దరిశి చెంచయ్య

భారత స్వాతంత్ర్య సమర యోధుడు, రచయిత

దరిశి చెంచయ్య (1890 - 1964) విప్లవవాదిగా ప్రసిద్ధి పొందిన స్వాతంత్ర్య సమరయోధుడు. వృత్తి రీత్య వ్యవసాయ శాస్త్రజ్ఞుడు. ఇతడు స్త్రీ జనోద్ధరణకు అధికంగా కృషిచేసాడు. ప్రముఖ సంఘసంస్కర్తగా పేరు గడించాడు. గద్దర్ రాజకీయ పార్టీలో కొంతకాలం చురుకైన కార్యకర్తగా పనిచేసాడు. ఈయన భార్య దరిశి అన్నపూర్ణమ్మ తెలుగు కవయిత్రి, సామాజిక కార్యకర్త, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధురాలు.[1] మంచి రచయిత అయిన చెంచయ్య రచనల్లో ప్రాచుర్యం పొందినది ఈయన ఆత్మకథ నేనూ నా దేశమూ.[2] గద్దర్ పార్టీ స్థాపనాకాలంలో చెంచయ్య బర్కిలీలో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో వ్యవసాయశాస్త్రం అధ్యయనం చేశాడు.[3]

చెంచయ్య 1890లో ప్రకాశం జిల్లా, కనిగిరిలోని ఒక పేద వైశ్య కుటుంబంలో జన్మించాడు. చెంచయ్య బిపిన్‌చంద్రపాల్‌ ఉపన్యాసాలచే ప్రభావితుడై స్వాతంత్ర్య పోరాటం విప్లవం ద్వారానే సఫలీకృతం అవుతుందని భావించాడు. చదువుకోసం అమెరికా వెళ్లిన చెంచయ్యకు 1912లో క్యాలిఫోర్నియా యూనివర్శిటీలో భారత విప్లవకారుడు లాలా హరదయాల్‌తో పరిచయం ఏర్పడింది. జితేంద్రనాథ్‌లహరితో కలిసి గదర్‌ పార్టీ స్థాపించాడు. గద్దర్‌ పార్టీలో చేరిన చెంచయ్యకు ఆ పార్టీకి చెందిన పంజాబీ యువకులు దేశభక్తి అనేది తమ సొత్తే అనే భావాన్ని ప్రదర్శించడం నచ్చలేదు. దేశభక్తి అనేది ప్రతి ఒకరికీ ఉంటుందని, బ్రిటీషు సేనలో మొదట పేరిచ్చి చేరిన పంజాబీ యువకులు, విదేశాల్లో యుద్ధం చేస్తూ దేశభక్తి అని గర్వించవలసిన అవసరం లేదని వాదించాడు. దీంతో గద్దర్‌ పార్టీలో గౌరవం పెరిగింది. అమెరికా నుండి స్వదేశానికి బయలుదేరి వస్తున్నప్పుడు మార్గమధ్యంలో బ్రిటీషు ప్రభుత్వం ఈయనను రాజద్రోహిగా పేర్కొని, అరెస్టు చేసి నాలుగున్నర ఏళ్ళు భారతదేశపు జైల్లో ఉంచారు.[4] ఈయన మొత్తం 36 సంవత్సరాల ప్రజాజీవితంలో 8 ఏళ్లు జైలులోనే గడిపాడు.[5]

మూలాలు

మార్చు