థార్ ఎడారి (హిందీ: थार मरुस्थल) భారత దేశానికి వాయువ్య దిశలో భారత పాకిస్తాన్ సరిహద్దులలో ఉంది. ఈ ఎడారిని గ్రేట్ ఇండియన్ డెసర్ట్ అని పిలుస్తారు.[1]. ఈ ఎడారి ప్రధానంగా రాజస్థాన్ రాష్ట్రంలో, కొంత భాగము హర్యానా, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలలో, కొద్ది భాగము పాకిస్తాన్ దేశంలోని పంజాబ్ రాష్ట్రములో విస్తరించి ఉంది.[2][3] పాకిస్తాన్లో విస్తరించి ఉన్న ఎడారిని ఖలిస్తాన్ ఎడారి అని పిలుస్తారు. థార్ ఎడారి భౌగోళిక సరిహద్దులు వాయువ్యాన సట్లెజ్ నది, తూర్పున ఆరావళీ పర్వత శ్రేణులు, దక్షిణాన రాణ్ ఆఫ్ కచ్ సాల్ట్ మార్ష్ (ఉప్పుకయ్య), పశ్చిమాన సింధూ నది. ఉత్తరాన థార్ ఎడారికి, విశాలమైన ముళ్ళపొదల భూములకు ఉన్న సరిహద్దు కచ్చితంగా నిర్వచించబడలేదు. అందువళ్ళ ఏ ప్రాంతాలను పరిగణనలోకి తీసుకున్నారో, తీసుకోలేదో అన్న విషయముపై థార్ ఎడారి పరిమాణము యొక్క అంచనాలు గణనీయంగా మారుతుంటాయి.[4]

థార్ ఎడారి
గ్రేట్ ఇండియన్ డిసెర్ట్
Desert
Thar desert Rajasthan India.jpg
థార్ ఎడారి, రాజస్థాన్, భారతదేశం
Countries భారతదేశం, పాకిస్థాన్
రాష్ట్రం భారతదేశం:
రాజస్థాన్
హర్యానా
పంజాబ్
గుజరాత్

పాకిస్థాన్:
Sindh
పంజాబ్
Biome Desert
Plant cactus
Animal camel
థార్ ఎడారి చూపిస్తున్న నాసా వారి ఉపగ్రహ చిత్రము - ఈ చిత్రములో భారత పాకిస్తాన్ సరిహద్దులు మిళితం అయి ఉన్నాయి. ఎడమ మధ్య భాగములో ఉన్నది ఎడారి. సింధూ నది దాని ఉపనదులు ఎడమ వైపు ఉన్నాయి. ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్నది ఆరావళి పర్వత శ్రేణులు

విస్తీర్ణంసవరించు

వర్డల్ వైడ్ ఫండ్ వారి నిర్వచనం ప్రకారం,[5] ఎడారి ప్రాంతం 92,200 చదరపు మైళ్ళు (238,700 చ.కి.మీ). ఇతర ఆధారాల ప్రకారం 805 కి.మీ పొడవు (500 మైళ్ళు) 485 కి.మీ (300 మైళ్ళు) వెడల్పుతో 446,000 చదరపు కి.మీల వైశాల్యములో ఉంది. భారత దేశ భూభాగములో ఉన్న ఈ ఎడారి 61% రాజస్థాన్లో 20% గుజరాత్లో 9% పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో విస్తరించి ఉంది.[6]

థార్ ఎడారి పుట్టుకసవరించు

 
Greening desert with plantations of jojoba at Fatehpur, Shekhawati

ఈ ఏడారి పుట్టుక మీద భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొందరి ప్రకారం ఈ ఎడారి 4,000-10,000 సంవత్సరాలు మాత్రమే పురాతనమైనది. క్రీ.పూ. 2000-1500 సంవత్సరాల ప్రకారం ఇక్కడ ప్రవహించే ఘగ్గర్ నది ఇంకి పోవడం వల్ల ఈ ఎడారి ఏర్పడిందని భావిస్తారు. ప్రస్తుతం ఎడారిగా ఉన్న ఈ ప్రాంతం ఒకప్పుడు మొహంజోదారో కేంద్రంగా ఉంటూ సింధు లోయ నాగరికత ప్రజలకు ప్రధాన నీటి వనరుగా ఉండేది. చతుర్ధ కల్పంలో జరిగిన భౌగోళిక మార్పుల కారణంగా ఈ ప్రాంతం నదీప్రవాహాలలో పెనుమార్పులు సంభవించాయని భావిస్తున్నారు. పలు శోధనలు మాత్రం సరస్వతీ నదీకాలువలు ఘగ్గర్ నదిలో సంగమించాయి అన్న అభిప్రాయాలతో ఏకీభవించడంలేదు. ఘగ్గర్ నదికి ప్రధాన ఉపనది అయిన సట్లైజ్ నది ఇక్కడి నదీమైదానంలో ప్రవహించినట్లు విశ్వసిస్తున్నారు. కాలప్రవాహంలో సంభవించిన భౌగోళిక పెనుమార్పుల కారణంగా సట్లైజ్ నది పడమటి దిక్కుగా యమునా నది తూర్పు దిశగా ప్రవహిస్తూ ఘగ్గర్ నది-హక్రా లలో సంగమిస్తున్నాయి.

రాబర్ట్ రైక్స్ కాలి భంగన్ వద్ద జరిపిన పరిశోధనలు ఇక్కడి నది ఎండిపోయిన కారణంగా దీనిని నివాసితులు వదిలి వెళ్లిన కారణంగా ఈ ప్రదేశం నిర్మానుష్యం అయిందని వివరిస్తున్నాయి. కాలి భంగన్ వద్ద లభించిన క్రీ.పూ 2000-1900 చెందిన రేడియో కార్బన్ క్రీ.పూ 2000-1900 చెందినది కనుక రాబర్ట్ రైక్స్ అభిప్రాయంతో ఏకీభవించాడు. నాగరికులైన హరప్పన్ వాసులు ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిన సమయానికి ఈ సమయానికి సామ్యత కనిపిస్తుంది. హైడ్రోలాజికల్ సాక్ష్యాలు ఘగ్గర్ నది-హక్రా ఎండి పోయిన కారణంగానే ఈ ప్రదేశం నిర్మానుష్యం అయినట్లు సూచిస్తున్నాయి. ఇటలీకి చెందిన రైక్స్ భారతీయ సహచరులతో కలసి ఈ పరిశోధనలు జరిపాడు.

పురాతన సాహిత్యంలో థార్ ఎడారిసవరించు

భారతీయ కావ్యాలు ఈ ప్రదేశాన్ని లవణసాగరంగా (ఉప్పుసముద్రం) వర్ణించాయి. రామాయణంలో రాముడు లంక మీద దండెత్తడానికి అడ్డుగా ఉన్న ద్రుమాకహల్య సముద్రాన్ని ఎండించడానికి ఆగ్నేయాస్త్రాన్ని సంధించిన సమయంలో దానికి ఉత్తరంగా మారుకాంతరుని చేత ఏర్పడిన మంచినీటి సరసు లవణసాగరం ఉన్నట్లు ప్రస్తావన చేయబడింది.[7] విశ్వావిర్భావం గురించి వివరించే జైన గ్రంథాలు మధ్యలోకానికి కేంద్రంగా జంబుద్వీపం ఉన్నట్లు వర్ణించబడింది. అంటే విశ్వానికి కేంద్రంగా జంబుద్వీపం ఉన్నట్లు వర్ణించబడింది. అక్కడ మానవులు నివసిస్తున్నట్లు వర్ణించబడింది. జంబుద్వీపాన్ని గురించిన జంబుద్వీప ప్రజ్ఞాపతి అనే గ్రంథంలో జంబూకవృక్షాలు అధికంగా ఉన్న ప్రదేశమైన జంబుద్వీపం లవణ సముద్రంతో ఆవరించబడి ఉన్నట్లు వర్ణించబడింది. ప్రథమ జైన తీర్ధంకరుడైన ఋషభుడు, భరతమహారాజు జీవిత చరిత్రలలో జంబుద్వీపం లవణోదక సముద్రం చేత ఆవరించబడి ఉన్నట్లు వర్ణించబడింది.

హిందూపురాణాలలో వర్ణించబడిన ఋగ్వేదకాల నది సరస్వతి. ఋగ్వేదంలో నదీస్థుతిలో తూర్పున యమున, పడమట సట్లైజ్ నదుల మధ్య సరస్వతీ నది ఉన్నట్లు వర్ణించబడింది. తరువాత తంద్య, జైమినీయ బ్రాహ్మణుల వేద నిర్వచనంలో అలాగే మహాభారతంలో సరస్వతీ నది ఎడారిలో ఇంకి పోయినట్లు వర్ణించబడింది.

పలుపరిశోధకులు ఋగ్వేదంలో వర్ణించబడిన సరస్వతీ నదే ఘగ్గర్ - హక్రా అని భావిస్తున్నారు. కొందరు ఋగ్వేదంలో వర్ణించబడిన నది హెల్మాండ్ నది భాస్తున్నారు. హెల్మాండ్ నదియే ఘగ్గర్ - హక్రా అని భావించే వారు కూడా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ విషయంలో అభిప్రాయభేధాలు ఉన్నాయి.

ఇప్పటికీ అతి సవ్లపంగా ఉన్న సరస్వతీ జలాలు ఘగ్గర్ - హక్రా నదిలో కలుస్తున్నాయి.

మహాభారతంలో వర్ణిచబడిన కామ్యకవనం కురుసామ్రాజ్యానికి పడమటి భాగంలో సరస్వతీ నదీతీరంలో ఉంది. కురుక్షేత్రానికి ఇది పడమటి భాగాన ఉంది. కామ్యకవనంలో ఉన్న ఈ సరసును కామ్యక సరసు అని పిలిచే వారు. కామ్యక వనం థార్ ఎడారి ముందుభాగాన త్రిణవిందు సరసు సమీపంలో ఉంది. పాండవులు తమ అరణ్యవాస కాలంలో అరణ్యంలో ప్రయాణిస్తూ గంగాతీరం చేరి కురుక్షేత్రం దాటి అక్కడి నుండి పడమట దిశగా ప్రయాణణిస్తూ యమున, ద్రిషద్వతీ నదులను దాటి చివరిగా సరస్వతీ నదీ తీరానికి చేరారని పురాణ కథనం వివరిస్తుంది.[7] అక్కడ వారు కామ్యక వనాన్ని చూసారు. వారు సరస్వతీ నదీ మైదానాలలోని అరణ్యంలో సంచరిస్తున్న మహర్షులను పలువురిని దర్శించి వారి ఆశీర్వాదాలు పొంది శక్తివంతులు అయ్యారు. అక్కడ విస్తారమైన పక్షులు జింకలు ఉన్నట్లు వర్ణించ బడింది. ఇక్కడ పాండవులు ఆశ్రమవాసం చేసారు. పాండవులు తమ రథముల మీద హస్థినాపురం నుండి ఈ ప్రదేశానికి ముడు రాజులలో వచ్చి చేరారు.

ఋగ్వేదంలో ప్రస్తావించబడిన అశ్వన్వతి, ద్విషన్వతి నదులను కొందరు పరిశోధకులు సరస్వతి, అశ్వన్వతి నదులని భావిస్తారు.[8] ద్విషన్వతి, సరస్వతి తీరంలో మానవ నివాసాలు తరువాత మహాభారతకాలానికి ముందే తూర్పు, దక్షిణ ప్రాంతాలకు తరలించబడ్డాయి. ప్రస్తుత బికానర్, జోద్ పుర్ ప్రాంతాలు కురుజంగల, మద్రజంగల ప్రాంతాలు అని భావించబడుతున్నాయి.

ఎడారి జాతీయ ఉద్యానవనం జైసల్మేర్ లో 180 మిలియన్ సంవత్సరాల జంతువులు, వృక్షాల శిలాజాలు లభ్యం అయ్యాయి.

 
థార్ అందం

వృక్షజాల వైవిధ్యంసవరించు

విస్తరించిన ఇసుక భూములు, మిట్టలు గులకరాళ్ళ మైదానాలు. వైవిధ్యమైన పర్యావరణ పరిస్థితుల కారణంగా వృక్షాలు, మానవ సంస్కృతి, జంతుజాలం ఈ నిర్జల వాతావరణంలో ప్రపంచంలోని ఇతర ఎడారుల కంటే ఇక్కడ పుష్కలంగా ఉంటాయి. ఈ ప్రదేశంలో23 జాతుల పాకే జంతువులు, 25 జాతుల సర్పాలు ఉన్నట్లు కనుగొనబడింది. వీటిలో పలు జాతులు కేవలం ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి.

కొన్ని అడవి జంతువులు త్వరగా ఇక్కడి నుండి పూర్తిగా లుబ్ధమై భారతదేశం లోని ఇతర ప్రాంతాలకు చేరాయి. కృష్ణజింక, చింకారా, అడవి గాడిద మొదలైనవి నివసిస్తున్నాయి. ఈ పరిస్థితులకు అనుగుణంగా అవి ప్రత్యేక ఉపాయాలు అలవరచుకున్నాయి. ఇతర వాతావరణాలలో నివసించే జంతువుల కంటే ఇక్కడ నివిసించే అవే జంతువులు ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా తమ శరీరాలను తక్కువ పరిమాణంలో మార్చుకున్నాయి. అవి ప్రత్యేకంగా రాత్రివేళలో సంచరిస్తాయి. ఇక్కడ జలం అత్యల్పంగా లభ్యమౌతున్న కారణంగా ఇక్కడి పచ్చికబయళ్ళు పంటభూములుగా మారిన కారణంగా ఈ జంతువులు ఇక్కడి ప్రజల చేత కాపాడబడుతున్నాయి. ఇక్కడ నివిస్తున్న ఇతర జంతువులు ఎర్ర నక్కలు, తోడేళ్ళు వంటివి ఉన్నాయి.

ఈ ప్రాంతం వలస పక్షులు ప్రాంతీయ పక్షులు కలిసి 141 జాతుల వరకు ఉన్నాయి. ఇక్కడ గ్రద్దలు, రాబందులు, హర్రియర్లు, ఫాల్కన్లు, బుజ్జార్డులు, కెస్ట్రల వంటి పక్షులు కనిపిస్తాయి. ఇక్కడ పలు పాకే జంతువులు ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో భారతీయ నెమళ్ళు పిల్లను కని పోషిస్తూ వృద్ధి చెందుతుంటాయి. నెమలి భారతీయ జాతీయపక్షి. అలాగే ప్జాబు రాష్ట్రీయపక్షి. ఇవి ఇక్కడి గ్రామసీమలలో ఖెజరీ లేక పైపల్ చెట్ల మీద ఉంటాయి.[7]

సహజ వృక్షాలుసవరించు

ఇక్కడి పొడి వాతావరణంలో జీవించగలిగిన ముళ్లు కలిగిన చెట్ల అడవులు ఇక్కడ అధికంగా ఉన్నాయి. అక్కడక్కడా ఉన్న మట్టి గడ్డల మీద ఈ చెట్లు మొలుస్తూ ప్రతికూల వాతావరణంలో జీవనం సాగిస్తున్నాయి. ఈ చెట్లు కొన్ని ప్రదేశాలలో దట్టంగానూ కొన్ని ప్రదేశాలలో పలుచగానూ కనిపిస్తాయి. ఈ మట్టిభూములు ఇసుక భూములు కలగలుపుగా భూమి నీటి ప్రవాహం కారణంగా పడమటి నుడి తూర్పు వర్షపు భాగానికి విస్తరిస్తూ ఉంది. ఈ ఎడారి భూములు చెట్లు, పొదలు, ఔషధీయ మొక్కల కారణంగా సారవంతమవుతూ ఉంది.

చెట్లు వృక్షాలుసవరించు

 
ఖెజరి చెట్టు

ఈ ఎడారి భూములలో కీకర్, రేవంజా, ఖేర్, దిరిశన, వేప, సంగ్రి, జాల్కి, రొహిడా, ఫరాశ్ వంటి ఎడారి మొక్కలు ఇక్కడ కనిపిస్తుంటాయి.

మొక్కలు పొదలుసవరించు

థార్ ఎడారిలో ఫోగ్, బ్వట్టీ, ఇంగుడ, హింగుడ, జుజుబీ, ఝడ్ బేర్, ఆఫిలు ఆఫ్ సోడమ్, సణియా, బుఈ, ఆర్ణి, సింపోట్టి, గోలి బెర్రీ, గుగ్లిలం, కరీర్ లేక కైర్, అలాయ్ మొదలైన పొదలు ఉన్నాయి.

ఔషధ మొక్కలు గడ్డిసవరించు

థార్ ఎడారిలో సందూర్, దుర్వ, బంచ్ గ్రాస్, ఘమూర్, కాస్, బఫెల్ గ్రాస్, దర్భ, ఘోకోరూ, జినస్, జాన్సన్ గ్రాస్, గవాక్షీ లేక ఇంద్రవారుణి వంటి ఔషధ మొక్కలు ఉన్నాయి.

అభయారణ్యాలుసవరించు

థార్ ఎడారిలో పదకొండు అభయారణ్యాలు ఉన్నాయి. అందులో బృహత్తరమైనది లారా డిసర్ట్ వన్యప్రాణి అభయారణ్యం, కుట్చ్ రాన్ నిల్డ్ లైఫ్ అభయారణ్యం ఉన్నాయి. ఎడారి అభయారణ్యం, జైసల్మర్ అభయారణ్యాలు ఎడారిలో జీవావరణ పరిస్థితులకు పూల మొక్కలకు చక్కని ఉదాహరణ. అలాగే అభయారణ్యాలలో అంతరించి పోతున్న జంతువుల జాబితాలో ఉన్న చిరోటీలు, నల్లబాతు, చింకారా, నక్క, బెమగాల్ నక్క, తోడేలు, శశకర్ణ్ వంటి జుతువులు ఉన్నాయి. ఈ ఉద్యాన వనంలో ఉన్న సముద్రపు గవ్వలు, చెట్ల కాండాలు ఎడారి చరిత్రను మౌనంగా తెలియజేస్తుంటాయి. జైపూరుకు 210 కిలోమీటర్ల దూరంలో షెకావతీ ప్రదేశంలో ఉన్న అతి చిన్న తాల్ చెప్పర్ అభయారణ్యంలో పెద్ద సంఖ్యలో నల్లబాతులు సంరక్షించబడుతున్నాయి. ఇక్కడ నక్కలు, శశకర్ణ్ కూడా అక్కడక్కడా కనిపిస్తుటాయి. ఇక్కడ కనిపించే వేటాడబడే పక్షులలో మట్టి కోడి కూడా ఒకటి. జైపూరుకు 210 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న ప్రభుత్వేతర అభయారణ్యం జాలోర్ వన్యప్రాణి అభయారణ్యం' లో అరుదైన అంతరించి పోతున్న జంతువులైన ఆసియా స్టెప్ అడవి పిల్లి, చిరుత, ఎడారి నక్క, జిర్డ్, భారతీయ గజల్ వంటి జంతువులు ఉన్నాయి.

ఎడారిలో పచ్చదనంసవరించు

 
షెకావతీ వద్ద పచ్చదనంలో భాగంగా నాటబడిన జొజొబా చెట్లు

థార్ ఎడారి భూమి సంవత్సరంలో అధిక భాగం ఎండి పోయి ఉంటుంది. ఇక్కడ బలంగా వీచే గాలుల కారణంగా ఇసుక దిబ్బల నుండి ఇసుక పొరుగున ఉన్న పంటపొలాలలో ఇసుక చేరుతూ ఉంటుంది. అలాగే ఈ గాలుల కారణంగా కంచెలు, రైలు మార్గాలు కూడా ఇసుకతో నిండి పోతాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఇసుక దిబ్బలకు తగిన మొక్కలను నాటి ఇసుక దిబ్బలు గాలికి తరలి పోకుడా అలాగా భూక్షయం కాకుడా కాపాడబడుతుంది.

థార్ ఎడారిలో నాటడానికి తగిన మొక్కలు కొన్ని మాత్రమే ఉన్నాయి. అందు వలన ఇతర దేశాల నుండి తీసుకురాబడిన మొక్కల జాతుల అవసరం ఉంది. అనేక జాతుల యూకలిప్టస్ మొక్కలు, తుమ్మ, కాసియా వంటి ఇతర జాతుల మొక్కలను ఇజ్రాయిలు, యు ఎస్ ఎ, రష్యా, దక్షిణ రొడేషియా, చిలీ, పెరూ, సుడాన్ దేశాల నుండి తీసుకు వచ్చిన మొక్కలను థార్ ఎడారిలో నాటారు. ఈ ఎడారి వాతావరణానికి తుమ్మ చెట్లు తట్టుకుని బ్రతకగలిగాయి. చెట్లు మాత్రం ఆర్థికంగా కూడా ప్రయోజనం అందిస్తున్నాయి.

థార్ ఎడారిలో ప్రధాన పారుదల వసతి అందిస్తున్నది రాజస్థాన్ కాలువ (ఇందిరాగాంధి కాలువ). థార్ ఎడారిలో పంటలను అభివృద్ధి చేయడానికి ఆ నీటి పారుదలను పరిశోధనగా తీసుకున్నారు.

వ్యవసాయంసవరించు

ప్రపంచంలోజనసాంద్రత కలిగిల ఎడారులలో థార్ ఎడారి ఒకటి. ఇక్కడి ప్రజల ప్రధాన జీవనోపాధి వ్యవసాయం, జంతువుల పెంపకం, వర్షాకాలం అనంతరం ఈ ప్రదేశంలో నమ్మదగిన జీవనోపాధి కాదు. వర్షాకాలం తరువాత 33% పంటలు తగ్గిపోతాయి. జంతువుల పెంపకం, చెట్లు, గడ్డి మధ్యకాలపు పంటగా పండ్లు కూరగాయల పెంపకం జీవనోపాధికి సహకరిస్తాయి. ఇలాంటి కరువు ప్రాంతాలలో ఆ సమయం ఇటువంటి మొక్కలు మొలకెత్తి ఫలించి పుష్పించి పంట చేతికి రావడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఈ ప్రదేశం తరచూ కరువునకు గురవుతూ ఉంటుంది. అధికంగా ఉండే పెంపుడు జంతువులు మేయడం, వాయువు, నీరు కారణంగా భూమి ఊచకోతకు గురికావడం, గనుల పరిశ్రమలు వంటి కారణాల వలన ఇక్కడి భూములు విచారించవలసినంతగా సారవిహీనం ఔతున్నాయి.

ఖరీఫ్ పంటల మూలంగా అత్యధికంగా వ్యవసాయ ఆదాయం లభిస్తుంది. ఎడారి వాతావరణంలో ఖరీఫ్ పంటలు వేసవి కాలంలో చక్కని పంటను అందిస్తాయి. జూన్, జూలై మాసాలలో పంటల కొరకు విత్తడం ఆరంభిస్తారు. సెప్టెంబరు, అక్టోబరు మాసాలలో పంట కోతకు వస్తుంది. థార్ ఎడారిలో జొన్నలు, పప్పు ధాన్యాలు, మొక్కజొన్నలు, నువ్వులు, వేరుశనగ ప్రధాన పంటలుగా పండించ బడుతున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా కాలువల అభివృద్ధి, గొట్టపుబావులు మొదలైన నీటి వసతుల అభివృద్ధి కారణంగా మాగాణి పంటలైన గోధుమ, ఆవాలు, జిలకర వంటి వాణిజ్య పంటలు సహితం రాజస్థాన్ లో పండిస్తున్నారు. ఓపియం పండించడం, వాడడంలో రాజస్థాన్ ప్రాంతం ప్రధానమైనది. ఇక్కడ ప్రధానంగా రెండు సీజన్లలో పుటలు పండించబడుతున్నాయి. పంటలకు కావలసిన నీరు బావులు, చెరువుల నుండి లభిస్తుంది. డెసర్ట్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం (ఎడారి అభివృద్ధి కార్యక్రమం) పేరిట కేంద్ర ప్రభుత్వం రాజస్థాన్ వాయవ్య ప్రాంతంలో ప్రభుత్వేతర నిధులతో ఇందిరాగాంధీ కాలువను అభివృద్ధి పరచి దాని ములంగా జరుగుతున్న జలవినియోగం ఎడారి అభివృద్ధి, ఎడారి ప్రజల జీవనాభివృద్దికి ఎలా దోహదం చేస్తుందో పరిశీలిస్తున్నారు.

పెంపుడు జంతువులుసవరించు

గడిచిన 15–20 సంవ్సరాలలో రాజస్థాన్ లోని థార్ ఎడారిలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక్కడ ప్రజల సంఖ్య, జంతువుల సంఖ్య అనేక రెట్లు పెరిగింది. సాధారణంగా ఎడారి భూములు వ్యవసాయానికి ప్రతికూలం కనుక పెంపుడు జంతువుల పెంపకానికి ప్రజాదరణ అధికం అయింది. ప్రస్తుతం థార్ ఎడారిలో జంతువుల సంఖ్య మానవుల సంఖ్యకంటే పది రెట్లు అధికం అయింది. ఇది జాతీయ సరాసరి నిష్పత్తి కంటే అధికం. అయినా అధికం అయిన జంతువుల మేత కారణంగా ఇక్కడి వాతావరణం, కరువు మీద బృహత్తర ప్రభావం చూపుతుంది.

థార్ఎడారిలో అనేక మంది వ్యవసాయదారులు పెంపుడు జంతువుల పెంపకం మీద తమ ఉపాధి కొరకు ఆధారపడుతున్నారు. పెంపుడు జంతువులలో ఆవులు, బర్రెలు, గొర్రెలు, మేకలు, ఎద్దుల శాతం అధికంగా ఉన్నాయి. బార్మర్ జిల్లాలో అత్యధిక సంఖ్యలో మేకలు, గొర్రెలు ఉన్నాయి. కంక్రేజ్ అభయారణ్యం, నాగౌరి ప్రాంతాలలో ఉన్నత జాతి దున్నపోతులు ఉన్నాయి. భారతదేశంలో అధికంగా ఉన్ని ఉత్పత్తి చేసే రాష్ట్రాలలో రాజస్థాన్ అగ్రస్థానంలో ఉంది. భారతదేశంలో ఉత్పత్తి ఔతున్న ఉన్నిలో 40-50% ఉన్నిని మార్వారి, జైసల్మేరీ, మాగ్రా, సోనాడి, నాలి, పుంగల్ వంటి ప్రదేశాలలోని గొర్రెల ద్వారా లభ్యం ఔతుంది. ప్రపంచంలోని కార్పెట్ తయారీ దారులు రాజస్థాన్ ఉన్నిని నాణ్యమైనదిగా భావిస్తున్నారు. చోక్లా గొర్రెల ఉన్ని అత్యున్నత రకమైన ఉన్నిగా భావించబడుతుంది. గొర్రెల పునరుత్పత్తి కేంద్రాలు సూరత్ ఘర్, జైత్సర్, బికనీర్ వద్ద కారాకుల్, మెరినో జాతి గొర్రలను అభివృద్ధి చేస్తున్నారు. రాజస్థాన్ లో జోద్ పుర్ ఉలెన్ మిల్, రాజస్థాన్ ఉలెన్ మిల్, బిక్నర్ అండ్ ఇండియా ఉలెన్ మిల్ వంటి ఉన్నిదారం తయారీ మిల్లులు ఉన్నాయి. బిక్నర్ ఆసియాలోనే అతి పెద్ది అయిన ఉన్ని వాణిజ్య కేంద్రంగా గుర్తింపు పొందింది.

గ్రామాలలోని పెంపుడు జంతువుల ఆహారం కొరకు అధికంగా సాధారణ భూముల పైనే ఆధారపడుతున్నారు. కరువు కాలంలో సంచారజాతులైన రెబరీ ప్రజలు పెద్ద పెద్ద గొర్రలు, ఒంటెల మందలతో దక్షిణ రాజస్థాన్ లోని అడవులకు మేత నిమిత్తమై తరలి వెళుతుంటారు.

జంతువుల పెంపకం ప్రాధాన్యతను అనుసరించి గ్రామదేవతల పేర్ల మీద పలు సంతలు నిర్వహించబడుతున్నాయి. నాగౌర్ జిల్లాలోని మానసర్ వద్ద రామ్ దేవి జంతువుల సంత, నాగైర్ జిల్లాలోని పర్భస్తర్ వద్ద తేజాజీ జంతువుల సంత, నాగైర్ జిల్లాలోని మెర్తా వద్ద బాల్డియో జంతువుల సంత, బర్నర్ జిల్లాలోని తిల్వారా వద్ద మల్లినాధ్ జంతువుల సంత జరిగుతున్న జంతువుల సంతలు ఎడారి ప్రజల ప్రధాన జంతువుల సంతలుగా పరిగణించబడుతున్నాయి.

వ్యవసాయ అరణ్యాలుసవరించు

థార్ ఎడారి వంటి అర్ధార్ద్రత భూములు‍‌ (సగం తడి కలిగిన భూములు) అనార్ధ్రత భూములు (పూర్తిగా తడి లేని భూములు ) కలిగిన భూములలో అడవులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎడారిలోని ప్రజాసంక్షేమానికి ప్రభుత్వేతర యాజమాన్య అడవులు ప్రధానంగా సహకరిస్తాయి. థార్ ఎడారిలో నివసిస్తున్న ప్రజల ఆర్థిక పరిస్థితి బలహీన స్థాయిలో ఉన్నాయి. ఈ కారణంగా వారు గ్యాస్, కిరోసిన్ వంటి వాటిని ఉపయోగించలేరు కనుక వంట చెరకుగా అధికంగా కట్టెలను ఉపయోగిస్తున్నారు. మొత్తం వంటపనులకు 75 శాతం కట్టెలను మాత్రమే ఉపయోగిస్తున్నారు. థార్ ఎడారిలో ఆటవిక ప్రాంతాల శాతం తక్కువగా ఉంది. రాజస్థాన్ ఆటవిక భూముల వైశాల్యం 31150 చదరపు కిలో మీటర్లు. భౌగోళికంగా రాష్ట్ర వైశాల్యంలో 9% ఆటవిక భుములు ఉన్నాయి. రాజస్థాన్ దక్షిణ ప్రాంతాలలో ఉన్న ఉదయపూర్, చిచ్చోడ్ ఘర్ అధికంగా అడవులు ఉన్నాయి. అత్యల్పంగా ఆటవిక ప్రాంతం ఉన్న జిల్లా చురూ జిల్లా. ఇక్కడ ఉన్న భూముల వైశాల్యం 80 చదరపు కిలోమీటర్లు. ఈ అడవులు ఇక్కడి ప్రజల వంట చెరకు, జంతువుల మేతకు తగినింత వనరులను అందిచ లేవు. ఈ కారణంగా జంతువుల పేడ అధిక భాగం వంట చెరకుగా ఉపయోగిస్తుటారు. ఇందు వలన వ్యవసాయ ఉత్పత్తులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ సమస్యకు వ్యవసాయ అడవులు మంచి పరిష్కారం. ఇది గమనించిన కొన్ని సంస్థలు వ్యవసాయ అరణ్యాల పెంపకం ద్వారా సత్ఫలితాలను సాధిస్తున్నాయి.

కేంద్ర నిర్జల విభాగం (సి ఎ జెడ్ ఆర్ ఐ) విజయవంతంగా అభివృద్ధి చేయబడి ప్రస్తుతం సంప్రదాయ, సంప్రదయేతర పంటలను అందిస్తున్నాయి. స్వల్ప వర్షపాతంలోనే బర్ పండ్లను ముందుకంటే పెద్దసైజులో పండిస్తున్నారు. ఈ పండ్ల చెట్లు రైతులకు మంచి ఆదాయాన్ని అందించే వనరుగా మారాయి. ఒక హెక్టార్ భూమిలో హార్టి కల్చర్ మూలంగా 35 చెట్లకు 10,000 కిలోల బర్ అలాగే 250 కిలోల జామ పంటను పండిస్తున్నారు. ఇది రైతుల మునుపటి ఆదాయాన్ని రెండు- మూడు రెట్లు పెంచింది.

ఈ ప్రదేశంలో జోద్ పూర్ వద్ద జాతీయ స్థాయి శిక్షణాలయమైన అరిడ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఉంది . ఇది భారతీయ అటవీశాఖలో అంతర్భాగం. ఈ శిక్షణాలయం ఈ ఎడారి ప్రదేశంలో పచ్చదనం పెరగడానికి జీవావరణ వ్యవస్థను రక్షించడానికి తగిన పరిశోధనలు చేపట్టింది. ఈ పరిశోధనలను నిర్జల ప్రదేశం అర్ధనిర్జల ప్రదేశాలైన గుజరాత్, రాజస్థాన్, దాద్రా & నగర్ యూనియన్ ప్రదేశాలలో చేపట్టింది. ఎడారి ప్రజల జీవనాధారమైన చెట్లలో అతి ముఖ్యమైనది జమ్మి చెట్టు.

జమ్మిచెట్టు ఎడారి ప్రజల గృహనిర్మాణానికి కావలసిన కొయ్యను అందిస్తుంది. ప్రధానంగా గృహనిర్మాణంలో దూలాలుగా, స్తంభాలుగానూ, తలుపులు, కిటికీలుగా ఉపయోగించ బడుతున్నాయి. బావులలో పైపులకు, బండి చక్రాల చుట్టూ వేయడానికి కూడా ఈ చెట్లను ఉపయోగిస్తున్నారు. అలాగే నిచ్చెనలు, నాగలి, వ్యవసాయ పనిముట్ల పిడిగా వేయడానికి ఉపయోగపడుతుంది. ఎడారిలో లభ్యం ఔతున్న చెట్లను పెట్టెలతయారీ పరిశ్రమ ప్రధానంగా జమ్మి చెట్టమీద ఆధారపడి ఉంది.

జమ్మిచెట్లు జంతువుల పెంపకంలో మేతకు ఉపయోగపడతాయి. ఈ చెట్లు జంతువుల మేతకు ప్రత్యేకంగా శీతాకాలంలోఉపయోగపడుతున్నాయి. ఎడారి భూములలో ఇతర వృక్షాలు ఏవీ జంతువులకు కావలసిన మేత అందించ లేవు. జమ్మి చెట్టు, మేక, ఒంటె కలిగిన వాడి చెంతకు క్షామ సంయంలో కూడా మరణం దరిచేరదు అని ఇక్కడి ప్రజలలో నానుడి ఉంది. ఈ మూడు ఒకచేట ఉన్న మనుష్యుడు ఎటువంటి విపత్కర సమయంలోనైనా బ్రతుకుతెరువు సాగించగలడు. బాగా ఎదిగిన జమ్మిచెట్టు సరాసరిగా మొత్తంగా 60 కిలోల పచ్చని మేతను అందిస్తుంది. ఈ ఆకులు సమృద్దమైన పోషకవిలువలు కలిగి ఉంటాయి. వర్షాధార మైన మేత అంతా జంతువుల చేత మేయబడుతుంది కనుక తరువాత వచ్చే శీతాకాలానికి సమయంలో జమ్మి చెట్ల ఆకులను జంతువుల మేతకు ఉపయైగించడం ప్రయోజనకరమైనది. కాయలు తియ్యటి గుజ్జు కలిగి అవి కూడా జంతువుల మేతకు ఉపయోగపడతాయి.

అత్యంత విలువైన పోషక విలువలు కలిగి చాలా రుచి కలిగి ఉన్న జమ్మి ఆకులను ఒంటెలు, పశువులు, మేకలు, గొర్రెలు వంటి పెంపుడు జంతువులు మిగిలిన ఎండు మేతల కంటే ఆసక్తిగా తింటూ ఉంటాయి. జంతుపెంపకానికి అవసరమైన మేతను ప్రాంతీయంగా లూంగు పాడ్స్ (కాయలు) లేక సంగర్ లోక సంగ్రి అని అంటూ ఉంటారు. ఎండిన కాయలను ఖో-ఖా అంటారు. వీటిని కూడా జంతువులు ఆసక్తిగా టింటాయి. క్షామం సమయంలో మానవులు కూడా ఆహారంగా తీసుకున్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 1899, 1939 మధ్య కాలంలో సంభవించిన కరువు కాలంలో ఈ చెట్ల బెరడును ఆహారంలో ఉపయోగించినట్లు భావిస్తున్నారు.

జమ్మిచెట్టు కాండము పోషక విలువలు కలిగిన చెట్టు కనుక నాణ్యమైన వంటచెరుకుగా ఉపయోగ పడుతుంది, కొమ్మలు కంచె వేయడానికి ఉపకరిస్తుంది, వేర్లు మాంసకృత్తుల సమృద్ధి కలిగినవి కనుక పొలములలో అత్యధిక ఫలసాయం పొందడానికి ఎరువుగా ఉపయోగిస్తుటారు. థార్ ఎడారిలోనూ ఉత్తర భారతంలోనూ అధికంగా కనిపించే మరొక చెట్టు ఎడారి టేకు, మార్వారి టేకు జాతి చెట్లు పరిసర ప్రజలు దీనిని రోహిడా అని పిలుస్తారు. థార్ ఎడారిలో ఈ చెట్లు మధ్యస్థ ఎత్తు వరకు పెరుగుతుంది. థార్ ఎడారిలో వీటికి మరింత ప్రధాన్యం కలిగి ఉన్నాయి. వ్యవసాయ అడవులులో ఈ చెట్లు నాణ్యమైన గృహనిర్మాణానికి అవసరమైన కొయ్యను అందిస్తున్నాయి. వంటచెరకుకు ఉపకరించే చెట్లు అధికుగా ఉన్న ఎడారిలో ఈ చెట్లు వ్యాపార ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఈ చెట్ల వాణిజ్య నామం ఎడారి టేకు, మార్వార్ టేకు అంటారు.

ఎడారి టేకు దృఢంగా, బలంగా అధిక కాలం మన్నిక కలదిగా ఉండి ఇక్కడి ప్రజల చేత ఎక్కువగా ఉపయోగించబడుతుంది. అంతేకాక ఇది వంటచెరకుగా, బొగ్గు, ఒంటెలకు, మేకలకు, గొర్రెలకు మేతగా కూడా ఉపయోగపడుతుంది.

పర్యావరణ రక్షణకు కూడా ఈ చెట్లు బాగా ఉపకరిస్తాయి. ఈ చెట్ల వేర్లు భూమిలోపల లోతుగా పాతుకు పోయి భూమి పటిష్ఠంగా ఉండడానికి ఉపకరిస్తాయి. ఇవి గాలి వేగాన్ని కూడా నియంత్రిస్తూ ఇసుక మాటలు కదితి పోకుడా కూడా కాపాడుతున్నాయి. ఇవి పక్షులకు ఆశ్రయం కల్పిస్తూ అలాగే ఇతర జంతువులకు కూడా ఆశ్రయం ఇస్తున్నాయి. వేసవి కాలంలో ఈ చెట్ల నీడలో పెంపుడు జంతువుల మందలు సేద తీరుతుంటాయి.

ఎడారి టేకు చెట్ల లోని భాగాలు ఔషధంగా కూడా ఉపకరిస్తుంది. ఈ చెట్ల కొమ్మల బెరడు పుండ్లను మాన్పడానికి ఉపకరిస్తుంది. మూత్రవ్యాధులకు, కాలేయ వ్యాధులకు, బొల్లి, చీముపట్టిన పుడ్లు మానడానికి కూడా ఔషధంగా ఉపకరిస్తాయి.

జీవావరణ పర్యటనసవరించు

జైసల్మర్ వద్ద ఒంటెల సవారీ ప్రజాదరణతో అభివృద్ధి చెందుతూ ఉంది. స్వదేశీ, విదేశీ పర్యాటకులు ఒంటెల మీద ఎడారిలో సవారీ చేయడానికి అత్యంత ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ పర్యావనణ పర్యటనలలో చవకైన ట్రక్కులలో అరేబియన్ నైట్ శైలి విందులు, సాంసకృతిక కార్యక్రమ ప్రద్రర్శనలు ఉంటాయి. ట్రక్కు పర్యటనలు పర్యావరణం సందర్శన చేయడానికి చక్కగా సహకరిస్తాయి. ఈ పర్యటనలు జైసల్మర్ దాని చుట్టు పక్కన ఉన్న గ్రామాలలోని వారికి అధికంగా ఉపాధి కల్పిస్తున్నాయి. పర్యాటక నిర్వాహకులకు, ఒంటెల యజమానులకు ఈ పర్యాటనలు చక్కని ఆదాయాన్ని ఇస్తున్నాయి.

పరిశ్రమలుసవరించు

రాజస్థాన్ పాలరాతి పరిశ్రమకు ప్రసిద్ధి పొందినది. రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లాలోని మక్రానా ఉత్పత్తి చేసిన పాలరాళ్ళను తాజ్ మహలు నిర్మాణానికి ఉపయోగించబడ్డాయి. భారతదేశంలోని సిమెంట్ ఉత్పత్తిలో రాజస్థాన్ రెండవ స్థానంలో ఉంది. సంభర్, జోద్ పూరు వద్ద లభించే ఇసుక రాళ్ళు జ్ఞాపికలు, ప్రముఖ భవనాలు, నివాస గృహాలు నిర్మాణం చేయడానికి ఉపకరిస్తాయి. జోద్ పూర్ వద్ద ప్రాంతీయవాసులు ఘటు పత్తర్ అని పిలిచే ఎర్ర రాళ్ళు కూడా లభిస్తాయి. వీటిని గృహనిర్మాణానికి ఉపయోగిస్తారు. జోధ్ పూరు, నాగౌర్ జిల్లాలలో ఇసుక రాళ్ళు లభిస్తాయి. గ్రానైట్ కు మెరుగు పెట్టే కర్మాగారాలకు జాలోర్ ప్రధాన కేంద్రంగా ఉంది.

గిరాల్, కపురాడి, జలిపా, బార్నర్ వద్ద ఉన్నభద్కా, ప్లనా, గౌడా, బిత్నాక్, బారసింగ్ పూరు, మండ్లా, బిక్నర్ జిల్లాలో ఉన్న చరణ్, రానేరీ హడ్లా, కాస్నౌ, మెర్టా, నాగౌర్ జిల్లా మొదలైన ప్రదేశాలలో లిగ్నైట్ నిక్షేపాలు ఉన్నాయి. ఈ కారణంగా ఇక్కడ లిగ్నైట్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలు స్థాపించబడ్డాయి. బార్మర్ జిల్లాలో ఉన్న గిరాల్ వద్ద లిగ్నైట్ ఆధారిత విద్యుదుద్పత్తి కేంద్రాలు స్థాపిచ బడ్డాయి. ప్రభుత్వేతర యాజమాన్యంలోబార్మర్ జిల్లాలో ఉన్న బాధరేష్ గ్రామంలో 1080 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయకలిగిన విద్యుదుత్పత్తి కేంద్రం జిండల్ గ్రూప్ చేత స్థాపించబడింది. బిక్నర్ జిల్లాలో ఉన్న బార్సింగ్ పూరు వద్ద న్యూలి లిగ్నైట్ బార్సింగ్ పూర్ ప్రాజెక్ట్ పేరుతో 125 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగిన రెండు విద్యుదుద్పత్తి కేంద్రాలను స్థాపిచాలన్న ప్రతిపాదన చేయబడింది. బార్నర్ జిల్లాలో రిలయన్స్ ఎనర్జీ 3000 కోట్ల రూపాయల వ్యయంతో భూ అంతర్గత వాయు ప్రసారణ ద్వారా విద్యుదుద్పత్తి కేంద్రాన్ని స్థాపించే పనులు చేపట్టింది.

జైసల్మార్, బార్మర్ జిల్లాలలో ఉత్తమ పెట్రోలియం నిల్వల కొరకు బృహత్తర నిల్వల కేంద్రాలు ఉన్నాయి. ప్రధాన పెట్రోలు నిలువలు జైసల్మర్ జిల్లాలోని బఘెవాల్, కాల్రెవాల్, తవారివాల్ వద్ద, బార్మర్ జిల్లాలోని గుడా మలానీ వద్ద ఉన్నాయి. బార్మర్ జిల్లాలో వాణిజ్యపరంగా చమురు ఉత్పత్తిని మొదలుపెట్టింది.

బార్మర్ జిల్లాలో ఉన్న చమురు నిల్వలు వార్తలలో కూడా చోటు చేసుకున్నాయి. బ్రిటల్ కహ చెందిన కైర్న్ ఎనర్జీ 2009 నుండి చమురు ఉత్పత్తిని ఆరంభించింది. జిల్లాలో ఎక్కువగా చమురు నిలువలు మంగళ, భాగ్యం, ఐశ్వర్యా వద్ద ఉన్నాయి. భారతదేశ 22 చమురు పరిశోధనలలో ఇది అత్యంత బృహత్తర చమురు పరిశోధనగా భావించబడుతుంది. ఎడారి కటినత్వం వలన సుదీర్ఘ కాలం ఇబ్బందులు అనుభవించిన ప్రాంతీయ వాసుల ఆర్థిక పరిస్థితులో పెనుమార్పును తీసుకురాగలదని విశ్వశించబడుతుంది.

భారత ప్రభుత్వం జైసల్మర్ ప్రాంతంలో 1955-56 లో ప్రాథమిక చమురు పరిశోధనలు చేపట్టింది. జైసల్మర్ ప్రాంతంలో ఆయిల్ ఇండియా లిమిటెడ్ 1988 లో సహజ వాయువును కనిపెట్టంది. ఇక్కడ ఒంటెల చర్మంతో చేయబడిన పలుచని మెసెంజర్ సంచుల ఉత్పత్తి కూడా జరుగుతుంది. థార్ ఎడారి వాయుశక్తితో విద్యుదుత్పత్తి చేయడానికి అనువైనది అని భావించ బడుతుంది. అంచనాల ప్రకారం రాజస్థాన్ ప్రాంతం వాయుశక్తితో 5500 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయగలదని భావించబడుతుంది. రాష్ట్రప్రభుత్వం ఇందుకు ముఖ్యత్వం ఇస్తూ మొదటిసారిగా జైసల్మర్ అమర్ సాగర్ వద్ద వాయుశక్తి ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాన్ని స్థాపించింది. బార్మర్ జిల్లాలోని మరి కొన్ని ముఖ్యసంస్థలు కూడా వాయుశక్తి ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలను స్థాపించడ్ మీద దృష్టి కేంద్రీకరించింది. ఈ ప్రాంతం సంవత్సరంలో అత్యధికమైన కాలం మేఘరహితంగా ఉంటుంది కనుక సౌరశక్తి ఆధారిత విద్యుదుత్పత్తి చేయడానికి కూడా అనువైనదే భావించబడుతుంది. చురు జిల్లాలోని భాలేరీ వద్ద కఠిన జలాన్నిత్రాగు నీటిగా మార్చడానికి సౌరశక్తి ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రం స్థాపించబడింది.

ఉప్పునీటి సరసులుసవరించు

థార్ ఎడారిలో అనేక ఉప్పునీటి సరసులు ఉన్నాయి. సంభర్, పచ్పద్రా, తాల్ చాపర్, ఫాలౌడి, లంకన్సర్ వద్ద ఉన్న ఉప్పునీటి సరసుల నుండి సోడియం క్లోరైడ్ సాల్ట్ ఉత్పత్తి చేయబడుతుంది. దిడ్వానా సరసు నుండి సోడియం సల్ఫేట్ సాల్ట్ ఉత్పత్తి చేయబడుతుంది. సంభర్, దిడ్వానా సరసు ప్రాంతాలలో మానవనివాసం గురించిన పరిశోధనలు పునరుద్ధరించడం వలన ఈ ప్రాంతం పురాతనత్వం, చారిత్రక ముఖ్యత్వం గురించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రజలుసవరించు

థార్ ఎడారిలో ప్రధానంగా హిందువులు, ముస్లిములు, సిక్కులు నివసిస్తున్నారు. పాకిస్తాన్ భూభాగంలో సింధీలు, కొల్హీలు నివసిస్తున్నారు. ఈ ఎడారి వర్ణమయమైన ఉన్నత సంస్కృతి కలిగిన ప్రజలకు ఆవాసమై ఉంది. ఇక్కడి ప్రజలకు జానపద సంగీతం, కవిత్వం మీద మక్కువ ఎక్కువ. రాజస్థాన్ లోని 40% ప్రజలు ఎడారిలోనే నివసిస్తున్నారు. ఎడారిలో ప్రజల జీవనాధారానికి వ్యవసాయం, జంతువుల పెంపకం మీద ఆధారపడుతుంటారు. ఈ కారణంగా వ్యవసాయం, మేతమేయడం నియంత్రించడం సాధ్యం కాని పరిస్తిస్థులు ఎదురయ్యాయి. వృక్షసంపద క్షీణించడానికి ఇది కారణం అయింది. ఎడారిలో మానవులు, పెంపుడు జంతువులు విపరీతంగా పెరిగిపోవడం వలన పర్యావరణం క్షీణించి భూసారం కూడా బాగా తగ్గించింది.

ఎడారు ప్రజలు ఆర్థిక పరిస్థితులు చాలా తక్కువ స్థితిలో ఉంటాయి. థార్ ఎడారి ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత కలిగిన ఎడారిప్రదేశం. ఈ ఎడారిలో చదరపు కిలోమీటరుకు 83 మంది నివసిస్తున్నారు. ఇతర ఎడార్లలో చదరపు కిలోమీటరుకు 7 మంది నివసిస్తున్నారు. ఈ ప్రదేశంలో అతి పెద్ద నగరం జోధ్ పూరు స్క్రబ్ అడవిలో ఉంది. బిక్నర్, జైసల్మర్ ఎడారి భూభాగంలోనే ఉన్నాయి.

ఉత్తర, పడమర ఎడారిలో వ్యవసాయం కొరకు నీటి పారుదల వసతులు అభివృద్ధి చేయబడ్డాయి. పాకిస్థాన్ భూభాగంలో ఉన్న ఎడారిలో కూడా పలురకాల భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, వారసత్వం, జానపద గాథలు, సంగీత రీతులు కనిపిస్తాయి. ఇక్కడ నివసిస్తున్న ప్రజలు భిన్న నతాలు, జాతులు, కులాలకు ప్రాతానిధ్యం వహించడమే ఇందుకు కారణం.

నీటివనరులుసవరించు

సాధారణంగా ఎడారి ప్రాంతాలలో నీరు లభ్యం కావడం అపురూపం కనుక థార్ ఎడారి ప్రజల జీవితాలలో నీరు ప్రధానపాత్ర పోషిస్తుంది. సహజనీటి వనరులు (ఒయాసిసులు) లేక మానవ నిర్మిత జోహాడ్స్ అనే చిన్న తరహా నీటి గుంటలు మానవులకు, జంతువులకు ఈ ఎడారి భూములలో త్రాగునీటిని అందిస్తున్నాయి. నిరంతర నీటి వసతి లేని కారణంగా ప్రాంతీయవాసులు అత్యధికంగా వలసజీవులుగా జీవిస్తున్నారు. అధిక మానవ నివాసాలు కొరాన్-ఝార్ కొండల నుండి ప్వహిస్తున్న రెండు వర్షాధార ప్రవాహాల వెంటనే ఉన్నాయి. ఎడారిలో భూగర్భ జలోలు చాలా అరుదుగా లభిస్తాయి. సరఫరా చేయబడే నీరు కూడా ఖనిజలవణాలు నీటిలో కోరిగిన కారణంగా తరచుగా చప్పగానే ఉంటాయి. ఈ జలాలు కూడా చాలా లోతులలో మాత్రమే లభిస్తాయి. మానవ నివాసో ప్రాంతంలో బావులలో త్రవ్వినప్పుడు లభించే నీరు తీయగా ఉన్నా బావులు త్రవ్వడం అత్యంత శ్రమతో కూడుకున్న పని ఒక్కోసారి భూమి త్రవ్వే వారు బావులు త్రవ్వే సమయంలో పనివారు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.

1980 లో పాకిస్థాన్ నివాసగృహాల గణాంకాలు కేవలం రెండు గదులు మాత్రమే గృహాల సంఖ్య 2,41,326. అతి చిన్నవైన ఈ నివాసాలలో సరాసరి ఒక్కో దానిలో ఆరు మంది నివసిస్తున్నారు. ఒక్కో గదిలో ముగ్గురు నివసిస్తున్నారు. వీటిలో దాదాపు 76 శాతం నివాసాల వెలుపలి గోడలు పచ్చి ఇటుకలతో నిర్మించబడ్డాయి. 10 శాతం నివాసాలలో చెక్కసామానులు వాడబడ్డాయి. 8 శాతం నివాసాలలో కాల్చిన ఇటుకలు వాడహడ్డాయి. జుగీలు (పూరిళ్ళు), గుడిశలలో నివసిస్తున్నారు. వీటిని ఎండు గడ్డి, కొయ్య ముక్కలతో నిర్మిస్తుంటారు. తుఫానుగాలులకు ఈ జుగీలు శక్తిహీనమైనవని నిరుపిస్తుంటాయి. పేదరికం జుగీనివాసులకు మరో అవకాశం కల్పించదు.

ల్యూని నది ఒక్కటే ఈ ప్రదేశానికి ఉన్న ఒకేఒక నీటి ఆఘధారం. ల్యూని నది ఎడారిలోనే ఒక సరసులోకి ప్రవహించి ఆగిపోతుంది. అజ్మీర్ వద్ద ఉన్న ఆరవల్లి పర్వతశ్రేణులలో ఉన్న పుష్కర్ వెల్లీలో జన్మించి 530 కిలోమీటర్ల ప్రయాణించి గుజరాత్ లోని కుచ్ వద్ద ఉన్న రాన్ చిత్తడి నేలలో తన ప్రయాణాన్ని ముగించుకుంటుంది. ల్యూని నది అజ్మీర్, బార్మర్, జలోర్, జోధ్ పూరు, నాగౌర్, పాలి, సిరోహి జిల్లాలు, ఉత్తర గుజరాత్ లోని బాణస్కంధ సమీప ప్రాంతంలో ఉన్నరధన్పూరు ప్రాంతం, మిథవిరానా నుండి ప్రవహిస్తుంది. ల్యూని నది ఉపనదులు వరుసగా సుక్రి, మిత్రి, బాంది, ఖారి, జావై, గుహియా, సాహి మొదలైనవి ఎడమ వైపు నుండి ప్రవహించి నదిలో కలువగా జొజారీ నది ఎడమ వైపు నుండి ప్రవహించి ల్యూని నదిలో కలుస్తుంది.

భారతదేశంలో వర్షాధారంగా ప్రవహించే నదులలో ఘగ్గర్ నది ఒకటి. ఈ నది హిమాచల్ ప్రదేశం లోని శివాలిక్ పర్వతశ్రేణులలో జన్మించి పంజాబు, హర్యానాల గుండా ప్రవహించి రాజస్థాన్ లోకి చేరుకుంటుంది. హర్యానాలోని సిర్సా ఆగ్నేయభాగంలోనూ రాజస్థాన్ లోని తల్వాల వద్ద ప్రవహిస్తున్న జీల్ నది పక్కగా ప్రవహిస్తు ఉంది. ఈ వర్షాధార నది రాజస్థాన్ వరకు పొడిగించబడిన రెండు నీటిపారుదల కాలువలకు కావలసిన నీటిని అందిస్తుంది. ఈ నది హనుమాన్ గర్ జిల్లా వరకు తన ప్రయాణం కొనసాగిస్తుంది.

థార్ ఎడారిలో రాజస్థాన్ కాలువ ప్రధాన నీటి పారుదల వలరుగా భావించబడుతుంది. పంటభూముల వరకు ఎడారి విస్తరించకుండా ఈ నీటి పారుదల కాలువలు సహకరిస్తున్నాయి. ఇది ప్రపంచంలో ఇది ఎడారి భూములను సస్యశ్యామలం చేయడానికి ప్రణాళికాయుతంగా పొడిగించబడిన అతి పెద్ద నీటి పారుదల కాలువగా పేరుపొందింది. ఇది పంజాబు, హర్యానాలలో దక్షిణంగానూ నైరుతి దిశగానూ ప్రవహిస్తూ రాజస్థాన్ లో ప్రవేశించి 650 కిలోమీటర్లు ప్రవహించి జైసల్మర్ వద్ద తన ప్రయాణాన్ని ముగిస్తుంది. ఇందిరాగాంధి కాలువ నిర్మాణం తరువాత ఈ కాలువ జైసల్మర్ జిల్లాలోని లోని 6770 కిలోమీటర్లు, బార్మర్ జిల్లాలోని 37 కిలోమీటర్లు భూమికగ నీటిని అందిస్తుంది. ఈ కాలువ ఎడారిలో జైసల్మర్ జిల్లాలోని నిస్సారమైన భూములను సారవంతం చేస్తుంది. ఇప్పుడీ అర్ధజల ఇసుక భూములు ప్రస్తుతం ఆవాలు, పత్తి, గోధుమలు పండించే సారవంతంమైన భూములుగా మారాయి.

ఈ కాలువ వ్యవసాయ భూములకు నీటిని అందించడమేగాక వందలాది ఈ ప్రాంతవాసులకు త్రాగునీటిని కూడా అందిస్తున్నాయి. ఈ కాలువ అభివృద్ధి రెండవ దశ పనులు అతి వేగంగా సాగాయి. ఈ ప్రణాళిక ఈ ప్రాంతవాసుల జీవన ప్రమాణాలను అభివృద్ధి పరుస్తాయని బావిస్తున్నారు.

ఎడారిలో పునరుత్తేజ కార్యక్రమాలుసవరించు

ఎడారిలో పునరుత్తేజం కలిగించే ఎడారి ఉత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంటాయి. రాజస్థాన్ ఎడారి ఉత్సవాలు అతి గొప్ప సరదా, ఉత్సాహం నిండి ఉంటాయి. ఈ ఉత్సవాలు సంవత్సరానికి ఒకసారిగా శీతాకాలంలో నిర్వహించబడుతుంది. అతి నేర్పుతో తయారు చేయబడిన వస్త్రధారణ చేస్తారు. ఎడారి ప్రజలు నృత్యాలు, వేటసమయంలో పాడా వీరోచితమైన జానపద గేయాలు, శృంగారం, విషాదంతో కూడిన గాయాలను ఆలపిస్తారు. ఈ సంతలలో పాములను ఆడించడం, పప్పెట్ షో, శ్రామికజజీవిత గాథలు, జానపద నృత్యాలు వంటి కళాప్రదర్శనలు చాటు చేసుకుంటాయి. వర్ణమయమైన రాజస్థాన్ సంసకృతితో పాటు ఒంటెలు కూడా ఈ సంతలలో ప్రధాన భూమిక పోషిస్తాయి.

ఎడారి జీవితంలో ఒంటెలు ప్రధాన భాగం వహిస్తాయి. ఎడారి ఉత్సవాలో ఒంటెలకు ఉండే ప్రాధాన్యం దీనిని రుజువు చేస్తుంది. ఒంటెల వస్త్రధారణ పోటీలలో పాలగొనే ఒంటెలు చిత్రవిచిత్ర వేషధారణలో ప్రవేశిస్తుంటాయి. ఈ ఉత్సవాలలో చోటు చేసుకునే ఇతర ఆసక్తికరమైన పోటీలు మీసాల పోటీలు, తలపాగా కట్టుకునే పోటీలు. ఈ పోటీలు సంస్కృతి ప్రదర్శనే కాక ఈ కళాత్మక సంసకృతిని సంరక్షించడానికి కూడా సహకరిస్తుది. తలపాగా, మాసాల పెంపకం శతాబ్దాలుగా రాజస్థాన్ పురాతన గౌరవ చిహ్నాలుగా గుర్తింపు పొందాయి.

సాధారణంగా సాయంకాలంలోనే నృత్యాలు, సంగీత కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ ప్రదర్శనలు చూడడాలనికి అనేకమంది ప్రజలు చేరుతుటారు. పౌర్ణమి రాత్రులలో జరిగే ఈ ఉత్సవాలు ఇసుక తిన్నెలకు వెండి మెరుగులు అద్దుతుటాయి.

ముఖ్యమైన ఎడారులుసవరించు

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. Singhvi, A. K. and Kar, A. (1992). Thar Desert in Rajasthan: Land, Man & Environment. Geological Society of India, Bangalore.
  2. Sinha, R. K., Bhatia, S., & Vishnoi, R. (1996). Desertification control and rangeland management in the Thar desert of India. RALA Report No. 200: 115–123.
  3. Sharma, K. K. and S. P. Mehra (2009). The Thar of Rajasthan (India): Ecology and Conservation of a Desert Ecosystem. Chapter 1 in: Sivaperuman, C., Baqri, Q. H., Ramaswamy, G., & Naseema, M. (eds.) Faunal ecology and conservation of the Great Indian Desert. Springer, Berlin Heidelberg.
  4. Sharma, K. K., S. Kulshreshtha, A. R. Rahmani (2013). Faunal Heritage of Rajasthan, India: General Background and Ecology of Vertebrates. Springer Science & Business Media, New York.
  5. "WWF". Archived from the original on 2007-09-30. Retrieved 2007-10-02.
  6. Kaul, R.N. (1970). Afforestation in Arid zones (edited): Dr. W. JUNK N.V. Publishers The Hague.
  7. 7.0 7.1 7.2 Gupta, M. L. (2008). Rajasthan Gyan Kosh. 3rd Edition. Jojo Granthagar, Jodhpur. ISBN 81-86103-05-8
  8. aśmanvatī rīyate saṃ rabhadhvamut tiṣṭhata pra taratāsakhāyaḥ | atrā jahāma ye asannaśevāḥ śivān vayamuttaremābhi vājān || (RV:10.53.8)

ఇతర లింకులుసవరించు