దొమ్మరి ఆట

దొమ్మరోళ్ళ దొమ్మరాటలు

మార్చు

దొమ్మరాటలు పూర్వ కాలం నుంచీ వున్నట్లు 13 వ శతాబ్దానికి చెందిన పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్ర పర్వత ప్రకరణంలో......

అమరాంగనలు దివి నాడేడు మాడ్కి నమరంగ గడలపై నాడేడు వారు

పై రెండు పాదముల వర్ణన ప్రకారం, దొమ్మర సానులు వెదురు గడల పైన ఆకాశంలో అప్సరసలు ఆడుతున్నారంత భ్రమను కలిగించేవారట. అంటే వారు వుపయోగించే ఎదురు గడలు అంత పొడవైన వన్నమాట. దొమ్మర సానులు పురుషులతో పాటు భూమి మీద వివిధ రకాల పిల్లి మొగ్గలు మొదలైన చిత్ర విచిత్ర ప్రదర్శనాలతో ప్రేక్షకుల్ని దిగ్భ్రమలో ముంచేవారు. చూసే వారికి ఆటలు భయాన్ని కలిగించేవి. వారి ఆటలు పాతిన గడమీదనే కాక, గడను పురుషులు ఎదురొమ్ము మీద, నొసటి మీద నిలబెట్టి, ఆ గడలపై దొమ్మర సానూలతో తమ తమ విద్యల్ని ప్రదర్శింప చేసేవారు. దొమ్మరి సానుల ఆటను శ్రీ హర్షుడు సంస్కృత నైషధంలో అలంకారికంగా వర్ణించినట్లు శ్రీనాథుడు శృంగార నైషధంలో ఈ విధంగా వర్ణించాడు.

గడ సాని గరడీలు

మార్చు

ఈ సకలావనీ తలము వెక్కటి దాన పరిభ్రమించి య

భాస పరంపరా పరత నభ్రమునన్ విహరింప గోరియో

తాసిక కీర్తి విభ్రమ కలంగరి మన్నటి యంచు చుండు నీ

రాసుతు వంశ రత్నము దిరంబుగ జెంది యమందలీలన్

.................................................. (శృంగార నైషధం. 5 అశ్వాసము, 118 పేజీ)

అలాగే

సంత నెన్నడో జవ్వన మమ్ము

కొన్న గడసాని ననుంగవ యందలంచితీ

అని ఊర్వసి పేర్కొన్న గడసాని ఇటువంటిదే అని నాచన సోముని ఉత్తర హరి వంశ 1-74 పద్యంలో ఉదహరింప బడిందని.... (పి.యస్.ఆర్. అప్పారావు గారు, సూత్ర ధారి పత్రికలో వుదయరించారు. )

విజయనగర రాజుల కాలంలో మహర్నవమీ వుత్సవాలలో దొమ్మరాటలు మొదలైన చిత్ర విచిత్రాలను ప్రదర్శించడంతో పాటు ఏనుగులు, పులులు, సింహాలు మొదలైన క్రూర మృగాలతో సర్కసు పనులు చేయించే వారని విదేశీ యాత్రీకుడైన అబ్దుల్ రజాక్ వర్ణించి నట్లు భావ రాజు కృష్ణా రావు గారు (విదేశీ యాత్రికులు -- ప్రాచీనాంధ్ర దేశం 191 - 192 పేజీలలో) ఉదహరించారు. అంతే కాక బాపల విద్య లేవీ కూడా దొమ్మరి విద్యలతో సరిపోవని చంద్ర శేఖరుడు తన శతకంలో ఈవిధంగా వర్నించాడు.

మెడ్డుగ దొమ్మరెక్క, గన మించిన యిద్దమ రేడ లేదు, నా తెడ్డొక బాప నిద్దెలని తిట్టును మూర్ఖుడు చంద్ర శేఖరా....

ఈ విధంగా దొమ్మరాటలు చరిత్రలో స్థానాన్ని ఏర్పరచుకున్నాయి. ఈ నాడు పెద్ద పెద్ద సర్కసులని చెప్పుకోబడే వాటికి ఆధారం ఆనాటి దొమ్మరాటలే .............

నేటి దొమ్మరాటలు:

మార్చు

ఆయా కాలాలలో చారిత్రకంగా ప్రచారం పొందిన దొమ్మరాటలు, ఈ నాటికీ ఆంధ్ర దేశంలో అక్కడక్కడా దేశ దిమ్మరులైన దొమ్మరుల ద్వారా చూస్తూ వుంటాం. ఒకప్పుడు ప్రజ్ఞ విశేషాలను ప్రదర్శించే సమూహాలుగా వున్న ఈ దొమ్మరి వారు కేవలం ఒకే కుటుంబంలో వున్న వ్వక్తులే. వారి జీవనాధారం కోసం చిన్న చిన్న ప్రదర్శనాల నిచ్చి వచ్చిన డబ్బుతో కడుపు నింపు కుంటూ, ఒక వూరి నుంచి మరో వూరికి పోతూ వుంటారు. ఒకప్పుడు రాజాస్థానాలలో ప్రభువుల సమక్షంలో ప్రతిభా విశేషాలను చూపించిన వీరు... బిక్కు బిక్కు మంటూ దిక్కులేని యాచకుల్లాగ బ్రతుకు తున్నారు. ఈనాడు - వీరి ఆలనా, పాలనా చూసే వారే లేరు. వీరిని గురించి అలోచించే వారే లేరు. పట్టించు కోవాల్సిన ప్రభుత్వం సంగతి చెప్ప వలసిన అవసర మేమి లేదు.

నిజానికి పజ్ఞ, ప్రతిభా విశేషాలతో కూడు కొని వున్న ఇలాంటి కళా రూపాలు చచ్చి పోకూడదు. వాటిని బ్రతికించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందు కంటే, అవి జాతీయ క్రీడా విశేషాలకు సంబంధించిన కళారూపాలు గనుక. సహజంగా ఈ నాటి దొమ్మర్లు, పంటలు బాగా పండిన తరుణంలో, సంక్రాంతి మొదలైన పర్వదినాలలో దొమ్మరాటల వారు వస్తూ వుంటారు. వంశ పారంపర్యంగా కుల వృత్తిగా స్వీకరించి కుటుంబంలో ల్వున్న వారందరూ చిన్న తనం నుంచే వీటిని అభ్యశించడం వల్ల, కుటుంబ స భ్యులందరూ ఆరి తేరిన వై వుంటారు. ముఖ్యంగా వీరి ఆటల్లో మంచి వయసులో వున్న స్త్రీలు ఇద్దరు ముగ్గు రుంటారు. ఈ ఆటలకు వేరే ముఖ్య ఆకర్షణ.

వీథిలో ఎదురుగడ:

మార్చు

వీరు ఒక గ్రామంలో ప్రవేశించి పెద్దలందర్నీ కలుసుకుని ప్రదర్శనానికి అనుమతి తీసుకుని, వారిని ప్రదర్శనానికి ఆహ్వానించి, ఊరి మధ్య ఒక పెద్ద ఎదురుగడ (వెదురు కర్ర) ను పాతుతారు. దానిని నాలుగు ప్రక్కలా నాలుగు బలమైన త్రాళ్ళతో లాగి నిలబెడతారు. వారి దగరున్న డోలును ఉధృతంగా వాయిస్తూ వుంటే, చిన్న పిల్లలు రక రకాల పిల్లి మొగ్గలు వేస్తూ వుంటారు. ఒక్క పదినిముషాల్లో ఊరిలోని వారందరూ గుమి కూడతారు. అప్పుడు ప్రదర్శన ప్రారంభిస్తారు. ఇది చూడడానికి ఒక వ్వాయామ ప్రదర్శనగా కనిపించినా, దీనిని ఒక కళారూపంగానే భావించి ప్రజలు ఆనందం పొందుతారు.

యవ్వనంలో వున్న యువతుల పిల్లి మొగ్గలకూ, చేసే విన్యాసాలకూ, యువకులు తల్ల క్రిందులై పోతారు[ఆధారం చూపాలి]. ఆట ప్రారంభానికి వంతగా నున్న డప్పు, డోలూ ఎంతో ఉత్సాహాన్నిస్తాయి. కేరింతలతో, కేకలతో, ఆడా, మగా, గోచీలు పెట్టి దండాలూ, జబ్బలూ, చరుస్తూ అందరూ రకరకాల మొగ్గలు వేస్తూ ప్రేక్షకులను ఆకర్షిస్తారు; గారడీ నాయకుడు కొట్టే దోలుకూ, వేసే కేకలకూ అనుగుణంగా రకరకాల విన్యాసాలు చేస్తారు. ముఖ్యంగా స్త్రీలు ఎత్తుగా వున్న తీగ మీద ఎదురుగడ ఊతంగా ఆ ప్రక్క నుంచి ఈ ప్రక్కకు, ప్రథమంలో నెమ్మదిగా నడుస్తూ, తరువాత వేగంగా నడుస్తూ, తీగ మీద నుండి క్రిందికి పడి పోతుందేమో నన్నంత భయాన్ని కలిగిస్తూ తమ తమ నైపుణ్యాన్ని చూపిస్తారు.

గడమీద గిరికీలు

మార్చు

ఆ తరువాత ఎత్తుగా వున్న స్త్రీ, పురుషుడూ కూడా గబగబా పైకి ఎగ బ్రాకి, శిఖరాగ్రం మీద నిలబడీ, కూర్చునీ, పడుకునీ రకరకాల ఆశ్చర్య కరమైన విన్నాస్యాలను చేస్తూ చూపరుల్ని, సంభ్రమాశ్చర్యాలతో ముంచుతారు. అక్కడనుండీ పల్టీ కొట్టి ఎదురు గడకు కట్టిన త్రాటి మీద నుండి ఒక్క నిముషంలో వేగంగా జారి క్రిందికి వస్తారు. అఖరి సారిగా గడ మీదకు స్త్రీ ఎగబ్రాకి గిర్రున తిరిగుతూ, తన చాతుర్యాన్ని చూపిస్తుంది. చుట్టూ చేరిన ప్రేక్షకు లందరూ, తలలు పైకెత్తి ఈలలతో చప్పట్లుతో, గడసానిని మరింత ఉత్సాహ వరచి ఆనందంలో, ఓలలాడి పోతారు. ఇలా ముగ్దులై పోయిన ప్రేక్షకులను గారడి బృందంలో వున్న పిల్లలూ, పెద్దలూ బాగా డబ్బు దండు కుంటారు. ఇలా ఒకనాడు ద్దొమ్మరాటలు, ఆంధ్ర ప్రజా సామాన్యాన్ని ఉర్రూత లూగించాయి., ఈనాటికీ అక్కడక్కడా చిన్న చిన్న బృందాలను చూడగలం. ఒక రకంగా ల్చెప్పాలంటే ఇది ఒక చిన్న తరహా సర్కసు, అయినా గడ సాని గడ నెక్కడం ఊరికి మంచిదనే నమ్మకం పల్లె ప్రజలలో ఉంది.

కనికట్టు చేసే కాటిపాపల వాళ్ళు.

మార్చు

కాటి పాపల వారు ఆంధ్ర ప్రాంతంలో కూడా ఉన్నారు. ఈ కాటిపాపల వారు, మెదక్, జిల్లా జహీరా బాద్ తాలూకాలో ఉన్నారు. కాని ఈ నాడు ఆంధ్ర దేశంలో కాటి పాపల వారిని గురించి ఎవరికీ తెలుయదు. వీరిని అందరూ కాటిపాపల వాళ్ళు అంటారు. ఇలా పేరు ఎందుకు వచ్చిందంటే ఎవరూ చెప్పలేరు. కానీ వీరి అసలు పేరు కాతి కాపర్లు. వీరి అసలు వృత్తి (కాటిని) శ్మశాన్ని కాపలా కాయడమనీ అందువల్లే వారికా పేరు వచ్చిందనీ, లక్ష్మీకాంత మోహన్ గారు తెలియజేస్తున్నారు. పూర్వం ఊరి కాపలా వారి మాదిరి కాటి కాపర్లు కూడా వుండే వారు. వీరికి ఊరు వుమ్మడిగా పారితోషికం ఇవ్వబడేది. అయితే నా చిన్న తనంలో పిల్లల్ని భయపెట్టటానికి తల్లి దండ్రులు అదుగో కాటి పాపల వాళ్ళు వచ్చారంట అనేవారు. కాటి పాపల వాళ్ళు పిల్లల్నీ పాపల్ల్నీ ఎత్తుకుపోతారని ఆ రోజుల్లో ప్రతీతి. పాపల్ని ఎత్తుకు పోతారు కనుక, కాటి పాపల వాళ్ళు అనే పేరు వచ్చిందేమో తెలియదు.

వీరిది కూడా ఇంద్రజాల ప్రదర్శనమే. ప్రజలను భయ కంపితులుగా చేసే కళారూప మిది. వీరి వేష ధారణ అతి గంభీరమైనది. ఈ ప్రదర్శకుడు రంగు రంగుల దుస్తులు ధరిస్తాడు. రెండు మూడు పెద్ద గంటలను వ్రేలాడ దీస్తాడు..... నడుస్తూ వుంటే ఈ గంటలు చప్పుడు ఏదో ఏనుగు నడుస్తునట్లుగా భీతి పుడుతుంది. నొసటన పెద్ద బొట్టు, వడితిరిగిన బుర్ర మీసాలు, ఈకల మాదిరిగా చిత్రించిన రేకుల కిరీటం..... చంకలో జోలె...... చేతిలో ఎముకలు పుచ్చుకొని భూత వైద్యుడిలా ప్రవేశిస్తాడు. వీ నిత్తి మీద ఇత్తడి రేకుల కిరీటం మినహాయిస్తే, బుడబుక్కల వారి వేష ధారణకూ, వీరికి పెద్ద తేడా కనిపించదు.

వీరు కొన్ని మాయలూ, మంత్రాలు కూడా చేస్తారు. కాటి కాపర్లు అవడం వల్ల కొన్ని అతీంద్రియ శక్తులు కలిగి వుంటారనే నమ్మకం కూడావుంది. ఈ నాడు కాటికాపరి తనం ఎక్కడా లేదు. ఒక నాటు సత్య హరిశ్చంద్రుడు కాటి కాపరి తనం చేయడం అదరికీ తెలిసిందే.వీరు ఇంటింటికి తిరుగుతారు. ఎవరికీ ఈ అపాయాన్ని కలిగించరు. వ్యాచిస్తూ పొట్ట పోసు కుంటారు. అయితే వీరు ప్రేక్షకులను సమీక రించటానికి ఇంద్ర జాల విద్యల్ని ప్రదర్శిస్తారు. మూజిక్ చేసి ప్రేక్షకుల్ని ఆశ్చ్యర్య చికితుల్ని చేస్తారు.

వీ భుజానికీ ఒక జేలె వుంటుంది. అందులో నుంచి గవ్వలతో పసుపు కుంకాలతో అలంకరించిన ఒక బొమ్మను అమ్మవారి బొమ్మంటూ తీసి అందరి ఎదుట పెడతారు. చేతిలో ఒక ఎముక వుంటుంది. ఆ ఎముకతో ఆ బొమ్మను తాకిస్తూ, ఓం మహంకాళీ శాంభవీ అంటూ క్షణంలో మండ్ర గబ్బల్నీ, తేళ్ళనీ, ఎలుకల్నీ పుట్టిస్తాడు. ఆ పుట్టిన ఎలుక చేత కీచు కీసు మనిపిస్తాడు. నోటిలో నుంచి ఇనుప గోలీల్నీ, మేకుల్నీ తీస్తాడు. అలా వ్వాచిస్తూ పొట్ట పోసు కుంటూ వ్వాచకులై, దేశ దిమ్మరులై తిరుగుతూ వుంటారు ........ ఆ నాడూ వీరి ఇంద్ర జాల విద్యల్నీ తిలకించ టానికి ప్రజలు గుంపులు గుంపులుగా ఎగబడి చూసేవారు. ఇదీ ఒక కళా రూపం గానే వర్థిల్లింది.

మూలాలు

మార్చు