తరిమెల నాగిరెడ్డి

(టి.నాగిరెడ్డి నుండి దారిమార్పు చెందింది)

తరిమెల నాగిరెడ్డి (ఫిబ్రవరి 11, 1917 - జులై 28, 1976) ఆంధ్ర ప్రదేశ్కు చెందిన ప్రముఖ కమ్యూనిస్టు నాయకులలో నాగిరెడ్డి ఒకడు. అందరూ నాగిరెడ్డి గారిని టి.ఎన్ అని పిలిచేవారు.

తరిమెల నాగిరెడ్డి
Tarimella nagireddy..jpg
తరిమెల నాగిరెడ్డి
జననంతరిమెల నాగిరెడ్డి
ఫిబ్రవరి 11, 1917
అనంతపురం జిల్లా తరిమెల
మరణంజులై 28, 1976
ఇతర పేర్లుటి.ఎన్
వృత్తిఆంధ్ర ప్రదేశ్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిష్ట్ రెవల్యూషనరీస్‌ (ఎ.పి.సి.సి.ఆర్) నాయకుడు
ప్రసిద్ధిప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు

జననంసవరించు

అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో ఫిబ్రవరి 11, 1917 న రైతు కుటుంబములో జన్మించాడు.

పాఠశాల రోజుల నుండే సమాజములోని అసమానతలకు వ్యతిరేకంగా తిరుగుబాటు లక్షణాలు కనబరిచాడు. మద్రాసులోని లయోలా కళాశాలలో ఇంటర్మీడియట్ (10+2) చదివేరోజుల్లో తన జాతీయతా భావాల కారణంగా కళాశాల యాజామాన్యానికి, ఆచార్యులతో నాగిరెడ్డికి పొసగలేదు. లయోలా కళాశాల యాజమాన్యము నాగిరెడ్డికి జవహర్ లాల్ నెహ్రూ బహిరంగ ఉపన్యాసాలకు హాజరైనందుకూ, రామస్వామి ముదలియారుకు, సత్యమూర్తికి మధ్య జరిగిన ఎన్నికల ప్రచారములో పాల్గొన్నందుకు, వ్యాసరచనా పోటీలలో మహమ్మద్ బిన్ తుగ్లక్‌ను ప్రశంసించినందుకు, అనేకసార్లు జరిమానా విధించింది.

నాగిరెడ్డి లయోలా కళాశాల తరువాత వారణాసి, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించాడు. వారణాసిలో ఉన్న నాలుగేళ్ళలో నాగిరెడ్డి కమలాదేవి ఛటోపాధ్యాయ, జయప్రకాశ్ నారాయణ్,అచ్యుత్ పట్వర్ధన్ వంటి వారిచే ప్రభావితుడయ్యాడు. కమ్యూనిజం, మార్క్సిజంతో ఈయనకు వారణాసిలోనే పరిచయమయ్యింది. రష్యన్ విప్లవము, స్టాలిన్ నాయకత్వము గురించి విస్తృతముగా చదివి, భారతదేశములో కూడా మార్క్సిజాన్ని అమలుచేయవచ్చని నమ్మటం ప్రారంభించాడు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ఉపకులపతిని నిలదీశారు. మహాత్మాగాంధీకి అది తెలిసి తరిమెల నాగిరెడ్డి వైస్ ఛాన్సలర్‌కి క్షమాపణలు చెప్పాలని ఉత్తరం రాశారు. నాగిరెడ్డి అందుకు ఒప్పుకోలేదు. తిరస్కరించారు.

నాగిరెడ్డి తన ప్రభుత్వ వ్యతిరేక రాజకీయకలాపల వల్ల అనేకమార్లు జైలుకు వెళ్లాడు. 1940లో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధం, ఆర్ధిక వ్యవస్థపై దాని ప్రభావం అన్న పుస్తకం వ్రాసి ప్రభుత్వము యొక్క ఆగ్రహానికి గురై జైలుకు వెళ్ళాడు. తిరుచిరాపల్లి జైలునుండి విడుదల కాగానే మరలా 1941లో భారతీయ రక్షణ చట్టము కింద అరెస్టయ్యాడు. 1946లో ప్రకాశం ఆర్డినెన్సు కింద అరెస్టయ్యి 1947లో విడుదల చేయబడ్డాడు.

1952లో నాగిరెడ్డి మద్రాసు శాసనసభకు సి.పి.ఐ అభ్యర్థిగా అనంతపురం నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. జైలులో ఉండి కూడా, ప్రముఖ కాంగ్రేసు నాయకుడు, తన బావ అయిన నీలం సంజీవరెడ్డిపై విజయం సాధించి సంచలనం సృష్టించాడు. 1955లో కొత్తగా ఏర్పడిన పుట్లూరు నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేసి తరిమెల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయాడు. 1957లో అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి 2వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు. తిరిగి 1962లో పుట్లూరు నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సి.పి.ఐ అభ్యర్థిగా పోటీచేసి తరిమెల రామచంద్రారెడ్డి ఓడించి ఎన్నికైనాడు. 1967లో నియోజకవర్గాల పునర్విభజనలో పుట్లూరు నియోజకవర్గం రద్దుకాగా, సి.పి.ఐ (ఎం) అభ్యర్థిగా అనంతపురం నియోజకవర్గం నుండి మూడో పర్యాయం శాసనసభకు ఎన్నికయ్యాడు. 1969లో మార్చి నెలలో శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేశారు.

1968లో నాగిరెడ్డి సి.పి.ఐ (ఎం) నుండి విడిపోయి ఆంధ్ర ప్రదేశ్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిష్ట్ రెవల్యూషనరీస్‌ (ఎ.పి.సి.సి.ఆర్) - ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిష్టు ఉద్యమకారుల సమన్వయ కమిటీ‌ని స్థాపించాడు. సి.పి.ఐ (ఎం) కార్యకర్తలను కొత్తపార్టీలోకి ఆకర్షించడంలో సఫలం అయ్యాడు. కొద్దికాలం ఎ.పి.సి.సి.ఆర్ అఖిల భారత కమ్యూనిష్టు ఉద్యమకారుల సమన్వయ కమిటీలో కలసివుంది. రెడ్డి 1976లో తను మరణించేదాకా ఎ.పి.సి.సి.ఆర్ నాయకునిగా కొనసాగాడు.

నాగిరెడ్డి రచనలలో ముఖ్యమైనది ఇండియా మార్ట్‌గేజ్‌డ్ (తాకట్టులో భారతదేశం). నాగిరెడ్డి 1976, జులై 28న మరణించాడు. ఆయన భౌతికకాయాన్ని తరిమెలకు తీసుకెళ్తుండగా కల్లూరు వద్ద పోలీసులు భౌతికకాయాన్ని అరెస్టు చేశారు. ప్రజలు తండోపతండాలుగా రావడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. పోస్టుమార్టం తర్వాత భౌతికకాయాన్ని బంధువులకప్పగించారు.

బయటి లింకులుసవరించు