దొడ్డా పద్మ, తెలంగాణ సాయుధ పోరాట నాయకురాలు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో పాల్గొని ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొని, మూడేళ్ళపాటు నల్లమల అడవులలో అజ్ఞాత జీవితం గడిపింది.[1] పద్మ భర్త దొడ్డా నర్సయ్య తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఒక దళానికి నాయకుడిగా ఉండేవాడు.

దొడ్డా పద్మ
జననం
సరస్వతి

సుపరిచితుడు/
సుపరిచితురాలు
తెలంగాణ సాయుధ పోరాట నాయకురాలు
జీవిత భాగస్వామిదొడ్డా నర్సయ్య
తల్లిదండ్రులు
  • కాట్రగడ్డ రంగయ్య (తండ్రి)

జీవిత విశేషాలు

మార్చు

పద్మ అసలు పేరు సరస్వతి. పద్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా, గన్నవరం మండలంలోని బుద్ధవరం గ్రామంలో జన్మించింది. స్వగ్రామంలో ఐదవ తరగతి వరకు చదువుకుంది. కొంతకాలం తరువాత పద్మ కుటుంబం అట్లప్రగడ గ్రామానికి వలస వెళ్ళింది. పద్మ తండ్రి కాట్రగడ్డ రంగయ్యకు తొలితరం కమ్యూనిస్టు నాయకులతో పరిచయాలు ఉన్నాయి. తెలంగాణ సాయుధ పోరాట నాయకులు తమ్మారెడ్డి సత్యనారాయణ, వెల్లంకి విశ్వనాథం, పేట రామారావు తదితరలు ఇంటికి వస్తుండేవారు. కమ్యూనిస్టు నాయకుల జాడకోసం పోలీసులు పద్మ కుటుంబాన్ని బంధించారు. ఆ సమయంలో పద్మ పోలీసులకు దొరకకుండా నర్సరావుపేటలోని దొడ్డా నర్సయ్య రహస్య స్థావరానికి చేరుకుంది.

వ్యక్తిగత జీవితం

మార్చు

పద్మకు నర్సయ్యతో ఉన్న పరిచయంతో సత్తెనపల్లి తాలూకా ‘తాళ్లూరు’లో వివాహం జరిగింది. నర్సయ్య స్వగ్రామం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చిలుకూరు. 1941లో రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన చిరుకూరులో జరిగిన ఆంధ్ర మహాసభ కార్యక్రమంలో వాలంటీర్‌గా పనిచేసిన నర్సయ్య సామ్యవాద సిద్ధాంతానికి ప్రభావితుడై కమ్యూనిస్టు ఉద్యమంలోకి వెళ్ళాడు. తరువాత 1957లో జరిగిన ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

ఉద్యమ జీవితం

మార్చు

భూస్వామ్య వ్యతిరేక ఉద్యమంలో కీలక నాయకుడిగా ఉన్న నర్సయ్య బృందంలో పద్మ ఒక్కరే ఆడపిల్ల. నల్లమల అడవులలో రహస్య జీవితం గడుపుతున్నప్పుడు పద్మగా పేరు మార్చబడింది. దళ సభ్యురాలిగా రోజూ కరపత్రాలు, ఉత్తరాలు రాయడం వంటి బాధ్యతలు నిర్వర్తించింది. రహస్య జీవితం ముగిసిన తరువాత కొంతకాలం అఖిల భారత మహిళా సమాఖ్య నాయకురాలిగా పనిచేసింది. మహిళల సమస్యలకు వ్యతిరేకంగా ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహిస్తూ, అనేక కార్యక్రమాలు నిర్వహించింది. 1952లో తొలి ఎన్నికలు జరిగినపుడు తన బృందంతో కలిసి భుజానికి డక్కలి తగిలించుకొని నల్గొండ జిల్లాలో ఊరూరా తిరుగుతూ ‘బండెనక బండి కట్టి..’ లాంటి గీతాలు పాడుతూ ప్రజలను చైతన్యపరిచింది.

మూలాలు

మార్చు
  1. ఆంధ్రజ్యోతి, నవ్య (16 September 2021). "ఇప్పుడు నోరెత్తే వాళ్ళేరీ?". andhrajyothy. కె. వెంకటేష్‌. Archived from the original on 4 October 2021. Retrieved 4 October 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 17 సెప్టెంబరు 2021 suggested (help)
  2. నవతెలంగాణ, వేదిక (16 March 2020). "ఉద్యమాల ఎర్రపొద్దు". NavaTelangana. అనంతోజు మోహన్‌ కృష్ణ. Archived from the original on 28 October 2020. Retrieved 4 October 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 28 సెప్టెంబరు 2020 suggested (help)