తెలుగుగంగ ప్రాజెక్టు

చెన్నైకి తాగునీరిచ్చే ఉద్దేశంతో మొలకెత్తిన ఈ తెలుగుగంగ ప్రాజెక్టు ప్రాజెక్టు ప్రతిపాదనకు, రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలకు సాగునీటి సరఫరా కూడా తరువాతికాలంలో చేరింది.

నేపథ్యంసవరించు

 
కర్నూలు జిల్లా ఆత్మకూరు వద్ద తెలుగు గంగ కాలువ దృశ్య చిత్రం

తాగునీటి సమస్యతో అతలాకుతలమైపోతూ ఉండే చెన్నై నగరానికి కృష్ణా జలాలను అందించడమే సరైన పరిష్కారంగా ప్రభుత్వాలు, నిపుణులూ కూడా భావించారు. 1950ల మొదట్లో, నాగార్జునసాగర్ ప్రాజెక్టు కట్టక మునుపు, కృష్ణా-పెన్నా ప్రాజెక్టు నొకదానిని రూపొందించి, కృష్ణా నీటిని చెన్నైకి తరలించే ఆలోచన చేసింది, రాజాజీ నాయకత్వంలోని అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం. అయితే నిపుణుల సంఘం దానిని ఆమోదించక, నల్గొండ జిల్లా నందికొండ దీనికనువైనదిగా సూచించింది. అక్కడే నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. అయితే, చెన్నై నీటి సమస్య అలాగే ఉండిపోయింది.

ప్రతిపాదనలుసవరించు

తమిళనాడు ప్రభుత్వ ప్రయత్నాల ఫలితంగా, 1971లో కృష్ణా పరీవాహక ప్రాంతంలోని మూడు రాష్ట్రాల మధ్యా ఒక ఒప్పందాన్ని అప్పటి కేంద్రప్రభుత్వం కుదిర్చింది. దీని ప్రకారం, ఈ మూడు రాష్ట్రాలు - మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ - తమ వాటా లోనుండి తలా 5 టి.ఎం.సి.( శతకోటి ఘనపుటడుగులు.) నీటిని చెన్నై తాగునీటి కోసం కేటాయిస్తాయి.

1976 ఏప్రిల్ 14మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు ముఖ్యమంత్రుల మధ్య ఈ విషయమై చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. తెలుగుగంగ చరిత్రలో ఇదో మైలురాయి. 1977 అక్టోబరులో జరిగిన అంతర్రాష్ట్ర మంత్రుల స్థాయి సమవేశంలో, శ్రీశైలం ప్రాజెక్టు నుండి ఈ నీటిని తీసుకోవాలని నిర్ణయించారు. 1978లో ప్రాజెక్టుకు సంబంధించిన పరిశీలన పనులు మొదలై, 1983కి ముగిసాయి.

రామారావు ప్రవేశంసవరించు

1983లో ముఖ్యమంత్రిగా రామారావు రంగప్రవేశం చేసాడు. కాంగ్రెసు పార్టీతో ఆయనకు ఉన్న రాజకీయ స్పర్థ తెలుగుగంగ విషయంలో నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆయనకు ఉపయోగపడింది. పూర్వపు కాంగ్రెసు ముఖ్యమంత్రులు పార్టీ అధిష్టానాన్ని మన్నించి, సర్దుకోవలసి వచ్చేది. రామారావుకు ఇది లేకపోవడం వలన, తన వాదనలు, నిబంధనల విషయంలో గట్టిగా ఉండి, రాయలసీమ సేద్యపు నీటిని కూడా ప్రాజెక్టులో భాగం చేసాడు.1983 మే 23 న ఆంధ్ర, తమిళనాడు ముఖ్యమంత్రులు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సమక్షంలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రారంభం జరిగింది.

ప్రాజెక్టు తుది రూపుసవరించు

406 కి.మీ. పొడవైన కాలువలు గల తెలుగుగంగ ప్రాజెక్టు తుదిరూపు ఇలా ఉంది:

 • శ్రీశైలం ప్రాజెక్టు నుండి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం కుడి ప్రధాన కాలువలోకి నీటి మళ్ళింపు.
 • కుడి ప్రధాన కాలువ 16.4 కి.మీ. ప్రయాణించి, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్ద ముగుస్తుంది.
 • బనకచర్ల లోని ఎడమ రెగ్యులేటర్ ద్వారా నీరు వెలుగోడు బాలెన్సింగు జలాశయం చేరుతుంది.
 • వెలుగోడు నుండి నీరు చెన్నముక్కపల్లి వద్ద పెన్నా నదిలో కలిసి సోమశిల జలాశయం చేరుతుంది.
 • సోమశిల నుండి 45 కి.మీ. ప్రయాణించి, కందలేరు జలాశయం చేరుతుంది.
 • కందలేరు నుండి 152 కి.మీ. ప్రయాణించి, తమిళనాడు లోని పూండి జలాశయానికి చేరుతుంది.

1996 సెప్టెంబర్ 23 న తెలుగుగంగ నీళ్ళు మొదటిసారిగా తమిళనాడు లోకి ప్రవేశించాయి..

తొలిగా వచ్చిన నీరు 500 మిలియన్ ఘనపు అడుగులు (14×10^6 మీ3) ఆశలను వమ్ము చేసింది. 2002 లో, సత్యసాయిబాబా కాలవ పునరుద్ధరణ, కాలువకు సిమెంట్ లైనింగ్ చేసేపని ప్రారంభించి 2004 పూర్తి చేసినతరువాత పూండి జలాశయంలోకి నీరు ప్రవేశించాయి.[1] 2006 లో చెన్నై కు సరఫరా అయిన నీరు s 3.7 బిలియన్ ఘనపు అడుగులు (100×10^6 మీ3).[2]

కాలవ పునరుద్ధరణ అయినతరువాత కందలేరు-పూండి భాగాన్ని సాయి గంగ గా పేరు పెట్టారు.[3][4][5]

వివాదాలుసవరించు

అంతర్రాష్ట్ర వివాదాలుసవరించు

రాయలసీమ, నెల్లూరు ప్రాంతాల సాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి సహజంగానే వచ్చింది. మిగిలిన రాష్ట్రాలు దీనికి అభ్యంతరం తెలిపాయి. దీనికి ప్రధాన కారణం - బచావత్ ట్రిబ్యునల్లో శ్రీశైలం నుండి రాయలసీమకు కృష్ణా జలాల కేటాయింపులు లేవు. శ్రీశైలం ప్రాజెక్టు నుండి సాగునీరు వాడుకుంటే అది ట్రిబ్యునల్ కేటాయింపుల ఉల్లంఘనే అనేది ఎగువ రాష్ట్రాల వాదన. ఆంధ్ర ప్రదేశ్ వాదన ఇలా ఉంది. మూడు రాష్ట్రాల వాటా పోను కృష్ణా నదిలో ప్రవహించే అదనపు జలాలను వాడుకునే స్వేచ్ఛను ఆంధ్ర ప్రదేశ్ కు ట్రిబ్యునల్ ఇచ్చింది. కాబట్టి ఎగువ రాష్ట్రాలకు ఈ విషయంలో అభ్యంతరాలు ఉండనవసరం లేదు.

కర్ణాటక ప్రభుత్వం చేసిన మరో వాదన: "శ్రీశైలం నుండి సాగునీరు ఇవ్వదలచిన నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలు పూర్తిగాను, కర్నూలు జిల్లాలో సగానికిపైగాను పెన్నా పరీవాహక ప్రాంతంలోనివి. కృష్ణా బేసిన్ పరిధిలోకి రావు. సాగునీటిని వేరే బేసిన్ కు తరలించడం సరైనది కాదు." కర్ణాటక తన ఈ అభ్యంతరాన్ని ట్రిబ్యునల్ కు నివేదించగా, అలా తరలించడంలో తప్పేమీ లేదని ట్రిబ్యునల్ తేల్చింది.

కలివికోడిసవరించు

అంతర్రాష్ట్ర సమస్యలు, ప్రాంతాల మధ్య నీటి పంపకాల వివాదాలు, పర్యావరణ సమస్యలకు తోడు తెలుగుగంగ మరో ప్రత్యేక సమస్య నెదుర్కొంటోంది. కడప జిల్లాలో కనిపించే అత్యంత అరుదైన కలివికోడి అనే పక్షి ఈ కాలువ తవ్వకం వలన అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది.

మూలాలుసవరించు

 1. "Kandaleru water reaches Satyamurthi Sagar". The Hindu. Chennai, India. 2004-03-08. Retrieved 2007-09-17.
 2. "AP to release Krishna waters to Chennai". The Tribune. 2006-08-06. Retrieved 2007-09-17.
 3. "Chennai benefits from Sai Baba's initiative". The Hindu. 1 December 2004. Retrieved 5 January 2019.
 4. The Hindu: Project Water by Hiramalini Seshadri, 25 June 2003, Available online Archived 26 ఫిబ్రవరి 2009 at the Wayback Machine
 5. "Water projects: CM all praise for Satya Sai Trust". The Hindu. 13 February 2004. Retrieved 5 January 2019.

 • టి.ఎం.సి:(Thousand Million Cubic Feet) శతకోటి ఘనపుటడుగులు. ఘనపరిమాణపు కొలత.
 • క్యూసెక్కు: క్యూబిక్ ఫుట్/సెకండు. ప్రవాహపు రేటు యొక్క కొలత. 1 క్యూసెక్కు = 28.317 లీటర్లు/సెకండు