మధురాంతకం రాజారాం

ప్రముఖ రచయిత

మధురాంతకం రాజారాం (అక్టోబర్ 5, 1930 - ఏప్రిల్ 1, 1999) ప్రముఖ కథకులు.[1] ఈయన సుమారు 400కు పైగా కథలు, రెండు నవలలు, నవలికలు, నాటకాలు, గేయాలు, సాహితి వ్యాసాలు రచించారు.[2] పెక్కు తమిళ రచనలను తెలుగులోకి అనువదించారు. ఈయన కథలు అనేకం తమిళ, కన్నడ, హిందీ, ఆంగ్ల భాష లలోకి అనుమతించబడ్డాయి. చిన్ని ప్రపంచం-సిరివాడ నవల రష్యన్ భాషలోకి తర్జుమా చేయబడి ప్రచురితమైంది. 1993 లో మధురాంతకం రాజారాం కథలు పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈయన కుమారులు మధురాంతకం నరేంద్ర, మహేంద్ర. ఇద్దరూ సాహిత్యంతో పరిచయం ఉన్నవారే.

మధురాంతకం రాజారాం
జననం(1930-10-05)1930 అక్టోబరు 5
మొగరాల గ్రామం, చిత్తూరు జిల్లా
మరణం1999 ఏప్రిల్ 1(1999-04-01) (వయసు 68)
విద్యాసంస్థపి. సి. ఆర్. కళాశాల, చిత్తూరు
వృత్తిరచయిత
ఉపాధ్యాయుడు
పిల్లలుమధురాంతకం నరేంద్ర
మధురాంతకం మహేంద్ర
తల్లిదండ్రులు
 • విజయరంగం పిళ్ళై (తండ్రి)
 • ఆదిలక్ష్మమ్మ (తల్లి)

బాల్యం, విద్యాభ్యాసం సవరించు

ఈయన చిత్తూరు జిల్లా మొగరాల గ్రామంలో 1930, అక్టోబర్ 5న ఆదిలక్ష్మమ్మ, విజయరంగం పిళ్ళై దంపతులకు జన్మించారు. ఆయన ప్రాథమిక విద్య ఒక ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. 1945 లో చిత్తూరులోని జిల్లా బోర్డు హైస్కూలు (ప్రస్తుతం పి. సి. ఆర్ కళాశాల) నుంచి ఎస్. ఎస్. ఎల్. సి పూర్తి చేశాడు. చదువుకునే రోజుల నుంచి ఆయన సాహిత్యం పట్ల అభిరుచి కలిగి ఉండేవాడు.[2] రాజారాం వృత్తి రీత్యా ఉపాధ్యాయులు.

రచయితగా సవరించు

ముందు గేయ రచయితగా తన రచనా ప్రస్థానం ప్రారంభించి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. రాజమండ్రి రౌతు బుక్ డిపో, చెన్నై, కొండపల్లి వీరవెంకయ్య కంపెనీల నుంచి వచ్చే కొవ్వలి లక్ష్మీనరసింహరావు, జంపన చంద్రశేఖరరావు, కృత్తివెంటి వెంకటేశ్వరరావు, ఎం. అప్పారావు పట్నాయక్ లాంటి రచయితల నవలలు చదివేవాడు. తరువాత ఆయనకు ఆంధ్రపత్రిక, భారతి లాంటి పత్రికలతో పరిచయం ఏర్పడింది. అందులో రచనలు, పద్యాలు, గేయాలు చదివి ఆయన సాహితీరంగం వైపు ఇంకా ఉత్తేజితుడయ్యాడు. 1951లో ఆయన రాసిన పరమానంద శిష్యులు అనే కథా గేయం ఆంధ్రపత్రికలో ప్రచురితమైంది. ఆయన రాసిన మొట్టమొదటి కథ కుంపట్లో కుసుమం. 1968 లో ఆయనకు ఉత్తమ కథకుడిగా సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.[2]

రచయిత మునిపల్లె రాజు ఆయన కథల సంపుటి గురించి ముందుమాటలో ప్రస్తావిస్తూ రాజారాం గురించి ఇలా రాశాడు.[3]

ఎవరి జీవన దృక్పథమూ, సాహిత్య వ్యాసంగమూ జంటగా, శ్రుతిలయలై, దార్శనికతగా రూపుదిద్దుకుంటాయో, ఏ రచయితకు మానవాదర్శం మీద, మానవ సామర్థ్యం పట్ల గౌరవమూ అకుంఠిత విశ్వాసమూ వుంటాయో, ఏ కథకుడు– అన్ని విధాల వితండ వాదనలకు, తర్క కుతర్కాలకు, నినాదపూరిత సిద్ధాంతాలకు అతీతంగా మానవతనే మహామంత్రంగా రచనా జపయజ్ఞం చేస్తాడో– అతగాడి సృజనను కాలం కుదిపి వేయలేదు, చెరిపి వేయలేదు. మధురాంతకం రాజారాం ఆ కోవలోనివాడు

నాటకాలు సవరించు

 • ధర్మదీక్ష

కథాసంపుటాలు సవరించు

ఆయన కథా సంపుటాలను విశాలాంధ్ర వారు ప్రచురించారు.

 • వర్షించిన మేఘం
 • ప్రాణదాత
 • కళ్యాణకింకిణి
 • జీవన్ముక్తుడు
 • తాను వెలిగించిన దీపాలు
 • చరమాంకం
 • కమ్మ తెమ్మెర
 • స్వేచ్ఛ కోసం
 • వక్రగతులు - ఇతర కథలు
 • వగపేటికి
 • రేవతి ప్రపంచం
 • మధురాంతకం రాజరాం కథలు - నాలుగు సంపుటాలు

కుటుంబం సవరించు

ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మధురాంతకం నరేంద్ర తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆంగ్ల ఆచార్యుడిగా పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు మధురాంతకం మహేంద్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ అకాల మరణం పొందాడు. వీరిద్దరూ కూడా కవులు, రచయితలే.

అవార్డులు సవరించు

 • 1968 లో తాను వెలిగించిన దీపాలు కథాసంపుటికకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం
 • అనువాద రచనకు తంజావూర్ విశ్వవిద్యాలయం వారి అవార్డ్.
 • 1990 లో గుంటూరు అరసం వారిచే కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ సత్కారం.[4]
 • 1991 లో గోపీచంద్ సాహితి సత్కారం
 • 1993 లో మధురాంతకం రాజారాం కథలు పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి
 • 1994 లో శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం
 • 1996 లో అప్పాజోస్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్ వారి ప్రతిభామూర్తి పురస్కారం

మరణం సవరించు

ఈయన 1999, ఏప్రిల్ 1వ తేదిన సహజ మరణం పొందాడు.

జీవిత చరిత్ర సవరించు

మధురాంతకం రాజారాం జీవిత చరిత్రను, రచనల ఆధారంగా సింగమనేని నారాయణ పుస్తకం రాశాడు. ఈ పుస్తకాన్ని 2013 లో సాహిత్య అకాడెమీ ప్రచురించింది.[5]

మూలాలు సవరించు

 1. 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.
 2. 2.0 2.1 2.2 సూర్యనారాయణ రాజు, మంతెన (2 October 2016). ఆదివారం వార్త: హృదయరంజక కథకుడు 'మధురాంతకం'. హైదరాబాదు: గిరీష్ సంఘీ. p. 22.
 3. "చలువ పందిరి కింద కథా శ్రవణం". Sakshi. 2019-03-31. Retrieved 2023-03-15.
 4. పెనుగొండ లక్ష్మీనారాయణ (Jan 2020). గుంటూరుసీమ సాహిత్యచరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ. pp. 283–284.
 5. Gopalakrishna, P. S. (2015-03-19). "Life and works of a writer". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-12-15.