దొడ్డా నర్సయ్య, తెలంగాణ సాయుధ పోరాట నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఒక దళ నాయకుడిగా పనిచేసిన నర్సయ్య, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పిడిఎఫ్) పార్టీ తరపున 1957 నుండి 1962 వరకు హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[1]

దొడ్డా నర్సయ్య
జననం1914
మరణం2004, జనవరి 19
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తెలంగాణ సాయుధ పోరాట నాయకుడు
జీవిత భాగస్వామిదొడ్డా పద్మ

జీవిత విశేషాలు మార్చు

నర్సయ్య 1914లో అప్పయ్య - వెంకమ్మ దంపతులుకు తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, చిలుకూరు గ్రామంలో జన్మించాడు. ఎనిమిది మంది సంతానంలో నర్సయ్య మూడోవాడు. మేళ్ళచెరువులోని తన మేనమామ ఇంట్లో ఉండి ఉర్దూ మీడియంలో నాల్గో తరగతి వరకు చదుకున్నాడు. తరువాత పోలీస్‌ పటేల్‌ దగ్గర గుమస్తాగా పనికి కుదిరాడు. అక్కడి వెట్టిచాకిరీ ఇష్టంలేక పని మానేశాడు. తరువాత మరొకరి దగ్గర నెలకు 50 రూపాయిల జీతానికి గుమస్తాగా చేరాడు. దొరల దోపిడీకి సహకరించడం. అప్పులు తిరగ రాయడం, వడ్డీలకు వడ్డీలు కట్టి పండిన తిండి గింజల్ని జమ చేసుకోవడం వంటివి గమనించేవాడు.[2]

తెలంగాణ సాయుధ పోరాటం మార్చు

ముల్కాపురంలో జరిగిన 7వ ఆంధ్రమహాసభకు హజరై, అక్కడి నాయకుల ప్రసంగాలు విని తానుకూడా పోరాటంలో పాల్గొనాలనుకున్నాడు. ఆంధ్రమహాసభ పిలుపు మేరకు 1941లో రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన చిలుకూరులో జరిగిన ఆంధ్ర మహాసభ కార్యక్రమంలో వాలంటీర్‌గా పనిచేసిన నర్సయ్య సామ్యవాద సిద్ధాంతానికి ప్రభావితుడై కమ్యూనిస్టు ఉద్యమంలోకి వెళ్ళాడు. 1942లో పార్టీ సభ్యత్వం పొందాడు. నిజాం వ్యతిరేక ఉద్యమం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. రజాకార్ల దౌర్జన్యంలో నిలువనీడకు కూడా దూరమై, జైలు నిర్బంధాలను కూడా ఎదుర్కొన్నాడు.[3] నర్సయ్య తమ్ముడు నారాయణరావు పోరాటంలో పాల్గొని మూడేళ్ళపాటు అజ్ఞాతంలో, 16 నెలలపాటు జైలులో ఉన్నాడు. నర్పయ్య అన్న గోపయ్య దళ కమాండర్‌ పనిచేశాడు. భూస్వాముల గుండాలు కౌలు పేరుతో చేస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా నర్సయ్య పోరాటం సాగించాడు. తన దళంతో కలసి నైజాం సైన్యాన్ని ఎదురించి అనేక గ్రామాల ప్రజలను రక్షించాడు. ఉద్యమకారులకు ఆయుధాలను సేకరించి ఇచ్చేవాడు. వివిధ గ్రామాల్లోని జమీందార్లను తరిమికొట్టి వారి భూములను స్వాధీనం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు.[2]

వ్యక్తిగత జీవితం మార్చు

తెలంగాణ సాయుధ పోరాట నాయకురాలు, కాట్రగడ్డ రంగయ్య కుమార్తె దొడ్డా పద్మ, పోలీసుల నుండి తప్పించుకొని నర్సరావుపేటలోని నర్సయ్య రహస్య స్థావరానికి వచ్చింది. అలా నర్సయ్యకు పద్మతో పరిచయం జరిగింది. సత్తెనపల్లి తాలూకా ‘తాళ్లూరు’లో వారిద్దరి వివాహం జరిగింది.

రాజకీయ జీవితం మార్చు

1957లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పిడిఎఫ్) పార్టీ తరపున హుజూర్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి ఒక్క రూపాయి పంచకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి. భాస్కర్ రావుపై 5,887 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[4] ఎమ్మెల్యేగా తనకు వచ్చే జీతాన్ని కమ్యూనిస్టు పార్టీకి ఇచ్చి, పార్టీ ఇచ్చే 250 రూపాయల గౌరవ వేతనాన్ని తీసుకునేవాడు. సెక్యూరిటీ గార్డులు, గన్‌మెన్ల లాంటి హంగు, ఆర్భాటాలేవీ లేకుండా బస్సులోనే ప్రయాణించేవాడు. 1962, 1967లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కిరాజు వాసుదేవరావు చేతిలో ఓడిపోయాడు.[3]

మరణం మార్చు

నర్సయ్య 2004, జనవరి 19న మరణించాడు.[2]

గుర్తింపు/గౌరవం మార్చు

తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ తరఫున నిలిచిన నర్సయ్యకు నివాళిగా 2014, డిసెంబరు 19న 15వ వర్ధంతి సందర్భంగా నర్పయ్య నిలువెత్తు కాంస్యవిగ్రహాన్ని చిలుకూరు గ్రామంలో ఏర్పాటుచేయబడింది.[5]

మూలాలు మార్చు

  1. "🗳️ Dodda Narsiah, Huzurnagar Assembly Elections 1957 LIVE Results". LatestLY (in ఇంగ్లీష్). Archived from the original on 2022-02-13. Retrieved 2022-02-13.
  2. 2.0 2.1 2.2 నవతెలంగాణ, వేదిక (16 March 2020). "ఉద్యమాల ఎర్రపొద్దు". NavaTelangana. అనంతోజు మోహన్‌ కృష్ణ. Archived from the original on 28 October 2020. Retrieved 13 February 2022. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 28 సెప్టెంబరు 2020 suggested (help)
  3. 3.0 3.1 ఆంధ్రజ్యోతి, నవ్య (16 September 2021). "ఇప్పుడు నోరెత్తే వాళ్ళేరీ?". andhrajyothy. కె. వెంకటేష్‌. Archived from the original on 4 October 2021. Retrieved 13 February 2022. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 17 సెప్టెంబరు 2021 suggested (help)
  4. "🗳️ Dodda Narsiah winner in Huzurnagar, Andhra Pradesh Assembly Elections 1957". LatestLY (in ఇంగ్లీష్). Archived from the original on 2022-02-13. Retrieved 2022-02-13.
  5. సాక్షి, తెలంగాణ (20 January 2014). "పోరు బిడ్డ.. మన దొడ్డా". Sakshi. Archived from the original on 22 January 2014. Retrieved 13 February 2022.