ద్వారక పార్థసారథి

ద్వారక పార్థసారథి కర్ణాటక సంగీత విద్వాంసురాలు.

ద్వారక పార్థసారథి
జననండిసెంబర్ 20, 1920
చింతాద్రిపేట, మద్రాసు
మరణంఏప్రిల్ 14, 1978
ఇతర పేర్లుద్వారకాబాయి
ప్రసిద్ధిసంగీత విద్వాంసురాలు,
గృహలక్ష్మి స్వర్ణకంకణ గ్రహీత
భార్య / భర్తనల్లాన్ చక్రవర్తుల పార్థసారథి
పిల్లలుశ్రీరామ్‌, మోహనకృష్ణ, లక్ష్మణ్, సుధాకర్, గీతార్థ
తండ్రిగాడిచర్ల హరిసర్వోత్తమ రావు
తల్లిరమాబాయి

జీవిత విశేషాలు

మార్చు

ద్వారకాబాయి స్వాతంత్ర్య సమరయోధుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారి పుత్రిక. ఈమె మద్రాసులోని చింతాద్రిపేటలో 1920, డిసెంబరు 17వ తేదీన గాడిచర్ల హరిసర్వోత్తమరావు, రమాబాయి దంపతులకు మూడవ సంతానంగా జన్మించింది. ఈమె బాల్యం నంద్యాలలో గడిచింది. తన తల్లివద్ద సంగీతాభ్యాసం చేసింది. తండ్రి గాడిచర్ల నిరంతర సంచారి. భార్య, బిడ్డను నంద్యాలలో వదలి వెళ్లేవాడు. నంద్యాల గాంధీగా పేరుపొందిన కాదరాబాద్ నరసింగరావు రమాదేవిని తన తోబుట్టువుగా, ద్వారకాబాయిని మేనకోడలిగా ఆలనా పాలనా చేసేవాడు. ద్వారకా బాయి, సంగీతోభ్యాసంతో పాటు నంద్యాల పురపాలకోన్నత పాఠశాలలో బడి చదువు పూర్తి చేసింది. ఆ తర్వాత మద్రాసు క్వీన్ మేరీస్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివి, సంగీతంలో డిప్లొమా అత్యున్నత స్థానంలో ఉత్తీర్ణురాలయ్యింది. గోటు వాద్య విద్వాంసురాలిగా గుర్తింపు పొందింది. తండ్రితో పాటు అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యింది. చెన్నైలోని స్త్రీ సేవాసదన్, కేసరి ఉన్నత పాఠశాల, విద్యోదయ బాలికల ఉన్నత పాఠశాలలో తన సేవలను అందించింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలు నిర్వహించిన సంగీత పరీక్షలకు నిర్వాహకురాలిగా వ్యవహరించింది. స్త్రీ సేవామందిరంలో సంగీతశాఖను ఏర్పాటు చేయడంలో కృషి చేసింది.

ఈమె తన సంగీత సహాధ్యాయి నల్లాన్ చక్రవర్తుల పార్థసారథి (1917-1985) ని ప్రేమించి 1942, మే 9న మహాబలిపురం, తిరుక్కళి పక్షితీర్థం వద్ద సంస్కరణ వివాహం చేసుకుంది. ఈ దంపతులు ఇరువురు కలిసి అనేక సంగీత కచేరీలు చేశారు. 1945లో మద్రాసు సంగీత కళాశాలను స్థాపించి నిర్వహించారు. సంగీత విద్వాంసుడు శ్రీపాద పినాకపాణి ఈ దంపతులకు సహాధ్యాయి.

ఈ దంపతులు స్థాపించిన మద్రాస్ సంగీత కళాశాల వందలాది దేశీయ విద్యార్థులతో పాటు అమెరికా, ఇంగండ్. ఆస్ట్రేలియా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, మలేసియా, శ్రీలంక తదితర విదేశాల సంగీత పిపాసులను ఆకర్షించింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు నిర్వహించే సంగీత పరీక్షలతో పాటు మద్రాస్ విశ్వవిద్యాలయం నిర్వహించే సంగీత డిప్లమో పరీక్షలకు ఈ కళాశాలలో శిక్షణను ఇచ్చేవారు. 1972లో జరిగిన కళాశాల రజతోత్సవ సందర్భంగా ఈ కళాశాల శిష్యులు ఈ దంపతులకు వెండివీణను బహూకరించి సత్కరించారు.

ద్వారక పార్థసారథి తరచుగా తెలుగు పత్రికలకు వారసత్వం, సంస్కృతి, విశిష్ట ఆసక్తికరమైన ప్రదేశాలు, సంగీత మూలం వంటి అంశాలపై వ్యాసాలు వ్రాసింది. ఈమె ప్రామాణిక, చిత్తశుద్ధి, నిస్వార్థ సేవలను గుర్తించి గృహలక్ష్మి మాసపత్రిక వారు 1975లో స్వర్ణకంకణాన్ని బహూకరించారు.

ఎందరో విద్యార్థులను కళాకారులుగా తీర్చిదిద్దిన ద్వారక పార్థసారథి 1978, ఏప్రిల్ 14న మరణించింది[1].

రచనలు

మార్చు
  1. పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ గారి రచనలు
  2. రామనాథపురం శ్రీనివాస అయ్యంగారి రచనలు
  3. జావళీలు - స్వరసహితము
  4. గానకళా బోధిని (ఎన్.సి.పార్థసారథితో కలిసి)
  5. శ్యామాశాస్త్రి గారి రచనలు
  6. రాగమల్లికాభరణి

మూలాలు

మార్చు
  1. వెబ్ మాస్టర్. "సంగీత కళాప్రవీణ ఎన్ సి పార్థసారధికి నివాళి". ఆసియా నెట్ న్యూస్. Retrieved 18 January 2020.[permanent dead link]