జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం

జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామంలో ఉన్న దేవాలయం. ఇక్కడి దేవున్ని జానకంపేట సాలగ్రామ నరసింహుడు అని పిలుస్తారు. శివకేశవ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన అ దేవాలయానికి వందల ఏళ్ళ చరిత్ర ఉంది.[1]

జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం
జానకంపేట దేవాలయంలో లక్ష్మీ నరసింహస్వామి
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:నిజామాబాద్ జిల్లా
ప్రదేశం:జానకంపేట, ఎడపల్లి మండలం
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:నరసింహస్వామి
ప్రధాన పండుగలు:బ్రహ్మోత్సవాలు
నిర్మాణ శైలి:దక్షిణ భారతదేశం
చరిత్ర
కట్టిన తేదీ:
(ప్రస్తుత నిర్మాణం)
మూడవ శతాబ్ధం
నిర్మాత:జైనులు, కాకతీయులు

చరిత్ర

మార్చు

హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత దండకారణ్యంలోకి వచ్చిన నరసింహుడు జానకంపేట కొండ ప్రాంతంలో సేదతీరి, ఇక్కడే స్వయంభువుగా వెలిశాడట. నరసింహస్వామి ఉగ్రరూపాన్ని దర్శించడానికి ఋషులకు సాధ్యపడకపోవడంతో, స్వామి ఆజ్ఞమేరకు ఖాట్మండు సమీపంలోని గండకీ నదీ తీరం నుంచి సాలగ్రామ శిలను తీసుకు వచ్చి నాభిలో ప్రాణప్రతిష్ఠ చేయడంతో శాంతమూర్తిగా దర్శనమిచ్చాడని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. నాభిలో సాలగ్రామం ఉండటం వల్ల సాలగ్రామ నరసింహుడిగానూ ప్రసిద్ధిగాంచాడు.[1] ఇక్కడ మూడో శతాబ్దంలో దేవాలయ వెనుకభాగంలో గురుకులం నిర్మించబడినట్టు ఆనవాళ్ళు లభించాయి. తర్వాతి కాలంలో కాకతీయుల పాలనలో గురుకులాన్ని శివాలయంగా మార్చడంతో, ఈ దేవాలయం శివకేశవ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. ఈ దేవాలయానికి ఉమామహేశ్వరుడు క్షేత్రపాలకుడిగా ఉన్నాడు.

నిర్మాణం

మార్చు

మూడవ శతాబ్దంలో ఒక జైనమత ప్రవక్త ఈ క్షేత్రాన్ని సందర్శించి, స్వామి శక్తికి ఆకర్షితులైన జైనులు ఇక్కడ దేవాలయాన్ని నిర్మించారని, గుడి వెనుకభాగంలో ఒక గురుకులాన్ని కూడా స్థాపించారని కూడా తెలుస్తోంది. దేవాలయ ముఖద్వారంపై గజలక్ష్మి దేవి, దేవాలయంలోని ప్రతి స్తంభంపై నాగేంద్ర ప్రతిమలు చెక్కబడి ఉన్నాయి. పూర్తిగా రాతితోనే నిర్మితమైన ఈ దేవాలయాన్ని కాలక్రమేణ కాకతీయులు కూడా అభివృద్ధి పరిచారు.

అష్టముఖి కోనేరు

మార్చు

ఈ దేవాలయ ప్రాంగణంలో అష్టముఖి కోనేరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.[2] కలియుగం ప్రారంభంలో ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న ఋషులుకు, రాక్షసులు ఆటంకాలు సృష్టించేవారు. ఋషులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా, బ్రహ్మ ఆజ్ఞతో అష్ట దిక్పాలకులు ఎనిమిది దిక్కుల్లో కాపలాగా నిలబడి వారి మధ్యలో నీటిని ఉద్భవించేలా చేశారని అందుకే దీనిని ‘అష్టముఖి’ కోనేరుగా పిలుస్తున్నారని చరిత్రకారుల అభిప్రాయం.[1]

ఉత్సవాలు

మార్చు

శనివారంతో కూడిన అష్టమీ, అమావాస్య తిథుల్లో స్వామిని దర్శించుకుంటే, శనిదోషాలు పోతాయని భక్తుల నమ్మకం. ప్రతినెలా స్వాతి నక్షత్రం రోజున స్వామి కళ్యాణం, ప్రతిఏటా మాఘశుద్ధ అష్టమి నుంచి మాఘశుద్ధ ప్రతిపద వరకూ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 telugu, NT News (2022-03-20). "యాదాద్రి కాకుండా తెలంగాణ‌లో ఉన్న న‌ర‌సింహ‌స్వామి ఆల‌యాల గురించి తెలుసా". Namasthe Telangana. Archived from the original on 2022-03-21. Retrieved 2022-03-24.
  2. "సెలవుల నెలవులు". www.andhrabhoomi.net. Archived from the original on 2020-09-19. Retrieved 2022-03-24.