చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్

చొప్పల్లి గా ప్రసిద్ధిచెందిన చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్ సుప్రసిద్ధ హరికథా కళాకారుడు, రంగస్థల, సినిమా నటుడు.[1]

చొప్పల్లి సూర్యనారాయణ
చొప్పల్లి సూర్యనారాయణ
జననంచొప్పల్లి సూర్యనారాయణ
19 సెప్టెంబర్ 1905
విజయనగరం జిల్లాలో చొప్పల్లి
ఇతర పేర్లుచొప్పల్లి
"హరికథా కంఠీరవ"
వృత్తి1929లో మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో హరికథకుడు
ప్రసిద్ధిసుప్రసిధ హరికథా కళాకారుడు , రంగస్థల, సినిమా నటులు
తండ్రివైణిక విద్వాంసుడైన చొప్పల్లి నరసింహం
తల్లిసూరమాంబ

ఈయన విజయనగరం జిల్లా లోని చొప్పల్లి గ్రామంలో సెప్టెంబరు 19 1905 తేదీన జన్మించాడు. వైణిక విద్వాంసుడైన చొప్పల్లి నరసింహం, సూరమాంబ ఈయన తల్లిదండ్రులు. ఆనాడు విజయనగరం మహారాజైన ఆనంద గజపతి నాటక సమాజంలో నటించి ప్రజల, ప్రభువుల మన్ననలు పొందినవాడు నరసింహం. తండ్రి ప్రోత్సాహం చొప్పల్లిని నటునిగా తీర్చిదిద్దాయి.

విజయనగరం మహారాజా కళాశాలలో ఎస్.ఎస్.ఎల్.సి. పాసయ్యాడు. తర్వాత శ్రీవాణీ విలాస్ అమెచ్యూర్ కంపెనీలో చేరి అనాసపురపు గోపాలరావు సరసన రసపుత్ర విజయం నాటకంలో వీరమాత పాత్ర పోషించి మొదటిసారిగా రంగస్థల ప్రవేశం చేశాడు. తర్వాత ప్రహ్లాదలో నారదుడు, లవకుశలో లక్ష్మణుడుగా పాత్రలు పోషించాడు. తర్వాత ప్రసిద్ధ నటులైన యడవల్లి, పారుపల్లి, ఆంజనేయులు మొదలైన వారితో కలిసి ద్రౌపదీ వస్త్రాపహరణం, గయోపాఖ్యానం, సక్కుబాయి మొదలైన నాటకాలలో నటించాడు. ముఖ్యంగా సక్కుబాయిలో శివయోగి, పాండవ నాటకంలో ధర్మరాజు పాత్రలు ఆయనకు అఖండమైన ప్రఖ్యాతిని చేకూర్చాయి.

చొప్పల్లి తొలినాటి చలనచిత్ర రంగంలో ప్రవేశించి సక్కుబాయి (1935) సినిమాలో శివయోగి పాత్రను, ద్రౌపదీ వస్త్రాపహరణం (1936) లో ధర్మరాజు పాత్రను, కచ దేవయాని (1938) లో శుక్రాచార్యుడుగా, రుక్మిణీ కళ్యాణంలో అగ్నిద్యోతనుడుగాను, మీరా బాయి (1940) లో రూపగోస్వామి మొదలైన పాత్రలు ధరించి కీర్తిని గడించాడు.

1929లో మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో హరికథకుడిగా ప్రవేశించి అనేక హరికథ లను గానం చేశాడు. పండితుల చేత "హరికథా కంఠీరవ" అనే బిరుదును పొందాడు.

మూలాలు

మార్చు
  1. చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్, నటరత్నాలు, మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి, సీతారత్నం గ్రంథమాల, విజయవాడ, 2002, పేజీలు: 580-81.