చెక్కభజన పాటలు

ఆంధ్రప్రదేశ్ లోని జానపద కళా రూపం


రాయలసీమలో - మరీ ముఖ్యంగా కడప, చిత్తూరు జిల్లాల్లో - చెక్కభజన పాటలు చాలా ప్రాచుర్యం పొందాయి. ఇందులో భజన చెయ్యడానికి వాడే చెక్కలు పొడవుగా ఉండే పలకలను పోలి ఉండడం వల్ల చెక్కభజననే పలకల భజన అని కూడా అంటారు. చేతుల్లో మూరెడు పొడవుండే తాళపు చెక్కలతో, కాళ్ళకు గజ్జెలతో వలయాకారంలో తిరుగుతూ తాళపు చెక్కలు వాయిస్తూ తాళానికి అనుగుణంగా పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఉంటారు. ఒకే చేతిలో రెండు చెక్కలను ఆడిస్తూ వాయించడం చెక్కభజనలోని సొగసు. వలయాకారంలో తిరిగే కళాకారులు కొన్ని సార్లు ఉద్దులు-వెలుద్దులుగా (జతలు జతలుగా) మారి ఎదురెదురుగా అడుగుమార్చి అడుగువేస్తూ ఉద్ది మార్చి ఉద్ది (ఒక అడుగులో ఒకవైపు-ఇంకొక అడుగులో రెండవవైపు) తిరుగుతూ నృత్యం చేస్తారు. పెన్నుద్దికాడైన గురువు పాటలోని ఒక్కొక్క చరణం అందిస్తే మిగిలిన వాళ్ళు అందుకుని పాడుతూ నృత్యం చేస్తారు. పలకల భజనలో జడకోపు తప్పనిసరిగా ఉంటుంది. ప్రస్తుతం చెక్కభజనలో భక్తి, పౌరాణిక, శృంగార, హాస్య సంబంధమైన పాటలు వ్యాప్తిలో ఉన్నాయి. ప్రాచీనకాలంలో తిత్తి, మద్దెల, కంజీర వాయిద్యాలుగా ఉండేవి. ఇప్పుడు హార్మోనియం, డోలు, కంజీర, తబలా వాడుతున్నారు. చెక్కభజన భజన రెండు చెక్కలను లయాత్మకంగా కొట్టడం ద్వారా అద్భుతమైన సంగీతాన్ని సృష్టించి దానికి అనుగుణంగా అడుగులు వేసే కళ.చెక్కభజనలో అడుగులకు అనుగుణంగా పాటలో వేగం, ఊపు, ఉంటాయి. చాలారకాల అడుగులున్నాయి . ఆది అడుగు, రెండు, మూడు, పర్ణశాల, కుప్పకొట్టడం, కులుకు వంటివి ప్రత్యేకమైన అడుగులు. ఈ అడుగులకు అనుగుణంగా చెక్కలు కొడుతుంటారు. గురువు మధ్యలో ఉండి పాట పాడతాడు. పాటలో వేగం పెరిగే కొద్దీ అడుగులు వేగంగా కదుల్తాయి. డప్పు, హార్మూనియం వాద్యాలు ఉపయోగిస్తారు.చెక్కభజన బృందాల సంఖ్య తగ్గిపోయింది. ఒకప్పుడు హార్మోనియం, డప్పు వాద్యాలతో రమ్యంగా ఉండే చెక్కభజన, కేసియో, స్టీరియో వాడకంతో జానపద సహజత్వం పోయి కృత్రిమత్వం వచ్చింది.

చెక్కభజన ప్రదర్శన

కృష్ణుడు-చెంచిత సంవాదము కృష్ణుడు:పచ్చనీ నీలాల పారుటాకుల సీరపై నల్ల గందోడి పాపా ఏవూరిదానవే చెంచితా ఏవూరిదానవే ముత్తెమా ఏవూరిదానవే పగడమా ఏవూరిదానావే చెంచిత :ఏవూరులైతే ఏమికృష్ణూడా ఏపల్లెలైతే ఏమికృష్ణూడా ఆడవోళ్ళుండేటి సోటూలో నీకు మాటలేముంటాయి కృష్ణూడా పోవోయి పోవోయి నల్లన్ని బాబు పొద్దేడబోయేర నా సామి కృష్ణుడు:పిల్లా బామా మేనత్త కూతుర మేలు కన్నుల దాన జారు పైటా దానా కండ్ల కాటుక దాన పండ్ల దాల్చిన దాన చెంచితా నీవేవూరిదానవే చెంచీతా నీ అడుగు చూసి నేను చెంచితా ఆర్నెల్లు కాసుంటి చెంచీతా నన్ను పెళ్ళాడవే చెంచితా నీ కులముద్దరించేను చెంచీతా చెంచిత:చీచీ పోరా సిగ్గులేనివాడా హీనంబు లేదురా కృష్ణూడా నీకు మానంబు లేదురా కృష్ణూడా నిన్ను సూత్తేను భయమౌర కృష్ణూడా నువ్వు నల్లంగ వుండావు కృష్ణూడా నాకు భయమేసురా కృష్ణూడా దూరంగ వుండార కృష్ణూడా కృష్ణుడు :నేనెవరానుకున్నావె చెంచితా నే రేపల్లె వాడాలో చెంచితా నే గోపెమ్మ కొడుకునే చెంచితా నే గోపాల కృష్ణుణ్ణే చెంచితా నే మచ్చావ తారుణ్ణె చెంచితా నన్ను పెళ్ళాడవే చెంచితా నీ కులముద్దరించేను చెంచీతా చెంచిత:చీచీ పోరా సిగ్గులేనివాడా హీనంబు లేదురా కృష్ణూడా నీకు మానంబు లేదురా కృష్ణూడా నీకు పెళ్ళాలు లేకనే కృష్ణుడా నువ్వు నాకాడికొస్తివ కృష్ణూడా నువ్వు వచ్చేటి తోవలో కృష్ణూడా నిన్ను పామన్న కరవదా కృష్ణూడా


బృందగేయం (కరుణప్రధానం)

చిరుతాల భజన ప్రదర్శన ( చెక్కభజనలో ఒక రకం)

యమునాకళ్యాణిస్వరాలు - చతురస్రగతి ఏకతాళం


మగ: కోపులేమొ తగ్గినాయి

కొమ్మలేమొ హెచ్చినాయి

పొయొస్చ జానకీ

కోడిపందెమూ - నేను

చూసొస్చ జానకీ - కోడిపందెము


ఆడ: ముక్కులోటి ముక్కెర

కోడిపుంజుల పాలాయ

పోవద్దు మామా - కోడిపందెమూ

నువు ఆడద్దు మామా - కోడిపందెము


మగ: కోపులేమొ తగ్గినాయి

కొమ్మలేమొ హెచ్చినాయి

పొయొస్చ జానకీ

కోడిపందెమూ - నేను

ఆడొస్చ జానకీ - కోడిపందెము


ఆడ: సెవుల్లోటి కమ్మలు

కోడిపుంజుల పాలాయ

పోవాకుమగడా - కోడిపందెమూ

నువు ఆడాకు మగడా - కోడిపందెము


మగ: ఆటలేమొ తగ్గినాయి

కొమ్మలేమొ హెచ్చినాయి

పొయొస్చ జానకీ

కోడిపందెమూ - నేను

ఆడొస్చ జానకీ - కోడిపందెము


ఆడ: మెడల్లోటి ఆరాలు

కోడిపుంజుల పాలాయ

పోవద్దు ముద్దురుడ - కోడిపందెమూ

నువు ఆడద్దు ముద్దురుడ - కోడిపందెము


మగ: కోపులేమొ తగ్గినాయి

కొమ్మలేమొ హెచ్చినాయి

ఆడెన్న వస్చానె

కోడిపందెమూ - నేను

గెలిసన్న వస్చానె - కోడిపందెము


ఆడ: నడుం కున్న వడ్డ్యాణం

కోడిపందెం పాలాయ

పోవద్దు నాథుడా - కోడిపందెమూ

నువు ఆడద్దు మగడా - కోడిపందెము


మగ: కోపులేమొ తగ్గినాయి

మోజులేమొ హెచ్చినాయి

చూసొస్చ జానకీ

కోడిపందెమూ - నేను

ఆడెన్న వస్చానె - కోడిపందెము


ఆడ: కాలాలోటి కడియాలన్ని

కోడిపుంజుల పాలాయ

వద్దొద్దు మామా - కోడిపందెమూ

నువు ఆడద్దు మామా - కోడిపందెము

బృందగేయం (భక్తిప్రధానం)

కీరవాణి రాగస్వరాలు - తిశ్రతాళం

దశావతారాలను వర్ణించే ఒక జానపదం. రాయలసీమ వాసులు. పలకల భజనల్లో పాడుకునే పాట.


బేట్రాయి సామి దేవుడా - నన్నేలినోడ బేట్రాయి సామి దేవుడా కాటేమి రాయుడా - కదిరినరసిమ్మడా మేటైన వేటుగాడ నిన్నే నమ్మితిరా

బేట్రాయి...

శాప కడుపు సేరి పుట్టగా - రాకాసిగాని కోపామునేసి కొట్టగా ఓపినన్ని నీల్లలోన వలసీ వేగామె తిరిగి బాపనోల్ల సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ

బేట్రాయి...

తాబేలై తాను పుట్టగా ఆ నీల్లకాడ దేవాసురులెల్లకూడగా దోవసూసి కొండకింద దూరగానే సిల్కినపుడు సావులేని మందులెల్ల దేవర్లకిచ్చినోడ

బేట్రాయి...

అందగాడనవుదులేవయా - గోపాల గో విందా రచ్చించా బేగరావయా పందిలోన సేరి కోర పంటితోనె ఎత్తి భూమి కిందు మిందు సేసినోడ సందమామ నీవె కాద

బేట్రాయి...

నారసిమ్మ నిన్నె నమ్మితి - నానాటికైన కోరితి నీ పాదమే గతీ ఓరి నీవు కంబాన సేరి ప్రహ్లాదు గాచి కోరమీస వైరిగాని గుండె దొర్లసేసినోడ

బేట్రాయి... బేట్రాయి...

బుడుత బాపనయ్యవైతివి ఆ శక్కురవరితి నడిగి భూమి నేలుకుంటివీ నిడువు కాళ్ళోడివై అడుగు నెత్తిపైన బెట్టి తడవు లేక లోకమెల్ల మెడిమతోటి తొక్కినోడ

బేట్రాయి...

రెండుపదులు ఒక్కమారుతో ఆ దొరలనెల్ల సెండాడినావు పరశుతో సెండకోల బట్టి కోదండరామసామికాడ (సెండకోల = గండ్రగొడ్దలి) బెండు కోల సేసికొనీ కొండకాడకేగినోడ (బెండు కోల = శక్తి తగ్గించుకుని, సముద్రం దగ్గర

గొడ్డలి విసిరేసి అంత మేరా సముద్రాన్ని వెనక్కి జరిపినాడు కదా, ఆ ఘట్టం)

బేట్రాయి... రామదేవ రచ్చించరావయా సీతమ్మతల్లి శ్యామసుందర నిన్ను మెచ్చగా సామి తండ్రిమాట గాచి ప్రేమ భక్తినాదరించి

ఆమైన లంకనెల్ల దోమగాను సేసినోడ

బేట్రాయి...

దేవకీదేవి కొడుకుగా ఈ జగములోన దేవుడై నిలిచినావురా ఆవూల మేపుకొనీ ఆడోళ్ళాగూడుకొనీ తావుబాగ సేసుకొనీ తక్కిడి బిక్కిడి సేసినోడ (తక్కిడి బిక్కిడి = మోసం)

బేట్రాయి...

ఏదాలూ నమ్మరాదనీ ఆ శాస్త్రాలా వాదాలూ బాగా లేవనీ బోధనలూ సేసికొనీ బుద్ధూలు సెప్పుకొనీ నాదావినోదుడైన నల్లనయ్య నీవెకాద

బేట్రాయి...

కలికి నా దొరవు నీవెగా ఈ జగములోన పలికినావు బాలశిశువుడా చిల్లకట్టు పురములోన సిన్నీ గోపాలుడౌర పిల్లంగోవి సేతబట్టి పేట పేట తిరిగినోడ..

బేట్రాయి...