అయ్యదేవర కాళేశ్వరరావు
అయ్యదేవర కాళేశ్వరరావు (జనవరి 22, 1881 - ఫిబ్రవరి 26, 1962) స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మొదటి శాసనసభాధిపతి.[2] [3] ఇతని జీవిత చరిత్ర నవ్యాంధ్రము నా జీవిత కథ అనే పుస్తక రూపంలో వెలువడింది.[4]
అయ్యదేవర కాళేశ్వరరావు | |
---|---|
జననం | అయ్యదేవర కాళేశ్వరరావు జనవరి 22,1881[1] కృష్ణా జిల్లా నందిగామ |
మరణం | ఫిబ్రవరి 26,1962 |
వృత్తి | న్యాయవాది విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి లో కార్యదర్శి 1956 నుండి 1962 వరకు రాష్ట్ర శాసనసభ సభాపతి |
ప్రసిద్ధి | స్వాతంత్ర్య సమర యోధుడు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మొదటి సభాపతి |
తండ్రి | లక్ష్మయ్య, |
తల్లి | వరలక్ష్మమ్మ |
పుట్టుక, చదువు
మార్చుఇతను కృష్ణా జిల్లా నందిగామలో లక్ష్మయ్య, వరలక్ష్మమ్మ దంపతులకు 1881 సంవత్సరంలో జన్మించాడు. 1901 లో బి.ఎ. పరీక్షలో ఉత్తీర్ణులై నోబుల్ కళాశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేసాడు. తరువాత మద్రాసు విశ్వవిద్యాలయంలో బి.ఎల్. పరీక్షలో నెగ్గి 1906లో విజయవాడలో న్యాయవాదిగా పనిచేసాడు. జమిందారీల చట్టం విషయంలోగల విశేష పరిజ్ఞానం మూలంగా పలువురు జమిందారులకు లాయరుగా పనిచేసాడు.
స్వాతంత్ర్యోద్యమం, సంఘసేవ
మార్చురఘుపతి వెంకటరత్నం నాయుడు ప్రభావం వలన ఇతనిలో సంఘ సంస్కరణపై మక్కువతో బ్రహ్మ సమాజ కార్యక్రమాలలో కృషి చేసాడు. స్వాతంత్ర్య సంగ్రామంలో బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలోను, హోంరూలు ఉద్యమంలోను ఇతను పనిచేసాడు. మహాత్మా గాంధీ నాయకత్వంలోని అన్ని ఉద్యమాలలోనూ వీరు ఉత్సాహంగా పాల్గొని కారాగార శిక్షను అనుభవించాడు.
అస్పృశ్యులకు ఏలూరులోని జనార్దనస్వామి ఆలయ ప్రవేశానికై ఆత్మకూరు గోవిందాచార్యులు, గూడూరు రామచంద్రరావు, చెంచుదాసు, అత్తిలి సూర్యనారాయణ, నరాలసెట్టి దేవేంద్రుడు మొదలైన వారితో కలిసి సత్యాగ్రహాన్ని నిర్వహించాడు.[5]
రాజకీయాలతో పాటు గ్రంథాల ప్రచురణలో శ్రద్ధ వహించారు. విజయవాడలోని రామమోహన గ్రంథాలయ స్థాపనకు సహాయం చేసాడు. కొమర్రాజు లక్ష్మణరావు నెలకొల్పిన విజ్ఞాన చంద్రికా గ్రంథమండలిలో కార్యదర్శిగా పనిచేసాడు. ఇతను కారాగారంలో ఉండగా 'ఫ్రెంచి విప్లవ చరిత్ర', 'అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్ర', 'తురుష్క ప్రజాస్వామికం', చీనా జాతీయోద్యమ చరిత్ర', 'ఈజిప్టు చరిత్ర' అను పుస్తకాలను రచించాడు.
1926, 1937, 1946, 1955 సంవత్సరాలలో జరిగిన శాసనసభ ఎన్నికలలో విజయవాడకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రజా ప్రతినిధిగా ఇతను విజయవాడ పురపాలక సంఘానికి అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డాడు. ఎంతోమందికి విద్యాదానం చేసారు. ఇతను విజయవాడ పురపాలక సంఘ అధ్యక్షుడిగానూ, మద్రాసు శాసనసభకు చీఫ్ విప్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు.
మద్రాసు శాసనసభలో
మార్చు1939లో మద్రాసు శాసనసభకు కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ- బందరులకు ప్రాతినిధ్యం వహిస్తూ పోటీ చేసి ఘన విజయం సాధించాడు. రాజగోపాలాచారి ప్రధానమంత్రిగా మద్రాసు ప్రభుత్వమేర్పడింది. దానిలో కాళేశ్వరరావు రాజగోపాలాచారికి కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. మద్యపాన నిషేధ చట్టం, సేల్సుటాక్సు, హరిజన దేవాలయ ప్రవేశ చట్టాల రూపకల్పనలో కాళేశ్వరరావు తన మేధాసంపత్తిని, భాషానైపుణ్యాన్ని ప్రయోగించి అందరి మన్ననలూ పొందాడు. 1946లో విజయవాడ నుంచి శాసనసభకు ఎన్నికైన కాళేశ్వరరావు ప్రకాశం పంతులు పక్షం వహించాడు. టంగుటూరి ప్రకాశం మంత్రివర్గంలో కాళేశ్వరరావుకు మంత్రి పదవి రాలేదు, కానీ ఆయన శిష్యుడు వేముల కూర్మయ్యకు మంత్రి పదవి కాళేశ్వరరావు ప్రభావం వల్ల లభించింది. ఆ ప్రభుత్వం ఏడాది లోపే పడిపోయినా కాళేశ్వరరావు ప్రకాశం పక్షాననే ఉన్నాడు. 1947లో కాళేశ్వరరావు శాసనసభలో బహుభార్యత్వ నిషేధపు బిల్లును ప్రవేశపెట్టాడు.
సభాపతిగా
మార్చుస్వాతంత్ర్యానంతరం 1955లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయవాడ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎన్నికై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి శాసనసభకు అయ్యదేవర కాళేశ్వరరావు తొలి సభాపతిగా ఎన్నికయ్యాడు. 1956 నుండి 1962 వరకు రాష్ట్ర శాసనసభ సభాపతిగా బాధ్యతలు నిర్వర్తించాడు. శాసనసభాపతిగా శాసనసభలో భాష తెలుగులోనే ఉండాలని 1959 డిసెంబరు 14న రూలింగ్ ఇచ్చాడు. 1961 ఆగస్టు 11న సభాపతి అనుమతి లేనిదే సభలో ఎవరైనా ఎలాంటి ప్రకటనలు, ప్రసంగాలు చేయరాదని రూలింగ్ ఇచ్చాడు. 1962లో శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు, కానీ ఫలితాలు వెలువడడానికి ముందురోజే తుదిశ్వాస వదిలాడు.
రచయితగా
మార్చుఅయ్యదేవర కాళేశ్వరరావు పలు పుస్తకాలను తెలుగులో రచించాడు వేదాంతం, చరిత్ర, రాజకీయాల నేపథ్యం పై అనేక రచనలు చేసాడు. జైలు శిక్షను అనుభవిస్తున్న సమయంలో చైనా జాతీయోద్యమ చరిత్ర, ఈజిప్టు చరిత్ర, ఫ్రెంచి విప్లవ చరిత్ర, అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్రపై పుస్తకాలు రాసారు. అతను రాసిన 'నా జీవిత కథ' అనాటి ఆంధ్రోద్యమ చరిత్రకు సంబంధించిన విషయాలు కలిగి ఉంది.[1]
ఇతర విశేషాలు
మార్చు- విజయవాడలో పేరొందిన మునిసిపల్ మార్కెట్ ఇతని పేరు మీదుగా నిర్మించారు. అదే కాళేశ్వరరావు మార్కెట్
మూలాలు
మార్చు- 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 50 వసంతాల ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతులు, ఉపసభాపతులు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ. p. 1.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2024-06-23. Retrieved 2024-06-23.
- ↑ "Former Speakers - Legislative Assembly - Liferay DXP". web.archive.org. 2024-06-23. Archived from the original on 2024-06-23. Retrieved 2024-06-23.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ ఆంధ్రభూమి, సబ్ ఫీచర్ (26 February 2016). "మలితరం గొప్ప నేత 'అయ్యదేవర' ( నేడు వర్ధంతి)". అయ్యదేవర పురుషోత్తమరావు. Retrieved 2 May 2018.[permanent dead link]
- ↑ జంగం చిన్నయ్య, అనువాదం:కె.సజయ. ఆధునిక భారతదేశ నిర్మాణంలో దళితులు (2021 ed.). హైదరాబాద్: హైదరాబాద్ బుక్ ట్రస్ట్. p. 157. Retrieved 4 January 2024.