ధన్వాడ రామచంద్రరావు
డాక్టరు ధన్వాడ యస్. రామచంద్రరావు (1881- ) M.A., M.D (Edinburgh) బెజవాడ, తదుపరి బెంగళూరు కాపురస్తులు, వైద్యనిపుణులు, గొప్ప ఫిలాంత్రఫిస్టు (సానుభూతి కలవారు). 1922 నుండి 1925 వరకు బెజవాడ మునిసిపల్ కౌన్సిల్ కు అధ్యక్షులుగా చేశారు.
బెజవాడ మునిసిపల్ కౌన్సిల్ రాజకీయాలు
మార్చుబెజవాడలో జస్టిస్ పార్టీ ఆదికారములో నుండిన రోజులలో ఆ పార్టీలో ప్రముఖులైన సర్ మోచర్ల రామచంద్రరావు గారు పార్టీ కార్యకలాపాలకు మూలస్తంభములాంటివారు. మునిసిపల్ కౌన్సిల్ కు అధ్యక్షుడుగా కూడా చేశారు. 1920 కు ముందునుండి అదేపార్టీకి చెందిన దినవహి హనుమంతరావు గారు దాదాపుగా 15 సంవత్సరములు అధ్యక్షులుగా నున్నారు. చాల సంవత్సరములు కౌన్సిల్కు ఎన్నికలు జరపకపోవుట కారణంగా 1921 లో కాంగ్రెస్సు పార్టీకి చెందిన ప్రముఖ న్యాయవాది అయ్యదేవర కాళేశ్వరరావు గారు, గురునాధ రామశేషయ్య మొదలగు యితర కాంగ్రెస్సు ప్రముఖులు చేసిన ఆందోళన (పన్నులు కట్టవద్దని ప్రజలను ప్రేరేపించిన) కారణంగా కాళేశ్వరరావు గారికి, రామశేషయ్యగారికీ 1 సంవత్సరం జైలు శిక్షవిధించబడింది. తత్ఫలితముగానైతేనేమి, కాంగ్రెస్సు ప్రముఖులు జైలులోనుండిన సదావకాశ మని కాబోలు చివరకు జస్టిస్పార్టీ వారు మునిసిపల్ కౌన్సిల్ కు ఎన్నికలు జరుపించారు. ఆ మునిసిపల్ ఎన్నికలకు ఆనాటి కాంగ్రెస్సు ప్రముఖులు డాక్టరుఘంటసాల సీతారామ శర్మ గారు ప్రముఖ పాత్ర వహించి ఎలక్షన్లో విస్త్రుతముగా ప్రచారము చేసి కాంగ్రెస్సు పార్టీకి విజయము సాధించారు. అప్పడు 1922 లో డాక్టరు ధన్వాడ రామచంద్రరావు గారిని కౌన్సిల్ కు అధ్యక్షుడుగా ఎన్నుకొనబడ్డారు. వీరు అప్పటిలో ప్రముఖ ముక్కుచెవిగొంతుక, మరియూ కంటి వైద్యనిపుణులు (ENT & E Specialist) స్కాట్లాండులోని ఎడింబరోలో ఎమ్ డి చేశారు. పార్టీ రాజకీయాలలోనూ స్వాతంత్ర్యోద్యమములలోనూ ప్రత్యక్షముగా పాత్రవహించకపోయిననూ వారు గొప్ప దేశభక్తులు, గాంధీవాది. ఎల్లప్పుడూ తెల్లని ఖద్దరు వస్త్రములనే ధరించేవారు. 1925 లో అయ్యదేవర కాళేశ్వరరావు గారు జైలునుండి విడుదలై వచ్చిన తరువాత వారిని అధ్యక్షునిగా చెయుటకొరకు డాక్టరు రామచంద్రరావుగారు తమ అధ్యక్షపదవికి 20/04/1925నాడు రాజీనామా చేశారు. వారి అధ్యక్షపదవీకాలంలో మునిసిపల్ కమీషనర్ అను పదవి లేదు. అధ్యక్షునికే కార్యకాధికారములుండేవి.
డాక్టరుగారి జీవిత విశేషాలు కొన్ని
మార్చువారి తండ్రి గారు ధన్వాడ అనంతం (1850-1949) గారి కాలంనుండి వారి కుటుంబము క్రైస్తవమతమవలంబిచినవారు. రామచంద్రరావుగారు గొప్ప పిత్రుభక్తి గలవారు. తన జీవితమును పిత్రుసేవలో ధారపోసి బ్రహ్మచారిగానుండి వారు తన తండ్రి అనంతంగారికి అహర్నిశలు సేవచేశారు. తండ్రి పేరుమీద బెజవాడలో అనంతం ఆసుపత్రిని స్థాపించారు. బీదవారి పట్ల దయకలిగి జీవితాంతం బీద విద్యార్థులకు విద్యావేత్తనములిచ్చారు. అంతేకాక బీదవారికి ధన ధాన్య మౌలిక సహాయం చేతనైనంతగా చేశేవారు. మునిసిపల్ కౌన్సిల్ కు వారి తరువాత అధ్యక్షునిగా వచ్చిన అయ్యదేవర కాళేశ్వరరావు గారి కార్యకాలములో 1927-28 లో బెజవాడ మునిసిపల్ బిల్ కలెక్టర్ల అవినీతి కుంభకోణం (defalcation case) కేసులో ఇరుకున్న కె.యస్ అభిషేకం అను క్రైస్తవమతస్తుడైన బిల్ కలెక్టరుపై సాను భూతి కలిగి డాక్టరు రామచంద్రరావుగారు అతని తరఫున వకీలుగా పనిచేయమని న్యాయవాదిగా నుండిన తమ మిత్రులైన దిగవల్లి వేంకట శివరావుగారి వద్దకు తీసుకుని వచ్చి కుంభకోణంలో జరిగిన కుట్ర యథార్థము చెప్పించి అతనికి తక్కువ శిక్ష పడేట్లుగా అతని తరఫున న్యాయవాది గానుండమని కొరారు. ఆ కేసులో మిగతా బిల్ కలెక్టర్లకు రెండున్నసంవత్సరములు దాకా జైలు శిక్షపడగా ఆ అభిషేకమునకు కేవలం ఒక నెల మాత్రమే శిక్షపడినది. 1957 లో డాక్టరు గారు ఇంగ్లీషులో తన తండ్రిగారి జీవిత చరిత్ర "DHANVADA ANANTAM" అను గ్రంథమును రచించారు.[1]. ప్రముఖ క్రైస్తవమతనాయకులు,1940 లో కలకత్తా యూనివర్సిటీ కులపతిగానుండి తదుపరి 1951-1956 లో పశ్బమ బెంగాలకు గవర్నరు గాచేసిన ప్రముఖ విద్యావేత్త, రాజకీయనాయకుడైనట్టిహరేంద్ర కుమార్ ముఖర్జీ ( Harendra Coomar Mookerjee ) గారు డాక్టరు రామచంద్రరావుగారికి మిత్రులు వారిద్వారా దిగవల్లి వేంకట శివరావుగారికీ కూడా మిత్రులుగానుండిరి.ఆ ముఖర్జీ గారు 1940 మార్చి 29 తారీఖున బెజవాడ వచ్చినప్పుడు డాక్టరుగారు, శివరావు గారు కలసి ముఖర్జీగారి ఉపన్యాస సభను బెజవాడ రామమోహనా గ్రంథాలయములో ఏర్పాటు చేసారు. ఆసభకు డాక్టరు చాగంటి సూర్యనారాయణమూర్తి గారు అధ్యక్షలుగా నుండిరి.[2] డాక్టరు రామచంద్ర రావు గారు 1940 దశాబ్దము తరువాత బెంగుళూరులో కాపురముండేవారు. డాక్టరుగారు దిగవల్లి వేంకట శివరావు గారుకు సన్నిహిత మిత్రులు. జీవితాంతము వారిరువురూ ఉత్తరప్రత్యుత్తరములు జరిపారు. డాక్టరుగారు బెంగళూరునుండి వ్రాసిన ఉత్తరములలో జూలై 1958 లో వ్రాసిన పోస్టుకార్డు తరువాత సమాచారమేమీ కనపడుటలేదు (అప్పటికి వారికి 74 ఏండ్లు).