంబంధించిన మీమాంస. కోమలి చివరికి తానున్న కుటీరపు దహనంలో, జ్వాలల్లో చిక్కుకుపోవడం, దయానిధి ఆమెను రక్షించడం, తనకు తోడుగా ఎటో తీసుకెళ్ళి పోవడం కూడా దహన సంస్కారపు ఆత్మ సంస్కారంలోని భావమే. దయానిధి తల్లి శిలా విగ్రహం తల పగిలినా ఆమె పాదాలు ఇంకా నిలిచి ఉండడం ఈ సమాజపు సంస్కారంలో భాగమే. రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలంలోని మధ్య తరగతి మందహాసంలోని భాగస్థులే నిజాయితీ లేని దశరథ రామయ్య, గోవిందరావు, కృష్ణమూర్తి, జోగప్ప నాయుడు, గుర్నాధం, ప్రకాశరావు, అరూపానందస్వామి, శిష్యులు జీవ సజీవలు. మరీ ముఖ్యంగా రాజభూషణంలు. వారికి చివరికి మిగిలేదేమిటనే ప్రశ్నే రాదు. ఎంత అదృష్టవంతులు వాళ్ళు. నారన్న నౌకరే అయినా అతనికి దయానిధిపైనున్న ప్రేమ మిగిలింది. అనంతాచారికి ఆదరణ మిగిలింది. వైకుంఠానికి కృతజ్ఞత మిగిలింది. నవలలోని అగ్రవర్ణాలవాళ్ళు సుఖపడింది లేదు వాళ్ళ కృతక నీతివలన. నిమ్న వర్ణాలలోని కామాక్షి, కోమలులు ఇంతకంటే నష్టపోయేది ఏమీ లేదు. జగన్నాధం కృతకమైన తెలుగులో మాట్లాడుతాడు. ఆ వెక్కిరింపు సమాజం పట్లనే. అతనే గనుక సహజమైన భాషలో మాట్లాడి ఉంటే దయానిధి అస్తిత్వ వేదన అతన్ని కాల్చేసేది. చివరికి మిగిలేది నవలలో మాతృ ప్రేమ, స్వీయ ప్రేమల వికృతులు చివరికి ద్వేష రాహిత్యంలో ప్రేమ సాఫల్యాన్ని పొంది విశ్రాంతినొందిన నవల.[4]

"సోమర్‌సెట్ మాం రాసిన ఆఫ్ హ్యూమన్ బాండేజ్ నవల లేకపోతే బుచ్చిబాబు "చివరకు మిగిలేది" రాసి వుండడన్నది స్పష్టమే - అ లేకపోతే ఇ ఉండదు అన్న సూత్రం ప్రకారం - అయితే, బుచ్చిబాబుపై మాం ప్రభావం కంఠదఘ్నంగా ఉన్న విషయం వారిద్దరి కథలను కూడా పరిశీలిస్తే స్పష్టమవుతుంది." (కంఠదఘ్నంగా అంటే గొంతుదాకా - లోతుగా, గాఢంగా - అని అర్థం చేసుకున్నాను.) - కాకాని ఈ రెండూ నవలలనీ ముందుమాట, స్వీయ కథాత్మక లక్షణం, వస్తువు, పాత్రచిత్రణ - అనే అంశాల దృష్ట్యా పరిశీలించి తేల్చారు. వీటన్నిటిలో సామీప్యం ఉన్నా, స్త్రీ పాత్రలు మాత్రం బుచ్చిబాబు ఊహాశక్తి నుంచి ప్రభవించినవేగాని, మాం ప్రభావం నుండి కాదన్నారు.[5]

నవల మొత్తం మనోవిశ్లేషణ - ఒక తాత్త్వికచింతనగా సాగినందునేమో సూక్తిముక్తావళిలాగానో సుభాషణ రత్నావళిలాగానో అనిపించింది నాకు. నిజంగా జరిగినకథ కంటే దాన్నిగురించిన అతని ఆలోచనలూ, సిద్ధాంతీకరణ పుష్కలంగా ఉన్నాయి. (ఈవిషయం బుచ్చిబాబు కూడా తొలిపలుకులో ప్రస్తావించారు ప్రతివారికీ వుండే బలహీనత లేదా లక్షణం అని). జీవితం పుట్టినక్షణంనుండి ఆమరణాంతం సాగే ప్రయాణం. మరణంతోనే జీవితానికి ముగింపు. ఈనవల జీవితానికి అర్థంలేదు చివరకి మిగిలేది ఏమీ లేదన్న దయానిధిసిద్దాంతంతో ముగుస్తుందే తప్ప అతని మరణంతో కాదు. అతను ఇంకా జీవించి వుండగానే. ఇంక ఏమీ లేదు అనుకోడం నిరాశావాదం. నిజానికి అతను జీవితంలో అనుభవించింది కూడా ఏమీలేదు. .... చివరకుమిగిలేది ప్రథమపురుషలో సాగినా, ప్రధానపాత్ర ఆంతరంగిక చిత్రణ కావడంచేత ఉత్తమపురుషలో సాగినట్టే వుంటుంది చదువరికి. ఉత్తమపురుషలో కథ చెప్పినప్పుడు కొన్ని వసతులుండే మాట నిజమే. కాని ఈరెండు నవలల్లో వస్తువు పరిశీలించినప్పుడు, రచయితలు ఆవస్తువుని చిత్రించిన తీరు గమనించినప్పుడు, ఈగ్రామరు అనవసరం అనిపించింది అనుకుంటాను నేను. సూక్ష్మంగా చెప్పాలంటే బుచ్చిబాబు రచయితగా చివరకు మిగిలేదిలో సాధించినదానికీ, పాఠకుడిగా తనవుత్తరంలో వెలిబుచ్చిన అభిప్రాయాలకీ సమన్వయం కుదరడంలేదు.[1]

ఈ నవల ద్వారా పాఠకులు గ్రహించే సత్యం ఏమిటంటే- 'మానవునికి కావాల్సింది మతాలు, దేవుళ్లు, మొక్కుబళ్లు, రాజకీయాలు కావు... కావాల్సింది దయ. అది కొంచెం ఉన్నా చాలు'. ఇక దయానిధి జీవితం అంతా- 'వ్యక్తిని కాదు ద్వేషించాల్సింది, వ్యక్తిలోని దౌర్భల్యాలను, బలహీనతలను ద్వేషించాలి' అన్న మానవతా వాద సిద్ధాంతం పైనే నడుస్తుంది. ... పాత్రలన్నీ ముందు పరిచయమైనట్లు జవజీవాలతో నిండివని. నాటకీయమైన సంభాషణలు, ప్రకృతి వర్ణనలు మనసును ఆహ్లాదపరుస్తాయి. జీవితంలో నిజమైన విషాదం ప్రేమించలేకపోవటమే అన్న నగ్నసత్యాన్ని నిరూపించే నవల ఇది.[2]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 నిడదవోలు మాలతి వ్యాసం
  2. 2.0 2.1 2.2 2.3 ఈనాడు లో చీకోలు సుందరయ్య వ్యాసం[permanent dead link]
  3. AVKF పుస్తకాల సైటులో పరిచయ వాక్యాలనుండి
  4. 4.0 4.1 వేగుంట మోహన ప్రసాద్ రేడియో ప్రసంగ వ్యాసం - శత వసంత సాహితీ మంజీరాలులో ముద్రించబడింది.
  5. ] "సాహిత్య ప్రభావం" లో "బుచ్చిబాబుపై విలియం సోమర్సెట్ మాం ప్రభావం" అన్న అధ్యాయం. కాకాని చక్రపాణి. Media House Publications, 2004. - http://groups.google.tl/group/telugu-unicode/browse_thread/thread/21da143bf7d841a0[permanent dead link] లో కొడవళ్ళ హనుమంతరావు ఉట్టంకించినది

వనరులు

మార్చు

బయటి లింకులు

మార్చు

ఇవికూడా చూడండి

మార్చు