జార్జ్ స్టబ్స్ (1724 – 1806) ఒక ఇంగ్లీషు చిత్రకారుడు. ఇతడు ముఖ్యంగా గుర్రాల తైలవర్ణ చిత్రాలకు ప్రసిద్ధిగాంచాడు.

జార్జ్ స్టబ్స్
జార్జ్ స్టబ్స్
జార్జ్ స్టబ్స్ యొక్క స్వీయచిత్రం
జననం(1724-08-25)1724 ఆగస్టు 25
మరణం1806 జూలై 10(1806-07-10) (వయసు 81)
వృత్తిబ్రిటిష్ కళాకారుడు

జీవిత విశేషాలు మార్చు

జార్జ్ స్టబ్స్ 1724, ఆగష్టు 25న లివర్‌పూల్‌లో జాన్, మేరీ దంపతులకు జన్మించాడు.[1]

ఇతనికి పదిహేను సంవత్సరాల వయసు వచ్చేవరకూ తండ్రి చేస్తున్న తోళ్ళ వ్యాపారంలో అతనికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. చిన్నతనం నుండి ఇతనికి చిత్రకళ అంటే ఇష్టం. దానిని స్వాభావికంగానే అభ్యసించాడు.[2] ఇతడు తన తండ్రి మరణానంతరం 1741లో "హామ్లెట్ విన్ స్టాంట్లీ" అనే స్థానిక చిత్రకారుని వద్ద సహాయకునిగా పనిచేశాడు.[3] కొంత కాలం తరువాత ఆ పని మానివేసి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటి పట్టునే వుంటూ చిత్రకళను తనకు తానుగా అభ్యసిస్తూ కాలం గడిపాడు. ఆ కాలంలో అతని పోషణ భారమంతా తల్లే భరించింది.[4]

ప్రకృతిపై ప్రేమ, ప్రతి విషయాన్నీ లోతుగా పరిశీలించే జిజ్ఞాసతో చనిపోయిన కొన్ని జంతువులూ భాగాలను కోసి, శ్రద్ధతో వాటిని చిత్రాలుగా గీసుకునేవాడు. 1745 నాటికి జీవనభృతికోసం ఒక ప్రక్క వ్యక్తులయొక్క చిత్రాలు వేస్తూ, మరోప్రక్క యార్క్ పట్టణంలోని మెడికల్ పాఠశాలలో పనిచేశాడు. "ఛార్లెస్ ఆట్కిన్‌సన్" అనే ఉపాధ్యాయుని నుంచి మానవ శరీరం అంతర్భాగాల గురించి పాఠాలను నేర్చుకున్నాడు. కొన్నాళ్ళకు తానే విద్యార్థులకు పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగాడు. స్త్రీల ప్రసవానికి సంబంధించి "బర్టన్" వ్రాసిన "శాస్త్రీయ ప్రసవ విధానం" అనే పుస్తకంలో సందర్భానుసారమైన చిత్రాలను వేశాడు. ఇందులో చనిపోయిన గర్భిణీ స్త్రీల విజ్ఞానాత్మకమైనవి కావటంతో అవి కాలగతిలో నశించకుండా ఎన్‌గ్రేవర్ వద్దకు తీసుకొనిపోయి, వాటిని లోహపు ఫలకాలపై తర్జుమా చేయించాడు. అవి అంతగా తృప్తినివ్వకపోవడంతో తానే ఆ పనికి పూనుకొని నైపుణ్యాన్ని సంపాదించాడు[4].

 
అశ్వకేసరాల పోరు, తైలవర్ణచిత్రం, 1770, యేల్ యూనివర్శిటీ ఆర్ట్ గ్యాలరీ

1754లో ఇతడు ఇటలీ ప్రయాణమై వెళ్ళాడు. అక్కడ మైఖలాంజిలో శిల్ప, చిత్రకళను కన్నులారా గాంచి ఆస్వాదించాడు.[5] ఇటలీ నుంచి తిరిగి వచ్చి తోళ్ళవ్యాపారాన్ని సాగించాడు. గాలన్, లియొనార్డో డావిన్సి వేసిన శరీర అంతర్భోగ చిత్రాలు ఇతనిపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఊరికి దూరంగా 'హార్క్‌స్టేవ్' అనే ప్రాంతంలో ఒంటరిగా ఒక ఇంటిని అద్దెకు తీసుకుని తన ప్రియురాలు, తరువాత జీవన భాగస్వామి అయిన మేరీ స్పెన్సర్‌తో ఏకాంత జీవితం కొనసాగించాడు[6]. ఆమె సహాయంతో చనిపోయిన గుర్రపు శరీరభాగాలను పొరలుపొరలుగా కోసి, కండల, ఎముకల నిర్మాణాన్ని అధ్యయనం చేసి చిత్రాలుగా, ఎన్‌గ్రేవింగులుగా వేసుకొనేవాడు. ఇది తెలుసుకున్న ప్రజలు ఇతడిని అసహ్యించుకునేవారు. అదే సమయంలో ఇతనికి కుమారుడు కలిగాడు. అతనికి "జార్జ్ టెన్‌లీ స్టబ్స్" అని పేరు పెట్టాడు. నెల్ ధ్రోప్ అనే ధనికురాలు ఇతని చిత్రాలలో కనిపించే శాస్త్రీయ తీరుతెన్నులు గమనించి జీవితాంతం ఇతనికి ముఖ్య రాజపోషకురాలిగా సహాయం చేసింది[4]. ఇతడు 1754వ సంవత్సరంలో తాను వేసిన అసంఖ్యాకమైన రేఖా చిత్రాలను లోహపు ఫలకాలపై తర్జుమా చేయించడానికి లండన్ వెళ్లాడు. అయితే అతనికి మొదట్లో ఆర్థికంగా సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇంతలో అతనికి హెన్నీ ఎంజెల్ అనే యువకునితో పరిచయం ఏర్పడింది. అతని తండ్రి డొమినికో ప్రముఖ అశ్వ వ్యాపారి. అతనికి పెద్ద అశ్వశాల ఉంది. అక్కడ వివిధ భంగిమలలో తిరుగాడుతున్న గుర్రపు చిత్రాలను స్టబ్స్ వేశాడు. దీనిలోని కొత్తదనం ఎందరినో ఆకర్షించింది. స్టబ్స్‌తో తమకు ప్రీతిపాత్రమైన గుర్రాల మూర్తి చిత్రాలను, వాటి భంగిమలను చిత్రాలుగా గీయించడానికి ఎంతో మంది ముందుకు వచ్చారు. 1760లో రిచ్‌మండ్ అనే రాచబంధువు ఒకరు తాను గుర్రంపై వేటాడే దృశ్యాలను మూడు చిత్రాలుగా వేయించుకుని స్టబ్స్‌కు పెద్ద మొత్తం బహుమతిగా ఇచ్చాడు. తరువాత ఎందరో ధనవంతులు ఇతనితో గుర్రపు చిత్రాలను గీయించసాగారు. ఇతడు జిమ్‌కార్క్, విజిల్ జాకెట్ అనే ప్రసిద్ధి చెందిన గుర్రాలను చిత్రించాడు[4].

 
విజిల్ జాకెట్ నేషనల్ గ్యాలరీ, లండన్.

ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో ఇతడు 1764లో లండన్‌లోని సోమర్‌సెట్ వీధిలో ఒక భవంతిని నిర్మించుకొని అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఇతడు ఆఫ్రికా ఖండంలో విస్తృతంగా పర్యటించి, 1763లో తాను చూసిన కొత్త జంతువుల చిత్రప్రదర్శనను ఇంగ్లాండ్‌లో ప్రదర్శించాడు. అందులో ప్రముఖంగా 'ఆఫ్రికన్ గాడిద ' చిత్రం చూడడానికి ప్రజలు ఎగబడ్డారు. దీనితో పాటు ఇతడు వేసిన చిరుత, పెద్ద ముంగిస, సింహం లాంటి చిత్రాలు కూడా సందర్శకులను ఆకర్షించాయి. 1762లో మొనాకో దేశంలో ప్రయాణ మార్గంలో ఒక గుర్రంపై దాడి చేసిన సింహాన్ని చూశాడు. ఆ సంఘటనను చిత్రంగా మలిచాడు. ఇతడు వేసిన గొప్ప ప్రాముఖ్యత పొందిన చిత్రాలలో ఇది కూడా ఒకటి. 1768లో ఇతడు అనాటమీ ఆఫ్ ది హార్స్ అనే పుస్తకాన్ని ప్రచురించాడు. ఈనాటికీ దాని సాధికారత చెక్కు చెదరలేదు. 1780లో ఇతడు రాయల్ అకాడమీకి అసోసియేట్ సభ్యుడిగా నియమితుడయ్యాడు[4].

1770లో జోషియా వెడ్జ్‌వుడ్ అనే పింగాణీ పాత్రలు చేసి ప్రావీణ్యం గావించిన వ్యక్తితో స్టబ్స్‌కు స్నేహం కుదిరింది. పింగాణీ పాత్రలపై ఎనామిల్ రంగులను ప్రయోగాత్మకంగా ఉపయోగించి ఒక కొత్త శైలికి నాంది పలికాడు. 1790 లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ తన రాచరికపు ఠీవిని ప్రదర్శింపజేసే చిత్రాలను స్టబ్స్ చేత వేయించుకున్నాడు. ఇతనికి 80 సంవత్సరాల వయస్సు వరకూ శరీర ధారుడ్యం తగ్గలేదు. చిత్రకళపై వయస్సు ఏ ప్రభావం చూపలేదు. మనిషి, పులి, కోడి ఈ మూడు జీవజాలలో కనిపించే కొన్ని సమాంతరమైన కండర నిర్మాణాలపై పరిశోధనాత్మకమైన చిత్రకళా ప్రయోగాన్ని చేయదలచి ఈ విషయమై 15 ఫలకాలు, 125 రేఖాచిత్రాలు, నాలుగు వ్రాత సంపుటాలు వ్రాశాడు. అయితే ఈ ప్రయోగం పూర్తి కాకుండానే ఇతను మరణించాడు[4].

కళాఖండాలు మార్చు

 
కంగారూ వర్ణచిత్రం,1772

ఇతడు గీసిన అనేక చిత్రాలు లండన్‌లోని నేషనల్ గ్యాలరీ, గ్రీన్‌విచ్‌లోని నేషనల్ మారిటైమ్‌ మ్యూజియం, లివర్‌పూల్‌లోని నేషనల్ మ్యూజియం, రాయల్ ఆర్ట్ గ్యాలరీ, టేట్ గ్యాలరీ, హంటరియన్ మ్యూజియం, బ్రిటిష్ స్పోర్టింగ్ ఆర్ట్ ట్రస్ట్, విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం మొదలైన అనేక గ్యాలరీలలో భద్రపరచబడ్డాయి. విజిల్ జాకెట్, ది కంగారూ ఫ్రం న్యూ హాలెండ్, హే మేకర్స్, రీపర్స్, మిల్‌బాంక్స్ అండ్ మెల్‌బోర్న్‌స్ ఫ్యామిలీస్, హార్స్ అండ్ లయనెస్, మేర్స్ అండ్ ఫౌల్స్ ఇన్ ఎ రివర్ లాండ్‌స్కేప్ మొదలైన చిత్రాలు ఇతనికి పేరు తెచ్చినపెట్టిన వాటిలో కొన్ని. ఇతని పేయింటింగ్ ఒకటి 2011లో జరిగిన వేలంలో గరిష్ఠంగా £22.4 మిలియన్లకు అమ్ముడు పోయింది[7].

మరణం మార్చు

ఇతడు తన 81వ యేట 1806, జూలై 10వ తేదీన లండన్‌లో మరణించాడు[4].

మూలాలు మార్చు

  1. Egerton, Judy (2007). George Stubbs, Painter: Catalogue raisonné. New Haven, Conn.: Yale University Press. ISBN 9780300125092. p. 10.
  2. Egerton (2007), p. 12.
  3. Egerton (2007), p. 13.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 కాండ్రేగుల, నాగేశ్వరరావు (1 November 2008). "చిత్రకళలో అశ్వఘోషుడు - స్టబ్స్" (PDF). మిసిమి. 19 (11): 15–18. Retrieved 30 March 2018.
  5. The Great Artists: part 50: Stubbs. 1985. London: Marshall Cavendish Ltd. p. 1571.
  6. The Great Artists: part 50: Stubbs. 1985. London: Marshall Cavendish Ltd. p. 1572.
  7. Scott Reyburn (6 July 2011). "Stubbs, Gainsborough Records Boost $80 Million Auction". Bloomberg.

గ్రంథసూచి మార్చు

బయటి లింకులు మార్చు