జి.ఎన్.రెడ్డి ( గోళ్ళ నారాయణస్వామి రెడ్డి) విద్యావేత్త, నిఘంటుకర్త, భాషా శాస్త్రవేత్త. ఈయన వృత్తిపరంగా ఉపన్యాసకుడు నుండి విశ్వవిద్యాలయ ఉపకులపతి స్థాయి వరకు ఎదిగాడు. భాషాశాస్త్రం, సాహిత్యం, సంస్కృతులపై వివిధ మౌలిక రచనలు చేశాడు.

జి.ఎన్.రెడ్డి
జననంజి.ఎన్.రెడ్డి
(1927-12-23)1927 డిసెంబరు 23
మరణం1989 జూలై 13(1989-07-13) (వయసు 61)
వృత్తితెలుగు అధ్యాపకుడు
ఉద్యోగంశ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం
ప్రసిద్ధివిద్యావేత్త, భాషా వేత్త

వ్యక్తిగత జీవితం

మార్చు

చిత్తూరు జిల్లా మహాసముద్రం అనే పల్లెటూరులో 23 డిసెంబరు 1927లో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు గోళ్ళ తులసమ్మ, కృష్ణారెడ్డి.

నాలుగో తరగతి వరకు విద్యాభ్యాసం స్వగ్రామమయిన మహాసముద్రంలోనే జరిగింది. గిరింపేట మునిసిపల్ స్కూల్ లో ఏడో తరగతి వరకు చదివారు. బంగారుపాళెం జమీందార్ హైస్కూల్లో 8వ తరగతి పూర్తి చేసారు. ఆ తరువాత జిల్లా బోర్డు హైస్కూల్లో చదువుకున్నాడు. 1944లో ఎస్.ఎస్.ఎల్.సీ పూర్తి చేసారు. 1946లో మద్రాస్ లోని పచ్చయ్యప్ప కళాశాలలో ఇంటర్ పూర్తి చేసాడు. 1949లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి.ఓ.ఎల్. (ఆనర్స్) పట్టా పొందాడు. ఇదే మద్రాసు విశ్వవిద్యాలయం నుండి 1955లో తెలుగుసాహిత్యం మీద ఆంగ్ల ప్రభావం అనే అంశంపై ఎమ్.లిట్ సంపాదీంచారు. 1957లో దక్కన్ కాలేజీలో అమెరికన్ ఆచార్యుల వద్ద అడ్వాన్స్ కోర్స్ ఇన్ లింగిస్టిక్స్అనే కోర్స్ పూర్తి చేసాడు. తరువాత 1962లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి తెలుగులో అర్ధపరిణామం అనే అంశం పై పరిశోధనకు గానూ డాక్టరేట్ డిగ్రీ పొందాడు. ఈ పరిశోధన A study of Telugu Semantics అనే ఒక ఆంగ్ల గ్రంథం రూపంలో వెలువడింది.

13 జూలై 1989వ సంవత్సరంలో అస్వస్థతతో తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో నిర్యాణం చెందాడు.

వృత్తి జీవితం

మార్చు

జి.ఎన్. రెడ్డి 1949-50లో ట్యూటర్ గా, 1950-57లో అసిస్టెంట్ తెలుగు లెక్చరర్ గా, అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో 1958-59 వరకు పనిచేసారు. 1959 ఆగస్టులో తెలుగు శాఖోపాధ్యాయులుగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చేరారు. 1964లో రీడర్ గా పదోన్నతి పొంది, మరొక సంవత్సరంలోనే 1965లో ఆచార్య పదవిని పొందాడు. తెలుగు శాఖాధిపతిగా 1965-82 వరకు పనిచేసాడు.

ఈయన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు బోధనేతర పదవులను నిర్వహించాడు. 1978-79 లలో ఉపప్రాచార్యుడిగా, 1966-75 ప్రాచ్య కళాశాల డీన్ గా, 1966లో అధ్యాపక సంఘానికి అధ్యక్షునిగా, 1981 నుండి 1984 వరకు విశ్వవిద్యాలయం సిండికేట్ సభ్యునిగా, 1973-82 మధ్య కేంద్ర, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీల్లో సభ్యులుగా ఉన్నాడు.

భాషాశాస్త్రానికి సంబంధించిన అనేక ప్రసిద్ధ సంస్థలలో వీరు వివిధ బాధ్యతలను నిర్వహించాడు. రాక్‌ఫెల్లర్ పరిశోధకులుగా పూనాలో కొంతకాలం పనిచేశాడు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా 1984 నుండి 1987 వరకు పనిచేశాడు. తరువాత వీరిని విశ్వవిద్యాలయ గ్రాంట్ల కమిషన్ (యు.జి.సి) ఎమిరిటిస్ ప్రొఫెసర్‌గా నియమించింది. ఈయన అనేక జాతీయ అంతర్జాతీయ సదస్సులలో పరిశోధనా పత్రాలను సమర్పించాడు. అమెరికాలోని విస్కాన్‌సిన్ విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా కొంతకాలం పనిచేశాడు. వివిధ దేశాలు పర్యటించారు. వీరి పర్యవేక్షణలో సుమారు 40 మంది పరిశోధకులకు డాక్టరేట్, యం.ఫిల్ డిగ్రీలు వచ్చాయి. 1981లో ఉత్తమ అధ్యాపక అవార్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అందుకున్నాడు.

రచనలు

మార్చు

తెలుగు నిఘంటువు (1973-సాహిత్య అకాడెమీ ముద్రితం), ఇంగ్లీషు తెలుగు నిఘంటువు (1978 - ద్విభాషా నిఘంటువు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ ముద్రితం), మాండలిక వృత్తిపదకోశం (కుమ్మరం (1976), వడ్రంగం (1983) - రెండూ సాహిత్య అకాడెమీ ముద్రితం), తెలుగు పర్యాయపద నిఘంటువు (1987-89 - 1990లో మరణానంతరం ముద్రితం) వంటి ప్రామాణిక గ్రంథాలకు సంపాదకులుగా ఉన్నాడు. భాషాశాస్త్రం, సాహిత్యం, సంస్కృతులపై వివిధ మౌలిక రచనలు చేశాడు.

ఇతర రచనలు :

  1. ది ఇన్‍ఫ్లుయన్స్ ఆఫ్ ఇంగ్లిష్ ఆన్ తెలుగు లిటరేచర్ (ఆంగ్లంలో సిద్ధాంత గ్రంథం)
  2. ఎ స్టడీ ఆఫ్ తెలుగు సెమాంటిక్స్ (ఆంగ్లంలో సిద్ధాంత గ్రంథం)
  3. సెలెక్టెడ్ ఎస్సేస్ ఆఫ్ సీపీ బ్రౌన్ (ఆంగ్లంలో)
  4. లెక్చర్స్ ఆన్ తెలుగు స్టడీస్ (ఆంగ్లంలో)
  5. పొడుపు కథలు (చిత్తూరు జిల్లాలో సేకరించిన 1575 పొడుపు కథల సంకలనం)
  6. భాషా విజ్ఞాన పరిచయం
  7. ద్రావిడ భాషా విజ్ఞానం

స్మరణలు

మార్చు

మరణానంతరం మిత్రులు, స్నేహితులు, పరిశోధకులు, విద్యార్థులు అందరూ కలిసి ఆచార్య జి.ఎన్. రెడ్డి సాహిత్య పీఠం ఏర్పాటు చేసారు.

మూలాలు

మార్చు