డార్లింగ్ Darling డార్లింగ్

డార్లింగ్ Darling డార్లింగ్ కె.భాగ్యరాజా దర్శకత్వంలో 1983, మే 14న విడుదలయ్యింది.1982లో ఇదే పేరుతో విడుదలైన తమిళ సినిమా నుండి దీనిని డబ్ చేశారు.

డార్లింగ్ Darling డార్లింగ్
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.భాగ్యరాజా
తారాగణం కె.భాగ్యరాజా,
పూర్ణిమా జయరాం ,
సుమన్,
ముచ్చెర్ల అరుణ,
ఇందిరాబాయి
సంగీతం శంకర్ గణేష్
గీతరచన రాజశ్రీ
భాష తెలుగు

కథ మార్చు

ఈ సినిమాలో భాగ్యరాజ్‌ తన యజమాని కూతురైన పూర్ణిమా జయరామ్‌ పట్ల ఇష్టం పెంచుకుంటాడు. పెద్దయ్యాక కాదు. చిన్నప్పుడే. పదేళ్ల వయసులో. ఇద్దరూ ఊటీలో చదువుకుంటూ ఉంటారు. ఒకే క్లాసులో ఒకరిని ఒకరు విడవకుండా ఉంటారు. మ్యూజికల్‌ చైర్స్‌లో ఒక్క చైరే మిగిలితే ఇద్దరూ నిలబడిపోతారు తప్ప ఒకరి మీద మరొకరు గెలవడానికి కూర్చోరు. స్కూల్‌లో మార్చింగ్‌ జరిగి ఎదురూ బొదురూ వస్తే ఆగిపోయి ఉన్న చోటే మార్చ్‌ చేస్తారు తప్ప ముందుకు కదలరు. ఆటల్లో ఒకరు ఫస్ట్‌ వస్తే ఒకరు సెకండ్‌. పోటీల్లో ఒకరు సెకండ్‌ వస్తే మరొకరు ఫస్ట్‌. కాని ఊటీలో కూడా ఎండ కాస్తుంది. వాళ్ల జీవితంలో కూడా ఎండ వచ్చింది. ఆ అమ్మాయి తండ్రికి ట్రాన్స్‌ఫర్‌ అయిపోయింది. ఆ అమ్మాయి పోతూ పోతూ ‘నేను తిరిగి వచ్చే వరకూ నన్ను గుర్తు పెట్టుకుంటావ్‌గా’ అని అడుగుతుంది. అంతేకాదు చనిపోయిన తన కుక్కపిల్ల సమాధి దగ్గర రోజూ పూలు పెడతావుగా అని కూడా అడుగుతుంది. ఆ అమ్మాయి ఎక్కిన రైలు వెళ్లిపోతుంది. దాని చక్రాల కింద ఆమె అంత వరకూ పెంచుకున్న జ్ఞాపకాలు కూడా జారిపోయాయి. కాని ఆ పిల్లవాడు మాత్రం ఆ క్షణం దగ్గరే ఫ్రీజ్‌ అయిపోయాడు. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా పదేళ్ల పాటు ఆ అమ్మాయిని ప్రేమిస్తూ ఉండిపోయాడు. అనుక్షణం ఆమె తలపులు. జ్ఞాపకాలు. కుక్కపిల్ల సమాధి మీద రోజూ పూలు పెట్టి ఎంతో గాఢంగా మౌనం పాటిస్తుంటాడు. ఇదంతా ఎవరి కోసం. తన కోసమే. ఏదో ఒక రోజు రాకపోదు తనని చూసి గుండెల్లో పొదువుకోకపోదు అని ఆశ.అమ్మాయి వచ్చింది. రిసీవ్‌ చేసుకోవడానికి స్టేషన్‌కు వెళ్లి స్టైల్‌గా ‘హాయ్‌... ఐయామ్‌ రాజా’ అన్నాడు. ఆ అమ్మాయి అతణ్ణి ఎగాదిగా చూసి ‘అయితే లగేజ్‌ అందుకో’ అంది.ఒక ఆశల బుడగ సూది మొన తగలకనే టప్పున పేలింది. ఆ అమ్మాయికి అసలు ఏమీ గుర్తు లేదు. చాలా జీవితం చూసింది. విదేశాల్లో చదువుకుంది. ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకుంది. రేపోమాపో పెళ్లి. ఈలోపు సరదాగా ఊటీ చూద్దామని ఫ్రెండ్స్‌తో వచ్చింది. ఇక్కడ చూస్తే అమర ప్రేమికుడు భాగ్యరాజ్‌. కళ్ల నిండా మనసు నిండా ఆమెను చూసుకోవడమే. అడిగితే డీసెంట్‌గా ప్రాణమిచ్చేసేలా ఉంటాడు. మొదట ఇతని వాలకం ఏమీ అర్థం కాదు. కాని మెల్లమెల్లగా అతడి మనసులోని లోతు అర్థం చేసుకుంటుంది. మరో వైపు తాను నిశ్చితార్థం చేసుకున్న వరుడు సుమన్‌ తన కోసం ఊటీ వస్తే అక్కడ అతడి కుసంస్కారం గమనిస్తుంది. భాగ్యరాజ్‌ దగ్గర డబ్బు లేదు. అతడు వాచ్‌మెన్‌ కొడుకు నిజమే. కాని అతడి లాంటి మనసు ఎక్కడ ఉందని? అందుకే ఎంగేజ్‌మెంట్‌ను కాదని భాగ్యరాజ్‌నే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకుంటుంది. అయితే ఈలోపే ఆమె మీద కృతజ్ఞతాభారం పడుతుంది. వ్యాపారంలో నష్టపోయిన తండ్రిని స్నేహితుడైన సుమన్‌ తండ్రి ఆదుకున్నాడు కనుక ఈ క్షణంలో సుమన్‌ని కాదని భాగ్యరాజ్‌ని చేసుకోవడానికి ఆమెకు కృతజ్ఞత అడ్డు వస్తుంది. నలిగిపోతున్న ఆమెను సుమన్‌ తండ్రి గమనిస్తాడు. అసలు సంగతి గ్రహిస్తాడు. ఆయన పెద్దమనిషి. సంస్కారవంతుడు. అందుకే నిజమైన ప్రేమికునికే ఆమె చెందాలని నిర్ణయిస్తాడు. పదేళ్ల సుదీర్ఘప్రేమ ఫలవంతమైంది. చిన్నప్పటి స్నేహితురాలు ప్రియురాలైంది. ఇప్పుడు ఇల్లాలైంది.[1]

నటీనటులు మార్చు

విశేషాలు మార్చు

  • ఈ సినిమాను కన్నడ భాషలో ప్రేమీ నెం.1 పేరుతో రమేష్, ప్రేమ జంటగా 2001లో నిర్మించారు.
  • ఈ సినిమా తరువాత ఇదే కథను ఆధారం చేసుకుని హలో, మనసంతా నువ్వే, వంటి ఎన్నో సినిమాలు వచ్చాయి.

మూలాలు మార్చు

  1. "డబ్బింగ్‌ క్లాసిక్స్‌– 9 డార్లింగ్‌ డార్లింగ్‌ డార్లింగ్‌". సాక్షి దినపత్రిక. 24 January 2018. Archived from the original on 20 మార్చి 2020. Retrieved 20 March 2020.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)