డి వి మోహన కృష్ణ
డి వి మోహన కృష్ణ శాస్త్రీయ సంగీత విద్వాంసులు, గాయకులు, గురువులు, స్వరకర్త.[1] శాస్త్రీయ, లలిత సంగీతంలో సమాన ప్రతిభను కలిగిన మోహన కృష్ణ, గత 40 ఏళ్ళుగా సంగీత ప్రపంచంలో ఎంతో కృషి చేశారు. ఎన్నో పాటలను, కృతులను పాడారు, రచించారు, స్వరపరిచారు. మోహన కృష్ణ, ఎన్నో సరికొత్త రాగాలను కూడా సృష్టించారు. దేశ విదేశాలలో సుమారు నాలుగు వేలకు పైగా గాత్ర కచేరీలను చేసి అనేక గౌరవాలు, సత్కారాలు, బిరుదులు, బహుమతులను అందుకున్నారు. భారతదేశమంతా పర్యటించి ఎందరో వాగ్గేయకారుల సంగీత ఉత్సవాల్లో కూడా పాల్గొన్నారు.[2]
డి వి మోహన కృష్ణ | |
---|---|
జననం | దేవరకొండ వెంకట మోహన కృష్ణ ఆగస్టు 3, 1962 |
వృత్తి | శాస్త్రీయ సంగీత విద్వాంసులు, గురువులు |
జీవిత విషయాలు
మార్చు1962వ సంవత్సరం ఆగస్టు 3వ తేదీన మచిలీపట్నంలో కళాకారుల కుటుంబంలో శ్రీ మోహన కృష్ణ జన్మించారు. తండ్రి శ్రీ డి.బి.వి సుబ్రహ్మణ్యం, తల్లి శ్రీమతి కుసుమ. ప్రముఖ పౌరాణిక నటులు “నటరాజశేఖర” బిరుదాంకితులు శ్రీ కీ.శే. డి.వి. సుబ్బారావు గారికి మోహన కృష్ణ మనవడు. మోహన కృష్ణ పూర్తిపేరు దేవరకొండ వెంకట మోహన కృష్ణ.[3]
మోహన కృష్ణ అమ్మమ్మ శ్రీమతి మల్లాది బాలవర్ధనమ్మ. ఆవిడ కూడా ఒక సంగీత కళాకారిణి. మోహన కృష్ణ సంగీత అభిలాషకు, అభివృద్ధికీ వారి అమ్మమ్మగారే స్ఫూర్తి అని ఆయన అంటారు.
సంగీత సాధన
మార్చుసంగీత నేపథ్యం ఉన్న కుటుంబం కావడం వల్ల రేడియోలో సంగీతం వినడం ప్రారంభించిన నాటి నుండే సంగీతం పట్ల మోహన కృష్ణకు ఆసక్తి కలిగింది. అప్పటి ప్రసిద్ధ గాయకులందరినీ అనుకరిస్తూ మోహన కృష్ణ పాటలు పాడేవారు. మోహన కృష్ణ మచిలీపట్నంలోని సంగీత విద్వాన్ శ్రీ శిష్టు ప్రభాకర కృష్ణమూర్తి శాస్త్రి గారి నుండి కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ప్రాథమిక శిక్షణ పొందారు. ఆయనే రోజూ మోహన కృష్ణ ఇంటికి వచ్చి సంగీత పాఠం చెప్పేవారు. అటు స్కూలు పాఠాలు, ఇటు సంగీత పాఠాలు రెండూ శ్రద్దగానే నేర్చుకున్నారు మోహన కృష్ణ.
రోజూ కచేరీ కేసెట్లు వినడంకోసం తన తల్లిదండ్రులు ఒక టేప్ రికార్డరు కూడా కొని ఇవ్వటంతో "పద్మవిభూషణ్" డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారి కచేరిలో రికార్డు చేసిన క్యాసెట్లను తొలిసారిగా వినటం జరిగింది. బాలమురళి కృష్ణ గారి గానంతో మోహనకృష్ణ మంత్రముగ్ధులు అయ్యారు. బాలమురళీ కృష్ణ గారి కచేరీలు ఏ రేడియో స్టేషన్ లో వచ్చినా దానిని రికార్డు చేయడమే పనిగా పెట్టుకునేవారు, మోహనకృష్ణ. బాలమురళి గారి పాడే తీరు, గానంలోని విలక్షణతను బాగా గమనించేవారు.
అలనాటి సినీ గాయని బి. వసంత గారు మోహన కృష్ణ కజిన్ కావడంతో, 1977లో ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళనపుడు వసంత గారి నాన్నగారు మోహన కృష్ణ గానం విని ఆనందించి, డా. మంగళంపల్లి బాలమురళికృష్ణ గారికి పరిచయం చేశారు. అ సమయంలో మోహన కృష్ణ, వారికి ఒక పాట పాడి వినిపించారు. అది మొదలు మోహనకృష్ణ బాలమురళి గారిని అప్పుడప్పుడూ కలుస్తూ చివరికి 1980లో వారి దగ్గర శిష్యుడిగా చేరి సంగీతాన్ని అభ్యసించడం మొదలుపెట్టారు. కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్తలు, 35 తాళాలలో శిక్షణ పొందారు. డి వి మోహన కృష్ణ సద్గురు త్యాగరాజ గురుశిష్య పరంపరలో ఆరవ తరానికి చెందినవారు.[4]
19 ఏళ్ళ వయసులో డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాసే సమయానికి మోహన కృష్ణ కళ్ళకు కంజెక్టివైటిస్ వచ్చింది. అందువల్ల కేవలం వారం రోజుల్లోనే మోహన కృష్ణ చూపు చాలావరకు మందగించింది. క్రమంగా చూపు పోయింది. నాటి నించీ నేటి వరకూ కేవలం తనకున్న అపారమైన ధారణా శక్తితో ఎటువంటి పుస్తక సహాయం లేకుండా అనేక కృతులను పద్యాలను లలిత గీతాలను, భక్తి గీతాలను తాను నేర్చుకుని తన శిష్యులకు బోధిస్తున్నారు. ఆయన ఒక ఏకసంతాగ్రాహి. చదువు పూర్తిచేసి తన అమ్మమ్మతోపాటు మద్రాసుకు వెళ్ళి అక్కడ ఆరు నెలలు అద్దె ఇంట్లో ఉన్నారు మోహన కృష్ణ. తన అమ్మమ్మతో కలిసి ప్రతిరోజు సిటీ బస్సు ఎక్కి బాలమురళి కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి శిక్షణ పొందేవారు. వారి ఇబ్బందిని గమనించిన బాలమురళి కృష్ణ గారు, మోహనకృష్ణకు తన ఇంటి పైన ఒక రూము ను కేటాయించి ఆరేళ్ళ పాటు ఆ ఇంట్లోనే ఉంచి సంగీతం నేర్పించారు.
తన గురువుగారైన బాలమురళి కృష్ణ గారి కీర్తనలు, సంగీత పాఠాలు, రికార్డింగుల తోటిదే ప్రపంచంగా మోహనకృష్ణ శిష్యజీవితం గడిచింది. తన గురువు గారికీ సహకారం అందిస్తూ అనేక కచేరీలలో పాల్గొన్నారు.
26 సంవత్సరాల వయసులో విజయవాడలోని ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు మోహనకృష్ణ. కొంతకాలం తరువాత హైదరాబాద్ బదిలీ అయ్యారు. హైదరాబాద్‌కు వచ్చిన తరువాత వృత్తిపరంగా ఎన్నో విజయాలను సాధించారు. ఉద్యోగంతోపాటు, ఎన్నో టీవీ ఛానల్స్‌కు కూడా పనిచేయడంతో బాగా పేరు వచ్చింది. ఆ కారణంగా సంగీతరంగంలో విస్తృతంగా పనిచేసే అవకాశాలు వచ్చాయి.[5]
సంగీత ప్రస్థానం
మార్చు- 1988 లో విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో నిలయ విద్వాంసునిగా నియమితులయ్యారు. 1999 నుండి 2022 వరకు హైదరాబాద్ లోని ఆల్ ఇండియా రేడియోలో నిలయ విద్వాంసునిగా పని చేసిన మోహన కృష్ణ, 2022 ఆగష్టులో సెలక్షన్ గ్రేడ్ పోస్టులో పదవి విరమణ చేశారు.
- కర్నాటక సంగీతంలో టాప్ గ్రేడ్ కళాకారునిగా గుర్తింపు పొంది, ఆల్ ఇండియా రేడియోలో సంగీత శిక్షణ కార్యక్రమాని కి ఒకప్పుడు శిష్యునిగా, తరువాత గురువుగా వ్యవహరిస్తున్నారు.
- హైదరాబాదులోని ఆకాశవాణి వివిధ భారతిలో ప్రసారం చేయబడిన ‘సరిగమల సరాగాలు’ అనే కార్యక్రమానికి ప్రేక్షకుల నుండి పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకున్నారు.
- వృత్తిలో భాగంగా ఆల్ ఇండియా రేడియోలో ఎన్నో లలిత గీతాలకు, దేశభక్తి గీతాలకు, భక్తి రంజని కార్యక్రమాలకు సంగీతం అందించారు.
- 1997లో ఇండోనేషియాలో సంగీత కచేరీలు చేశారు.
- 2006 నవంబర్ నెలలో ప్రముఖ నేపధ్య గాయకులు డా. ఎస్పీ బాలసుబ్రమణ్యం గారితో కలిసి “స్వరరాగ సమ్మోహనం” అనే పేరుతో ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ ప్రారంభించి ఆ కార్యక్రమాన్ని ఆరేళ్ళపాటు అప్రతిహతంగా కొనసాగించి శాస్త్రీయ సంగీతాన్ని, సినీ సంగీతాన్ని అనుసంధానం చేశారు.
- 2006వ సంవత్సరంలో అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్, మేరీల్యాండ్, వాషింగ్టన్, చికాగో, అట్లాంటా, శాక్రిమెంటో, డల్లాస్‌లలో అనేక సంగీత కచేరీలు ఇచ్చారు.
- తిరుపతి బ్రహ్మోత్సవం వేడుకలలో భాగంగా తిరుమలలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే సంగీత కచేరీలలో చాలా సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా కచేరీలు చేస్తున్నారు.
- తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ లో భాగంగా 110 అన్నమాచార్య కీర్తనలను స్వరపరిచి, వాటిలో కొన్ని స్వయంగా ఆలపించటంతోపాటు ఆ ప్రాజెక్ట్ కమిటీకి గౌరవ సలహాదారులుగా ఉన్నారు.[6]
- హనుమ, మహిత, అపరాజిత మొదలైన వివిధ రాగాలను సృష్టించారు. వివిధ దేవతలపై మంగళ హారతులతో పాటు, 50 కి పైగా కృతులను రచించి వాటిని స్వర పరిచారు.
- హైదరాబాద్‌లోని బ్లూ లోటస్ ఇన్ఫర్మేటిక్స్ అనే మ్యూజిక్ సాఫ్ట్‌వేర్ కంపెనీ అభివృద్ధి చేసిన బ్యూటీ ఆఫ్ కర్నాటిక్ మ్యూజిక్ (2 వాల్యూమ్‌లు), రాగ నిధి (3 సంపుటాలు) ప్రాజెక్టులకు సంగీత ఉపాధ్యాయులుగా సేవలను అందించారు.
- ఔత్సాహిక గాయకులకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో సంగీతాన్ని బోధిస్తున్నారు. ఈయన దగ్గర సంగీతం నేర్చుకున్నవారు సంగీత ఉపాధ్యాయులుగా, సినీ గాయకులుగా, పరిశోధకులుగా, సంగీత పాఠశాలల నిర్వాహకులుగా సంగీతాన్ని ప్రచారం చేస్తున్నారు.
- "మోహనరాగాలు" అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించి దాని ద్వారా కర్ణాటక, లలిత, భక్తి సంగీతానికి సంబంధించిన 300 వరకు వీడియోలను తయారుచేసి భావితరాలకు అందిస్తున్నారు.
అవార్డులు
మార్చు- 1980లో కర్ణాటక శాస్త్రీయ సంగీతం జాతీయ స్థాయి రేడియో పోటీలలో మొదటి బహుమతి అందుకున్నారు.
- కేంద్ర ప్రభుత్వంచే స్కాలర్ షిప్ పొంది, రెండు సంవత్సరాలు (1982, 1983) తన గురువు బాలమురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో రెండేళ్లు శిక్షణ పొందారు.
- 1989లో విజయవాడలోని టాలెంట్ అకాడమీ ద్వారా సంవత్సరపు ఉత్తమ సంగీతకారుడిగా సత్కారం అందుకున్నారు.
- 1994లో విజయవాడలోని జే సీ క్లబ్ నుండి అత్యుత్తమ సంగీత విద్వాంసుడు అవార్డును గెలుచుకున్నారు.
- 1995లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారి స్మారకార్థం ‘కళానీరాజనం’ అవార్డుతో సత్కారం పొందారు.
- 1996లో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా సన్నిధిలో ప్రదర్శన చేసి ఆయన ఆశీస్సులు పొందారు.
- 2004లో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని దుండిగల్‌లోని శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో నాద సేవ చేసి, ఆయన నుండి “స్వర్ణకంకణం”అందుకున్నారు.
- 2004లో సంగీత నృత్యోత్సవాల సందర్భంగా చెన్నైలోని వీపంచి సంస్థ నుండి శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు స్మారక పురస్కారంతో సత్కారం అందుకున్నారు.
- 2005 డిసెంబర్ లో చైతన్య ఆర్ట్ థియేటర్స్ నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ నేపథ్య గాయకుడు శ్రీ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారి నుండి జీవిత సాఫల్య పురస్కారం పొందారు.
- 2006 జనవరిలో శ్రీరామ గానసభ, నల్లకుంట, హైదరాబాద్ వారిచే “మధురగానసుధానిధి” బిరుదుతో సత్కరించారు.
- 2006 ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "లలిత సంగీత విశారద" బిరుదుతో సత్కరించింది.
- కంచి పీఠానికి చెందిన శ్రీ శ్రీ శ్రీ కంచి పరమాచార్య ఆయనను 2009లో ఆస్థాన విద్వాన్‌గా నియమించారు.
- 2009 డిసెంబర్ లో, మాజీ ప్రధానమంత్రి శ్రీ పి.వి. నరసింహారావు జ్ఞాపకార్ధం, మోహన కృష్ణకి “సంగీత సుధా నిధి” బిరుదును ప్రదానం చేశారు.
- 2009లో ఈటివిలో ప్రసారమైన “బ్లాక్” పేరుతో రెండు సిరీస్‌ల ద్వారా, అనేక మంది దృష్టిలోపం ఉన్న వర్ధమాన సంగీతకారుల జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం ఆయనకు లభించింది. ఆ కార్యక్రమం టీవీ ప్రేక్షకులను, సంగీత ప్రియులను ఆకట్టుకుంది.
- 2016లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను ‘కళారత్న’ హంస పురస్కారంతో సత్కరించింది.[7]
- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ నుండి కర్ణాటక సంగీత రంగంలో ఆయన చేసిన సేవలకు 2019 వ సంవత్సరానికి గాను ప్రతిభ పురస్కారం లభించింది.[8]
- 2022 ఆగష్టు 3నమోహన కృష్ణ షష్టిపూర్తి సందర్భంగా ఆయన శిష్య ప్రశిష్యులు ఆయనకు ఘన సన్మానం చేశారు.
మూలాలు
మార్చు- ↑ "తానా ప్రపంచ సాహిత్యవేదిక 'అమ్మభాషా సేవలో అంధ మేధావుల' సభ సక్సెస్". EENADU. Retrieved 2023-02-28.
- ↑ "If music can heal". The Hindu. 2012-10-11. ISSN 0971-751X. Retrieved 2023-02-28.
- ↑ "Devarakonda.V.Mohana Krishna". www.karnatictutor.com. Retrieved 2023-02-28.
- ↑ 2013అక్టోబర్ 11వ తేదీన ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన ''ఒకటి పోతే మరొకటి వస్తుంది : ప్రభాకర కృష్ణమూర్తి'' అనే న్యూస్ నుండి
- ↑ "Mohana Krishna | EYEWAY". eyeway.org.in. Retrieved 2023-02-28.
- ↑ 2012 సెప్టెంబర్ 16వ తేదీన ఆంధ్రప్రభ పేపర్లో వచ్చిన ''సంస్కృతీ వైభవానికి దర్పణం సంగీతం'' అనే న్యూస్ నుండి
- ↑ "23మందికి కళారత్న పురస్కారం | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Archived from the original on 2016-04-10. Retrieved 2023-02-28.
- ↑ "తెలుగువర్సిటీ ప్రతిభా పురస్కారాల ప్రదానం". EENADU. Retrieved 2023-02-28.