దినవహి హనుమంతరావు

దినవహి హనుమంతరావుగారు కాకినాడ కాపురస్తులని, సంపన్నులని, నాటకాలంటే ప్రీతి అని ఒక నాటక కంపెనీని స్ధాపించారని చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు తమ స్వీయచరిత్రలో వ్రాశారు.[1]. దినవహి హనుమంతరావు గారికి 1922 నాటికే దాదాపుగా 60 ఏండ్లుండేవి. బెజవాడలో ఆ రోజులనాటిజస్టిస్ పార్టీలో ప్రముఖులు. 1921 నాటికి బెజవాడ మునిసిపల్ కౌన్సిల్ కు12 సంవత్సరములపాటు వరుసగా అధ్యక్షులుగా చేసియున్నువారు. వారికి చాల పలుకుబడి గలిగియుండేది. అంతే కాక వారు మోచర్ల రామచంద్రరావు, న్యాపతి సుబ్బారావు, బి.యన్ శర్మ గారు మొదలగు వారితో కాకినాడ, రాజమహేంద్రవరం, చెన్నపట్టణం మొదలైన ప్రాంతములో మోడరేట్ నాన్ బ్రాహ్మిన్ ఉద్యమ స్నేహితులు. మెసానిక్ లాడ్జిలో సభ్యులు. వీరిని గురించి దిగవల్లి వేంకట శివరావు గారు తమ జ్ఞాపకాలు అను అప్రచురిత రచనలో విశేషాలు వ్రాసియున్నారు.[2] బెజవాడలోగురుమంత అప్పలస్వామి పాత్రుడు అను నగరాలనాయడుగారు మునిసిపల్ కాంట్రాక్టరు గారు హనుమంతరావుగారికి కుడి భుజములాంటి వారు. వారికి బెజవాడలో నున్న పెద్ద షౌకారులు, బియ్యం మిల్లులవారు అర్ధణా వాటా ఇచ్చేవారనీను, మునిసిపల్ కౌన్సిల్ కు అధ్యక్షలవటంవల్ల చెన్నపట్టణం లోనున్న పెద్ధ కంపెీనలనుండి మునిసిపాలిటీ పనులకు కావలసిన సామానులు కొనుగోలు చేస్తున్నందున వారికి చెన్నపట్టణం వ్యాపారస్తులు గూడా కమిషన్ ఇచ్చేవారని చెప్పుకునే వారు. హనుమంతరావుగారు సంపన్నులు. వారికి బందరులో కలెక్టరు బంగళాయేకాకుండా ఇంకా మూడు పెద్ద బంగళాలుండేవు. ఉల్లిపాలెంలో భూములు తోట వుండేది. వారి పెద్ద కుమారుడు పురుషోత్తమరావు గారు చెన్నపట్టణంలో నుండేవారు. రెండవ కుమారుడు వెంకటపతి రావు బెజవాడలోనుండేవారు. హనుమంతరావు గారి కుటుంబ వ్యవహారములలో కుమారులతో వచ్చిన ఆస్తిపాస్తుల వ్యాజ్య వ్వహారములో దిగవల్లి వేంకట శివరావుగారు న్యాయవాదిగా వారి ఆస్తిపాస్తులను స్వయముగా పరిశీలించి విభజనచేసి విభజనదస్తావేజు వ్రాశారు. హనుమంతరావు గారు శివరావు గారు చేసిన విభజన అంగీకరించారు.[2]

బెజవాడ పట్టణాభివృధ్ధికి హనుమంతరావుగారి కృషి మార్చు

దివవహి హనుమంతరావు గారు మునిసిపల్ ఛైర్మన్ గా బెజవాడ పట్టణాభివృధ్దికి నిస్సంకోచంగా, నిస్వార్ధమైన కృషిచేశారు. వారి కాలంలో బెజవాడ చాల చిన్న పట్టణం. చాల రోడ్లు ఇరుకుగా వుండేవి. అప్పటికింకా మంచినీటికి కుళాయిలు లేవు. హోరున వాన పటుతున్నాగూడా హనుమంతరావు గారు నిక్కరు తొడుగుకుని, ప్రైవేటుగుర్రంబండిలో వచ్చి వీదులలో మోకాలు లోతునీటిలో బండిని నిలిపి మునిసిపల్ శానిటరీ వార్లను పిలిపించి దగ్గర వుండి రోడ్లకు గండి కొట్టించి నిలచిపోయున్న నీటిని పోయేటట్లుగా చెసిన చాల సందర్భాలున్నవి. అనేక ఇంటివారలు రోడ్లమీదకి అరుగులు కట్టుకుని రోడ్లు ఆక్రమించేవారు. అలాంటి అరుగులు అనేకములు పగులకొట్టించి రోడ్లు వెడల్పుచే యించారు. అలాగ చేసిన గొప్ప కృషి ఫలితముగా చాల ఇరుకుగాను సంకుచితముగానున్న రోడ్లను వెడల్పు చేసినవి వారి కృషికి స్మారకచిహ్నములుచేయతగినవి. అట్టిపనులలో వచ్చే కొర్టుకేసులు, నైతిక రాజకీయ చిక్కులును వారు ధైర్యసాహసములతోను, డిప్లమాటికలగాను అతిక్రమించి బెజవాడ పట్టణాభి వృధ్ధి చేశారు. ఆటువంటి సందర్భములలో చాలా క్రిమనల్ కేసులు దాఖలుకాబడినవని ఆ కాలమునాటి ప్రముఖ న్యాయవాది పెద్దిభొట్ల వీరయ్యగారు తమ స్వీయచరిత్రలో వ్రాశారు.[3]. హనుమంతరావు గారి కార్యదక్షతకు మరో ఉదాహరణగా అప్పటిలో బెడవాడ టెలిగ్రాఫ్ ఆఫీసు కాంపౌండునానుకుని వెళ్లే ముఖ్యరహదారి చాల ఇరుకుగానుండేది. టెలిగ్రాఫ్ ఆఫీసు కేంద్ర ప్రభుత్వమువారిది. వారి ఆఫీసు కాంపౌండు వాలు పగులగొట్టించి రోడ్డు వెడల్పుచేయాలంటే వచ్చే చిక్కులు ఉూహింపదగినవే. అలాంటి సందర్భములలో హనుమంతరావు గారు తమ పలుకుబడి, రాజకీయ, సాంఘిక నైపుణ్యంతో అతిక్రమించారు. కార్యాలయం కేందప్రభుత్వమునదైనా ఆఫీసు కాంపౌండు మునిసిపాలిటీదనీనూ, పబ్లికు కన్వీనియంసు కోసము అనివార్యమనీ చెప్పి కాంపౌండు గోడ పగులగొట్టించి లోపలికి జరిపించి రోడ్డు వెడల్పు చేశారు. బెజవాడలో అప్పటి (1921) టెలిగ్రాఫ్ డెప్యూటీ సూపరింటెండెంటైన బొడ్డపాటి పూర్ణయ్య గారు, అప్పటి కేంద్ర ప్రభుత్వపు ఎగ్జెక్యూటివ్ కౌన్సిల్ లో మెంబరుగానున్న బి.ఎన్ శర్మ గార్ల సహకారంతో చేయగలిగారు. ఊరిలో పురపారిశుధ్యం లోపాలు చేశేవారిని మందలించి శిక్షించేవారు. బెజవాడ ఊరిమధ్యలో టెలిగ్రాఫ్ అఫీసు దగ్గరలో రైల్వే లెవెల్ క్రాసింగ్ ఉండేది (అప్పటి వీధులు లాండుమార్కులు అవేవి ఇప్పుడు లేవు) అక్కడ చాల సంకుచి తమైనగేటు ఉండేది. గేటు మూసివేసినప్పుడు అరగంట పాటు గేటుకిరు ప్రక్కలా ట్రాఫిక్ అంతా ఆగిపోయేది.గేటు తెరచిన ప్పుడు ఇరుప్రక్కలనుండీ పోయే ట్రాఫిక్ కు ఆ సంకుచిత గేటు చాల ఆటంకమైయ్యేది. అట్టి ఆటంకమైన సంకుచిత గేటును వెడల్పుగా చేయించటానికి హనుమంతహావు గారు చేసిన కృషి చెప్పుకోదగిన విషయం.

బెజవాడ మునిసిపల్ కౌన్సిల్ రాజకీయాలు మార్చు

దినవహి హనుమంతరావు గారు జస్టిస్ పార్టీవారు. బెజవాడలో వారి పార్టీవారే మునిసిపల్ కౌన్సిల్ను దాదాపు 15 సంవత్సరములు నడిపారు. ఎన్నికలు జరపలేదు. 1922లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రముఖ న్యాయవాది అయిన అయ్యదేవర కాళేశ్వరరావు గారు మరియూ అద్దేపల్లి రామశేషయ్య గారును తీవ్ర ఆందోళన ఉద్యమంచేసి పట్టణవాసులను ఇంటి పన్నులను కట్టవద్దని రెచ్చగొట్టి ఆందోళన చేయగా 1922 ఫిబ్రవరిలో సి ఆర్ పిసి సెక్షన్ 107 క్రింద అయ్యదేవర కాళేశ్వర రావు గారి మీద కేసు పెట్టి వారిని జైలుకు పంపించిన తరువాత 1922 మధ్యలో జస్టిస్ పార్టీవారు ఎన్నికలు జరిపారు. ఆ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీవారికి మేజారిటీ గెలుపు వచ్చింది. ఆ ఎలక్షన్లో ప్రముఖ కాంగ్రెస్సు నేత, ప్రముఖ వైద్యలు డాక్టరు ఘంటసాల సీతారామ శర్మ గారు చాల కృషిచేశారు 1922 డిసెంబరులో డాక్టరుధన్వాడ రామచంద్రరావు ఎమ్.ఎ ఎమ్.డి గారిని మునిసిపల్ కౌన్సిల్ కు అధ్యక్షులుగా ఎన్నుకున్నారు.హనుమంతరావుగారు ప్రతి పక్షములోనున్నారు. కాళేశ్వరరావు గారు 1923 ఫిబ్రవరి దాకా ఏడాదిపాటు జైలు లోనున్నారు. క్రమేణా హనుమంతరావు గారి పార్టీకి బలము తగ్గిపోయింది. అంతవరకూ వారి పక్షములో నున్నబెజవాడలోని చాల ముంది వైశ్యులు, వర్తకులు కాంగ్రెస్సు పార్టీలో చేరారు.

హనుమంతరావుగారి సంఘసేవ మార్చు

బెజవాడలో వారి పేరున దినవహి సత్రవ అని వుండేది. కానీ కొంతకాలముతరువాత వారి కుమారుడు వెంకటపతి రావుగారు దానిని ఆక్రమించుకుని స్వంతంచేసుకున్నారు. హనుమంతరావుగారు ప్రతి సంవత్సరము శివరాత్రికి జరిగే రథోత్సవమునకు టెలిగ్రాఫ్ ఆఫీసు ప్రక్కన వున్న మెయన్ కాలువ రోడ్డు ప్రక్కనవున్న స్థలములో పందిళ్ళు వేయించి బల్లలు కుర్చీలు వేసి నీళ్లు జల్లించి చలివేంద్రి పెట్టించి రథోత్సనముచూడవచ్చిన సామాన్య ప్రజలకు సౌకర్యములు కలిపించేవారు. మునిసిపల్ కౌన్సిల్కు వారు అధ్యక్షులు గానున్నన్ని సంవత్సరములూ ప్రతి ఏటా అలా చేయించే వారు. కాంగ్రెస్సు కౌన్సిల్ వచ్చినతరువాత గూడా కొంతకాల అలానే జరిగింది గానీ క్రమేపి మానేశారు.

మూలాలు మార్చు

  1. "స్వీయ చరిత్ర" చిలకమర్తి లక్ష్మీనరసింహం (1944)
  2. 2.0 2.1 "నా జ్ఞాపకాలు" దిగవల్లి వేంకట శివరావు అప్రచురిత రచన
  3. "స్వీయ చరిత్ర" పెద్దిభొట్ల వీరయ్య (1950)