తారకేశ్వరి సిన్హా

భారతీయ రాజకీయవేత్త
(తార్కెశ్వరి సిన్హా నుండి దారిమార్పు చెందింది)

తారకేశ్వరి సిన్హా (26 డిసెంబరు 1926 - 14 ఆగస్టు 2007) బీహార్ రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు, రాజకీయ నాయకురాలు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు.[1] దేశంలోని మొదటి మహిళా రాజకీయ నాయకులలో ఒకరైన తారకేశ్వరి సిన్హా, క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకైన పాత్రను కూడా పోషించింది. 26 సంవత్సరాల వయస్సులో 1952లో పాట్నా ఈస్ట్ నియోజకవర్గం నుండి 1వ లోక్‌సభకు ఎన్నికయింది. ఆ తరువాత, బార్ నియోజకవర్గం నుండి 1957, 1962, 1967 లోక్‌సభ ఎన్నికయింది.[2] ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో 1958 నుండి 1964 వరకు తొలి మహిళా డిప్యూటీ ఆర్థిక మంత్రిగా పనిచేసింది. ఐక్యరాజ్య సమితి, టోక్యోను సందర్శించిన ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించింది. విమర్శకుల ప్రశంసలు పొందిన గుల్జార్ దర్శకత్వంలో వచ్చిన ఆంధి సినిమా ఇందిరా గాంధీ కాకుండా తారకేశ్వరి సిన్హా నుండి పాక్షికంగా ప్రేరణ పొందింది.[3]

తారకేశ్వరి సిన్హా
మాజీ పార్లమెంట్ సభ్యురాలు
నియోజకవర్గంబార్ (బీహార్)
వ్యక్తిగత వివరాలు
జననం(1926-12-26)1926 డిసెంబరు 26
తులసిగర్, నలంద జిల్లా, బీహార్
మరణం2007 ఆగస్టు 14(2007-08-14) (వయసు 80)
న్యూఢిల్లీ
జాతీయతభారతీయురాలు
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
కళాశాలలండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్

జననం, విద్య మార్చు

తారకేశ్వరి 1926, డిసెంబరు 26న బీహార్ రాష్ట్రం, నలంద జిల్లా పరిధిలోని చండీ సమీపంలోని తులసిగర్ గ్రామంలో భూమిహార్ కుటుంబంలో జన్మించింది. పాట్నాలోని మగధ్ మహిళా కళాశాల (బంకిపూర్ బాలికల కళాశాల)లో విద్యను అభ్యసించింది. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ నుండి విడిపోయిన బీహార్ స్టూడెంట్స్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కూడా కొంతకాలం పనిచేసింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఎకనామిక్స్‌లో ఎంఎస్సీ చేసింది.

ఉద్యమం మార్చు

స్వాతంత్ర్యోద్యమ కాలంలో క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా చురుకుగా పాల్గొన్నది.[4]

రాజకీయ జీవితం మార్చు

తారకేశ్వరి బీహార్‌లోని బార్ నియోజకవర్గం నుండి తొలిసారిగా పోటీ చేసింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, 1952లో పాట్నా తూర్పు నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ పొంది, మొదటి సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ నుండి 1957, 1962, 1967లలో జరిగిన ఎన్నిలకల్లో కూడా గెలుపొందింది.[4]

1957, నవంబరు 19న సిల్హా టు టెల్ ది ట్రూత్ గేమ్ షోలో కనిపించింది.[5]

మొరార్జీ దేశాయ్‌కి సన్నిహితురాలిగా ఉన్న తారకేశ్వరి, లాల్ బహదూర్ శాస్త్రి స్థానంలో ఇందిరా గాంధీకి, దేశాయ్ కి మధ్య జరిగిన వారసత్వ పోరులో అతని పక్షాన ఉన్నది. దేశాయ్, ఇతర నాయకులు కాంగ్రెస్‌కు రాజీనామా చేసినప్పుడు, తారకేశ్వరి కూడా రాజీనామా చేసింది. 1971 లోక్‌సభ ఎన్నికల సమయంలో బార్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ (ఓ) అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి ధరమ్‌వీర్ సిన్హా చేతిలో ఓడిపోయింది. తరువాతి ఏడాది కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి, ఇందిరాగాంధీ పార్టీకి తిరిగి వచ్చింది. 1977లో బెగుసరాయ్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసింది, బీహార్‌లో కాంగ్రెస్ పూర్తిగా ఓడిపోయింది. 1978 నవంబరులో కాంగ్రెస్ అభ్యర్థిగా సమస్తిపుర్ నుండి లోక్‌సభకు ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది.

ఆ తరువాత రాజకీయాల నుండి రిటైర్ అయ్యి, సామాజిక సేవను చేపట్టింది.

సామాజిక సేవ మార్చు

న్యూఢిల్లీలో విమాన ప్రమాదంలో మరణించిన ఎయిర్ ఇండియా పైలట్, తన సోదరుడు కెప్టెన్ గిరీష్ నందన్ సింగ్ జ్ఞాపకార్థం తులసిగడ్డలో ఒక ఆసుపత్రిని నిర్మించింది. రెండు అంతస్తుల ఆసుపత్రి నిర్మాణం కోసం ఆ రోజుల్లోనే పెద్ద మొత్తంగా దాదాపు రూ. 25 లక్షలు సేకరించింది. ఇందులో ఉచితంగా వైద్యం అందించేది.

మరణం మార్చు

తారకేశ్వరి తన 80వ ఏట 2007, ఆగస్టు 14న న్యూఢిల్లీలో మరణించింది.

మూలాలు మార్చు

  1. "Tarkeshwari Sinha". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). 1971-03-05. ISSN 0362-4331. Retrieved 2021-09-29.
  2. "Members Bioprofile". loksabhaph.nic.in. Retrieved 2021-09-29.
  3. Sanjay Suri. "Mrs. G's String of Beaus".
  4. 4.0 4.1 "Tarkeshwari Sinha". veethi.com. Retrieved 2021-09-29.
  5. YouTube