తాన్‌సేన్
తాన్‌సేన్ (సి 1500 -. 1586) హిందుస్తానీ శాస్త్రీయ సంగీతకారుడు.[1] ప్రముఖ వాగ్గేయకారుడు. మధ్య ఆసియాకు చెందిన రబాబ్ అనే సంగీత వాయిద్యాన్ని తీర్చిదిద్దాడు. మొఘల్ చక్రవర్తి అక్బర్ నవరత్నాలలో ఒకడు. అక్బర్ ఇతన్ని మియాఁ (మహా పండితుడు) అనే బిరుదునిచ్చి గౌరవించాడు. అతని అసలు పేరు రామ్‌తాను పాండే.
హిందూ కుటుంబంలో జన్మించిన అతను ఆధునిక మధ్యప్రదేశ్ యొక్క వాయవ్య ప్రాంతంలో తన కళను నేర్చుకున్నాడు. రేవా రాజు రాజా రామ్‌చంద్ర సింగ్ (1555–1592) ఆస్థానంలో అతను తన వృత్తిని ప్రారంభించాడు. తన వయోజన జీవితంలో ఎక్కువ భాగం అతడి పోషణలోనే గడిపాడు. ఇక్కడుండగా తాన్‌సేన్ సంగీత సామర్థ్యాలు, అధ్యయనాలు విస్తృత ఖ్యాతిని పొందాయి.[1] ఈ ఖ్యాతి మొఘల్ చక్రవర్తి అక్బర్ దృష్టికి వెళ్ళింది. తాన్‌సేన్‌ను మొఘల్ దర్బారు లోని సంగీతకారులతో చేరేందుకు పంపాలని కోరుతూ అతను రాజా రామ్‌చంద్ర సింగ్‌కు దూతలను పంపాడు. తాన్‌సేన్ వెళ్లడానికి ఇష్టపడలేదు. కాని రాజా రామ్‌చంద్ర సింగ్ అతన్ని ప్రోత్సహించి పంపించాడు.1562 లో, 60 సంవత్సరాల వయస్సులో, వైష్ణవ [2] సంగీతకారుడు తాన్‌సేన్ అక్బర్ దర్బారులో చేరాడు. అతని ప్రదర్శనలు చాలా మంది కోర్టు చరిత్రకారుల కథనాలకు సరుకుగా మారాయి.[1]
తాన్‌సేన్ గురించి అనేక కథలు వ్యాప్తిలో ఉన్నాయి. వాస్తవాలు, కల్పనలను మిళితం చేశాయి. ఈ కథల చారిత్రకత సందేహాస్పదంగా ఉంది.[3] అక్బర్ అతన్ని నవరత్నాలలో (తొమ్మిది ఆభరణాలు) ఒకటిగా భావించి, అతనికి మియా అనే బిరుదును ఇచ్చాడు.[4]
తాన్‌సేన్ ఒక స్వరకర్త, సంగీతకారుడు, గాయకుడు, ఉత్తర భారతదేశం లోని అనేక కంపోజిషన్లు అతనికి ఆపాదించారు. అతను సంగీత వాయిద్యాలకు ప్రాచుర్యం తెచ్చిపెట్టిన వాయిద్య కారుడు. హిందూస్థానీ సంగీతంలో ఉత్తర భారతీయ సంప్రదాయంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఆయన ఒకడు. 16 వ శతాబ్దంలో అతడు చేసిన అధ్యయనాలు, కట్టిన స్వరాలూ చాలా మందికి స్ఫూర్తినిచ్చాయి. అతన్ని అనేక ఉత్తర భారత ఘరానాలు (ప్రాంతీయ సంగీత పాఠశాలలు) తమ ఘరానా స్థాపకుడిగా భావిస్తారు.[5][6]
ప్రఖ్యాతి గాంచిన ధ్రుపద్ కంపోజిషన్లకు, అనేక కొత్త రాగాలను సృష్టించినందుకు, అలాగే శ్రీ గణేష్ స్తోత్రం, సంగీత సారం అనే రెండు పుస్తకాలను వ్రాసినందుకూ అతడు ప్రసిద్ధుడయ్యాడు.[7]
జీవిత విశేషాలు
మార్చుతాన్సేన్ పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశం అస్పష్టంగా ఉన్నాయి. కాని చాలా మూలాలు అతను సా.శ. 1493 - 1506 మధ్య పుట్టాడని చెప్పాయి అతని జీవిత చరిత్ర కూడా అస్పష్టంగా ఉంది. కొన్ని సాధారణ అంశాలతో పాటు, పరస్పర విరుద్ధమైన కథనాలు కూడా ఉన్నాయి. తాన్‌సేన్ గురించి చారిత్రక వాస్తవాలు అతని చుట్టూ అల్లుకుని ఉన్న విస్తృతమైన, విరుద్ధమైన కథనాల నుండి సేకరించడం కష్టం.[8]
వివిధ కథలలోని సాధారణ అంశాల ప్రకారం, చిన్నతనంలో తాన్‌సేన్ పేరు రామ్‌తాను. అతని తండ్రి ముకుంద్ పాండే (మకరంద్ పాండే, ముకుంద్ మిశ్రా, లేదా ముకుంద్ రామ్ అని కూడా చెబుతారు) [9] ఒక సంపన్న కవి, నిష్ణాతుడైన సంగీతకారుడు. అతడు కొంతకాలం వారణాసిలో హిందూ దేవాలయ పూజారిగా కూడా ఉన్నాడు.
తాన్‌సేన్‌కు ఇద్దరు భార్యలు. అతని భార్య మెహరున్నీసా, చక్రవర్తి అక్బర్ కుమార్తె. తన్రాస్ ఖాన్, బిలాస్ ఖాన్, హమీర్సేన్, సూరత్సేన్, సరస్వతి దేవిలతో సహా తాన్‌సేన్ పిల్లలందరూ సంగీతకారులే.[10] మెహరున్నీసాను తాన్‌సేన్ వివాహం చేసుకున్నట్లు జహంగీర్నామా ప్రస్తావించింది. ఈ కారణంగా, అక్బర్ తాన్‌సేన్‌ను ఇస్లాంను అంగీకరించమని బలవంతం చేశాడు.
తాన్‌సేన్ మరణించిన సంవత్సరం అస్పష్టంగా ఉంది. ఇస్లామిక్ చరిత్రకారులు రాసిన దాని ప్రకారం, తాన్‌సేన్ 1586 లో ఢిల్లీలో మరణించాడు. ముస్లిం ఆచారాల ప్రకారం అతడికి అంత్యక్రియలు చేసారు. ఊరేగింపుకు అక్బర్, అతని దర్బారులో చాలా మంది హాజరయ్యారు.[11] హిందూ చరిత్రకారులు రాసిన చరిత్రలో, 1589 ఏప్రిల్ 26 ను ఆయన మరణించిన తేదీగా ఇచ్చారు. అతని అంత్యక్రియలు హిందూ ఆచారాల ప్రకారం జరిగాయి.[12] తాన్‌సేన్ అవశేషాలను గ్వాలియర్‌లోని తన సూఫీ మాస్టర్ షేక్ ముహమ్మద్ ఘౌస్ సమాధి స్థలంలో ఖననం చేశారు. ప్రతి సంవత్సరం డిసెంబరులో తాన్‌సేన్ సమరోహ్ గ్వాలియర్‌లో జరుగుతుంది.[13]
'తాన్‌సేన్ సమరోహ' అనే ఒక జాతీయ సంగీత ఉత్సవం ప్రతి సంవత్సరం డిసెంబరులో, అతని జ్ఞాపకార్థం బెహత్ వద్ద ఉన్న తాన్‌సేన్ సమాధి సమీపంలో జరుగుతుంది. తాన్‌సేన్ సమ్మాన్ లేదా తాన్‌సేన్ అవార్డు హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంలో ఉద్దండులకు ఇస్తారు.
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 Bonnie C. Wade (1998). Imaging Sound: An Ethnomusicological Study of Music, Art, and Culture in Mughal India. University of Chicago Press. pp. 108–110. ISBN 978-0-226-86841-7.
- ↑ Edmour J. Babineau (1979). Love of God and Social Duty in the Rāmcaritmānas. Motilal Banarsidass. p. 54. ISBN 978-0-89684-050-8.
- ↑ Nazir Ali Jairazbhoy (1995). The Rāgs of North Indian Music: Their Structure and Evolution. Popular Prakashan. pp. 19–20. ISBN 978-81-7154-395-3.
- ↑ Davar, Ashok (1987). Tansen – The Magical Musician. India: National book trust.
- ↑ Andrea L. Stanton; Edward Ramsamy; Peter J. Seybolt; et al. (2012). Cultural Sociology of the Middle East, Asia, and Africa: An Encyclopedia. SAGE Publications. p. 125. ISBN 978-1-4522-6662-6.
- ↑ Bruno Nettl; Ruth M. Stone; James Porter; et al. (1998). The Garland Encyclopedia of World Music: South Asia : the Indian subcontinent. Taylor & Francis. pp. 376–377. ISBN 978-0-8240-4946-1.
- ↑ Bonnie C. Wade (1998). Imaging Sound: An Ethnomusicological Study of Music, Art, and Culture in Mughal India. University of Chicago Press. p. 117. ISBN 978-0-226-86841-7.
- ↑ Bonnie C. Wade (1998). Imaging Sound: An Ethnomusicological Study of Music, Art, and Culture in Mughal India. University of Chicago Press. pp. 113–114. ISBN 978-0-226-86841-7.
- ↑ Sunita Dhar (1989). Senia gharana, its contribution to Indian classical music. Reliance. p. 19. ISBN 978-81-85047-49-2.
- ↑ The Life and work of Wazir Khan of Rampur, and the prominent disciples of Wazir Khan, Research by Rati Rastogi, RohilKhand University, Barailey
- ↑ Stephen F. Dale (2009). The Muslim Empires of the Ottomans, Safavids, and Mughals. Cambridge University Press. p. 160. ISBN 978-1-316-18439-4.
- ↑ Bonnie C. Wade (1998). Imaging Sound: An Ethnomusicological Study of Music, Art, and Culture in Mughal India. University of Chicago Press. p. 115. ISBN 978-0-226-86840-0.
- ↑ "Strains of a raga ... in Gwalior". The Hindu. 11 January 2004. Archived from the original on 30 సెప్టెంబరు 2004. Retrieved 26 జూన్ 2020.